నాది ద్రోహమా?
సాక్షి, చెన్నై: పీఎంకే నేత రాందాసు ఇంటి వివాహ వేడుక వేదికగా సాగిన ఆసక్తికర పరిణామాలు డీఎంకే బహిష్కృత నేత అళగిరికి ఆగ్రహాన్ని తెప్పించాయి. తాను కలిస్తే ద్రోహం-వాళ్లు కలిస్తే స్నేహమా అంటూ శుక్రవారం డీఎంకే అధిష్టానంపై అళగిరి విరుచుకు పడ్డారు. డీఎంకే నుంచి ఎంకే అళగిరి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో అళగిరి తెర మీదకు రావడం పరిపాటే. లోక్‌సభ ఎన్నికల సమయంలో అళగిరి, ఎండీఎంకే నేత వైగోలు కలిసిన వేళ డీఎంకే వర్గాలు తీవ్రంగానే స్పందించాయి. అళగిరిని ద్రోహిగా పేర్కొంటూ మండిపడ్డాయి. గతంలో శత్రువుగా ఉన్న వైగోను మిత్రుడిగా మార్చుకునేందుకు డీఎంకే పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. డీఎంకేను రెండుగా చీల్చిన వైగో ఓ మారు ఎన్నికల సమయంలో ఆ పార్టీతో కలిసినా, ఆ బంధం ఎక్కువ రోజులు సాగలేదు. ప్రస్తుతం 2016లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న డీఎంకే, ఎండీఎంకే బలాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో పడింది. అలాగే, పీఎంకేను సైతం తమతో కలిసి నడిపించే రీతిలో కార్యాచరణను సిద్ధం చేసే పనిలో పడింది.
నేను ద్రోహి...వాళ్లు మిత్రులు: తన వ్యూహాల అమలు లక్ష్యంగా కరుణ చేస్తున్న ప్రయత్నాలకు పీఎంకే నేత రాందాసు ఇంటి వివాహ వేడుక కలిసి వచ్చింది. ఆ వేడుకలో పొగడ్తల పన్నీరును పాతమిత్రులు చల్లుకున్నారు. ఒకరినొకరు కరచాలనంతో పలకరించుకున్నారు. ఇక, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, ఎండీఎంకే నేత వైగోలు చెప్పనక్కర్లేదు. పాత స్నేహాన్ని గుర్తుకు తెచ్చుకున్నట్టుగా వ్యవహరించారు. ఒకే విమానంలో మదురైకు సైతం బయలుదేరి వెళ్లారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఈ పరిణామాలన్నీ బహిష్కృత నేత అళగిరిలో ఆగ్రహాన్ని రేపాయి. తనకో న్యాయం....వారికో న్యాయమా అని విరుచుకు పడ్డారు. శుక్రవారం మదురైలో ఓ మీడియాతో మాట్లాడిన అళగిరి తీవ్రంగానే స్పందించారు. వారికి వద్దనుకుంటే ద్రోహం, కావాలనుకుంటే మిత్ర బంధం అని మండి పడ్డారు. వైగోను తాను కలిస్తే, అదో పెద్ద ద్రోహం అన్నట్టు చిత్రీకరించారని, ఇప్పుడు స్టాలిన్ చేసిందేమిటో మరి అని ప్రశ్నించారు. వైగోను కలిసిన తాను ద్రోహి అయినప్పుడు, ఆయన మాత్రం ఎలా మిత్రుడు అవుతాడోనని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఈ పరిణామాలు చూస్తుంటే, రాజకీయాలు ఎటు వెళ్తున్నాయోనన్న విస్మయం కలుగుతోందన్నారు.
గోపాలపురానికి వైగో: ఓ వైపు అళగిరి విమర్శలు గుప్పించే పనిలో పడితే, మరో వైపు గోపాలపురం మెట్లు ఎక్కేందుకు వైగో సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఎండీఎంకే వస్తే ఆహ్వానిస్తామని కరుణానిధి చేసిన వ్యాఖ్యలు వైగోను పులకింతకు గురి చేసినట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. డీఎంకేకు తాను చెడు తలబెట్టినా, తనకు కరుణానిధి మాత్రం మంచే చేశారన్న భావనలో ఉన్న వైగో, త్వరలో పూర్వపు తన అధినేతను కలుసుకునేందకు ఉవ్విళ్లూరుతున్నట్టుగా ఎండీఎంకేలో చర్చ సాగుతోంది. మరికొద్ది రోజుల్లో కరుణానిధి నివాసం గోపాలపురం మెట్లు ఎక్కడం లక్ష్యంగా కార్యాచరణను వైగో సిద్ధం చేసుకుంటున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం.