చెన్నై, సాక్షి ప్రతినిధి : జల్లికట్టు, కోళ్లపందెం, రెక్లాపోటీలు ప్రాచీన గ్రామీణ క్రీడ ల కోవలోకి వస్తాయి. దున్నలను గ్రామీణ యువకులు వెంటాడి అదుపులోకి తీసుకోవడాన్ని జల్లికట్టు క్రీడగా వర్ణిస్తారు. సంక్రాంతి పండుగ సమయాల్లో నిర్వహించే ఈ క్రీడలో దున్నను అదుపులోకి తీసుకున్న యువకుడు మరుసటి సంక్రాంతి వరకు ఆ గ్రామంలో వీరుడిగా చలామణి అవుతాడు. దున్నల దాటికి ఎందరో యువకులు తీవ్రంగా గాయపడిన సందర్భాలు ఉన్నాయి. జల్లికట్టులోకి దిగే దున్నల కళ్లలో కారంపొడి జల్లడం, అదుపులోకి తీసుకునేందుకు యువకులు వాటిని వెంటాడే సాహస చర్య ఒళ్లు గగుర్పొడుస్తుంది.
తమిళనాడులో పెద్ద ఎత్తున సాగే జల్లికట్టును తిలకించేందుకు విదేశీయులు సైతం ఏటా వస్తుంటారు. అత్యంత ప్రాచీనమైన జల్లికట్టు క్రీడ పేరుతో వాటిని హింసించడం తగదని పేర్కొంటూ అఖిలభారత జంతు సంరక్షణ కేంద్రం వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇటీవల తీర్పుచెప్పింది. మానవుల ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు జంతువులు, పశు,పక్ష్యాదులకు ఉందని పేర్కొంది. జల్లికట్టుపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. తమ వీరోచిత ప్రదర్శనకు అవకాశం లేకుండా పోయిందని యువకులు, ప్రాచీన క్రీడపై నిషేధం తగదని ప్రజలు నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు. నిషేధంపై పునరాలోచించాలని అనేక రాజకీయ, ప్రజాసంఘాలు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాయి.
మరో రెండు
తాజాగా మరో రెండు క్రీడలు నిషేధం దిశగా సాగుతున్నాయి. రెండు చక్రాల బండికి ఒక గుర్రాన్ని కట్టి పరుగెత్తించే క్రీడను రెక్లా అంటారు. అమ్మా పేరవై అనే సంఘం నేతృత్వంలో తారాపురం సమీపం చంద్రపురంలో ఆదివారం రెక్లా పోటీలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలతోపాటూ కేరళ నుంచి కూడా ఔత్సాహిక క్రీడాకారులు వచ్చారు. సుమారు 300 మందితో ఆదివారం సాయంత్రం రెక్లా పోటీలు ప్రారంభవుతున్న దశలో పోలీసులు అకస్మాత్తుగా వచ్చి అడ్డుకున్నారు. జల్లికట్టుపై సుప్రీం విధించిన తీర్పు రెక్లాకు కూడా వర్తిస్తుందని అన్నారు. ఇందుకు నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమ ఆజ్ఞలను మీరి రెక్లా పోటీలను నిర్వహిస్తే కేసులు పెట్టి జైళ్లలోకి నెట్టివేస్తామని పోలీసులు హెచ్చరించడంతో క్రీడాకారులంతా నిరాశతో వెనుదిరిగారు.
కోళ్లపందెంపై నిషేధానికి వినతి
జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో జంతు, పశుపక్ష్యాదులు అని పేర్కొన్నందున కోళ్లపందాలను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించాలని అఖిలభారత జంతవధ నిషేధ వ్యతిరేక సంఘం డైరక్టర్ మణిలాల్ రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం విజ్ఞప్తి చేశారు. పందెంకోళ్ల కాళ్లకు కత్తులు కట్టి వాటితో జరిపే క్రీడల వల్ల అవి తీవ్రంగా గాయపడటం లేదా ప్రాణాలు కోల్పోతున్నాయని ఆయన పేర్కొన్నారు. జంతువులు, పక్షులను వేధించరాదని జల్లికట్టు విషయంలో ఇచ్చిన తీర్పులో సుప్రీం కోర్టు స్పష్టం చేయడమేగాక ఇటువంటి క్రీడలు జరగుకుండా రాష్ట్రప్రభుత్వాలు తగిన చర్య తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన ఉటంకించారు. సుప్రీం తీర్పును అనుసరించి కోళ్లపందెంపై నిషేధాజ్ఞలు జారీచేయాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు.