కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలకు కొదవలేదు
క్లిష్టపరిస్థితుల్లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన ఈవీకేఎస్ ఇళంగోవన్ ఇంటగెలిచి రచ్చగెలవాలని భావిస్తున్నారు. పార్టీని బలపరచుకున్న తరువాత ఎన్నికల బరిలో దిగేందుకు పార్టీని సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే సీనియర్ నటుడు కార్తీక్, తాను స్థాపించిన నాడాళుం మక్కల్ కట్చి పార్టీని బుధవారం కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలకు కొదవలేదు. ప్రస్తుత టీఎన్ సీసీ అధ్యక్షుడు ఇళంగోవన్, కేంద్ర మాజీ మంత్రులు జీకే వాసన్, పీ చిదంబరం, తంగబాలు వేర్వేరు గ్రూపులుగానే వ్యవహరిస్తున్నారు. తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైన తరువాత ఆ పార్టీ అధినేత జీకే వాసన్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఈ కారణంగా మిగిలిన ముగ్గురు వర్గ నేతలు పార్టీ కార్యాలయ ముఖం చూడడం మానివేశారు. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన జ్ఞానదేశికన్ సైతం జీకే వాసన్ వర్గమే.
కొత్త పార్టీ పెట్టేందుకు జీకేవీ, జ్ఞానదేశికన్ కాంగ్రెస్ నుంచి వైదొలగడంతో దూరంగా ఉన్న మూడు వర్గాలు ఏకమయ్యూరుు. పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, తంగబాలు, జయంతి నటరాజన్ తదితరులు సత్యమూర్తి భవన్‌కు చేరుకుని ఇళంగోవన్‌ను అభినందించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేలను కలిగి ఉండగా, వీరిలో ఇద్దరు జీకే వాసన్‌తో వెళ్లిపోయారు. పార్టీపరమైన 58 జిల్లా అధ్యక్షుల్లో 24 మంది జిల్లా అధ్యక్షులు వాసన్ వెంట నడుస్తున్నారు. 400 మంది మాజీ ఎమ్మెల్యేల్లో 380 మంది కాంగ్రెస్‌తోనే ఉన్నారని ఇళంగోవన్ అంటున్నారు. జీకే వాసన్ పార్టీని ప్రకటించేనాటికి మరింత మంది ఆయనను వీడి సొంతగూటికి చేరుకుంటారని ఆయన నమ్మకంతో ఉన్నారు.
విలీనం
అఖిల భారత నాడాళుం మక్కల్ కట్చి వ్యవస్థాపక అధ్యక్షుడు, నటుడు కార్తీక్ బుధవారం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. సీనియర్ నటుడు ముత్తురామన్ తనయుడైన కార్తీక్ సీతాకోకచిలుక, అభినందన వంటి పలు తెలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. తాను స్థాపించిన పార్టీతో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసినా ఒక్కచోట గెలవలేదు. కుటుంబ సభ్యుల ఆస్తితగాదాలు, పోలీస్ కేసులతో ఇటీవల వార్తల్లో వ్యక్తిగా మారిన కార్తీక్ సుమారు 200 మంది అనుచరులతో బుధవారం సత్యమూర్తి భవన్‌కు చేరుకుని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్‌జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు సూర్యమూర్తి, పీఎంకే నేత మణిరత్నం సైతం తమ అనుచరుగణంతో కాంగ్రెస్‌లో చేరారు.