సాక్షి, చెన్నై : జీకే మూపనార్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జీకే వాసన్‌కు కాంగ్రెస్ అధిష్టానం మంచి గుర్తింపునే ఇచ్చిందని చెప్పవచ్చు. రాజ్య సభ సభ్యుడి హోదాతో కేంద్రంలో మంత్రి పదవుల్ని అనుభవించిన వాసన్, రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎంపిక వివాదంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన తండ్రి స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్‌ను మళ్లీ ఆవిర్భవింప చేసి ప్రజల మన్ననల్ని అందుకునేందుకు ఉరకలు పరుగులు తీస్తున్నారు. అయితే, పార్టీ మారినా కాంగ్రెస్ అధిష్టానంపై గౌరవాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తరచూ ఆ పార్టీ అధిష్టానం వర్గాలకు ఏదో ఒక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన పార్టీకి చెందిన నాయకుడు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రంగా స్పందించడాన్ని వాసన్ జీర్నించుకోలేనట్టున్నారు.
రాహుల్‌పై విమర్శ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బర్త్ డే శుక్రవారం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఓ టీవీ చానల్ నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ తరపున మాజీ ఎంపి మాణిక్ ఠాకూర్,తమిళ మానిల కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు జ్ఞాన శేఖరన్ హాజరయ్యారు. చర్చ వాడివేడిగా సాగింది. రాహుల్‌పై జ్ఞాన శేఖరన్ తీవ్రంగా స్పందించారు. విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ అందరి మన్నన లు అందుకున్నారు. అలాగే, తామేమి తక్కువ తిన్నామా..? అన్నట్టుగా వాసన్ గుట్టుని రట్టు చేస్తూ ఠాకూర్ స్పందించారు. ఇది బాగానే ఉన్నా చిక్కంతా జ్ఞాన శేఖరన్‌కు ఎదురైంది.
రాహుల్‌ను విమర్శిస్తూ శేఖరన్ స్పందించిన తీరు అధినేత వాసన్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించినట్టు సమాచారం. అగ్గి మీద గుగ్గిలంలా మండి పడ్డ ఆయన ఇక మీదట రాహుల్‌ను విమర్శించే పని పెట్టుకోవద్దని పార్టీ వర్గాలకి హెచ్చరికలు చేశారట.! తన అనుమతి లేనిదే ఏ నాయకుడు టీవీ చర్చలకు వెళ్ల కూడదన్న ఆంక్షలు విధించి ఉండడం గమనార్హం. ఇక, వాసన్ ఆంక్షలతో ఆయన నిర్ణయం ఏమిటో, ఆయన తీరు ఏంటో అన్న సందిగ్ధంలో పడాల్సిన వంతు ఆ పార్టీ వర్గాలకు ఏర్పడిందటా..!. ఇదిలా ఉండగా, ఓ వైపు రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వాసన్ స్పందించిన సమయంలో, అదే నాయకుడిపై పార్టీకి చెందిన జ్ఞాన శేఖరన్ విమర్శలు గుప్పించడం ఎంత వరకు సమంజసం అని తమిళ మానిల కాంగ్రెస్ వర్గాలు పెదవి పిప్పుతున్నాయి.
రాహుల్‌పై విమర్శా!
Published Mon, Jun 22 2015 3:50 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement