ఇక.. చొరబాటే | Jayalalitha's property is all heirloom Deepak, Deepa. | Sakshi
Sakshi News home page

ఇక.. చొరబాటే

Published Sun, Jun 18 2017 3:34 AM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

ఇక.. చొరబాటే

ఇక.. చొరబాటే

చట్టపరంగా కసరత్తులు
మేనత్త స్థానం నాతోనే భర్తీ : దీప
ఆస్తులన్నీ మావే : దీపక్‌


దివంగత ముఖ్యమంత్రి జయలలిత  మేనకోడలు, మేనల్లుడు మేనత్త ఆస్తుల కోసం మళ్లీ తెర ముందుకు వచ్చారు. పోయెస్‌ గార్డెన్‌లోకి చొరబడేందుకు సిద్ధమైనట్టు, పార్టీని కైవసం చేసుకునేందుకు చట్టపరంగా కసరత్తులు మొదలెట్టినట్టుగా  దీప ప్రకటించారు. మేనత్తకు చెందిన ఆస్తులన్నింటికీ తామే వారసులం అని, చిన్న అత్త శశికళ కుటుంబీకులు తప్పుకుంటే మంచిదని దీపక్‌ హెచ్చరించారు.

సాక్షి, చెన్నై :
దివంగత సీఎం జయలలిత ఆస్తులకు తామే వారసులం అని ఆమె అన్న జయకుమార్‌ కుమారుడు దీపక్, కుమార్తె దీప పేర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య ఐక్యత లేని దృష్ట్యా, తరచూ వివాదం బయలుదేరుతోంది. గత ఆదివారం పోయెస్‌ గార్డెన్‌ వేదికగా, అక్క, తమ్ముడు కయ్యానికి కాలు దువ్వుకున్నారు.

ఈ నేపథ్యంలో శనివారం దీప మీడియా ముందుకు వచ్చారు. అలాగే, దీపక్‌ మరో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ఆస్తులన్నీ తమదేనని, తామిద్దరికీ అన్ని హక్కులు అంటూ వ్యాఖ్యానించారు. అయితే, దీపక్‌ వ్యాఖ్యలు ఓ రకంగా సాగితే, దీప వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.

గార్డెన్‌ను కైవసం చేసుకుంటా:
టీ.నగర్‌లోని తన నివాసంలో దీప మీడియాతో మాట్లాడుతూ ఇక, ఎవర్నీవదలి పెట్టే ప్రసక్తే లేదని మాటల తూటాల్ని అందుకున్నారు. పోయేస్‌ గార్డెన్‌ను కైవశం చేసుకుంటానని, ఎవరు అడ్డు వచ్చినా, ఎదురించి చొరబడటమే లక్ష్యంగా పేర్కొన్నారు. ఆస్తుల కైవశం లక్ష్యంగా చట్ట నిపుణులతో చర్చిస్తున్నానని, చట్టపరంగా అన్నీ సొంతం చేసుకుంటానని ధీమా వ్యక్తంచేశారు. పోయేస్‌ గార్డెన్‌లో ఏదో జరుగుతోందన్న అనుమానం కల్గుతోందన్నారు.

తాను వేద నిలయంలోకి వెళ్లిన సమయంలో ఎవ్వరూ లేరనీ, వివాదం సాగగానే, లోపలి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు చొచ్చుకు రావడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ఆరోపించారు. శశికళ ఫోటోను తాను బయటపడేయడానికి ప్రయత్నించిన సమయంలో ఆ వ్యక్తులు చొచ్చుకు వచ్చారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు అపాయింట్‌మెంట్‌  ఇస్తారన్న ఆశాభావంతో ఉన్నట్టు తెలిపారు. ఆయన దృష్టికి అన్ని వివరాలను తీసుకెళ్తానని పోయేస్‌ గార్డెన్‌ ఇంటినే కాదు, పార్టీని కూడా దక్కించుకుంటానని దీప ధీమా వ్యక్తంచేశారు.

మేనత్త స్థానాన్ని తన ద్వారా భర్తీ చేయడానికి అన్నాడీఎంకే కేడర్‌ ఎదురుచూస్తున్నదని, వారి అభీష్టం మేరకు రెండాకుల చిహ్నం రక్షిస్తానని, పార్టీలోకి అడుగుపెట్టి, మేనత్త స్థానాన్ని భర్తీ చేస్తానని వ్యాఖ్యానించారు. పదవులు ఉన్నంత వరకే సీఎం, మాజీ సీఎంల చుట్టూ కేడర్‌ ఉంటుందని, ఆ పదవులు దూరం కాగానే, తన వైపునకు నేతలు వచ్చి తీరుతారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఎన్నికల కమిషన్‌ తనకు మరింత సమయాన్ని కేటాయిస్తూ మరో రెండు లక్షల అంశాలతో కూడిన ప్రమాణ పత్రం దాఖలుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. జయ పేరవై తరహాలో అన్నాడీఎంకేకు అనుబంధంగా ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై ఉంటుందని పేర్కొన్నారు.

ఆస్తులన్నీ మావే
ఓ మీడియాతో ప్రత్యేకంగా దీపక్‌ మాట్లాడుతూ తమ అవ్వ గతంలో మేనత్త పేరిట ఆస్తుల వీలునామా రాసినట్టు, అవన్నీ మేనత్త పేరుతోనే ఉన్నాయని వివరించారు. గతంలో రాసిన వీలునామా మేరకు, మేనత్త కోర్టుకు సమర్పించిన జాబితాలోని ఆస్తుల మేరకు ప్రస్తుతం తాను తన సోదరి మాత్రమే వారసులం అని వ్యాఖ్యానించారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవనీ, చిన్నత్త శశికళ ఫోటోను బయటకుపడేయడాన్ని తాను వ్యతిరేకించడంతో దీప ఆగ్రహించినట్టు తెలిపారు.

అంతకు ముందు తామిద్దరం అక్కడే అల్పాహారం కూడా తీసుకున్నట్టు, అయితే, చిన్నత్త సెక్యూరిటీ అడ్డుకుంటే, తాను ఏం చేయగలనని ప్రశ్నించారు. తాను ఇప్పుడూ.. ఎప్పుడూ ఒక్కటే చెబుతానని, మేనత్తకు చెందిన అన్ని ఆస్తులకు తామిద్దరం మాత్రమే వారసులం అని, మరెవ్వరూ లేదని స్పష్టంచేశారు. కొన్ని ఆస్తులు వేరే వ్యక్తులు గుప్పెట్లో ఉన్నాయని, వారు తప్పుకుంటే మంచిదని హెచ్చరించారు. గార్డెన్‌లోని ఇంటికి తాను తరచూ వెళ్లి వస్తున్నాననీ.. అక్కడ ఎలాంటి అనుమానాస్పద విషయాలు, దాడులు తనకు ఎదురుకాలేదని స్పష్టంచేశారు. ఈ ఆస్తులన్నీ చిన్నత్త శశికళ కుటుంబీకుల చేతిలో ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయని, దయచేసి వారుగా ముందుకు వచ్చి తమకు అప్పగించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement