Tamil Maanila Congress
-
ఇదేంటబ్బా!
సాక్షి, చెన్నై: కాంగ్రెస్‌లోకి మళ్లీ టీఎంసీ విలీనం అయ్యేనా అన్న చర్చ రాష్ట్రంలో బయలు దేరింది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు తాజాగా చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లేందుకు తగ్గ కారణాలను ఏకరువు పెడుతూ జ్ఞాన దేశికన్ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన నేపథ్యంలో ఢిల్లీలో జీకే వాసన్ తిష్ట వేయడం చర్చకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది. తన తండ్రి మూపనార్ స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్‌ను జాతీయ కాంగ్రెస్‌లోకి విలీనం చేసిన ఘనత జీకే వాసన్‌కు చెందుతుంది. ఈ విలీనం తదుపరి ఆయన జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా రెండు సార్లు పనిచేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో బలమైన గ్రూపు నేతగా ఎదిగిన వాసన్ ఇటీవలి లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తమిళ అసెంబ్లీ ఎన్నికల్ని టార్గెట్ చేసి మళ్లీ తన తండ్రి స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్‌కు పునర్జీవం పోశారు. తండ్రి చరిష్మాతో మద్దతు దారుల్ని తన వైపుకు తిప్పుకున్నా, వాసన్ చరిష్మా ఏ మాత్రం ఎన్నికల్లో పనిచేయ లేదు. ఎన్నికల సమయంలో ప్రజాసంక్షేమ కూటమిలోకి అడుగు పెట్టినప్పడే, ముఖ్యనాయకులు టాటా చెప్పి, మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పతనంతో కేడర్ పెద్ద సంఖ్యలో మళ్లీ మాతృగూటికి వెళ్తుండడంతో తమిళ మానిల కాంగ్రెస్ పరిస్థితి ఏమిటీ..? అన్న చర్చ రాష్ట్రంలో బయలు దేరింది. ఈ సమయంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు జ్ఞానదేశికన్ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి ఓ లేఖాస్త్రం సంధించిన సమాచారం చర్చనీయంశంగా మారింది. ఈ చర్చ సద్దుమనగక ముందే, ఢిల్లీలో జీకే వాసన్ తిష్ట వేసి ఉండటంతో మళ్లీ విలీనమా..? అన్న ప్రశ్న బయలు దేరింది. ఢిల్లీలో తిష్ట: వాసన్‌కు నీడ వలే ఉన్న జ్ఞానదేశికన్‌కు గతంలో కాంగ్రెస్‌లో మంచి గుర్తింపు ఉండేది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించిన జ్ఞాన దేశికన్, తాను కాంగ్రెస్ పార్టీని విడటానికి గల పరిస్థితులు ఏమిటంటే..? అంటూ సోనియాకు రాసిన లేఖాస్త్రంలో వివరించి ఉండటం గమనార్హం. అలాగే, కారణాలతో పాటుగా ఆమె ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి ఉండటం బట్టి చూస్తే, మళ్లీ తనను అక్కున చేర్చుకోండి...అన్నట్టుగా విన్నవించి ఉన్నట్టుందన్న చర్చ బయలు దేరి ఉన్నది. తన నీడ జ్ఞాన దేశికన్ లేఖాస్త్రం సంధించిన తదుపరి జీకే వాసన్ ఢిల్లీకి విమానం ఎక్కి ఉండటంతో చర్చ మరింత బలోపేతంగా సాగుతున్నది. శనివారం కూడా ఢిల్లీలో తిష్ట వేసి ఉన్న వాసన్ అక్కడి కాంగ్రెస్ పాత మిత్రులతో సమావేశం అవుతున్నట్టు సమాచారం. అలాగే, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు తగ్గ అనుమతి కోరి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించేందుకు తగ్గ కసరత్తుల్ని వాసన్ వేగవంతం చేసి ఉన్నట్టుగా సమాచారాలు వస్తుండటంతో, మళ్లీ విలీనమా..? అన్న చర్చ శర వేగంగా సాగుతున్నది. అయితే, ఈ చర్చలు, ప్రచారాల్ని తమిళ మానిల కాంగ్రెస్ వర్గాలు ఖండించడం లేదు. ఆ పార్టీ వర్గాలు సైతం మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లే విధంగా వాసన్ నిర్ణయం తీసుకుంటే మంచిదన్న సలహా ఇచ్చేపనిలో పడ్డట్టు ప్రచారం బయలుదేరడం ఆలోచించ తగ్గ విషయమే. -
మద్యంపై పోరాటం
రాష్ట్రంలో మద్యనిషేధం సాధన కోసం పార్టీ శాయశక్తులా పోరాడుతుందని తమిళ మానిల కాంగ్రెస్ (తమాకా) సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. తమాక తొలి సర్వసభ్య సమావేశం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ఆమోదించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: కామరాజనాడార్, తన తండ్రి జీకే మూపనార్‌లను పార్టీ అవమానించిందని ఆవేదన చెందిన జీకే వాసన్.. కాంగ్రెస్ అధిష్టానంతో విభే దించారు. తన తండ్రి స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్‌ను పునరుద్ధరించి సొంతకుంపటిని పెట్టుకున్నారు. జీకేవాసన్ పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. పార్టీ ఆవిర్భావం తరువాత తొలిసారిగా శుక్రవారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీకే నివాసం ఆళ్వార్‌పేట నుంచి వానగరంలోని శ్రీవారు వెంకటాచలపతి మండపం వరకు పార్టీ స్వాగత ద్వారాలు, తోరణాలు, పతాకాలు దారిపొడవునా వెల్లివిరిశాయి. రాష్ట్రం నలుముల నుండి పెద్ద ఎత్తున హాజరైన అభిమాన జనసందోహం సమక్షంలో సంబరాలు జరుపుకున్నారు. జీకే మూపనార్, కామరాజనాడార్ వాళ్గ (వర్దిల్లాలి) అంటూ కార్యకర్తలు చేసిన జయజయధ్వానాలు సమావేశ ప్రాంగణంలో మిన్నంటాయి. సర్వసభ్య సమావేశానికి హాజరు కావాల్సిందిగా రెండువేల మందికి ఆహ్వానాలు పంపారు. సర్వసభ్య సమావేశానికి హాజరైన కార్యకర్తలు అక్కడి కౌంటర్లో రూ.500 లు చెల్లించి సభ్యత్వం తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జీకేవాసన్ సభా ప్రాంగణానికి చేరుకోగా అభిమానులు హర్షధ్వానాలు చేస్తూ స్వాగతం పలికారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేయగానే సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్ష పదవికి జీకేవాసన్ నామినేషన్ దాఖలు చేయగా ఒకే నామినేషన్ పడటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జ్ఞానదేశికన్ ప్రకటించారు. తీర్మానాలు: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన కలిగి, వాటిని పరిష్కరిచగలిగే సత్తా ఉన్న జీకే వాసన్ నేతృత్వంలో పనిచేస్తూ అండగా ఉంటామని తీర్మానించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇతర కార్యవర్గాన్ని నియమించే హక్కును ఆయనకే కల్పిస్తున్నాము. రాష్ట్రంలో మరలా కామరాజనాడార్ పాలన కోసం ప్రజలంతా జీకేవీకి అండగా నిలవాలని విజ్ఞప్తి. పరిశ్రమలతోపాటూ రైతుల సంక్షేమాన్ని కాపాడాలి, విద్యుత్ కోతలు లేని సరఫరాను అందించాలి, దేశంలో లోక్‌పాల్, రాష్ట్రంలో లోకాయుక్తా న్యాయస్థానాలను నెలకొల్పాలి, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదించాలి...తదితర తీర్మానాలను చేశారు. వందరోజులు ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో అమలుచేయాలని కోరారు. నిరుద్యోగుల విద్యా రుణాలను మాఫీ చేయాలని తీర్మానించారు. ఎర్రచందన స్మగ్లింగ్ మాఫియాలను, వారికి సహకరించే అధికారులను ఏపీ ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలని, కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు తలా రూ.10లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాపురాలు కూలుస్తున్న మద్యం: రాష్ట్రంలో ఏరులైపారుతున్న మద్యం ఎన్నో కాపురాలను కూలుస్తోందని సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, యువకుల సంక్షేమం దృష్ట్యా రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం విధించాలని తాము వత్తిడిచేస్తున్నామని తీర్మానించారు. మే 31వ తేదీలోగా సంపూర్ణ మద్య నిషేధంపై ప్రభుత్వం ఒక ప్రకటన చేయని పక్షంలో రాష్ట్రస్థాయి ఆందోళనలు చేపడతామని తీర్మానం చేశారు. -
‘కాంగ్రెస్’ల పోరు
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలోని రెండు ‘కాంగ్రెస్’ల మధ్య పోరు ఊపందుకుంది. ఉన్నవారు చేజారకుండా తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ), వలసలకు వలవేస్తూ తమిళ మానిల కాంగ్రెస్ (తమాకా) పోటాపోటీగా సిద్ధం అవుతున్నారు. రాష్ట్రం లో కాంగ్రెస్ మూడు దశాబ్దాల క్రితమే స్వయంశక్తిని కోల్పోయింది. ప్రాంతీయ పార్టీల అండే దిక్కుగా నెట్టుకొస్తోంది. కామరాజనాడార్ తరువాత కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై ఆ పార్టీ నేతలే ఆశలు వదులుకున్నారు. ఈ క్రమంలో గడిచిన పార్లమెంటు ఎన్నిక లు రాష్ట్ర కాంగ్రెస్‌ను మరింత దీనావస్థలోకి నెట్టేశాయి. పదేళ్ల పాలన తో అనేక అప్రతిష్టల పాలైన కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునేందుకు ఏపార్టీ ముందు కు రాలేదు. దీంతో విధిలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఒంటరిపోరుకు దిగింది. ఒక్కసీటు దక్కకపోగా డిపాజిట్లను కోల్పోయింది. చతికిలపడిన కాంగ్రెస్‌కు కొంతవరకు జవసత్వాలుగా నిలిచిన మాజీ కేంద్ర మంత్రి జీకే వాసన్ అధిష్టానంపై అలిగి పార్టీ నుంచి వైదొలిగారు. టీఎన్‌సీసీ అధ్యక్షునిగా ఉన్న జ్ఞానదేశికన్‌ను సైతం తనతో తెచ్చుకున్నారు. గతంలోకాంగ్రెస్‌లో విలీనం చేసిన తమిళ మానిల కాంగ్రెస్ (తమాకా)ను పునరుద్ధరించారు. జీకేవీ బలం, బలగమంతా కాంగ్రెస్‌లోనే ఉండడంతో బలమైన చీలికతెచ్చారు. 23 మంది టీఎన్‌సీసీ జిల్లా అధ్యక్షులను తమాకాలో చేర్చడంలో ఆయన సఫలీకృతులయ్యూరు. ప్రజల్లోకి పార్టీ అధినేతలు ఈ దశలో పార్టీ బలహీనం కాకుండా చూసే బాధ్యత టీఎన్‌సీసీ కొత్త అధ్యక్షుడు ఇళంగోవన్‌పై పడింది. కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరంతో కలిసి శనివారం సత్యమూర్తి భవన్‌కు వచ్చిన ఇళంగోవన్ మీడియాతో మాట్లాడారు. తమాకాలోకి వెళ్లిపోయిన 23 మంది జిల్లా అధ్యక్షుల మాటేమిటని ప్రశ్నించగా, 23 మంది వెళ్లిపోయారని మీరంటున్నారు, మరో 43 మంది జల్లా అధ్యక్షులు ఇంకా మావైపే ఉన్నారని నేనంటున్నాను అని సమాధానం ఇచ్చారు. ఖాళీ అయిన 23 జిల్లా అధ్యక్షుల స్థానాలను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. తమాకాను దీటుగా ఎదుర్కొనే వ్యక్తులను అధ్యక్షులుగా నియమించేందుకు తాను స్వయంగా వెళుతున్నట్లు ప్రకటించారు. జీకేవీ రెండునెలల పర్యటన తమాకా అధ్యక్షుడు జీకేవాసన్ సైతం ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో రెండు నెలల పర్యటనను ఖరారు చేసుకున్నట్లు శనివారం ప్రకటించారు. చెరకు రైతులు, కావేరీ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న డెల్టా రైతులను కలుసుకోనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తమిళ మానిల కాంగ్రెస్ ఒక మహాశక్తిగా అవతరించడం ఖాయమన్నారు. తమాకాను మరేపార్టీ ఎదుర్కొన లేదన్నారు. ఒకేసారి రెండు ‘కాంగ్రెస్’ల అధినేతలు ప్రజల్లో వెళ్లాలని నిర్ణయించుకోవడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. -
కొత్త పార్టీకి పేరే ప్రాణం
కొత్త పార్టీకి ప్రజాకర్షణ కలిగిన పేరే ప్రాణం. ఆదరణ పొందాలంటే ప్రాచుర్యం పొందిన పేరుండాలి. అయితే, కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్‌కు ఆ పేరుతోనే పెద్ద చిక్కు వచ్చిపడింది. తండ్రి జీకే మూపనార్ స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్ (తమాకా) తనకు దక్కేనా అనే సంకటస్థితిలో జీకే వాసన్ పడిపోయారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:పార్టీల ఆవిర్భావం, మరో పార్టీలో విలీనం రాజకీయాల్లో సహజమే. డీఎంకేతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకోవడాన్ని తీవ్రంగా నిరసించిన సీనియర్ కాంగ్రెస్ నేత జీకే మూపనార్ 1996లో తమిళ మానిల కాంగ్రెస్(తమాకా)ను స్థాపించి, బలమైన పార్టీగా తీర్చిదిద్దారు. ప్రజాభిమానంతో పెద్ద సంఖ్యలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నారు. మూపనార్ మరణం తరువాత ఆయన కుమారుడు జీకే వాసన్ ఆ పార్టీని 2002లో కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆయన లిఖితపూర్వకంగా తెలియజేశారు. సీఈసీ సైతం ఆమోదించింది. అయితే జీకే మూపనార్ హయాంలోనే పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత శాఖ అధ్యక్షునిగా ఉన్న తేనీ జయకుమార్ యథాప్రకారం కొనసాగారు. పార్టీ విలీనం పద్ధతి ప్రకారం జరగలేదంటూ పార్టీని నిర్వహించారు. 