టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ పదవి ఊడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన్ను తొలగించాలని ఫిర్యాదులు ఏఐసీసీకి వెల్లువెత్తారుు. కొత్త అధ్యక్షుడిగా తిరునావుక్కరసును నియమించే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రధాన గ్రూపు నేతగా ఉన్న కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జీకే వాసన్ మద్దతుదారుడు జ్ఞాన దేశికన్ టీఎన్‌సీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈయన్ను ఆ పదవి నుంచి తొలగించడమే లక్ష్యంగా ప్రత్యర్థి గ్రూపులు తీవ్రంగానే గతంలో ప్రయత్నాలు చేశాయి. అయితే, వాసన్ పలుకుబడి ముందు ఆ ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. అయితే, తాజాగా ఆయన్ను పదవి నుంచి తొలగించాలన్న నినాదం మళ్లీ తెర మీదకు వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ కష్టాల మడుగులో మునగడం వెనుక జ్ఞానదేశికన్ పనితీరు కారణం అంటూ ఫిర్యాదులు ఏఐసీసీకి వెల్లువెత్తుతున్నాయి. డీఎంకే మీద ఇది వరకు పదే పదే జ్ఞాన దేశికన్ విమర్శలు గుప్పించడంతోనే ఆ పార్టీ ఎన్నికల వేళ ఛీదరించుకున్నదంటూ మరి కొందరు కాంగ్రెస్‌వాదులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఒంటరి కష్టం: రాష్ర్టంలో ఒంటరిగా కాంగ్రెస్ మనుగడ సాధించడం కష్టతరం అంటూ పలువురు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సీనియర్లు పోటీ నుంచి తప్పుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనలేకే వారు దూరంగా ఉండాల్సిన పరిస్థితిని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో పతనం తప్పదని, మళ్లీ పుంజుకోవాలంటూ సరికొత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వివరించి ఉన్నారు. ప్రధానంగా అధ్యక్షుడిని మార్చాల్సిందేనని, అప్పుడే రాష్ట్రంలో డీఎంకేకు దగ్గర కావచ్చని మరి కొందరు పేర్కొన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎంకే అత్యధిక సీట్లు సాధించిన పక్షంలో, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు దొరికిన పక్షంలో, వారి మద్దతు కూడగట్టుకోవాలంటే, అందుకు తగ్గ చర్చలకు సమర్థులు అవసరం అని సూచించారు. ఇక్కడ రాష్ర్ట పార్టీ అధ్యక్షుడిలో ఉత్సాహం, చురుకుదనం లేదని, ఆయన్ను తొలగిస్తేనే రాష్ట్రంలో పార్టీ బాగుపడుతుందని సూచించినట్టు, ఈ ఫిర్యాదులను సోనియా వ్యక్తిగత కార్యదర్శి అహ్మద్ పటేల్ పరిశీలించినట్టు సమాచారం.
అధ్యక్షుడిని మార్చాలంటూ రాహుల్ సైతం ఇది వరకు సంకేతం ఇచ్చి ఉండడంతో ఆ పదవిని చేజిక్కించుకునేందుకు ముగ్గురి మధ్య పోటీ నెలకంది. గతంలో కష్ట కాలంలో ఉన్న పార్టీని సమర్థవంతంగా నడిపించి గాడిలో పెట్టిన మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవన్ సైతం రేసులో ఉన్నట్టు తెలిసింది. గత అనుభవాలతో మళ్లీ పార్టీని గాడిలో ఆయన పెట్టగలరన్న నమ్మకం ఉన్నా, కొత్త వాళ్లకు చోటు ఇచ్చేందుకు రాహుల్ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ దృష్ట్యా, కేంద్ర సహాయ మంత్రి సుదర్శన నాచ్చియప్పన్ లేదా, జాతీయ కార్యదర్శి తిరునావుక్కరసుకు పదవి దక్కవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే, రాహుల్‌తో తిరునావుక్కరసుకు వ్యక్తిగతంగా పరిచయం ఉండటం, ఆయన పోటీ చేసిన రామనాధపురానికి స్వయంగా రాహుల్ వచ్చి ప్రచారం నిర్వహించడం తెలిసిందే. ఈ దృష్ట్యా, టీఎన్‌సీసీ పదవిని తిరునావుక్కరసు తన్నుకెళ్లొచ్చంటూ ఆ పార్టీ వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం.
జ్ఞానదేశికన్‌కు పదవీ గండం
Published Thu, May 1 2014 1:22 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement