సాక్షి, చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే-ప్రజాసంక్షేమ కూటమి దారులు మూసుకోవడంతో ఇక, బీజేపీ ఒక్కటే తమాకా నేత జీకే వాసన్‌కు దిక్కుగా మారింది. ఇందుకు తగ్గట్టుగా బీజేపీతో కలసి ఎన్నికల పయనానికి తగ్గ సమాలోచనలు సాగుతుండడం గమనార్హం.ఒకప్పుడు తన కంటూ కాంగ్రెస్‌లో ప్రత్యేక బలగాన్ని కల్గిన జీకే వాసన్, సొంత కుంపటి పెట్టే సరికి సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. తమిళ మానిల కాంగ్రెస్ పునరుద్ధరణతో ఎదుర్కొంటున్న తొలి ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారు.
అన్నాడీఎంకేతో పొత్తుకు యత్నించి,అక్కడి తలుపులు మూసుకోవడంతో ఢీలా పడాల్సిన పరిస్థితి. ఇక, డీఎంకేలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని తేల్చారు. డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమిలో సీట్ల సర్దుబాటు గొడవ సాగుతుండటంతో, అక్కడ చాన్స్ కరువైనట్టే. ఇక, మిగిలిందల్లా, జాతీయ పార్టీ బీజేపీ కలసి పనిచేయడమే. ఇంతకన్నా మరో మార్గం జీకే వాసన్‌కు లేదని చెప్పవచ్చు. లేదంటూ ఒంటరిగా బలం ఉన్న స్థానాల్లో బరిలోకి దిగాల్సిందే. అయితే, తన దృష్టిని కమలం వైపుగా వాసన్ మళ్లించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇందుకు అద్దం పట్టే విధంగా బీజేపీ వర్గాలు స్పందిస్తుండడంతో కమలంతో కలసి వాసన్ అడుగులు వేస్తారా..? అన్న చర్చ బయలు దేరింది. ద్వితీయ శ్రేణి నాయకులు బీజేపీతో సంప్రదింపుల్లో ఉన్నట్టు, ఒకటి రెండు రోజుల్లో పార్టీ సమావేశంలో చర్చించి, వాసన్ తుది నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం బయలు దేరింది. ఈ సమయంలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ స్పందిస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో సోదరుడు వాసన్ బీజేపీతో కలసి ఎన్నికల్ని ఎదుర్కోవడం శ్రేయస్కరంగా పేర్కొన్నారు.
ద్వితీయ శ్రేణి నాయకులు సంప్రదింపుల్లో ఉన్నారని, ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తంచేశారు. అవినీతికి వ్యతిరేకంగా తమాకా ఆవిర్భవించి ఉన్నదని, ఈ ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, సమష్టిగా అవినీతి పరుల్ని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరిద్దామని సూచించారు.
కమలమే దిక్కా?
Published Sat, Apr 9 2016 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM
Advertisement
Advertisement