కాంగ్రెస్‌కు శని వదిలింది
సాక్షి, చెన్నై: నెల రోజుల క్రితం వరకు భుజాలు రాసుకుని తిరిగిన వాళ్లు ఇప్పుడు రాజకీయ శత్రువులయ్యారు. నిన్న మొన్నటి వరకు జీకే వాసన్‌ను ఉద్దేశించి సున్నిత వ్యాఖ్యలు చేసిన ఈవీకేఎస్ తాజాగా స్వరం పెంచారు. వాసన్ కొత్త పార్టీ ప్రయత్నాలు వేగవంతమయ్యే కొద్దీ ఆయనపై తీవ్ర విమర్శలు ఎక్కుబెట్టే పనిలో ఈవీకేఎస్ పడ్డారు. కాంగ్రెస్‌లో ఉన్నన్నాళ్లు జీకే వాసన్, ఈవీకేఎస్ ఇళంగోవన్‌లు స్నేహ పూర్వకంగా మెలిగారు.
ఇతర గ్రూపుల్ని పక్కన బెడితే, వాసన్, ఈవీకేఎస్ గ్రూపులు కలసికట్టుగానే ఉన్నాయి. అయితే, ఈవీకేఎస్‌కు టీఎన్‌సీసీ పగ్గాలు చిక్కిన నేపథ్యంలో వాసన్ కాంగ్రెస్ గూటి నుంచి బయటకు వచ్చారు. సొంత కుంపటిగా కొత్త పార్టీ పనుల్ని వేగవంతం చేశారు. రాష్ట్రంలో పర్యటిస్తూ, తన మద్దతుదారుల్ని ఏకం చేయడం, కాంగ్రెస్ అసంతృప్తివాదుల్ని తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా వాసన్ పరుగులు తీస్తున్నారు.
అయితే, వాసన్ వేగం పెరిగే కొద్దీ ఈవీకేఎస్‌లో ఆక్రోశం రగులుతోంది. కాంగ్రెస్ నుంచి వాసన్ బయటకు వెళ్లిన సమయంలో మర్యాద పూర్వకంగానే ఈవీకేఎస్ స్పందించారు. ఆయన బయటకు వెళ్లకూడదని, తమతోనే ఉండాలని, ఒక వేళ వెళ్లినా.. ఎక్కడున్నా సంతోషంగానే ఉండాలని ఆకాంక్షించారు. అయితే, కాంగ్రెస్‌వాదుల్ని తన వైపు తిప్పుకోవడంలో వాసన్ వ్యూహాలు సత్ఫలితాల్ని ఇస్తుండడం ఈవీకేఎస్‌కు మింగుడు పడటం లేదు. దీంతో వాసన్‌ను టార్గెట్ చేసి విమర్శల స్వరాన్ని పెంచే పనిలో పడ్డారు. కోయంబత్తూరు వేదికగా జరిగిన పార్టీ సమావేశంలో ఏకంగా శని వదిలిందంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
కోయంబత్తూరులో ఈవీకేఎస్ పర్యటించారు. అక్కడ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగాన్ని అందుకున్న ఆయన జీకే వాసన్ ను టార్గెట్ చేసి విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన స్వరాన్ని పెంచుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొంగు మండలంలో కాంగ్రెస్‌ను చీల్చేందుకు అనేక కుట్రలు చేశారని, అయితే, వారి పాచికలు ఇక్కడ పార లేదన్నారు. ఇందుకు కారణం, ఇక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు పార్టీ మీదున్న అభిమానమేనన్నారు.
కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేయాలని, నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నార ని ధ్వజమెత్తారు. తాను ఉన్నంత కాలం ఎవరి కుట్రలు కుతంత్రాలు కాంగ్రెస్ నీడను కూడా తాకలేవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాహుకాలం, యమగండం మాదిరిగానే శని వదిలిందని, ఆ వర్గం వెళ్లడంతో కాంగ్రెస్‌కు ఇక పూర్వ వైభవం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ దయ లేకుండా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. కొత్త పార్టీలతో ఒరిగేది శూన్యమేనని, వాళ్లకు గుణపాఠం తథ్యమని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఆర్ ప్రభు, కంద స్వామి, మనోహరన్, మయూరా జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.