రజనీ రాకపోవచ్చు!
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలుకెళ్లడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెర లేచింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు జైలు శిక్ష పడడంతో తమిళనాట రాజకీయాలు రంజుగా మారాయి. తాను జైలుకెళుతూ ముఖ్యమంత్రి పదవిని తన అనుంగు అనుచరుడు పన్నీరు సెల్వంకు కట్టబెట్టారు జయ. ఇదే సమయంలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ రంగంలోకి దిగింది.
ఇదిలావుంటే తమిళనాడులో పాగా వేసేందుకు తమిళ తెరవేల్పు రజనీకాంత్ కు బీజేపీ గాలం వేసింది. తమ పార్టీలో చేరితో సీఎం అభ్యర్థి మీరేనంటూ రజనీకాంత్ ను ఊరించింది. స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేరుగా రజనీకాంత్ కు ఫోన్ చేశారు. కమలనాథుల ఆఫర్ కు రజనీకాంత్ ఇప్పటివరకు స్పందించలేదు. నరేంద్ర మోదీ ఉండగా రజనీ అవసరమా అంటూ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి రుసరుసలాడడంతో బీజేపీ ఆలోచనలో పడింది.
వచ్చేది, రానిది రజనీ స్పష్టం చేయకపోవడంతో కమలనాథులు ఇళయదళపతి విజయ్, డీఎండీకే అధినేత విజయకాంత్ వైపు మొగ్గుచూపుతున్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో విజయకాంత్, విజయ్ పల్లవి అందుకునేందుకు సిద్ధం అయ్యారు. పదేళ్లుగా డీఎండీకే పార్టీని ఒంటరిగా ముందుకు తీసుకెళ్తున్న 'కెప్టెన్'ను తమవైపు తిప్పుకుంటే మేలని బీజేపీ తలపోస్తోంది. ఇక తమిళనాట విశేషంగా అభిమానులను కలిగివున్న విజయ్ ను కూడా తమవాడిగా చేసుకునేందుకు కమలనాథులు తెరవెనుక ప్రయత్నాలు మొదలు పెట్టారు.
జైలు నుంచి విడుదలైన జయలలితకు రజనీకాంత్ లేఖ రాయడంతో బీజేపీ ఆయనపై ఆశలు వదులుకున్నట్టు కనబడుతోంది. బీజేపీ నాయకురాలు మేనకా గాంధీ కూడా జయకు లేఖ రాయడంతో బీజేపీ అగ్రనాయకత్వం అవాక్కయింది. తనకు లేఖ రాసినందుకు రజనీ, మేనకకు జయ ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే బీజేపీకి రజనీ దూరంగా ఉండాలనుకుంటున్నట్టు వెల్లడవుతోంది. ఆయన రాజకీయాల్లోకి రాకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమిళ రాజకీయాలు మున్ముందు ఎన్ని మలుపులు తిరగనున్నాయో?