e v k s elangovan
-
వాళ్లిద్దరు ఒకటయ్యారు
టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం మధ్య అధిష్టానం చొరవతో సయోద్య కుదిరింది. తమ నేతలు ఏకం కావడంతో ఇక, సమష్టిగా ఐకమత్యంతో పార్టీ కోసం శ్రమించేందుకు మద్దతుదారులు సిద్ధం అయ్యారు. సాక్షి, చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదన్న విషయం తెలిసిందే. ఏ ఏ గ్రూపుల మధ్య ఎప్పుడు వివాదాలు రాజుకుంటాయో చెప్పలేం. ఈ గ్రూపు గొడవలే ఆ పార్టీని రాష్ర్టంలో పతనం అంచుకు చేర్చి ఉన్నాయి. ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతుతో చతికిల బడ్డ పార్టీకి కొత్త గాలి నింపడం లక్ష్యంగా టీఎన్‌సీసీ బాధ్యతల్ని ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు ఏఐసీసీ అప్పగించింది. అయినా, గ్రూపుల తన్నులాట మాత్రం ఆగలేదు.ఈ సారి ఏకంగా టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌తో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వర్గీయులు ఢీ కొట్టి రచ్చకెక్కారు. దీంతో రెండు గ్రూపుల మధ్య మాటల యుద్ధం పెరిగింది. పార్టీతో సంబంధం లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించే పనిలో చిదంబరం వర్గీయులు నిమగ్నం కావడంతో వేరు కుంపటి పెట్టబోతున్నారా..? అన్న ప్రశ్న బయలు దేరింది. ఈ రెండు గ్రూపుల వివాదం పార్టీని మరింత అదోగతి పాలు చేస్తుండడంతో ఏఐసీసీ పెద్దలు పంచాయితీ పెట్టక తప్పలేదని చెప్పవచ్చు. ఈ పంచాయతీలు ఓ వైపు సాగుతున్నా, మరో వైపు మాటల తూటాలు పేలుతూనే వచ్చాయి. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతోండడంతో ఇకనైనా సామరస్య పూర్వకంగా అందరూ కలసి మెలసి వెళ్లాలని అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం. దీంతో చిదంబరం, ఈవీకేఎస్ తగ్గారు. కుదిరిన సయోధ్య : ఇన్నాళ్లు సత్యమూర్తి భవన్లో ఎలాంటి సభలు, సమావేశాలు పెట్టకుండా, హోటళ్లల్లో జరుపుకుంటూ వచ్చిన చిదంబరం మద్దతు దారులు, గత వారం ఈవీకేఎస్‌తో భేటీ కావడం సత్యమూర్తి భవన్‌ను వేదికగా చేసుకుని సమావేశం ఏర్పాటు చేసుకోవడం వివాదాలకు ముగింపు పలికినట్టు అయింది. అదే సమయంలో రెండు రోజుల క్రితం పార్టీ సర్వ సభ్య సమావేశం జరగడం, ఇందుకు చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరం డుమ్మా కొట్టడంతో చర్చకు దారి తీశాయి. ఐక్యంగా కదులుదాం : ఇక , కాంగ్రెస్‌లో గ్రూపులకు ఆస్కారం లేదని, అందరం ఐకమత్యంగా ముందుకు సాగడం లక్ష్యంగా చిదంబరం, ఈవీకేఎస్లో ఒక నిర్ణయానికి వచ్చేశారు. అధిష్టానం పెద్దల పంచాయతీకి తలొగ్గిన ఈ నేతలు ఇక, తామిద్దరం కలసి కట్టుగా పార్టీ బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగునున్నారు. ఆదివారం సత్యమూర్తి భవన్ వేదికగా ఈ ఇద్దరు నేతలు ఏకం అయ్యారు. డీఎండీకే నేత విజయకాంత్ ఆ ఇద్దరితో కలసి సత్యమూర్తి భవన్లో భేటీ అయ్యారు. అనంతరం అంబేద్కర్ శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ విభాగం నేతృత్వంలో ఏడాది పాటుగా నిర్వహించే విధంగా కార్యాచరణను సిద్ధం చేశారు. ఈవీకేఎస్ చిదంబరం కలసి కట్టుగానే ఈ సమావేశంలో నేతల అభిప్రాయాలను తెలుసుకుని వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. ఇందులో ఏఐసీసీ కార్యదర్శులు తిరునావుక్కరసర్, జయకుమార్, అధికార ప్రతినిధి కుష్భు, మాజీ ఎంపి కృష్ణ స్వామి, ఎస్సీ, ఎస్టీ విభాగం నేతలు సెల్వ పెరుంతొగైలతో పాటుగా పలువురు ముఖ్య నాయకులు హాజరు అయ్యారు. ఈ సమావేశం వేదికగా తమ నేతలు ఏకం కావడంతో ఇక, సమిష్టిగా పార్టీ బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగేందుకు ఆ ఇద్దరు నేతల మద్దతు దారులు సిద్ధం అయ్యారు. ఈ ఐక్యత కొనసాగాలన్న కాంక్ష పలువురు సీనియర్ కాంగ్రెస్ వాదులు వ్యక్తం చేయడం గమనార్హం. -
