కార్తీ ‘రచ్చ’ | karthi chidambaram house seized | Sakshi
Sakshi News home page

కార్తీ ‘రచ్చ’

Published Mon, Nov 24 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

karthi chidambaram house seized

 సాక్షి, చెన్నై : దివంగత నేత కామరాజనాడర్‌కు వ్యతిరేకంగా  కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో రచ్చకు దారి తీస్తున్నాయి. సర్వత్రా కార్తీ చిదంబరంపై విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. క్షమాపణకు పట్టు బడుతున్నారు. నాడార్ల సమాఖ్య ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించింది. ఆదివారం నుంగబాక్కంలోని కార్తీ చిదంబరం ఇంటిని ముట్టడించేందుకు యత్నించింది.
 
  జీకే వాసన్ పార్టీ నుంచి బయటకు వెళ్లడంతో టీఎన్‌సీసీలో కలవరం మొదలైంది. వాసన్ పార్టీ ఆవిర్భావ వేడుకలో ఎందరు నేతలు ప్రత్యక్షం కాబోతున్నారోనన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో పార్టీని రక్షించుకుని, కేడర్‌కు తాను అండగా ఉండానని చాటుకునే పనిలో కొత్త అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ నిమగ్నం అయ్యారు. సత్యమూర్తి భవన్ వేదికగా ప్రతి రోజు ఏదో ఒక సమావేశం ఏర్పాటు చేసి, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే విధంగా ముందుకు సాగుతున్నారు. అయితే, ఈవీకేఎస్ ప్రయత్నాలపై నీళ్లు చల్లే రీతిలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం వ్యవహరించారు. రెండు రోజుల క్రితం జరిగిన యువజన సమావేశంలో కార్తీ నోరు జారారు.
 
 కామరాజర్ సుపరి పాలనను మళ్లీ తీసుకొస్తాం.. ఆ పాలనే లక్ష్యం..., పూర్వ వైభవం ధ్యేయం అన్న నినాదాల్ని పక్కన పెట్టి, భవిష్యత్తు లక్ష్యంగా ఏం చేద్దాం అన్న అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ర్టంలో కామరాజర్ లేనిదే కాంగ్రెస్ లేదని చెప్పవచ్చు. అలాంటి నేతను అగౌరవ పరిచే విధంగా కార్తీ చిదంబరం అనుచిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌లో రచ్చకు దారి తీస్తున్నది. కార్తీ వ్యాఖ్యల్ని అదే వేదిక మీదున్న ఈవీకేఎస్ తీవ్రంగానే ఖండించారు. ఇక మీదట ఎవరైనా కామరాజర్‌ను విమర్శించే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, కాంగ్రెస్‌లోని నాడార్ల సామాజిక వర్గ నేతలు మాత్రం జీర్ణించుకోవడం లేదు. కార్తీపై విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టే పనిలో పడ్డారు.
 
 కర్పూరం వాసన తెలుసా: తప్పును కప్పి పుచ్చుకునే విధంగా కార్తీ వ్యవహరించ కూడదని, క్షమాపణ చెప్పుకోవాలని పట్టుబట్టే పనిలో పలువురు కాంగ్రెస్‌వాదులు నిమగ్నం అయ్యారు. ఇందుకు కార్తీ సిద్ధంగా లేని దృష్ట్యా, ఈ వ్యాఖ్యల వివాదం చిలికి చిలికి తుపానులా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. వాసన్ రూపంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ బలం, కార్తీ వ్యాఖ్యల రూపంలో ఎలాంటి పరిస్థితుల్ని సృష్టిస్తుందోనన్న బెంగ ఈవీకేఎస్‌లో మొదలైంది. ఈవీకేఎస్ సైతం తీవ్ర ఆగ్రహంతోనే ఉన్నారని చెబుతున్నారు. అయితే, చిదంబరం మద్దతు తనకు తప్పనిసరి కావడంతో చర్యల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు పేర్కొంటున్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా కార్తీపై ఆదివారం ఈవీకేఎస్ పరోక్షంగా తీవ్రంగానే స్పందించారు.
 
 తాంబరంలో జరిగిన పార్టీ వేడుకలో విలేకరులు ఈవీకేఎస్‌ను చుట్టుముట్టారు. కార్తీపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని ప్రశ్నించారు. ఇందుకు ఈవీకేఎస్ ఇచ్చిన సమాధానానికి విస్మయం చెందాల్సిన వంతు మీడియాకు తప్పలేదు. కామరాజర్‌కు వ్యతిరేకంగా కార్తీ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని దాట వేశారు. అదే సమయంలో కామరాజర్ గురించి ఇక మీదట ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే సహించబోనని హెచ్చరించారు. ‘గాడిదకు తెలుసునా... కర్పూర వాసన’ అంటూ పరోక్షంగా కార్తీ చిదంబరంను ఉద్దేశించి మండి పడటం గమనార్హం.
 
 ఇంటి ముట్టడి : కార్తీ వ్యాఖ్యలను నాడార్ల సమాఖ్య తీవ్రంగా పరిగణించింది. కార్తీ చిదంబరం క్షమాపణ చెప్పాలని, తన వ్యాఖ్యల్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆ సమాఖ్య నేతృత్వంలో ఉదయం నిరసన కార్యక్రమం చోటు చేసుకుంది. తమ నాయకుడు కార్తీ చిదంబరం ఇంటిని ముట్టడించేందుకు నాడార్ల సమాఖ్య సిద్ధం కావడాన్ని ఆయన మద్దతుదారులు తీవ్రంగా పరిగణించారు. తమ నేత ఇంటి వద్దకు వచ్చే వాళ్లను అడ్డుకునేందుకు ముందుగానే నుంగబాక్కంలో మకాం వేశారు. అలాగే, పోలీసులు సైతం రం గంలోకి దిగారు. శాస్త్రి భవన్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. 11 గంటల సమయంలో నాడార్ల సమాఖ్య నాయకులు అటు వైపుగా రాగానే, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో తోపులాట, వాగ్యుద్దం చోటు చేసుకుంది. చివరకు ఆందోళనకారుల్ని పోలీసు లు అరెస్టు చేశారు. కార్తీ చిదంబరం ఇంటి పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్తీ క్షమాపణ చెప్పే వరకు విడిచి పెట్టమని, తమ ఆందోళనలు కొనసాగుతాయని నాడార్ల సమాఖ్య స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement