
పొత్తు కసరత్తు
అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత పొత్తు కసరత్తుల్లో ఆదివారం నిమగ్నమయ్యారు. ఆమె ప్రసన్నంతో సీట్లను దక్కించుకునేందుకు పలు పార్టీల నాయకులు పోయెస్ గార్డెన్ బాట పట్టారు. ఏడు పార్టీలకు పోయెస్ గార్డెన్‌లోకి అనుమతి దక్కడంతో, ఇక తనకు పిలుపు ఎప్పుడు వస్తుందో అన్న ఎదురుచూపుల్లో తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ ఉన్నారు.
* నేతల పోయెస్ గార్డెన్ బాట
* పిలుపు కోసం వాసన్ ఎదురు చూపు
సాక్షి, చెన్నై: మళ్లీ అధికారమే లక్ష్యంగా అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత తీవ్ర కసరత్తుల్లో మునిగారు. ఇంటర్వ్యూలు ముగిం చి, అభ్యర్థుల చిట్టాకు మెరుగులు దిద్దే పనిలో పడ్డారు. మేనిఫెస్టో పనుల కసరత్తులు ఓ వైపు సాగుతుంటే, మరో వైపు తమను నమ్ముకుని పార్టీలు నడుపుతున్న వారికి అవకాశం కల్పించే విధంగా పొత్తు కసరత్తులకు చర్యలు చేపట్టారు.
పోయెస్ గార్డెన్ నుంచి పిలుపు ఎప్పుడెప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ వచ్చిన కొన్ని సామాజిక వర్గాల పార్టీలు అనుమతి దక్కడం తరువాయి అమ్మ ఎదుట ప్రత్యక్షం అయ్యారని చెప్పవచ్చు. ఆయా పార్టీల నాయకులు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా పోయెస్ గార్డెన్ బాట పట్టారు. ఇందులో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ నేతలు దేవరాజన్, కదిరవన్, కొంగు ఇలంజర్ పేరవై నేత, ఎమ్మెల్యే తనియరసు, ఇండియ కుడియరసు కట్చి నేత, ఎమ్మెల్యే సేకు తమిళరసు, తమిళర్ వాల్వురిమై కట్చి నేత , మాజీ ఎమ్మెల్యే వేల్ మురుగన్, సమత్తువ మక్కల్ కళగం నేత, ఎమ్మెల్యే ఎర్నావూర్ నారాయణన్, తౌఫిక్ జమాత్ వర్గాలు ఉన్నారు.
అమ్మ వెంటే : గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అమ్మే దిక్కు అని, అన్నాడీఎంకే వెంట నడిచిన పార్టీల నాయకులకు పోయెస్ గార్డెన్ తలుపులు తెరచుకున్నాయి. అమ్మ ప్రసన్నంతో పొత్తు పదిలం చేసుకుని, సీట్ల హామీతో ఆయా పార్టీల నాయకులు ఆనందంగానే బయటకు అడుగు పెట్టారని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఓ స్థానాన్ని దక్కిం చుకున్న ఫార్వర్డ్ బ్లాక్ ఈ సారి అదనపు సీట్లు కోరినట్టు సమాచారం.
ఇక, తమ సిట్టింగ్ స్థానాల్ని తమిళరసు, తనియరసు, ఎర్నావూర్ నారాయణన్ పదిలం చేసుకోగా, తమిళర్ వాల్వురిమై కట్టికి మూడు స్థానాలు కేటాయించేందుకు అమ్మ అంగీకరించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, ఎన్నికల్లో పోటీ చేయాలా, వద్దా? అన్నది తేల్చుకునే పనిలో తౌఫిక్ జమాత్ ఉన్నట్టు సమాచారం. పలు సామాజిక వర్గ పార్టీలకు పోయెస్ గార్డెన్‌లోకి అనుమతి దక్కడంతో, ఇక తమకు పిలుపు ఎప్పుడో అన్న ఎదురు చూపుల్లో టీఎంసీ వర్గాలు ఉన్నాయి.
ఎదురు చూపుల్లో : కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జీకే వాసన్ తన తండ్రి మూపనార్ స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్‌ను మళ్లీ తెర మీదకు తెచ్చిన విషయం తెలిసిందే. పొత్తు ప్రయత్నాలకు దూరంగా ఉన్న జీకే వాసన్, అమ్మ పిలిస్తే చాలు చటుక్కున వాలేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. అన్నాడీఎంకేతో కలసి పయనం సాగించాలన్న ఆశతో జీకే వాసన్‌తో పాటుగా ఆ పార్టీ వర్గాలు ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో పొత్తు కసరత్తుల్లో అమ్మ మునగడంతో ఇక, తమకు పోయెస్ గార్డెన్ పిలుపు ఎప్పుడు వస్తుందో అన్న ఎదురు చూపుల్లో ఉన్నారు. ఒక వేళ పోయెస్ గార్డెన్‌లోకి అనుమతి దక్కి, పొత్తు, సీట్లు ఖరారు చేసుకున్నా, ఎన్నికల్లో పార్టీ చిహ్నం ‘సైకిల్’ వాసన్‌కు దక్కేది డౌటే. ఇందుకు కారణం ఉత్తరాదిలో సైకిల్ చిహ్నంకు సొంత దారుడిగా ఉన్న సమాజ్ వాది పార్టీ తరఫున రాష్ర్టంలోని 234 స్థానాల్లో పోటీకి కసరత్తులు సాగుతుండడమే.