
తమిళనాడు కాంగ్రెస్‌లో ముసలం
సాక్షి, చెన్నై:తమిళనాడు కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ తిరుగుబాటు జెండా ఎగరేసేందుకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి తన తండ్రి దివంగత నేత జీకే ముపనార్ స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) పార్టీని పునరుద్ధరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీఎన్‌పీసీసీ) అధ్యక్ష పదవికి పీఎస్ జ్ఞానదేశికన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఈవీకేఎస్ ఇళంగోవన్‌ను నియమిస్తున్నట్టు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. జీకే వాసన్ తన తండ్రి స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్‌ను 2002లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ప్రస్తుతం జ్ఞానదేశికన్‌తో కలసి దానిని పునరుద్ధరించడం లేదా కొత్త పార్టీ ఏర్పాటు చేసే పనిలో వాసన్ ఉన్నట్టు తెలుస్తోంది.
దీనికి సంబంధించి కొద్ది రోజులుగా తన మద్దతుదారులతో మంతనాలు జరుపుతున్న వాసన్.. తన తదుపరి ప్రణాళికలను మూడో తేదీన వెల్లడిస్తానని శనివారం చెప్పారు. టీఎంసీ నినాదం ‘‘సుసంపన్న తమిళనాడు.. శక్తివంతమైన భారతదేశం’’ నినాదంతోనే ముందుకు వెళ్లాలని వాసన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో ముపనార్, కామరాజనాడార్‌ల ప్రోద్బలంతోనే కాంగ్రెస్ పార్టీ బలపడిందని, అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం వీరికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాసన్ ఆరోపిస్తున్నారు. పార్టీకి చెందిన అత్యంత కీలకమైన నాయకుల విషయంలో పార్టీ తప్పుడు విధానాలు అవలంబిస్తోందని, వారి ఫొటోలను సభ్యత్వ కార్డులపై నుంచి తొలగించిందని ఆరోపించారు. పార్టీ నాయకత్వం తమిళనాడు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తమిళనాడు కాంగ్రెస్ కమిటీని ఏఐసీసీ పూర్తిగా విస్మరించిందన్నారు. మొత్తానికి ముపనార్, కామరాజ్ కార్డుతో తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలని వాసన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.