కాంగ్రెస్‌కు శని వదిలింది
సాక్షి, చెన్నై: నెల రోజుల క్రితం వరకు భుజాలు రాసుకుని తిరిగిన వాళ్లు ఇప్పుడు రాజకీయ శత్రువులయ్యారు. నిన్న మొన్నటి వరకు జీకే వాసన్‌ను ఉద్దేశించి సున్నిత వ్యాఖ్యలు చేసిన ఈవీకేఎస్ తాజాగా స్వరం పెంచారు. వాసన్ కొత్త పార్టీ ప్రయత్నాలు వేగవంతమయ్యే కొద్దీ ఆయనపై తీవ్ర విమర్శలు ఎక్కుబెట్టే పనిలో ఈవీకేఎస్ పడ్డారు. కాంగ్రెస్‌లో ఉన్నన్నాళ్లు జీకే వాసన్, ఈవీకేఎస్ ఇళంగోవన్లు స్నేహ పూర్వకంగా మెలిగారు. ఇతర గ్రూపుల్ని పక్కన బెడితే, వాసన్, ఈవీకేఎస్ గ్రూపులు కలసికట్టుగానే ఉన్నాయి. అయితే, ఈవీకేఎస్‌కు టీఎన్‌సీసీ పగ్గాలు చిక్కిన నేపథ్యంలో వాసన్ కాంగ్రెస్ గూటి నుంచి బయటకు వచ్చారు. సొంత కుంపటిగా కొత్త పార్టీ పనుల్ని వేగవంతం చేశారు. రాష్ట్రంలో పర్యటిస్తూ, తన మద్దతుదారుల్ని ఏకం చేయడం, కాంగ్రెస్ అసంతృప్తివాదుల్ని తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా వాసన్ పరుగులు తీస్తున్నారు. అయితే, వాసన్ వేగం పెరిగే కొద్దీ ఈవీకేఎస్లో ఆక్రోశం రగులుతోంది. కాంగ్రెస్ నుంచి వాసన్ బయటకు వెళ్లిన సమయంలో మర్యాద పూర్వకంగానే ఈవీకేఎస్ స్పందించారు. ఆయన బయటకు వెళ్లకూడదని, తమతోనే ఉండాలని, ఒక వేళ వెళ్లినా.. ఎక్కడున్నా సంతోషంగానే ఉండాలని ఆకాంక్షించారు. అయితే, కాంగ్రెస్వాదుల్ని తన వైపు తిప్పుకోవడంలో వాసన్ వ్యూహాలు సత్ఫలితాల్ని ఇస్తుండడం ఈవీకేఎస్‌కు మింగుడు పడటం లేదు. దీంతో వాసన్‌ను టార్గెట్ చేసి విమర్శల స్వరాన్ని పెంచే పనిలో పడ్డారు. కోయంబత్తూరు వేదికగా జరిగిన పార్టీ సమావేశంలో ఏకంగా శని వదిలిందంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కోయంబత్తూరులో ఈవీకేఎస్ పర్యటించారు. అక్కడ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగాన్ని అందుకున్న ఆయన జీకే వాసన్ ను టార్గెట్ చేసి విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన స్వరాన్ని పెంచుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొంగు మండలంలో కాంగ్రెస్‌ను చీల్చేందుకు అనేక కుట్రలు చేశారని, అయితే, వారి పాచికలు ఇక్కడ పార లేదన్నారు. ఇందుకు కారణం, ఇక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు పార్టీ మీదున్న అభిమానమేనన్నారు. కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేయాలని, నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నార ని ధ్వజమెత్తారు. తాను ఉన్నంత కాలం ఎవరి కుట్రలు కుతంత్రాలు కాంగ్రెస్ నీడను కూడా తాకలేవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాహుకాలం, యమగండం మాదిరిగానే శని వదిలిందని, ఆ వర్గం వెళ్లడంతో కాంగ్రెస్‌కు ఇక పూర్వ వైభవం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ దయ లేకుండా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. కొత్త పార్టీలతో ఒరిగేది శూన్యమేనని, వాళ్లకు గుణపాఠం తథ్యమని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఆర్ ప్రభు, కంద స్వామి, మనోహరన్, మయూరా జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలకు కొదవలేదు
