28న పార్టీ ప్రకటన
- 28న పార్టీ ప్రకటన
- మహిళా లోకం ఆదరణ
- వాసన్‌కు మద్దతు వెల్లువ
కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేశారు జీకే వాసన్. ఈ నెల 28న తిరుచ్చి వేదికగా పార్టీ పేరు, జెండా, సిద్ధాంతాలను ప్రకటించేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వాసన్‌ను ఆ పార్టీ మహిళా లోకం ఆదరించే పనిలో పడింది. తాము సైతం అంటూ కాంగ్రెస్‌వాదుల మద్దతు వాసన్‌కు వెల్లువెత్తుతోంది.
సాక్షి, చెన్నై: కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జీకే వాసన్ కొత్త పార్టీ కసరత్తుల్ని వేగవంతం చేశారు. తనకు అండగా నిలిచిన ప్రతి కార్యకర్తను, నాయకుడిని పలకరిస్తూ ముందుకు పరుగులు తీస్తున్నారు. ప్రధానంగా పార్టీ నాయకులు, యువజన నాయకులు, విద్యార్థి నాయకుల్ని ఆకర్షించే విధంగా రోజుకో ప్రకటన చేస్తున్నారు.
యువతకు, విద్యార్థికి పెద్దపీట అని ప్రకటించిన వాసన్ తాజాగా 33 శాతం రిజర్వేషన్ అమలు తమ పార్టీ లక్ష్యంలో ప్రధాన అంశంగా మంగళవారం ప్రకటించారు. తనకు అండగా నిలుస్తూ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మహిళా నేతలకు జీకే వాసన్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వారి మద్దతును స్వీకరిస్తూ, మహిళా లోకం దృష్టిని తన వైపు తిప్పుకునేందుకు సిద్ధం అయ్యారు.
మహిళల మద్దతు: మైలాపూర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో మహిళా నాయకుల నేతృత్వంలో వాసన్ మద్దతు కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కోవై మహేశ్వరి, రాణి, కృష్ణమ్మ, అభి తదితర మహిళా నాయకుల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. తనను ఆదరించేందుకు వచ్చిన ప్రతి మహిళకు వాసన్ కృతజ్ఞతలు తెలియజేశారు. వాసన్‌ను నిలువెత్తు పూలమాలతో మహిళా లోకం ముంచెత్తింది.
ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి వాసన్ ప్రసంగిస్తూ, రానున్నది మహిళ రాజ్యంగా పేర్కొన్నారు. ఇంటినే కాదు, రాజకీయాల్ని సైతం చక్కదిద్దడంలో మహిళా లోకం రాణిస్తున్నదన్నారు. యువతకు, విద్యార్థికీ పెద్దపీట వేయబోతున్న తమ పార్టీ, మహిళల కోసం ప్రధాన అంశంగా అజెండాగా 33 శాతం రిజర్వేషన్ అమలు నినాదంతో ముందుకు రాబోతున్నదన్నారు. ఈ నెల 28న తిరుచ్చిలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నామని ఈ సందర్భంగా తాము ఎంపిక చేసిన ముహూర్తాన్ని ప్రకటించారు.
తిరుచ్చి జీ కార్నర్ మైదానం ఆవరణలో సాయంత్రం జరిగే ఈ బహిరంగ సభలో పార్టీని, జెండాను, సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రకటించనున్నట్టు వివరించారు. ముందుగా పార్టీ ఆవశ్యకతను వివరిస్తూ ముఖ్య నాయకుల ప్రసంగం ఉంటుందన్నారు. చిట్ట చివరగా పార్టీని తాను ప్రకటిస్తానని, ఈ ప్రకటన రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో పెను చర్చకు దారి తీయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలు జిల్లాల నుంచి కాంగ్రెస్‌ను వీడి వాసన్‌కు మద్దతు తెలియజేస్తూ పెద్ద ఎత్తున మహిళలతోపాటుగా వివిధ జిల్లాల నాయకులు కార్యకర్తలు తరలి రావడం విశేషం. ఈ సమావేశంలో వాసన్ మద్దతు నేతలు జ్ఞానదేశికన్, ఎస్‌ఆర్ బాల సుబ్రమణ్యన్, పీటర్ అల్ఫోన్స్, జ్ఞాన శేఖరన్, కోవై తంగం తదితరులు పాల్గొన్నారు.