జయలలిత ఆస్తులన్నీ మావే | Deepa, deepak stakes claim to Jayalalithaa's all assets | Sakshi
Sakshi News home page

జయలలిత ఆస్తులన్నీ మావే..

Published Sat, Jun 17 2017 7:33 PM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

జయలలిత ఆస్తులన్నీ మావే

జయలలిత ఆస్తులన్నీ మావే

►  మేనత్త స్థానం నాతోనే భర్తీ : దీప
► ఆస్తులన్నీ మావే :దీపక్‌

చెన్నై : మేనత్త ఆస్తి కోసం మేనకోడలు, మేనల్లుడు పోటీ పడుతున్నారు. అత్తమ్మ ఆస్తులకు తామే అసలైన వారసులమంటూ ఎవరికి వారే ప్రకటించుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కోసం ఆమె సోదరుడి సంతాపం అయిన దీపక్‌, దీపలు ఒకరిపై ఒకరు కయ్యానికి కాలు దువ్వుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం టీ నగర్‌లోని తన నివాసంలో దీప మీడియాతో మాట్లాడుతూ ఇక ఎవర్నీ వదలిపెట్టే ప్రసక్తే లేదని మాటల తూటాల్ని సంధించారు. పొయస్‌ గార్డెన్‌ను కైవసం చేసుకుంటానని, ఎవరు అడ్డొచ్చినా ఎదిరించి చొరబడటమే లక్ష్యమని పేర్కొన్నారు.

ఆస్తుల కైవసం లక్ష్యంగా చట్ట నిపుణులతో చర్చిస్తున్నానని, చట్టపరంగా అన్నీ సొంతం చేసుకుంటానని దీప ధీమా వ్యక్తం చేశారు. పొయస్‌ గార్డెన్‌లో ఏదో జరుగుతోందన్న అనుమానం వస్తోందన్నారు. తాను వేద నిలయంలోకి వెళ్లిన సమయంలో ఎవ్వరూ లేరని, శశికళ ఫోటోను తాను బయట పడేయడానికి ప్రయత్నించిన సమయంలో లోపలి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు చొచ్చుకు రావడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నదని అన్నారు. ప్రధాని మోదీ తనకు అపాయింట్‌మెంట్‌ ఇస్తారన్న ఆశాభావంతో ఉన్నానని, ఆయన దృష్టికి అన్ని వివరాలను తీసుకెళ్తానని, పొయస్‌ గార్డెన్‌నే కాదు పార్టీని కూడా దక్కించుకుంటానని దీప ధీమా వ్యక్తం చేశారు. మేనత్త స్థానాన్ని తన ద్వారా భర్తీ చేయడానికి అన్నాడీఎంకే కేడర్‌ ఎదురు చూస్తున్నదని, వారి అభీష్టం మేరకు రెండాకుల చిహ్నాన్ని రక్షిస్తానని చెప్పారు. పదవులు ఉన్నంత వరకే సీఎం, మాజీ సీఎంల చుట్టూ కేడర్‌ ఉంటుందని, ఆ పదవులు దూరం కాగానే తన వైపుకు నేతలు వచ్చి తీరుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జయ పేరవై తరహాలో అన్నాడిఎంకేకు అనుబంధంగా ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై ఉంటుందన్నారు.

ఆస్తులన్నీ మావే
మరోవైపు జయ మేనల్లుడు దీపక్‌ మీడియాతో  మాట్లాడుతూ తమ నానమ్మ గతంలో మేనత్త పేరిట ఆస్తుల వీలునామా రాసిందని, అవన్నీ అత్త జయలలిత పేరుతోనే ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో రాసిన వీలునామా మేరకు మేనత్త కోర్టుకు సమర్పించిన జాబితాలోని ఆస్తులకు  ప్రస్తుతం తాను,తన సోదరి మాత్రమే వారసులం అని వ్యాఖ్యానించారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవని, చిన్నత్త శశికళ ఫోటోను బయట పడేయడాన్ని తాను వ్యతిరేకించడంతో దీప ఆగ్రహించినట్టు తెలిపారు. అంతకుముందు తామిద్దరం అక్కడే అల్పాహారం కూడా తీసుకున్నట్టు, అయితే చిన్నత్త సెక్యూరిటీ అడ్డుకుంటే తాను ఏమి చేయగలనని ప్రశ్నించారు.

తాను ఇప్పుడు, ఎప్పుడూ ఒక్కటే చెబుతానని, మేనత్తకు చెందిన అన్ని ఆస్తులకు తామిద్దరం మాత్రమే వారసులం అని, మరెవ్వరూ లేరని స్పష్టం చేశారు. కొన్ని ఆస్తులు వేరే వ్యక్తుల గుప్పెట్లో ఉన్నాయని, వారు తప్పుకుంటే మంచిదని హెచ్చరించారు. గార్డెన్‌లోని ఇంటికి తాను తరచూ వెళ్లి వస్తున్నట్టు, అక్కడ ఎలాంటి అనుమానాస్పద విషయాలు, దాడులు తనకు ఎదురు కాలేదని స్పష్టం చేశారు. తొలుత చిన్నమ్మ శశికళకు అనుకూలంగా వ్యవహరించిన దీపక్‌ తదుపరి పరిణామాలతో తన సోదరికి దగ్గరయ్యే విధంగా వ్యవహరించడం మొదలెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement