జాలర్లకు షాక్ | Fishermen shock | Sakshi
Sakshi News home page

జాలర్లకు షాక్

Published Thu, Jul 3 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

జాలర్లకు షాక్

జాలర్లకు షాక్

సాక్షి, చెన్నై : రామేశ్వరానికి కూత వేటు దూరంలో ఉన్న కచ్చదీవులు ఒకప్పుడు తమిళనాడు పరిధిలో ఉండేవి. 1974లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రభుత్వం శ్రీలంకతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కచ్చదీవుల్ని శ్రీలంకకు ధారాదత్తం చేసింది. దీంతో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న తమిళనాడులోని సముద్ర తీర జాలర్లకు కన్నీళ్లు మిగిలాయి. ఆ దీవుల్లో తమిళ జాలర్లు చేపల్ని వేటాడేందుకు శ్రీలంక నావికాదళం అడ్డుతగులుతోంది. దాడులు, కాల్పులతో పాటు బందీలుగా పట్టుకెళుతూ భయాందోళన సృష్టిస్తోంది. స్వాధీనమే లక్ష్యం: మూడోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన జయలలిత కచ్చదీవులను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. గత యూపీఏ సర్కారుపై పలుమార్లు ఒత్తిడి తెచ్చారు. అసెంబ్లీలో సైతం తీర్మానం చేశారు.
 
 భౌగోళికంగా, సంస్కృతి, సంప్రదాయం, నాగరికత ప్రకారం కచ్చదీవులు భారత్‌లోనే ఉండాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గత ప్రభుత్వానికి వివరించే యత్నం చేశారు. భారత పార్లమెంట్ ఆమోదం లేకుండా కచ్చదీవుల్ని శ్రీలంకకు ధారాదత్తం చేయడం నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పినా ప్రయోజనం శూన్యం. ఈ క్రమంలో ప్రజలు యూపీఏకు చరమ గీతంపాడి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ చేతికి అధికారం అప్పగించారు. దీంతో తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయన్న ఆశ తమిళ జాలర్లలో నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భావించారు.
 
 కచ్చదీవుల విషయంలో కొత్త ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుని తమిళులకు అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కచ్చదీవుల వ్యవహారం లో తమదీ యూపీఏ బాటేనని స్పష్టం చేస్తూ మోడీ సర్కారు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.కేంద్రం పిటిషన్: తమిళ జాలర్లపై వరుస దాడులు, కచ్చదీవులపై తమిళుల హక్కుల పరిరక్షణ  నినాదంతో యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రానికి చెందిన పీటర్ రాయల్ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఏడాదిన్నర కాలంగా విచారణ జరుగుతోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన విచారణ సందర్భంగా కేంద్రాన్ని వివరణ కోరుతూ కోర్టు నోటీసులు ఇచ్చింది.
 
 కచ్చదీవుల వ్యవహారం, జాలర్ల భద్రత విషయంగా స్పష్టమైన వివరాలతో రిట్ పిటిషన్ దాఖలు చేయూలని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే విధానం కూడా మారలేదు. కేంద్ర ప్రభుత్వం తరపున బుధవారం మద్రాసు హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ జాలర్లకు పెద్ద షాక్ తగిలేలా చేసింది. 1974లో కచ్చదీవులు, 1976లో మన్నార్ వలిగుడా, వంగల వలిగుడాల విషయంలో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి ఆ పిటిషన్‌లో కేంద్రం వివరించింది. వీసాలేకుండా, శ్రీలంక అనుమతి లేకుండా కచ్చదీవుల్లోకి తమిళ జాలర్లు వెళ్లవచ్చని, అక్కడ చేపల్ని వేటాడేందుకు అవకాశం లేదని ప్రకటించింది. కచ్చదీవుల్లోని ఆంథోనియార్ ఆలయ ఉత్సవాల్ని ఘనంగా శ్రీలంక, తమిళ జాలర్లు జరుపుకునేందుకు వీలుందని పేర్కొంది. చేపల వేట విషయంలో తమిళ జాలర్లకు ఎలాంటి హక్కులు లేవని, అంతర్జాతీయ సరిహద్దుల్ని దాటేందుకు వీలులేదని వెల్లడించడం రాష్ర్ట ప్రభుత్వాన్ని విస్మయంలో పడేసింది. జాలర్లలో ఆగ్ర హ జ్వాలను రగిల్చింది.
 
 ఆగ్రహం: ఈ పిటిషన్ తమిళ జాలర్లు, తమిళాభిమాన సంఘాలు, రాజకీయ పక్షాల్లో ఆగ్రహాన్ని రేపింది. కచ్చదీవుల్ని స్వాధీనం చేసుకోవాల్సిందేనన్న డిమాండ్ మరోమారు తెరమీదకు వచ్చింది. తమిళుల భూభాగాన్ని ధారాత్తం చేసింది కాకుండా, చేపల వేట విషయంలో తమకు ఎలాంటి హక్కులు లేవంటూ కేంద్రం ప్రకటించడాన్ని జాలర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నాగపట్నం, రామేశ్వరం, పుదుకోట్టై జాలర్ల సంఘాలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి కేంద్రం తీరును ఎండగట్టేందుకు సిద్ధం అవుతున్నాయి.
 
 ఎండీఎంకే నేత వైగో కేంద్రం తీరును తప్పుబడుతూ గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమిళుల హక్కుల్ని కాలరాయవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రం సంధించారు. కచ్చదీవులకు సంబంధించిన పూర్తి వివరాల్ని, తాము చేసిన తీర్మానాల్ని ఆ లేఖలో వివరించారు. కచ్చదీవుల్ని స్వాధీనం చేసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. యూపీఏ పేర్కొన్న అంశాల్నే మళ్లీ కోర్టులో సమర్పించారని, సవరణలతో కూడిన మరో రిట్ పిటిషన్ దాఖలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో తమిళ జాలర్లకు ఇక కడలిలో భద్రత కరువైనట్టేనని ఆందోళన వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement