రానున్న లోక్‌సభ ఎన్నికల్లో లౌకికవాద యూపీఏ కూటమికి విజయం త థ్యమని కేంద్ర నౌకాయాన శాఖా మంత్రి జీకే వాసన్ ధీమా వ్యక్తం చేశారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో లౌకికవాద యూపీఏ కూటమికి విజయం త థ్యమని కేంద్ర నౌకాయాన శాఖా మంత్రి జీకే వాసన్ ధీమా వ్యక్తం చేశారు. చెన్నై తండియార్‌పేటలో కొత్తగా ఏర్పాటుచేసిన మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, 2004, 2009 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లి గెలిచిందో, అదే వ్యూహంతో నేడు సిద్ధం అవుతోందని పేర్కొన్నారు. యూపీఏ-1, యూపీఏ-2 కాలంలో ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గెలుపుబాట వేస్తాయని చెప్పారు. దేశంలోని లౌకికపార్టీలు కాంగ్రెస్‌తోనే ఉంటాయని అన్నారు. రాష్ట్రంలోని ద్రవిడ పార్టీలన్నీ కాంగ్రెస్ అండతోనే అధికారంలోకి వచ్చాయని గుర్తుచేశారు. ఈనెల 20వ తేదీన జరగనున్న శ్రీలంక, భారత్ చర్చల్లో తమిళ మత్స్యకారుల సమస్యకు పరిష్కారం లభించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమ సమరంలో వీరజవానులా పోరాడిన జగజ్జీవన్‌రాం విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం కలగడం అదృష్టమని వాసన్ పేర్కొన్నారు.