చెన్నై : రాజద్రోహం కేసులో మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం(ఎండీఎంకే) చీఫ్ వైగోనకు చెన్నై కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. అదే విధంగా 10 వేల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ప్రత్యేక న్యాయస్థానం జడ్జి జె. శాంతి ఈ మేరకు తీర్పు వెలువరించారు. కాగా శనివారం రాజ్యసభ సభ్యత్వానికై నామినేషన్ వేసేందుకు వైగో సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు తీర్పు ఆయనను ఇరకాటంలో పడేసింది. అయితే ప్రజాప్రతినిధి చట్టం- 1951లో రాజద్రోహాన్ని నేరంగా పరిగణించే సెక్షన్లు లేవు కాబట్టి వైగో నామినేషన్ వేయవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
కాగా 2009లో ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా వైగో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈలంకు ఏమైంది’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. శ్రీలంకలో ఎల్టీటీఈ పోరాటం ఆపకపోయినట్లైతే భారత్ ఒక్కటిగా కలిసి ఉండబోదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వైగోపై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో 2017లో అరెస్టైన ఆయన నెలరోజుల పాటు జైలులో ఉన్న తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. ఇక 1978 నుంచి 1996 మధ్య కాలంలో వైగో రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. తమ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ.. దాదాపు 23 ఏళ్ల తర్వాత డీఎంకే మద్దతుతో పెద్దల సభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జూలై 18న తమిళనాడులో ఇందుకు సంబంధించిన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కోర్టు తీర్పు వెలువడటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment