అమ్మ గూటికి..
సాక్షి, చెన్నై: తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్‌కు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు జ్ఞాన శేఖరన్ షాక్ ఇచ్చారు. ఇక, డీఎంకేకు కరుప్పు స్వామి పాండియన్ టాటా చెప్పారు. ఈ ఇద్దరి మద్దతు దారులు మంగళవారం అమ్మ గొడుగు నీడకు చేరారు. తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్‌కు వెన్నంటి ఉంటూ వచ్చిన నాయకుల్లో వేలూరు జ్ఞాన శేఖరన్ కూడా ఉన్నారు. కాంగ్రెస్‌లో గానీయండి, బయటకు వచ్చాక గానీయండి వాసన్ తమ నాయకుడు అని ముందుకు సాగిన అనేక మంది అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాండివ్వక తప్పలేదు.
ఇందుకు కారణం వాసన్ అనాలోచిత నిర్ణయమే. ముఖ్య నాయకులు బయటకు వెళ్లినా, కాంగ్రెస్ తరఫున పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ ఉపాధ్యక్షుడు జ్ఞాన శేఖరన్ మాత్రం హ్యాండివ్వలేక పోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో వాసన్ వెంటే సాగి, ఇక, తాను ఇమడ లేనన్న నిర్ణయానికి ప్రస్తుతం వచ్చేశారు. తనతో పాటుగా, తన మద్దతు దారులకు న్యాయం చేకూరే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు తిరుచ్చి, చెన్నై, తిరువళ్లురు, కాంచీపురం, వేలూరు జిల్లాలోని తన మద్దతు ముఖ్య నాయకులతో కలిసి పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కారు.
మంగళవారం ఉదయం తన వెన్నంటి వచ్చిన యాభైకు పైగా ముఖ్య నాయకులతో కలసి అమ్మ జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఇక, తన పయనం అన్నాడీఎంకేలో కొనసాగుతుందని ప్రకటించిన జ్ఞాన దేశికన్, త్వరలో తమిళ మానిల కాంగ్రెస్ గుడారం సైతం ఖాళీ కాబోతున్నట్టుగా ప్రకటించడం గమనార్హం. తన తదుపరి మరెందరో అన్నాడీఎంకేలోకి క్యూ కట్టేందుకు సిద్ధం అవుతున్నారని, చివరకు వాసన్ ఒక్కరే మిగులుతారేమో అని చమత్కరించడం ఆలోచించ దగ్గ విషయమే.
కరుప్పు టాటా...:
తిరునల్వేలి జిల్లా డీఎంకేలో ముఖ్యుడిగా ఉన్న కరుప్పు స్వామి పాండియన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్న నెపంతో కరుప్పు స్వామి పాండియన్‌ను డీఎంకే పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఇక, డీఎంకేలో తనకు తలుపులు మూసుకున్నట్టే అన్న నిర్ధారణకు వచ్చిన కరుప్పు స్వామి పాండియన్, ఇక, టాటా..అన్నట్టుగా డిఎంకే నుంచి బయటకు వచ్చి అమ్మ జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే గూట్లోకి దూకేశారు. తన మద్దతు వర్గంతో కలిసి అన్నాడీఎంకే సభ్యుత్వాన్ని పొందారు.