2006 వరకు పుదుచ్చేరి శాఖ అధ్యక్షునిగా కొనసాగిన తేనీ జయకుమార్ ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరిపోవడంతో, అదే పార్టీలోని మరోనేత తులసీదాస్ అధ్యక్షుడు అయ్యూరు. అయితే పుదుచ్చేరి తమాకా ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకుండా నామమాత్రంగా నేటికీ కొనసాగుతోంది. తమిళనాడు ప్రజలకు చిరపరిచితమైన తమాకా పేరునే పెట్టాలని జీకే వాసన్తోపాటూ ఆయన అనుచరుల్లో అధిక సంఖ్యాకులు ఆశిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో పార్టీ పేరును ప్రకటించాల్సి ఉండగా అదే పేరుతో పార్టీని రిజిస్టర్ చేసి ఉన్నందున కుదరదనిఎన్నికల అధికారులు వాసన్‌కు చెప్పేశారు. అంతేకాకుండా జీకేవీకి ఈసీ ప్రత్యామ్నాయాన్ని సూచించింది. ఎంజీఆర్ సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారంటూ ఒక ఉదంతాన్ని ఉదహరించింది. కరుణానిధి నాయకత్వంలోని డీఎంకేతో విబేధించిన ఎంజీఆర్ అన్నాడీఎంకే పేరుతో కొత్త పార్టీని స్థాపించాలని భావించారు. అయితే అనకాపుత్తూరుకు చెందిన రామలింగం అదే పేరుతో పార్టీని రిజిస్టర్ చేసి ఉన్నారు. దీంతో చేసేది లేక ఎంజీఆరే రామలింగం పార్టీలో చేరారు. ఆ తరువాత తనదైన శైలిలో అన్నాడీఎంకే అధ్యక్షునిగా మారి బలమైన పార్టీగా తీర్చిదిద్దారు. తప్పనిసరిగా తమాకా పేరునే కావాలని భావించిన పక్షంలో వాసన్ సైతం పుదుచ్చేరిలోని పార్టీలో చేరి తమిళనాడుకు విస్తరించవచ్చని ఈసీ సూచించింది. తమాకా పుదుచ్చేరి అధ్యక్షుడు తులసీదాస్ చేత అక్కడి పార్టీని రద్దు చేయించడం లేదా ఎంజీఆర్లాగా పుదుచ్చేరి పార్టీలో వాసన్ చేరిపోవడం మినహా గత్యంతరం లేదు. తమాకా పేరు ప్రజలకు చిరపరిచితం కాబట్టి అదే పేరును పెట్టడం వల్ల రాష్ట్రంలో వేగంగా బలపడవచ్చనేది అధిక సంఖ్యాకుల అభిప్రాయంగా ఉంది. ఇది నిజమే అయినా ఈ చిక్కుల నుంచి బయటపడేదెలా అనే ఆలోచనలో పడిపోయారు. 16న పార్టీ పేరుకు అవకాశం కొత్త పార్టీ ఏర్పాట్లలో మునిగితేలుతున్న జీకే వాసన్ మంగళవారం సైతం సమీకరణల్లో మునిగారు. తనను కలుస్తున్న వారితోనూ, తానుగా వెళ్లి కలిసిన వారితోనూ చర్చలు జరిపారు. ఈనెల 12 లేదా 16న తిరుచ్చిలో భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ పేరును ప్రకటించాలని, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాలని భావిస్తున్నారు. మదురై జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు తమాకా పతాకాన్ని ఎగురవేయగా, ఈ రోడ్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలోని జీకే వాసన్ ఫొటోను తొలగించారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి దయాదాక్షిణ్యాల కోసం ఎదురుచూడటం లేదని, రాష్ట్ర పార్టీకి ఆ పరిస్థితి ఎంతమాత్రం లేదని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్ మంగళవారం వ్యాఖ్యానించారు. ఒక్కరోజునే వలస కొత్త పార్టీ పూర్తిగా పుట్టకముందే జీకేవీ అనుచరుడు దూరమయ్యూరు. జీకే వాసన్ పార్టీని పెట్టబోతున్నట్లు సోమవారం ప్రకటించిన సందర్భంలో కన్యాకుమారి జిల్లా ప్రిన్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే జాన్‌జాకబ్ ఆయన వెంట నిలిచారు. మంగళవారం ఉదయాన్నే జాన్‌జాకబ్ టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఇళంగోవన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాను జీకే వాసన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడన్నది వాస్తవమే అని, అయితే ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌లో లేరు, పార్టీని వీడేంత గడ్డుపరిస్థితులు లేవని తాను భావిస్తున్నట్లు మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు.