ఆ 'లేఖలు' నన్ను కదిలించాయి: జయ
చెన్నై : సినీ నటుడు రజనీకాంత్, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధ్యక్షురాలు జయలలిత ధన్యవాదాలు తెలిపారు. జయ జైలు నుంచి విడుదలైన సందర్భంగా రజనీకాంత్, మేనకా గాంధీలు తమ సానుభూతి, మద్దతు తెలుపుతూ వేర్వేరుగా లేఖలు రాసిన విషయం తెలిసిందే.
దీనిపై స్పందించిన జయలలిత ... వారిద్దరి లేఖలు తనను లోతుగా కదిలించాయన్నారు. రజనీ, మేనకాగాంధీలు తమ తమ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన గురించి ఆలోచించటం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా వారికి, వారి కుటుంబాలకు మంచి జరగాలని జయ ఆకాక్షించారు. ఈ మేరకు అన్నాడీఎంకే కార్యాలయం సోమవారం ఓ లేఖను విడుదల చేసింది.
కాగా జీవితంలో ఎన్నో కష్టాల్ని, ఒడిదుడుకుల్ని చవి చూశారని, వాటిన్నింటిని ఎదుర్కొన్నట్టుగానే ప్రస్తుత కష్టాన్ని అధిగమించి త్వరితగతిన బాధ్యతలు చేపట్టాలని కేంద్రమంత్రి మేనకా గాంధీ ...జయలలితకు రాసిన లేఖలో ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే రజనీ కాంత్ తన లేఖలో మనో ధైర్యంగా ఉండాలని, ప్రశాంత పూరితంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మళ్లీ ప్రజల్లోకి రావాలని ఆంక్షిస్తూ, ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు ఆయన ఆలేఖలో పేర్కొన్నారు.