ఇదేంటబ్బా!
సాక్షి, చెన్నై: కాంగ్రెస్‌లోకి మళ్లీ టీఎంసీ విలీనం అయ్యేనా అన్న చర్చ రాష్ట్రంలో బయలు దేరింది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు తాజాగా చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లేందుకు తగ్గ కారణాలను ఏకరువు పెడుతూ జ్ఞాన దేశికన్ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన నేపథ్యంలో ఢిల్లీలో జీకే వాసన్ తిష్ట వేయడం చర్చకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది. తన తండ్రి మూపనార్ స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్‌ను జాతీయ కాంగ్రెస్‌లోకి విలీనం చేసిన ఘనత జీకే వాసన్‌కు చెందుతుంది. ఈ విలీనం తదుపరి ఆయన జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా రెండు సార్లు పనిచేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో బలమైన గ్రూపు నేతగా ఎదిగిన వాసన్ ఇటీవలి లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తమిళ అసెంబ్లీ ఎన్నికల్ని టార్గెట్ చేసి మళ్లీ తన తండ్రి స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్‌కు పునర్జీవం పోశారు.
తండ్రి చరిష్మాతో మద్దతు దారుల్ని తన వైపుకు తిప్పుకున్నా, వాసన్ చరిష్మా ఏ మాత్రం ఎన్నికల్లో పనిచేయ లేదు. ఎన్నికల సమయంలో ప్రజాసంక్షేమ కూటమిలోకి అడుగు పెట్టినప్పడే, ముఖ్యనాయకులు టాటా చెప్పి, మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పతనంతో కేడర్ పెద్ద సంఖ్యలో మళ్లీ మాతృగూటికి వెళ్తుండడంతో తమిళ మానిల కాంగ్రెస్ పరిస్థితి ఏమిటీ..? అన్న చర్చ రాష్ట్రంలో బయలు దేరింది. ఈ సమయంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు జ్ఞానదేశికన్ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి ఓ లేఖాస్త్రం సంధించిన సమాచారం చర్చనీయంశంగా మారింది. ఈ చర్చ సద్దుమనగక ముందే, ఢిల్లీలో జీకే వాసన్ తిష్ట వేసి ఉండటంతో మళ్లీ విలీనమా..? అన్న ప్రశ్న బయలు దేరింది.
ఢిల్లీలో తిష్ట: వాసన్‌కు నీడ వలే ఉన్న జ్ఞానదేశికన్‌కు గతంలో కాంగ్రెస్‌లో మంచి గుర్తింపు ఉండేది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించిన జ్ఞాన దేశికన్, తాను కాంగ్రెస్ పార్టీని విడటానికి గల పరిస్థితులు ఏమిటంటే..? అంటూ సోనియాకు రాసిన లేఖాస్త్రంలో వివరించి ఉండటం గమనార్హం. అలాగే, కారణాలతో పాటుగా ఆమె ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి ఉండటం బట్టి చూస్తే, మళ్లీ తనను అక్కున చేర్చుకోండి...అన్నట్టుగా విన్నవించి ఉన్నట్టుందన్న చర్చ బయలు దేరి ఉన్నది. తన నీడ జ్ఞాన దేశికన్ లేఖాస్త్రం సంధించిన తదుపరి జీకే వాసన్ ఢిల్లీకి విమానం ఎక్కి ఉండటంతో చర్చ మరింత బలోపేతంగా సాగుతున్నది.
శనివారం కూడా ఢిల్లీలో తిష్ట వేసి ఉన్న వాసన్ అక్కడి కాంగ్రెస్ పాత మిత్రులతో సమావేశం అవుతున్నట్టు సమాచారం. అలాగే, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు తగ్గ అనుమతి కోరి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించేందుకు తగ్గ కసరత్తుల్ని వాసన్ వేగవంతం చేసి ఉన్నట్టుగా సమాచారాలు వస్తుండటంతో, మళ్లీ విలీనమా..? అన్న చర్చ శర వేగంగా సాగుతున్నది. అయితే, ఈ చర్చలు, ప్రచారాల్ని తమిళ మానిల కాంగ్రెస్ వర్గాలు ఖండించడం లేదు. ఆ పార్టీ వర్గాలు సైతం మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లే విధంగా వాసన్ నిర్ణయం తీసుకుంటే మంచిదన్న సలహా ఇచ్చేపనిలో పడ్డట్టు ప్రచారం బయలుదేరడం ఆలోచించ తగ్గ విషయమే.