ONOE: హంగ్ వస్తే? | Sakshi Guest Columns On Jamili Elections | Sakshi
Sakshi News home page

'ఒకే దేశం-ఒకే ఎన్నిక'.. హంగ్ వస్తే?

Published Fri, Mar 15 2024 8:01 AM | Last Updated on Fri, Mar 15 2024 8:18 AM

Sakshi Guest Columns On Jamili Elections

ఎప్పటి నుంచో వినిపిస్తున్నట్లుగానే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ జమిలి ఎన్నికలకు జైకొట్టింది. ఈ కమిటీ తను నివేదించిన నివేదికలో పలు అంశాలకు సిఫార్సు చేసింది. హంగ్ వచ్చినా, అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులు నెలకొన్నా,మళ్ళీ ఎన్నికలు నిర్వహించి కొత్త సభను ఏర్పాటుచేయాలని సూచించింది. 

ఒకప్పటి ఏకకాల ఎన్నికలను పునరుద్ధరించాలన్నది ప్రధాన సిఫార్సు.దేశానికి స్వాతంత్ర్య లభించిన తొలిరోజుల్లో ఈ వ్యవస్థ ఉండేది. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంతో పాటు దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడానికి జమిలి ఎన్నికలు ఉపయోగపడతాయని బిజెపి ప్రభుత్వం చెబుతున్న మరోమాట. అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం తొలిదశ కాగా,ఈ ఎన్నికలు జరిగిన 100రోజుల లోపే మున్సిపాలిటీలు, పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించడం రెండో దశలో జరగాల్సిన కార్యాచరణగా ఉండాలని ఈ కమిటీ బలంగా చెబుతోంది. కాకపోతే,దీనికోసం ఆర్టికల్ 325ను సవరించాలి. ఈ సవరణకు రాష్ట్రాల సహకారం అవసరం. రేపటి ఎన్నికల ఫలితాల తర్వాత కానీ,ఆ యా పార్టీల బలాబలాలు తెలియరావు.

'ఒకే దేశం - ఒకే ఎన్నిక' అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆ మధ్య వివరణ ఇచ్చారు.జమిలి ఎన్నికల నిర్వహణలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటుచేసిన అత్యున్నత కమిటీ తుది నివేదిక అందించడానికి నిర్దిష్టమైన గడువేమీలేదని ఆయన స్పష్టం చేశారు. దీనిని బట్టి చూస్తే,ఇప్పుడప్పుడే ఈ వ్యవహారం తేలదని అర్థం చేసుకోవచ్చు.2024 లోపే జమిలి ఎన్నికలు జరుగవచ్చని గతంలో కొందరు జోస్యం చెప్పారు. దానికి తెరపడిందన్నది సత్యం. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సివుంది. ఆ తర్వాత భవిష్యత్తులో జరుగబోయే ఎన్నికల నాటికి ఏదైనా స్పష్టత వస్తుందేమో! చూడాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు,లోక్ సభకు ఏక కాలంలో ఎన్నికలు జరపాలనే నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదే పదే వినిపిస్తూనే వున్నారు. మొదటి నుంచీ జమిలి ఎన్నికల నిర్వహణపై ఆయన పట్టుదలగానే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే, ఈ అంశంపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో గత సంవత్సరం సెప్టెంబర్ లో కేంద్రం ఒక కమిటీని  ఏర్పాటుచేసింది. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే దిశగా కమిటీ పనిచేయడం కూడా ప్రారంభించింది. ప్రజల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించింది. స్పందన కూడా విశేషంగా వచ్చింది. వేలాదిగా ఈ -మెయిల్స్ వచ్చాయి. కేంద్రం మొన్నామధ్యనే 6 జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. ఇప్పటివరకూ 35 పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది.జమిలి ఎన్నికలకు సంబంధించి న్యాయ కమిషన్ నుంచి కూడా సలహాలు తీసుకుంది. మరి కొన్ని నెలల వ్యవధిలోనే సాధారణ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో,ప్రతిపక్ష పార్టీల వ్యాఖ్యల వేడి పెరుగుతోంది.

ముఖ్యంగా తృణమూల్ పార్టీ అధినేత్రి,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జమిలి ఎన్నికలకు ససేమిరా అంటున్నారు.అదే విషయాన్ని స్పష్టం చేస్తూ రామ్ నాథ్ కోవింద్ కమిటీకి ఉత్తరం కూడా రాశారు. ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వాన్ని అనుమతించే వ్యవస్థగా మారుతుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలకు తాము దూరంగానే ఉంటామని స్పష్టం చేశారు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలువివిధ కారణాలతో తమ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోవచ్చని గత చరిత్రను గుర్తుచేస్తున్నారు.

అనేకసార్లు లోక్ సభ రద్దయిందని, భవిష్యత్తులో కూడా అటువంటి పరిస్థితులు తలెత్తుతాయనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఓటర్ల ఎన్నికల విశ్వాసాన్ని ఉల్లంఘించడం న్యాయమా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు.తృణమూల్ పాటు మిగిలిన  ప్రతిపక్ష పార్టీలకు అనేక భయాలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు ఎన్నో అనుమానాలు ఉన్నాయి.

'జమిలి' అంటే రాష్ట్రాలపై దాడి చేయడమేనని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శనా బాణాలు సంధిస్తునే వున్నారు.ఈ ఎన్నికల వల్ల సామాన్యులకు ఒరిగేదేంటని కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు. 2029 నుంచి లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా లా కమిషన్ ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లా కమిషన్ ఇంకా తుది నివేదికను తయారుచేయాల్సివుంది. పంచాయతీల నుంచి పార్లమెంట్ దాకా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్నది బిజెపి ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ముఖ్యంగా,దీనివల్ల డబ్బు ఆదా అవుతుందని,ఆ ధనాన్ని అభివృద్ధి పనుల కోసం కేటాయించవచ్చని మోదీ సర్కార్ వాదిస్తోంది.ఈ చర్చ ఈనాటిది కాదు.2019లో రెండవసారి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే అన్ని పార్టీలను ఆహ్వానించి దీనిపై చర్చ కూడా జరిపారు.అప్పట్లో దేశ వ్యాప్తంగా మొత్తం నలబై రాజకీయ పార్టీలను ఈ సమాలోచనకు ఆహ్వానించారు. 21పార్టీలు మాత్రమే హాజరయ్యాయి.

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు అప్పట్లో జమిలి ఎన్నికలకు జై కొట్టాయి. వచ్చిన మిగిలిన పార్టీలు విభిన్న స్వరాలను వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగానే ఉంది. లోక్ సభకు,శాసనసభలకు సమాంతరంగా ఏకకాలంలో జరపడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ప్రధానంగా ఖర్చు కలిసివస్తుందన్నది వాస్తవమే. వివిధ ఎన్నికల కోడ్ పేరుతో జరగాల్సిన కార్యక్రమాలు జరగకుండా పనులు ఆగిపోవడం, సమయం వృధా అవ్వడం మొదలైన వాటికి అడ్డుగోడ పడుతుంది.తద్వారా పనిరోజులు పెరుగుతాయి.

ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కనీసం రెండు,మూడు రాష్ట్రాలలో ఎన్నికలు తప్పనిసరిగా వస్తుంటాయి.ఈ నేపథ్యంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడే పరిస్థితి వస్తుంది.అదే అన్ని చోట్ల సమాంతర ఎన్నికల విధానం అందుబాటులో ఉంటే,కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మరింతగా పరిపాలనపై దృష్టి  సారించే వెసులుబాటు ఉంటుంది. ఐదేళ్లకొకసారి అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల రాజకీయ సుస్థిరత నెలకొనే అవకాశం ఉంది.బిజెపి  ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలపై కొందరు అనేక అనుమానాలు, సందేహాలు,అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ఈ ప్రతిపాదన వల్ల ఎటుచూసినా,కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికే ఎక్కువ మేలుజరుగుతుందనీ,అందుకే, దీనిపై బలంగా ప్రచారం చేస్తోందనే భావంలో ప్రతిపక్షాలు ఉన్నాయి.

కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి సంపూర్ణమైన బలం లేకపోతే, వివిధ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి వస్తుందనీ, దీని వల్ల కేంద్రంలో పాలనకు అవరోధాలు ఏర్పడతాయనే అనుమానాలు బిజెపికి ఉన్నాయి.  ప్రస్తుతం,దేశంలో బిజెపి బలంగానే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బలహీనంగా వుంది. ఆంధ్రప్రదేశ్‌లో చాలా బలహీనంగా ఉంది. తమిళనాడు,కేరళలో కూడా అదే తీరు. తెలంగాణలో కాస్త బలిపడినట్లు తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో మాత్రం బిజెపి బలంగా కనిపిస్తోంది. కొన్ని రోజుల వ్యవధిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుంది. ఫలితాలు ఎలా ఉండబోతాయో ఇంకా స్పష్టత రావాల్సివుంది. జమిలి ఎన్నికలు జరిగితే, ఐదేళ్లపాటు యథేచ్ఛగా తమ విధానాలను అమలుపరిచే  స్వేచ్ఛ మరింత బలంగా ఉంటుందనే అభిప్రాయంలోనే బిజెపి మొదటి నుంచి వుంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగా ఆధిక్యత వస్తుందనీ,దాని వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందనే భయంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.దీని వల్ల వారు అనుసరించే విధానాల వల్ల దేశ సమగ్రతకు జమిలి ఎన్నికల వల్ల భంగం కలిగే ప్రమాదం ఉందనీ కొందరు విమర్శిస్తున్నారు.పరోక్షంగా అధ్యక్ష వ్యవస్థకు నిర్మాణం చేపట్టే ప్రతిపాదనలు దీని వెనకాల దాగి ఉన్నాయనే భయాలు కొందరిలో లేకపోలేదు.ఈ భయాలన్నీ ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్ కు, ఆ పార్టీని అనుసరిస్తున్న కొన్ని పార్టీలకు ఉన్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే, కొన్ని శాసనసభల పదవీకాలాన్ని కుదించాలి,కొన్నింటిని పొడిగించాలి.ఇటువంటి కీలకమైన చర్యలకు రాజ్యాంగ సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

దీనికి సరిపడా బలం ఉభయ సభల్లోనూ బిజెపికి ఉంది. 'సమాంతర ఎన్నికల'పై, 2018 ఆగస్టులో లా కమీషన్ ఒక ముసాయిదా నివేదిక సమర్పించింది. చట్ట సవరణ జరిగిన తర్వాత, దేశంలోని సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదం తెలపాల్సిన అవసరం కూడా ఉంది.ఇక్కడ కూడా  బిజెపికి వాతావరణం అనుకూలంగానే ఉంది.లోక్ సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగినప్పుడు కొన్నిచోట్ల క్రాస్ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. శాసనసభకు స్థానిక పార్టీకి వేసి, లోక్ సభకు జాతీయ పార్టీకి వేసే మైండ్ సెట్ కొందరు ఓటర్లలో ఉంటుంది.ఫలితాలు తదనుగుణంగా వచ్చిన అనేక ఉదాహరణలు ఉన్నాయి.

ఎల్లవేళలా,అధికారంలో ఉండే పార్టీలకు సంపూర్ణమైన మెజారిటీ ఉండకపోవచ్చు.సంకీర్ణంగా ప్రభుత్వాలు నడిపే క్రమంలో, విభేదాల వల్ల ప్రభుత్వం  పడిపోయినప్పుడు,ఎన్నికలు మళ్ళీ  నిర్వహించాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఏమి చేయాలి? అనే సందేహాలు ఉన్నాయి. ఇలా జమిలి ఎన్నికల అంశంలో అనేక అనుకూల, ప్రతికూల అంశాలు,సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటిపై దేశ వ్యాప్తంగా సమగ్రమైన చర్చ జరగాలి. ప్రజామోదాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలి.మంచిచెడు, లాభనష్టాలు బేరీజువేసుకోవాలి. "కేవలం ఇది చర్చించే విషయం కాదని,భారత్ కు ఎంతో అవసరం", అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేకమార్లు ఉద్ఘాటించారు. పార్టీల రాజకీయ స్వార్ధాలు ఎట్లా ఉన్నా,దేశ ప్రజల మంచికి,దేశ ప్రగతికి పట్టంకట్టే విధానాలను స్వాగతించవచ్చు.

2029 లో నైనా జరుగుతాయా? అన్నది వచ్చే ఎన్నికల్లో ఫలితాలను బట్టి కొంత అంచనా వెయ్యవచ్చు.ఈసారి ఎన్నికల్లో 400 స్థానాల లక్ష్యంతో బిజెపి కదనరంగంలో దిగుతోంది.కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా చాలా బలంగా వున్నాయి. ఇండియా కూటమి మధ్య ఐక్యత ఆశించిన స్థాయిలో లేదన్నది నేటి మాట.జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే? ప్రణాళిక చాలా అవసరం.ఈవిఎంలు, వీవీప్యాట్ లు,భద్రతా సిబ్బంది మొదలైన అనేక అంశాలలో పకడ్బందీ ప్రణాళికలు రచించుకోవాల్సివుంటుంది. 

:::మాశర్మ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement