చర్చలు విఫలం
చెన్నై, సాక్షి ప్రతినిధి:జల్లికట్టు నిర్వహణపై పట్టుబడుతూ మంగళవారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలు కొనసాగాయి. అనేక చోట్ల ప్రజలు రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలిపారు. కే ంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జరిపిన చర్చలు విఫలం కావడంతో విధించిన నిషేధపు ఉత్తర్వుల చిక్కుముడులు వీడలేదు. జల్లికట్టు జరిగేనా అనే అనుమానాలు నెలకొన్నాయి. జల్లికట్టు నిర్వహణపై ప్రభుత్వం సుప్రీం కోర్టులో మంగళవారం అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేసింది. తమిళనాడు ప్రజల వీరోచిత క్రీడగా జల్లికట్టుకు పేరుంది. తమిళుల సంస్కృతి, సంప్రదాయాల్లో జల్లికట్టు కూడా ఒక భాగమని భావిస్తారు. అయితే జంతుప్రేమికులు మాత్రం ఇది వికృత చేష్టగా నిరసిస్తున్నారు.
మానవుని సంతోషం కోసం జంతువులను వేధిస్తున్నారంటూ జంతుప్రేమికులు సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ఫలితంగా గత ఏడాది మే 7వ తేదీన నిషేధం అమల్లోకి వచ్చింది. జల్లికట్టు లేనిదే పొంగల్ పండుగ లేనట్లుగా ప్రజల్లో ఈ క్రీడ పాతుకుపోవడంతో సుప్రీం తీర్పు పట్ల అభ్యంతరాలు వెల్లువెత్తాయి. జల్లికట్టును నిర్వహించాల్సిందేనని ప్రభుత్వంపై అన్ని పార్టీలు ఒత్తిడి చేయడం ప్రారంభించాయి. ప్రజాభీష్టాన్ని సాధించగలం అనే నమ్మకంతో ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. కేంద్రాన్ని ఒప్పించాలని పశుసంవర్ధకశాఖ సంచాలకులు విజయకుమార్ నేతృత్వంలో ఒక బృందాన్ని సోమవారం ఢిల్లీకి పంపింది.
సుప్రీం కోర్టు ఆదేశించనిదే తాము ఏమీ చేయలేమని కేంద్రం చేతులెత్తేయడంతో మంగళవారం నాటి చర్చలు విఫలమయ్యూయి. ప్రభుత్వం సుప్రీం కోర్టులో మంగళవారం అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేసింది. జల్లికట్టు విషయంలో వేగిరం నిర్ణయాన్ని ప్రకటించాలని సుప్రీం కోర్టును ప్రభుత్వం అభ్యర్థిస్తోంది. ఈనెల 16న రాష్ట్రంలో జల్లికట్టు సాగాల్సి ఉంది.ప్రభుత్వంతోపాటూ ప్రజలు సైతం జల్లికట్టుకు సిద్ధమైపోయారు. విరుదునగర్, సేలం, మదురై, విళుపురం తదితర జిల్లాల్లో శవయాత్ర జరిపి రోడ్డుపై బైఠాయించారు. మరికొన్ని చోట్ల నిషేధపు ఉత్తర్వులకు నిరసనగా గుండు కొట్టించుకున్నారు. జల్లికట్టు అభిమానులు తమ ఇళ్లపై నల్లజెండాలను ప్రదర్శించారు. మరో రెండురోజులే గడువు ఉండడంతో జల్లికట్టు జరిగేనా అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి.