‘జల్లికట్టు’ నిషేధించాల్సిందే!
సాక్షి, చెన్నై: తమిళుల సంప్రదాయ, సాహస క్రీడగా పేరెన్నికగన్న జల్లికట్టుకు కొన్నేళ్లుగా గడ్డు పరిస్థితులు నెలకొంటూ వచ్చిన విషయం తెలిసిందే. ఎద్దులను హింసించడం, వాటిని పట్టుకునే క్రమంలో ప్రాణ నష్టం జరగడం, క్రీడాకారులు తీవ్రంగా గాయపడడం వంటివి చోటు చేసుకుంటూ వచ్చాయి. ఎద్దులను చిత్ర హింసలకు గురి చేస్తున్నారంటూ కొన్ని సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. జల్లికట్టును, రెక్లాను నిషేధించాలంటూ ఆ సంఘాలు దాఖలు చేసుకున్న పిటిషన్లకు అనుకూలంగా ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
జల్లికట్టు, రెక్లాను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు తమిళనాడులో వ్యతిరేకత బయలు దేరింది. తమ సాహస, సాంప్రదాయ క్రీడను అడ్డుకోవద్దంటూ ఆందోళనలు సాగాయి. కొన్ని చోట్ల దీక్షలు కొనసాగుతున్నాయి. మరికొన్ని చోట్ల జల్లికట్టు ఎద్దులను సంతలో విక్రయాలకు పెట్టారు. నిషేధానికి వ్యతిరేకంగా పిటిషన్లు : జల్లికట్టును నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ, పారంపర్యంగా ఆ క్రీడను నిర్వహిస్తూ వస్తున్న మదురై అలంగానల్లూరు, పీలమేడు, అవినాశిల్లోని కమిటీలు తీవ్రంగా పరిగణించాయి.
ఆ కమిటీలతో మదురై, దిండుగల్, శివగంగై, పుదుకోట్టై జిల్లాల్లోని జల్లి కట్టు క్రీడా కారులు, నిర్వహకులు మదురై ధర్మాసనాన్ని ఆశ్రయించారు. జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని, వేడుకలప్పుడు పకడ్బందీ చర్యలతో తమ సంప్రదాయ క్రీడను జరుపుకుంటామంటూ ఆ పిటిషన్ల ద్వారా కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్లన్నీ ఒకే అంశంతో ఉండడంతో వీటన్నింటినీ ఏకం చేసి విచారణకు మదురై ధర్మాసనం స్వీకరించింది. సోమవారం ఉదయం న్యాయమూర్తులు రామసుబ్రమణి, వేలుమణిల నేతృత్వంలోని బెంచ్ అన్ని పిటిషన్లను పరిశీలించింది. అయితే, జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన విషయాన్ని బెంచ్ పిటిషనర్లకు గుర్తు చేసింది. సుప్రీంకోర్టు తీర్పును తప్పనిసరిగా అమలు చేయాలని, నిషేధం ఎత్తివేతకు ఎలాంటి స్టే ఇవ్వలేమని బెంచ్ స్పష్టం చేసింది. ఈ పిటిషన్లన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.