సాక్షి, చెన్నై: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ఇంట్లో భారీ చోరీ జరిగింది. నుగంబాక్కంలోని పైక్రాఫ్ట్ గార్డెన్ రోడ్ లో ఉన్న ఆయన ఇంట్లో లూటీ జరిగింది. చిదంబరం భార్య నళినీ చిదంబరం నెల రోజుల క్రితం ఊటీకి వెళ్లి, గత రాత్రి తిరిగొచ్చారు. తలుపులు తెరిచి చూసేసరికి అల్మరాలు ఓపెన్ చేసి ఉండటంతో దోపిడీ జరిగిన విషయాన్ని ఆమె గుర్తించారు. వెంటనే పోలీసులకు ఆమె సమాచారం అందించారు. విలువైన ఆభరణాలు, రూ. 1.50 లక్షల నగదు, ఆరు విలువైన చీరలు చోరీ అయినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. తొలుత ఈ ఘటన వెనుక తమ ఇంట్లో పనిచేసే ఇద్దరు పనిమనుషుల హస్తం ఉండొచ్చని ఆమె అనుమానించారు. సీసీ టీవీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తే, మాస్క్లు ధరించిన ఇద్దరు మహిళలు ఇంట్లోకి వెళుతుండటం కనిపించింది. పదిరోజుల క్రితమే ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది.
ఫిర్యాదు వెనక్కి.. అయితే ఈ వ్యవహారంలో ఎలాంటి అరెస్టులు జరగలేదు. పోలీసు ఫిర్యాదుతో కంగారుపడ్డ ఆ పని మనుషుల కుటుంబ సభ్యులు.. చోరీకి గురైన సొత్తు వెనక్కి ఇస్తామని చిదంబరం ఫ్యామిలీకి చెప్పారు. దీంతో ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదివారం ఉదయం కార్తీ చిదంబరం కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఆభరణాలు ఏవీ చోరీ కాలేదని, కేవలం డబ్బు మాత్రమే అయిందని కార్తీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment