కల్లోల దీపం
♦ దీపక్ పిలుపుతో వేద నిలయంలోకి
♦ ఆ అరగంట ఏం జరిగింది
♦ కాసేపటికి ఉత్కంఠ – ముష్టియుద్ధం
♦ హతమార్చేందుకు ప్రయత్నంగా ఆరోపణలు
♦ మేనత్తను దీపక్, శశికళ కలిసి హతమార్చారు
♦ దీప వ్యాఖ్యలతో ఉత్కంఠ
వేద నిలయం వేదికగా దివంగత సీఎం జయలలిత మేనల్లుడు, మేన కోడలు మధ్య వివాదం చెలరేగింది. సోదరుడు దీపక్ పిలుపుతో మేనత్త ఇంట్లోకి సోదరి దీప ఆదివారం అడుగుపెట్టారు. అర్ధగంట సజావుగా సాగినా, తదుపరి ఏమైందో ఏమో క్షణాల్లో కల్లోలం బయలు దేరింది. తనను హతమార్చేందుకు కుట్ర జరిగినట్టుగా దీప ఆరోపణలు గుప్పించారు. మేనత్తను దీపక్, శశికళ కలిసి హతమార్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఆమె వ్యాఖ్యలతో క్షణాల్లో పోయెస్‌గార్డెన్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
సాక్షి, చెన్నై: జయలలిత మరణం తదుపరి ఆమె ఆస్తులకు తాను, తన సోదరి దీప మాత్రమే వారసులం అని దీపక్ వ్యాఖ్యానిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తొలుత చిన్నమ్మ శశికళకు అనుకూలంగా వ్యవహరించిన దీపక్ తదుపరి పరిణామాలతో తన సోదరికి దగ్గరయ్యే విధంగా వ్యవహరించడం మొదలెట్టారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం దీప, దీపక్‌ల మధ్య చోటుచేసుకున్న సమరం ఉత్కంఠకు దారి తీసింది. జయలలిత మరణం, చిన్నమ్మ శశికళ జైలు జీవితం తదుపరి కొన్ని నెలలుగా పోయెస్‌గార్డెన్‌లోని వేదనిలయం నిర్మానుష్యంగా మారిన విషయం తెలిసిందే. భద్రత కూడా ఇక్కడ కరువైంది. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. అప్పుడప్పుడు ఏదో అరుపులు కేకలు వినిపిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీప రూపంలో కల్లోలం బయలు దేరడంతో ఆ పరిసరాల్లో ఉత్కంఠ బయలు దేరడం గమనార్హం.
వేద నిలయంలోకి దీప : తమ్ముడు దీపక్ పిలుపు మేరకు మిత్రుడు రాజాతో కలిసి దీప ఉదయం పోయెస్‌గార్డెన్‌కు వచ్చారు. అక్కడ భద్రత సిబ్బంది ఎవ్వరూ లేని దృష్ట్యా లోనికి వెళ్లారు. అర్ధగంట పాటు అక్కడే ఆమె ఉన్నారు. తదుపరి ఏమి జరిగిందో ఏమో వేదనిలయంలో అరుపులు కేకలు, వివాదం సాగుతున్నట్టుగా ఉత్కం ఠ. ఈ సమాచారంతో ఓ మీడియా వేదనిలయంలోకి ప్రవేశించింది. వెళ్లిన కాసేపటికి ఆ మీడియా ప్రతినిధులు బయటకు పరుగులు పెట్టడంతో పోయెస్‌గార్డెన్ పరిసరాల్లో క్షణాల్లో ఉద్రిక్తతను రేపింది. లోపల ఏమి జరుగుతోందో అన్న ఉత్కంఠ తప్పలేదు. ఇంతలో లోపల నుంచి చెదిరిన జుట్టు, నీరసంగా దీప, ఆమె వెంట భర్త మాధవన్, మిత్రుడు రాజా బయటకు పరుగెత్తుకు వచ్చారు. ఇంతలో అక్కడికి దీప మద్దతు దారులు తరలి రావడం, క్షణాల్లో పోలీసు భద్రత కట్టుదిట్టం కావడం వంటి పరిణామాలు సినీ ఫక్కీలో సాగాయి. దీప మీద దాడి జరిగిందంటూ ఆమె మద్దతుదారులు ఆగ్రహంతో ఊగి పోవడంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది.
హతమార్చేందుకు కుట్ర : ఎవరో తీసుకొచ్చి ఇచ్చిన నీళ్లు తాగి, కుదటపడ్డ అనంతరం మీడియాతో దీప మాట్లాడారు. నాలుగైదు రోజులుగా వేద నిలయానికి రావాలని దీపక్ పదేపదే తనకు ఒత్తిడి తెచ్చినట్టు వివరించారు. తనకు ఇక్కడకు రావడం ఇష్టం లేదని, సోమవారం చట్టపరంగా కొన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్టు పేర్కొన్నారు. ఈ సమయంలో ఉదయాన్నే పదేపదే ఫోన్ చేసి ఇక్కడకు రావాలని, మేనత్త కోసం పూజలు చేయాల్సి ఉందని సూచించి రప్పించినట్టు తెలిపారు. తాను, తన మిత్రుడు రాజా ఇక్కడికి వచ్చామని, దీపక్ వెంట రౌడీల్లా ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు చెప్పారు.
హఠాత్తుగా తన మీద ఆ వ్యక్తులు దాడికి ప్రయత్నించారని, రాజా అడ్డుకునే క్రమంలో వివాదం ముదిరిందని, ఇంతలో తన భర్త మాధవన్‌కు ఫోన్‌చేసి పిలిపించడంతో బయట పడ్డానని తెలిపారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఓ మీడియా ప్రతినిధి, కెమెరామెన్ మీద కూడా ఆ వ్యక్తులు దాడి చేశారని తెలిపారు. పథకం ప్రకారం తనను ఇక్కడకు పిలిపించి హతమార్చేందుకు కుట్ర చేసినట్టుందని ఆరోపించారు. తనకు, తన భర్త మాధవన్‌కు ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజా మీద తప్పుడు కేసులు వేసి కక్ష సాధింపు చర్యలకు సిద్ధం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన మేనత్తను దీపక్, శశికళ కలిసి హతమార్చారని ఆరోపిస్తూ, దీపక్‌ను కూడా శిక్షించాలని డిమాండ్ చేయడం గమనార్హం. దినకరన్ గురించి మాట్లాడ వద్దని బెదిరించారని, క్షణాల్లో పోలీసులు అక్కడకు రావడం బట్టి చూస్తే, ముందస్తు పథకం వేసినట్టు అనుమానాలు కల్గుతోందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగుతున్న ఈ వ్యవహారాలపై ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేయనున్నట్టు, ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయనున్నట్టు చెప్పారు.
దీపక్‌పై దీప ఫైర్ : మీడియాకు చిక్కిన వీడియో మేరకు దీపక్‌పై దీప తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత దీప, దీపక్ జయలలిత ఫొటో వద్ద పుష్పాంజలి ఘటించారు. తదుపరి వేద నిలయంలోకి దీప వెళ్లారు. అర్ధగంట లోపల ఏమి జరిగిందో ఏమోగానీ, కాసేపటికి వెలుపల ఉత్కంఠ తప్పలేదు. ఓ పోలీసు అధికారి రంగంలోకి దిగి దీపను వారిస్తున్నారు. దీపక్‌ను ఉద్దేశించి దీప అనుచిత వ్యాఖ్యలు గుప్పించారు. పొకిరి, రాస్కెల్..మాధవన్ మీద చేయి చేసుకుంటావా, నాకు నీ ముఖం ఇక చూపించ వద్దు అని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఆ పోలీసు అధికారి మాధవన్‌కు ఏమి కాదు, తాను చూసుకుంటానని సమాధానం ఇస్తుండగా, అందరూ సమాధానం చెప్పే రోజు త్వరలో వస్తుందని దీప మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆ దృశ్యాల్లో కనిపించారు. పూజ అని పిలిపించి, హతమార్చేందుకు కుట్ర చేస్తారా, ఇంతసేపు ఎంతకు తనను వెయిట్ చేయించారంటూనే, ఇతనే... ఇతనే అంటుండగా ఓ వ్యక్తి అక్కడి నుంచి జారుకుంటూ వేద నిలయంలోకి వెళ్లడం ఆ మీడియాకు చిక్కిన దృశ్యాల్లో ఉండడం గమనార్హం.
ఇక వేద నిలయంలో తమ్ముడు, అక్కయ్య మధ్య ఏమి జరిగిందోనన్న ఉత్కంఠ తప్పలేదు. వారసులు ఆస్తుల కోసం తన్నుకున్నారేమో...అని వ్యంగ్యాస్త్రాలు సంధించే వాళ్లు పెరిగారు. మీడియాపై దాడి జరగడంతో జర్నలిస్టులు ఆందోళన చేశారు. నేనే రప్పించాను – దీపక్ : దీపను తానే పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయానికి రప్పించానని దీపక్ పేర్కొన్నారు. వి వాదంపై ఓ మీడియాకు ఆయన స్పం దిస్తూ దినకరన్ మనుషులు ఎవ్వరూ ఇక్కడ లేరన్నారు. ఇక్కడ ఏమీ జరగలేదని, నాకు, దీపకు మధ్య ఎలాంటి గొడవ లేదని స్పందించడం గమనార్హం. ఇక, ఈ వివాదం పుణ్యమా, ఇన్నాళ్లు నిర్మానుష్యంగా ఉన్న వేద నిలయం పరిసరాల్ని, ప్రస్తుతం నిఘా నీడలోకి తీసుకు వచ్చారు.