న్యూఢిల్లీ : ఎగ్జిట్ పోల్స్ రేపిన చిచ్చు ఇటు పార్టీల మధ్య అటు ఎగ్జిట్ పోల్‌స్టర్స్ మధ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎగ్జిట్ పోల్ అనేది అతిపెద్ద స్కామ్ అని కాంగ్రెస్ అంటుంటే ... మోదీ వచ్చిన తరువాతే ఇన్వెస్టర్లకు కాసుల పంట పండుతుందని బీజేపీ అంటోంది. మరొక వైపు కార్పొరేట్లకు, విదేశీ ఇన్వెస్టర్ల ప్రయోజనాల కోసమే ఈసారి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించారని కొంత మంది ఆరోపిస్తున్న పరిస్ధితి. దీన్ని ఖండిస్తున్నారు పోల్‌స్టర్స్ దేనికైనా సిద్ధం అంటూ సవాళ్లు విసురుతున్నారు. అసలు ఎగ్జిట్ పోల్ వివాదం ఎందాక వెళుతోందని ఇన్వెస్టర్లు ఖంగారు పడుతున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తర్వాత హఠాత్తుగా పెరిగిన షేర్ల ధరలు, ఎన్నికల ఫలితాల రోజు పతనం కావడంపై రచ్చ కొనసాగుతోంది. ఒక వైపు జాయింట్ పార్లమెంటరీ కమిటీ -జేపీసీ విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే మరొక వైపు ఎగ్జిట్ పోల్స్‌పైన తనపై వస్తున్న ఆరోపణలకు స్పందించారు యాక్సిస్ మై ఇండియా సర్వే ఏజెన్సీ చీఫ్ ప్రదీప్ గుప్తా. ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆయన ఒపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. అంతేకాదు అసలు ఎగ్జిట్ పోల్స్ తప్పంటూ కొంత మంది ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితత్వంపై అనుమానాలు వద్దని. ఖచ్చితంగా మేం ప్రజల నాడీని చెపుతున్నామని గుప్తా అంటున్నారు.
జూన్ 1వ తేదీన మళ్ళీ ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. 400 సీట్లు గెలుస్తుందని చాలా వరకు సర్వే ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన రోజు స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు సృష్టించాయి. అంతేకాదు లక్షల కోట్లు కొంత మంది జేబులోకి వచ్చిపడ్డాయి. తీరా రిజల్ట్స్ మాత్రం చాలా డిఫెరెంట్‌గా వచ్చాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులు కావడం, బీజేపీ మ్యాజిక్ మార్క్ కూడా దాటలేకపోవడంతో జూన్ 4న స్టాక్‌మార్కెట్లు కుప్పకూలిపోయాయి. దాదాపుగా ఇన్వెస్టర్లు 30లక్షల కోట్లమేర నష్టపోయారు. దీనికంతటికీ ఎగ్జిట్ పోల్స్ చేసిన వారు కొంత మందితో కుమ్మకవ్వడమే కారణమని సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ అయితే ఓ అడుగు ముందుకేసి ఇది స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద స్కామ్ అని ఆరోపిస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడానికి ముందు రోజు సాక్షాత్తు ప్రధాన మంత్రి, హోమ్ శాఖ మంత్రి స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టమంటూ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను హైలైట్ చేస్తున్నాయి ఇండియా కూటమి పార్టీలు. కావాలని కొంత మందికి , కొన్ని కంపెనీలకు ప్రయోజనం కల్పించేందుకు మాత్రమే ఈ ప్రకటనను చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అంతేకాదు జేపీసీ తప్పనిసరిగా విచారించాల్సిన మూడు ప్రశ్నలను సంధిస్తోంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే 5 కోట్ల కుటుంబాలకు పీఎం , హోమ్ మినిస్టర్ నిర్దిష్ట పెట్టుబడి సలహా ఎందుకు ఇచ్చారు? ప్రజలకు పెట్టుబడి సలహాలు ఇవ్వడం వారి పని కాదు కదా అంటున్నారు. స్టాక్ మార్కెట్లను తారుమారు చేసినందుకు సెబీ దర్యాప్తులో ఉన్న ఒకే వ్యాపార బృందానికి చెందిన ఒకే మీడియా సంస్థకు రెండు ఇంటర్వ్యూలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి , నకిలీ ఎగ్జిట్ పోల్‌స్టర్లకు సందేహాస్పద విదేశీ పెట్టుబడిదారులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటనేది తేలాలని ఇండి కూటమి సభ్యులు కోరుతున్నారు.
ఐతే దీన్ని బీజేపీ ఖండిస్తోంది. అలాంటి అవకతవకలకు పాల్పడేలా మోదీ, అమిత్ షా మాట్లాడలేదని.. మోదీ ప్రధాన మంత్రి అయినాక 10 ఏళ్లలో భారత మార్కెట్ క్యాప్ 67 లక్షల కోట్ల నుంచి 415 లక్షల కోట్లకు పెరిగిందని చెపుతున్నారు.
మొత్తం మీద ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చి ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాడ్డాక కూడా ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు ప్రతిపక్షం, ఇటు అధికార పక్షం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు వారికి పెద్దగా ఆర్ధికంగా ఎలాంటి నష్టం జరగకపోయినా. వారిచ్చిన స్టేట్‌మెంట్లు నమ్మిన సగటు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ మాత్రం నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాడనేది సత్యం.
Comments
Please login to add a commentAdd a comment