క్లిష్టపరిస్థితుల్లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన ఈవీకేఎస్ ఇళంగోవన్ ఇంటగెలిచి రచ్చగెలవాలని భావిస్తున్నారు. పార్టీని బలపరచుకున్న తరువాత ఎన్నికల బరిలో దిగేందుకు పార్టీని సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే సీనియర్ నటుడు కార్తీక్, తాను స్థాపించిన నాడాళుం మక్కల్ కట్చి పార్టీని బుధవారం కాంగ్రెస్‌లో విలీనం చేశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలకు కొదవలేదు. ప్రస్తుత టీఎన్ సీసీ అధ్యక్షుడు ఇళంగోవన్, కేంద్ర మాజీ మంత్రులు జీకే వాసన్, పీ చిదంబరం, తంగబాలు వేర్వేరు గ్రూపులుగానే వ్యవహరిస్తున్నారు. తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైన తరువాత ఆ పార్టీ అధినేత జీకే వాసన్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఈ కారణంగా మిగిలిన ముగ్గురు వర్గ నేతలు పార్టీ కార్యాలయ ముఖం చూడడం మానివేశారు. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన జ్ఞానదేశికన్ సైతం జీకే వాసన్ వర్గమే. కొత్త పార్టీ పెట్టేందుకు జీకేవీ, జ్ఞానదేశికన్ కాంగ్రెస్ నుంచి వైదొలగడంతో దూరంగా ఉన్న మూడు వర్గాలు ఏకమయ్యూరుు. పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, తంగబాలు, జయంతి నటరాజన్ తదితరులు సత్యమూర్తి భవన్‌కు చేరుకుని ఇళంగోవన్‌ను అభినందించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేలను కలిగి ఉండగా, వీరిలో ఇద్దరు జీకే వాసన్‌తో వెళ్లిపోయారు. పార్టీపరమైన 58 జిల్లా అధ్యక్షుల్లో 24 మంది జిల్లా అధ్యక్షులు వాసన్ వెంట నడుస్తున్నారు. 400 మంది మాజీ ఎమ్మెల్యేల్లో 380 మంది కాంగ్రెస్‌తోనే ఉన్నారని ఇళంగోవన్ అంటున్నారు. జీకే వాసన్ పార్టీని ప్రకటించేనాటికి మరింత మంది ఆయనను వీడి సొంతగూటికి చేరుకుంటారని ఆయన నమ్మకంతో ఉన్నారు. విలీనం అఖిల భారత నాడాళుం మక్కల్ కట్చి వ్యవస్థాపక అధ్యక్షుడు, నటుడు కార్తీక్ బుధవారం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. సీనియర్ నటుడు ముత్తురామన్ తనయుడైన కార్తీక్ సీతాకోకచిలుక, అభినందన వంటి పలు తెలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. తాను స్థాపించిన పార్టీతో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసినా ఒక్కచోట గెలవలేదు. కుటుంబ సభ్యుల ఆస్తితగాదాలు, పోలీస్ కేసులతో ఇటీవల వార్తల్లో వ్యక్తిగా మారిన కార్తీక్ సుమారు 200 మంది అనుచరులతో బుధవారం సత్యమూర్తి భవన్‌కు చేరుకుని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు సూర్యమూర్తి, పీఎంకే నేత మణిరత్నం సైతం తమ అనుచరుగణంతో కాంగ్రెస్‌లో చేరారు. -
కాంగ్రెస్ లో ఒకే ఒక్కడు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రాంతీయ పార్టీలతో పొత్తులేకుంటే చిత్తయిపోవడం ఖాయమని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. ఏ పార్టీ వెంటలేకుండా ఒంటరిపోరుకు దిగడం తుంటరితనమే అవుతుందని అధిష్టానానికి ముఖం చాటేస్తున్నారు. ఒకరు ఓపిక లేదంటే, మరొకరు కాంగ్రెస్‌లో ఒకేఒక్కడు వృద్ధాప్యాన్ని అడ్డంపెట్టుకున్నారు. మరొకరు కుమారుడికి ఇవ్వండి తనకొద్దని అధిష్టానం వద్ద వాపోతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన 8 మంది ఎంపీల్లో ఒక్కరు కూడా పోటీకి ముందుకు రాకపోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దుర్గతికి అద్దం పడుతోంది. ఆరణి సిట్టింగ్ ఎంపీ కృష్ణస్వామి తనకు రాజకీయ విరామం తీసుకోవాలని ఉందని ప్రకటించారు. మాజీ కేంద్రమంత్రి తంగబాలును సేలం నుంచి పోటీచేయాలని కాంగ్రెస్ ఆదేశించగా విముఖతను బహిరంగా ప్రదర్శించి ఎవరైనా యువతకు అవకాశం ఇవ్వాలని సూచించారు. ముఖం చాటేస్తున్న కేంద్ర మంత్రులు చిన్నా చితకా నేతలే కాదు, కేంద్రమంత్రులు, సిట్టింగ్ ఎంపీలు సైతం పోటీకి ముఖం చాటేస్తున్నారు. పైగా తనకు వద్దంటే తనకు వద్దు అని, కుమారులకు ఇవ్వాలని కీచులాడుకుంటున్నారు. కేంద్ర మంత్రి పీ చిదంబరం సైతం పోటీకి వెనకడుగు వేస్తుండగా, శివగంగై సిట్టింగ్ ఎంపీగా పోటీచేసి తీరాలని రాహుల్‌గాంధీ ఆయన్ను ఆదేశించారు. గత ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా చిదంబరం గెలిచారు. ఓడిపోయిన చిదంబరం గోల్మాల్ చేసి గెలిచారనే అపవాదును ఎదుర్కొన్నారు. ఆ చేదు అనుభవాన్ని ఇంకా మరిచిపోని ఆయన తన కుమారుడు కార్తీకి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారు. దిండుగల్లు నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ సిద్దన్ తనకు వయసైపోయిందని, పోటీచేయలేనని తప్పించుకుంటున్నారు. చిదంబరం వద్దంటున్నందున శివగంగై స్థానాన్ని తన కుమారుడు జయసింహ నాచియప్పన్‌కు కేటాయించాలని మరో కేంద్ర మంత్రి సుదర్శన్ నాచియప్పన్ కోరుతున్నారు. 1999 ఎన్నికల్లో శివగంగై నుంచి తమిళ మానిల కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసిన చిదంబరంను కాంగ్రెస్ అభ్యర్థిని సుదర్శన్ నాచియప్పన్ ఓడించారు. అదే ధీమాతో ఈసారి గెలవచ్చని సుదర్శన్ ధీమాతో ఉన్నారు. అయితే ఎవ్వరి కుమారులకు ఇచ్చేది లేదు చిదంబరం పోటీ చేసి తీరాల్సిందేనని అధిష్టానం ఆదేశించినట్లు తెలిసింది. అరుుతే అదే స్థానాన్ని తనకు కానీ, తన కుమారునికి కానీ కేటాయించాలని కోరుతూ సుదర్శన్ నాచియప్పన్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. మయిలాడుదురై నుంచి పోటీచేయాల్సిందిగా కేంద్ర మంత్రి జీకే వాసన్‌ను ఆయన అనుచరులు వత్తిడితెస్తున్నారు. తాను ప్రచారానికి పరిమితం కానున్నట్లు ఆయన నిర్ణయించుకున్నారు. శ్రీపెరంబదూర్ నుంచి పోటీచేయాలని మాజీ కేంద్రమంత్రి జయంతి నటరాజన్‌ను ఆధిష్టానం ఆదేశించింది. పోటీ చేయడం ఇష్టం లేదని ఆమె పార్టీకి చెప్పుకున్నారు. ఒకే ఒక్కడు బడా నేతలంతా పోటీ నుంచి తప్పుకునేందుకే ఆసక్తి చూపుతుండగా, కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవన్ మాత్రం తిరుపూరు నుంచి పోటీ చేసేందుకు సుముఖత ప్రదర్శించారు. అధిష్టానం ఆదేశిస్తే తనకు తిరుపూరును కేటాయించాలని కోరనున్నట్లు సుమారు రెండువారాల క్రితమే ప్రకటించారు. వద్దుబాబోయ్ అనే నేతల వెంటపడుతున్న కాంగ్రెస్ అధిష్టానం పోటీకి సిద్ధంగా ఉన్న ఇళంగోవన్ విషయంలో నాన్చుడుధోరణిని అవలంభిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడం విడ్డూరం. నాలుగో జాబితాపై ఆశలు : అభ్యర్థులే కరువైన కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు తొలిదశగా 20 మందితో బలవంతంగా అభ్యర్థులను సిద్ధం చేసుకుని మంగళవారం పేర్లను ప్రకటించాలని భావించింది. అయితే కేంద్రమంత్రులే ఎదురుతిరగడంతో తమిళనాడు జాబితాను పక్కనపెట్టి మిగిలిన రాష్ట్రాలతో మూడో జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ కూటముల మధ్య నలిగిపోయి పరాజయం పాలయ్యేకంటే పోటీకి దూరంగా ఉండటమే మేలని నేతలు భావిస్తున్నారు. నాలుగోజాబితాలోనైనా రాష్ట్రానికి చోటుదక్కుతుందో లేదోనని కాంగ్రెస్ కార్యకర్తలు కలవరపడుతున్నారు.