రజనీకాంత్ మద్దతు ఇస్తే చాలా బాగుంటుంది!
సాక్షి, చెన్నై: కొత్త మార్గంలో, సరికొత్తగా ఆవిర్భవించనున్న తమ పార్టీకి మద్దతు ప్రకటించాలని దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జీకే వాసన్ విజ్ఞప్తి చేశారు. మోదీ సర్కారు చెప్పేది ఒకటి, చేసేది మరొకటిగా ఉందని మండిపడ్డారు. శనివారం రామేశ్వరంలోని జాలర్ల కుటుంబాలను ఆయన పరామర్శించారు.
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జీకే వాసన్ కొత్త పార్టీ పేరు, సిద్ధాంతాల విషయమై తీవ్ర కసరత్తుల్లో ఉన్నారు. తమ పార్టీ ప్రజల్లోకి త్వరితగతిన వెళ్లి చేరాలంటే, రాష్ట్రంలో ప్రముఖంగా ఉన్న వీఐపీల మద్దతును కూడట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమ పార్టీకి మద్దతు ఇవ్వాలంటూ సూపర్‌స్టార్ రజనీ కాంత్‌కు ఆహ్వానం పలుకుతూ విజ్ఞప్తి చేశారు. తమ కథానాయకుడిని రాజకీయాల్లోకి రావొద్దంటూ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యలు చేస్తే, జీకే వాసన్ మద్దతు అభ్యర్థించడం రజనీకాంత్ అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. కొత్తగా, సరికొత్త మార్గంలో ఆవిర్భవించబోతున్న వాసన్ పార్టీ వ్యవహారాల మీద రజనీ అభిమానులు దృష్టి సారించే పనిలో పడడం గమనార్హం.
మద్దతు ప్లీజ్ :
రజనీకాంత్ చాలా మంచి వ్యక్తి అని, ఆయన తమకు మద్దతు ఇస్తే చాలా బాగుటుందని స్వయంగా జీకే వాసన్ శనివారం ఆహ్వానం పలికారు. ఆయన లాంటి వ్యక్తి మద్దతు ఉంటే, తమ పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు. చెన్నై నుంచి ఉదయాన్నే మదురైకు చేరుకున్న జీకే వాసన్‌కు అభిమాన లోకం బ్రహ్మరథం పట్టింది. మదురైలో ఆయనకు ఘన స్వాగతం లభించడంతో అక్కడి కాంగ్రెస్ వర్గాలు విస్మయంలో పడ్డారుు.
బాధితులకు భరోసా :
ఉరి శిక్షను ఎదుర్కొంటున్న జాలర్ల కుటుంబాలను స్వయంగా వెళ్లి ఏ ఒక్కరూ ఓదార్చలేదు. వారిని చెన్నైకు ప్రభుత్వం పిలిపించుకుంది. అలాగే, ఆ బాధితులే డీఎంకే అధినేత కరుణానిధిని కలిసి మొర పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, అందరి కన్నా భిన్నంగా వాసన్ వ్యవహరించారు. రామేశ్వరంలో సమ్మెలో ఉన్న జాలర్లను ఆయన స్వయంగా వెళ్లి వారిని పరామర్శించారు. జాలర్లకు తన మద్దతు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మోడీ సర్కారు చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్న చందంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. జాలర్లను విడుదల చేయించేందుకు చర్యల్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ ప్రజా సేవకు సరికొత్త మార్గదర్శి కాబోతున్నదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఎవరి బలం ఏమిటో వారం రోజుల వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని, తాను వెళుతున్న చోటల్లా లభిస్తున్న ఆదరణను గుర్తు చేసుకుంటే చాలు అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన పార్టీ ప్రజల్లోకి త్వరితగతిన తీసుకెళ్లేందుకు ప్రతి వీఐపీ మద్దతును కోరుతానని ఇంకో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.