జయను రజనీ ఎందుకు ఓడించారు? | Rajinikanth political entry | Sakshi
Sakshi News home page

జయను రజనీ ఎందుకు ఓడించారు?

Published Mon, Dec 12 2016 6:26 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

జయను రజనీ ఎందుకు ఓడించారు?

జయను రజనీ ఎందుకు ఓడించారు?

  • ఇప్పటికీ రాజకీయాల్లోకి వచ్చే చాన్స్‌ ఉందా!

  • 'నేను ఆమె(జయలలిత)ను గాయపరిచాను. ఆమె పార్టీ ఓడిపోవడానికి నేను ప్రధాన కారణం'.. ఇటీవల కన్నుమూసిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, జర్నలిస్టు-నటుడు చో రామస్వామికి సినీ నటులు ఏర్పాటుచేసిన సంతాప సభలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వ్యక్తం చేసిన పశ్చాత్తాపం ఇది. 1996నాటి అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'జయలలిత మరోసారి అధికారంలోకి వస్తే.. దేవుడు కూడా తమిళనాడును కాపాడలేరు' అంటూ అప్పట్లో రజనీ చేసిన రాజకీయ ప్రకటన పెద్ద సంచలనమే రేపింది. 'బాషా' వంటి సూపర్‌హిట్‌ సినిమాలతో అప్పట్లో రజనీ ఇమేజ్‌ శిఖరస్థాయిలో ఉంది.  అంతేకాకుండా 'నేను ఒక్కసారి చెప్తే.. వందసార్లు చెప్పినట్టే' అంటూ రజనీ ఈ సినిమాలో చెప్పిన పంచ్‌డైలాగ్‌ ప్రజల్లో నాటుకుపోయింది. ఈ క్రమంలో రజనీ ప్రకటనతో 1996 ఎన్నికల్లో జయలలిత అన్నాడీఎంకే పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. 234 స్థానాల్లో నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకుంది. జయలలిత పోటీ చేసిన రెండుస్థానాల్లోనూ ఓడిపోయారు.

    వైరం ఎందుకు?
    రజనీకి, జయలలితకు వైరం ఎందుకు అంటే ఓ వదంతి లాంటి కథ వినిపిస్తూ ఉంటుంది. పోయెస్‌ గార్డెన్‌లో రజనీ, జయ ఇళ్లు ఇరుగుపొరుగునే ఉంటాయి. పోయెస్‌ గార్డెన్‌ వీధుల్లో రజనీ, జయ ఎదురుపడితే భూమి దద్దరిల్లిపోయేదని స్థానికులు చెప్పేవారు. ఓ రోజు రజనీ కారులో వెళుతుండగా సీఎం జయలలిత సెక్యూరిటీ సిబ్బంది.. రోడ్డు క్లియర్‌ చేసేందుకు రజనీని అడ్డుకున్నారు. దీంతో రజనీ కారు దిగి బయటకు వచ్చి సిగరెట్‌ (స్థానికంగా ఉన్న వ్యాపారి దగ్గర రజనీయే స్వయంగా కొన్నారని అంటారు) కాలుస్తూ నిలుచుండి పోయారు. కొద్దిక్షణాల్లో అక్కడ రజనీ అభిమానులు పెద్ద ఎత్తున మూగడంతో సీఎం సెక్యూరిటీ సిబ్బందికి చుక్కలు కనిపించాయి. ఈ ఘటనతో సూపర్‌స్టార్‌ అంటే ఏంటో రజనీ నేరుగా సందేశం ఇచ్చినట్టు అయింది.

    రాజకీయ ఎంట్రీ చాన్స్‌ ఇంకా ఉందా?
    1996 ఎన్నికల్లో రజనీ ప్రకటన ప్రకంపనలు రేపింది. మరీ ఇప్పటికీ రాజకీయ ప్రవేశానికి రజనీకి అవకాశం ఉందా? అంటే పరిశీలకులు లేదనే అంటున్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు రజనీకి వచ్చిన మహాత్తర అవకాశం ఇప్పుడు చేయి జారిపోయిందని అభిప్రాయపడుతున్నారు. 1996లో రజనీకి ఒక మహాత్తరమైన రాజకీయ అవకాశం వచ్చిందని, తొలిసారి ఆయన చెడ్డ ప్రభుత్వం గురించి మాట్లాడగా.. అది ప్రజల్లోకి వెళ్లిందని, కానీ, ఇప్పుడు అలాంటి అవకాశమేది రజనీకి లేదని అంటున్నారు. రజనీ ప్రకటన తర్వాతే నటులకు ఉన్న ఛరిష్మాతో లబ్ధి పొందేందుకు విజయ్‌కాంత్‌ లాంటి నటులు రాజకీయాల్లో అడుగుపెట్టారు. సినీ నటులు అయినంత మాత్రాన ప్రజలు ఎన్నికల్లో వారికి బ్రహ్మరథం పడతారనడానికి వీలు లేదని ఇటీవలి అనుభవాలు చాటుతున్నాయి. అయితే, 2014 ఎన్నికల సందర్భంగా చెన్నైలో ప్రచారానికి వచ్చిన నరేంద్రమోదీ రజనీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ ఇది మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమే. ఆ తర్వాత రజనీ రాజకీయ ఎంట్రీ గురించి ఎవరూ మాట్లాడింది లేదు. ఆయన అభిమానులు చాలామంది కూడా రజనీ రాజకీయాలకు దూరంగా ఉండాలనే కోరుకుంటున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement