చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రాంతీయ పార్టీలతో పొత్తులేకుంటే చిత్తయిపోవడం ఖాయమని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. ఏ పార్టీ వెంటలేకుండా ఒంటరిపోరుకు దిగడం తుంటరితనమే అవుతుందని అధిష్టానానికి ముఖం చాటేస్తున్నారు. ఒకరు ఓపిక లేదంటే, మరొకరు కాంగ్రెస్‌లో ఒకేఒక్కడు వృద్ధాప్యాన్ని అడ్డంపెట్టుకున్నారు. మరొకరు కుమారుడికి ఇవ్వండి తనకొద్దని అధిష్టానం వద్ద వాపోతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన 8 మంది ఎంపీల్లో ఒక్కరు కూడా పోటీకి ముందుకు రాకపోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దుర్గతికి అద్దం పడుతోంది.
ఆరణి సిట్టింగ్ ఎంపీ కృష్ణస్వామి తనకు రాజకీయ విరామం తీసుకోవాలని ఉందని ప్రకటించారు. మాజీ కేంద్రమంత్రి తంగబాలును సేలం నుంచి పోటీచేయాలని కాంగ్రెస్ ఆదేశించగా విముఖతను బహిరంగా ప్రదర్శించి ఎవరైనా యువతకు అవకాశం ఇవ్వాలని సూచించారు.
ముఖం చాటేస్తున్న కేంద్ర మంత్రులు
చిన్నా చితకా నేతలే కాదు, కేంద్రమంత్రులు, సిట్టింగ్ ఎంపీలు సైతం పోటీకి ముఖం చాటేస్తున్నారు. పైగా తనకు వద్దంటే తనకు వద్దు అని, కుమారులకు ఇవ్వాలని కీచులాడుకుంటున్నారు. కేంద్ర మంత్రి పీ చిదంబరం సైతం పోటీకి వెనకడుగు వేస్తుండగా, శివగంగై సిట్టింగ్ ఎంపీగా పోటీచేసి తీరాలని రాహుల్‌గాంధీ ఆయన్ను ఆదేశించారు. గత ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా చిదంబరం గెలిచారు.
ఓడిపోయిన చిదంబరం గోల్‌మాల్ చేసి గెలిచారనే అపవాదును ఎదుర్కొన్నారు. ఆ చేదు అనుభవాన్ని ఇంకా మరిచిపోని ఆయన తన కుమారుడు కార్తీకి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారు. దిండుగల్లు నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ సిద్దన్ తనకు వయసైపోయిందని, పోటీచేయలేనని తప్పించుకుంటున్నారు. చిదంబరం వద్దంటున్నందున శివగంగై స్థానాన్ని తన కుమారుడు జయసింహ నాచియప్పన్‌కు కేటాయించాలని మరో కేంద్ర మంత్రి సుదర్శన్ నాచియప్పన్ కోరుతున్నారు. 1999 ఎన్నికల్లో శివగంగై నుంచి తమిళ మానిల కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసిన చిదంబరంను కాంగ్రెస్ అభ్యర్థిని సుదర్శన్ నాచియప్పన్ ఓడించారు. అదే ధీమాతో ఈసారి గెలవచ్చని సుదర్శన్ ధీమాతో ఉన్నారు.
అయితే ఎవ్వరి కుమారులకు ఇచ్చేది లేదు చిదంబరం పోటీ చేసి తీరాల్సిందేనని అధిష్టానం ఆదేశించినట్లు తెలిసింది. అరుుతే అదే స్థానాన్ని తనకు కానీ, తన కుమారునికి కానీ కేటాయించాలని కోరుతూ సుదర్శన్ నాచియప్పన్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. మయిలాడుదురై నుంచి పోటీచేయాల్సిందిగా కేంద్ర మంత్రి జీకే వాసన్‌ను ఆయన అనుచరులు వత్తిడితెస్తున్నారు. తాను ప్రచారానికి పరిమితం కానున్నట్లు ఆయన నిర్ణయించుకున్నారు. శ్రీపెరంబదూర్ నుంచి పోటీచేయాలని మాజీ కేంద్రమంత్రి జయంతి నటరాజన్‌ను ఆధిష్టానం ఆదేశించింది. పోటీ చేయడం ఇష్టం లేదని ఆమె పార్టీకి చెప్పుకున్నారు.
ఒకే ఒక్కడు
బడా నేతలంతా పోటీ నుంచి తప్పుకునేందుకే ఆసక్తి చూపుతుండగా, కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవన్ మాత్రం తిరుపూరు నుంచి పోటీ చేసేందుకు సుముఖత ప్రదర్శించారు. అధిష్టానం ఆదేశిస్తే తనకు తిరుపూరును కేటాయించాలని కోరనున్నట్లు సుమారు రెండువారాల క్రితమే ప్రకటించారు. వద్దుబాబోయ్ అనే నేతల వెంటపడుతున్న కాంగ్రెస్ అధిష్టానం పోటీకి సిద్ధంగా ఉన్న ఇళంగోవన్ విషయంలో నాన్చుడుధోరణిని అవలంభిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడం విడ్డూరం.
నాలుగో జాబితాపై ఆశలు : అభ్యర్థులే కరువైన కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు తొలిదశగా 20 మందితో బలవంతంగా అభ్యర్థులను సిద్ధం చేసుకుని మంగళవారం పేర్లను ప్రకటించాలని భావించింది. అయితే కేంద్రమంత్రులే ఎదురుతిరగడంతో తమిళనాడు జాబితాను పక్కనపెట్టి మిగిలిన రాష్ట్రాలతో మూడో జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ కూటముల మధ్య నలిగిపోయి పరాజయం పాలయ్యేకంటే పోటీకి దూరంగా ఉండటమే మేలని నేతలు భావిస్తున్నారు. నాలుగోజాబితాలోనైనా రాష్ట్రానికి చోటుదక్కుతుందో లేదోనని కాంగ్రెస్ కార్యకర్తలు కలవరపడుతున్నారు.
కాంగ్రెస్ లో ఒకే ఒక్కడు
Published Thu, Mar 20 2014 3:51 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement