Azhagiri
-
అసలైన డీఎంకే నాదే: అళగిరి
మదురై: తమిళనాడు ప్రధాన ప్రతిపక్షంలో ముసలం పుట్టింది. అసలైన డీఎంకే కేడర్ అంతా తనతోనే ఉన్నారని ఆ పార్టీ అధినేత కరుణానిధి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అళగిరి ప్రకటించుకున్నారు. తన సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌ను ‘నాన్‌వర్కింగ్ ప్రెసిడెంట్’ అంటూ పరోక్షంగా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత ఏడు జిల్లాల్లో స్టాలిన్ పార్టీ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన నేపథ్యంలో అళగిరి ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. గురువారం మదురైలో జరిగిన పార్టీ నేత ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. ‘ప్రస్తుతం పార్టీలో వివిధ స్థానాల్లో ఉన్న వారంతా పదవుల కోసమే తప్ప పనిచేసే వారు కాదు. అసలైన కేడర్ అంతా నా వెంటే ఉంది. పార్టీ అధ్యక్షుడు కరుణానిధిని మాత్రమే మా నాయకుడు’ అని అన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ 2014 లోక్‌సభకు ఎన్నికలకు ముందు అధ్యక్షుడు కరుణానిధి ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. అయినప్పటికీ దక్షిణ జిల్లాల్లోని పార్టీ క్యాడర్లో ఆయనకు మంచి పట్టుంది. -
నాది ద్రోహమా?
సాక్షి, చెన్నై: పీఎంకే నేత రాందాసు ఇంటి వివాహ వేడుక వేదికగా సాగిన ఆసక్తికర పరిణామాలు డీఎంకే బహిష్కృత నేత అళగిరికి ఆగ్రహాన్ని తెప్పించాయి. తాను కలిస్తే ద్రోహం-వాళ్లు కలిస్తే స్నేహమా అంటూ శుక్రవారం డీఎంకే అధిష్టానంపై అళగిరి విరుచుకు పడ్డారు. డీఎంకే నుంచి ఎంకే అళగిరి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో అళగిరి తెర మీదకు రావడం పరిపాటే. లోక్‌సభ ఎన్నికల సమయంలో అళగిరి, ఎండీఎంకే నేత వైగోలు కలిసిన వేళ డీఎంకే వర్గాలు తీవ్రంగానే స్పందించాయి. అళగిరిని ద్రోహిగా పేర్కొంటూ మండిపడ్డాయి. గతంలో శత్రువుగా ఉన్న వైగోను మిత్రుడిగా మార్చుకునేందుకు డీఎంకే పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. డీఎంకేను రెండుగా చీల్చిన వైగో ఓ మారు ఎన్నికల సమయంలో ఆ పార్టీతో కలిసినా, ఆ బంధం ఎక్కువ రోజులు సాగలేదు. ప్రస్తుతం 2016లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న డీఎంకే, ఎండీఎంకే బలాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో పడింది. అలాగే, పీఎంకేను సైతం తమతో కలిసి నడిపించే రీతిలో కార్యాచరణను సిద్ధం చేసే పనిలో పడింది. నేను ద్రోహి...వాళ్లు మిత్రులు: తన వ్యూహాల అమలు లక్ష్యంగా కరుణ చేస్తున్న ప్రయత్నాలకు పీఎంకే నేత రాందాసు ఇంటి వివాహ వేడుక కలిసి వచ్చింది. ఆ వేడుకలో పొగడ్తల పన్నీరును పాతమిత్రులు చల్లుకున్నారు. ఒకరినొకరు కరచాలనంతో పలకరించుకున్నారు. ఇక, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, ఎండీఎంకే నేత వైగోలు చెప్పనక్కర్లేదు. పాత స్నేహాన్ని గుర్తుకు తెచ్చుకున్నట్టుగా వ్యవహరించారు. ఒకే విమానంలో మదురైకు సైతం బయలుదేరి వెళ్లారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఈ పరిణామాలన్నీ బహిష్కృత నేత అళగిరిలో ఆగ్రహాన్ని రేపాయి. తనకో న్యాయం....వారికో న్యాయమా అని విరుచుకు పడ్డారు. శుక్రవారం మదురైలో ఓ మీడియాతో మాట్లాడిన అళగిరి తీవ్రంగానే స్పందించారు. వారికి వద్దనుకుంటే ద్రోహం, కావాలనుకుంటే మిత్ర బంధం అని మండి పడ్డారు. వైగోను తాను కలిస్తే, అదో పెద్ద ద్రోహం అన్నట్టు చిత్రీకరించారని, ఇప్పుడు స్టాలిన్ చేసిందేమిటో మరి అని ప్రశ్నించారు. వైగోను కలిసిన తాను ద్రోహి అయినప్పుడు, ఆయన మాత్రం ఎలా మిత్రుడు అవుతాడోనని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఈ పరిణామాలు చూస్తుంటే, రాజకీయాలు ఎటు వెళ్తున్నాయోనన్న విస్మయం కలుగుతోందన్నారు. గోపాలపురానికి వైగో: ఓ వైపు అళగిరి విమర్శలు గుప్పించే పనిలో పడితే, మరో వైపు గోపాలపురం మెట్లు ఎక్కేందుకు వైగో సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఎండీఎంకే వస్తే ఆహ్వానిస్తామని కరుణానిధి చేసిన వ్యాఖ్యలు వైగోను పులకింతకు గురి చేసినట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. డీఎంకేకు తాను చెడు తలబెట్టినా, తనకు కరుణానిధి మాత్రం మంచే చేశారన్న భావనలో ఉన్న వైగో, త్వరలో పూర్వపు తన అధినేతను కలుసుకునేందకు ఉవ్విళ్లూరుతున్నట్టుగా ఎండీఎంకేలో చర్చ సాగుతోంది. మరికొద్ది రోజుల్లో కరుణానిధి నివాసం గోపాలపురం మెట్లు ఎక్కడం లక్ష్యంగా కార్యాచరణను వైగో సిద్ధం చేసుకుంటున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం. -
వార్‌కు రెడీ
సాక్షి, చెన్నై: తాత్కాలిక ఉద్వాసన పర్వం డీఎంకేలో పెను ప్రకంపనలను సృష్టిస్తున్నది. అధిష్టానంతో ఢీ కొట్టేం దుకు బహిష్కృత నేతలు కేపీ రామలింగం, ఎస్ఎస్ పళని మాణిక్యం రెడీ అయ్యారు. ఇక, డీఎంకే పతనం దిశగా పయనిస్తున్నదని, ఆ పార్టీకి నూకలు చెల్లినట్టేనని ఎంకే అళగిరి స్పష్టం చేశారు. ప్రక్షాళన పర్వంలో భాగంగా 33 మంది నాయకులను పార్టీ నుంచి డీఎంకే అధినేత ఎం కరుణానిధి తాత్కాలిక వేటు వేశారు. అయితే తమ బహిష్కరణకు గల కారణాలు వెల్లడించాలంటూ బహిష్కృత నేతలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు వ్యతిరేకులుగా ఉన్న వాళ్ల మీదే వేటు వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు. పార్టీని పూర్తి స్థాయిలో తన గుప్పెట్లోకి తీసుకోవడం లక్ష్యంగా స్టాలిన్ పథకం వేసినట్టున్నారని, అందుకే అళగిరి, కనిమొళి మద్దతుదారులను సైతం సాగనంపేందుకు సిద్ధం అయ్యారని ఆరోపిస్తున్నారు. చెన్నై, ఈరోడ్, విల్లుపురం, కాంచీపురం, తిరునల్వేలి, తేని, మదురై, తిరువణ్ణామలై జిల్లాల కార్యదర్శు లు పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేసినా, వారిని మాత్రం వెనకేసుకు రావడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు. అయితే తమ నాయకులను బహిష్కరించడాన్ని నిరసిస్తూ పలు చోట్ల వారి మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. సేలంలో మూడు బస్సులు ధ్వంసం చేశారు. ఆయా ప్రాంతాల్లోని పార్టీ కార్యాలయాలపై తమ ప్రతాపం చూపించారు. తానుక్కొడే కారణమా? తంజావూరులో తనను కాదని మరొకరికి సీటు ఇచ్చినా, పార్టీ కోసం శ్రమిస్తే, ఓటమికి బాధ్యుడిని చేయడం శోచనీయమని కేంద్ర మాజీ మంత్రి, బహిష్కృత నేత ఎస్ఎస్ పళని మాణిక్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా వ్యవహరించానో అధిష్టానం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఓటమికి కారుకులు ఎందరో ఉన్నా, వారందర్నీ పక్కన పెట్టి కేవలం తనను టార్గెట్ చేయడమేంటని ప్రశ్నించారు. అయితే తనకు అధికారికంగా అధిష్టానం నుంచి బహిష్కరణ లేఖ అందాల్సి ఉందన్నారు. అది వచ్చాక, వివరణ ఎలా ఇవ్వాలో, అధిష్టానంతో ఎలా ఢీ కొడతానో అప్పుడు తెలుస్తుంది...చూస్తూ ఉండడంటూ ఎస్ఎస్ ప్రకటించడం గమనార్హం.అవమానంగా ఉంది : పార్టీ నుంచి తాత్కాలికంగా బహిష్కరించడం తనకు ఎంతో అవమానంగా ఉందని ఎంపీ, డీఎంకే వ్యవసాయ విభాగం కార్యదర్శి కేపీ రామలింగం ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఏళ్లుగా డీఎంకే కోసం శ్రమిస్తూ వచ్చిన తనకు చాలా పెద్ద బహుమతిని అధినేత కరుణానిధి ఇచ్చారని విమర్శించారు. అధిష్టానానికి ఎలాంటి వివరణ ఇవ్వాలో తనకు తెలుసునని, వివరణతోనే సరైన సమాధాన్ని ఇస్తానని స్పష్టం చేశారు. నోటీసులు రానీయండి : నోటీసులు వచ్చాకే తదుపరి కార్యాచరణ గురించి మాట్లాడుతానంటూ అళగిరి మద్దతుదారుడు, పార్టీ నేత ముల్లై వేందన్ స్పష్టం చేశారు. ఎలాంటి ఆరోపణలు అధిష్టానం దృష్టికి వెళ్లాయో, అభ్యర్థి ఎలాంటి ఫిర్యాదు చేశారో అన్న వివరాలు తనకు తెలియజేయాలని, అప్పుడే పార్టీకి వివరణ ఇస్తానని సమాధానం ఇచ్చారు. ధర్మపురి ఉత్తర జిల్లా కార్యదర్శి ఇన్భశేఖరన్ స్పందిస్తూ, తన మీద ఆరోపణలు, ఫిర్యాదులు వెళ్లడం శోచనీయమని, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, కట్టుబడతానని, తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటానని స్పష్టం చేశారు. పతనం దిశగా డీఎంకే : డీఎంకేలో తాజా పరిణామాలపై ఎంకే అళగిరిని ప్రశ్నించగా, ఆ పార్టీ పతనం దిశగా పయనిస్తోందని సమాధానం ఇచ్చారు. ఆ పార్టీకి నూకలు చెల్లినట్టేనని, ఇక అభివృద్ధి శూన్యమేనని స్పష్టం చేశారు. తన వెంట తిరుగుతున్నారన్న ఒక్క కుంటి సాకుతో పార్టీ నుంచి అనేక మందిని బహిష్కరించారని మండి పడ్డారు. తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారిల్లో ఘోరంగా ఓడిపోయినా, ఆ జిల్లాల కార్యదర్శులను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. పార్టీలో తనకు అడ్డు తగిలే వాళ్లు ఉండకూడదన్న లక్ష్యంగా ఈ ఉద్వాసన పర్వాన్ని సాగిస్తున్నారంటూ కోశాధికారి ఎంకే స్టాలిన్‌పై శివాలెత్తారు. ఈ క్రమంలో బహిష్కృత నేతలందరూ త్వరలో ఏకమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
హెచ్చరిక
సాక్షి, చెన్నై: కోట్లు కుమ్మరించి సీట్లు దక్కించుకున్న డీఎంకే అభ్యర్థులకు గుణపాఠం చెబుతామని ఎంకే అళగిరి హెచ్చరించారు. డీఎంకే నుంచి శాశ్వతంగా తనను బహిష్కరించడంతో అళగిరి స్వరాన్ని పెంచారు. ఆ పార్టీ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పార్టీ అధినేత కరుణానిధి మినహా తక్కిన వారిపైఆరోపణ అస్త్రాలను సంధిస్తూ వస్తున్న అళగిరి ఆదివారం తన మద్దతుదారులకు విరుదునగర్ వేదికగా ఓ పిలుపునిచ్చారు. డీఎంకే అభ్యర్థులకు గుణపాఠం చెబుదామని, ఇందుకు ప్రతి మద్దతుదారుడు సిద్ధం కావాలని ఆయన ఇచ్చిన పిలుపు డీఎంకే అభ్యర్థుల్లో గుబులురేపుతోంది. విరుదునగర్ కాస్యపట్టిలోని తన మద్దతుదారులను అళగిరి ఉదయం కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. విరుదునగర్‌లో బీజేపీ కూటమి తరపున ఎండీఎంకే అభ్యర్థి వైగో బరిలో ఉన్న విషయం తెలిసింది. ఆయనకు అనుకూలంగా వ్యవహరించే విధంగా మద్దతుదారులకు అళగిరి సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు అద్దంపట్టే విధంగా మీడియాతో ఆయన మాట్లాడారు. కోట్లు కుమ్మరించి సీట్లు దగ్గించుకున్న డీఎంకే అభ్యర్థులకు గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. మద్దతుదారులందరూ వారికి గుణపాఠం నేర్పడమే లక్ష్యంగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. డీఎంకేలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, నిజమైన కార్యకర్తలకు, నాయకులకు న్యాయం జరగడం లేదని శివాలెత్తారు. ఆర్థిక బలం ఉన్నంత మాత్రాన గెలుస్తామని జబ్బలు చరచడం కాదని, ప్రజా మద్దతు, మద్దతుదారుల సహకారం అవసరం అన్న విషయాన్ని డీఎంకేకు గుర్తుచేస్తామని హెచ్చరించారు. తాను దక్షిణాది జిల్లాల కార్యదర్శిగా ఉన్న సమయంలో అభ్యర్థులను నిలబెట్టేందుకు భయపడే అన్నాడీఎంకే ఇప్పుడు కొత్త వారిని తెరపైకి తెచ్చిందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. డీఎంకే అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతుకావడం తథ్యమని అళగిరి పేర్కొన్నారు. -
ఆంతర్యమేమిటో!
డీఎంకే అధినేత ఎం కరుణానిధి పెద్ద కుమారుడు, దక్షిణాది కింగ్ మేకర్ ఎంకే అళగిరి తదుపరి అడుగు ఏమిటోనన్న ఉత్కంఠ నెలకొంది. గురువారం ఢిల్లీలో అళగిరి బిజీబిజీగా గడపడంతో ఆంతర్యం వెతికే పనిలో డీఎంకే వర్గాలు పడ్డాయి. ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో మంతనాలకు సిద్ధపడడం చర్చకు దారి తీస్తోంది. సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత ఎం కరుణానిధికి ఆయన పెద్ద కుమారుడు అళగిరి రూపంలో షాక్‌ల మీద షాక్‌లు ఎదురవుతున్నాయి. పార్టీ నుంచి బహిష్కరించినా అళగిరి మాత్రం తగ్గడం లేదు. డీఎంకే అధిష్టానంపై ఆరోపణాస్త్రాలను, ఘాటైన విమర్శలు చేస్తూ వస్తున్న అళగిరి, త్వరలో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. మద్దతుదారులతో మంతనాల అనంతరం తన నిర్ణయం ఉంటుందని రెండు రోజుల క్రితం అళగిరి ప్రకటించారు. చెన్నైలో తిష్ట వేసి వరుస బెట్టి డీఎంకేపై ఆరోపణలు సంధిస్తూ వచ్చిన అళగిరి ఉన్నట్టుండి బుధవారం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆగమేఘాలపై అళగిరి పర్యటనలు సాగుతుండంటంతో ఆంతర్యాన్ని వెతికే పనిలో డీఎంకే వర్గాలు పడ్డాయి. ఢిల్లీలో బిజీ బిజీ : ఉదయాన్నే ఢిల్లీలో ప్రత్యక్షమైన అళగిరి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. అరగంట పాటుగా మన్మోహన్ సింగ్‌తో చర్చలు సాగించినానంతరం వెలుపలకు వచ్చిన అళగిరి యథా ప్రకారం మర్యాదేనంటూ సెలవు ఇచ్చారు. మీడియా పదే పదే గుచ్చి గుచ్చి ప్రశ్నించగా, మదురై విమానాశ్రయానికి ముత్తు రామలింగ దేవర్ పేరు పెట్టాలని ప్రధానిని కోరడం జరిగిందంటూ దాట వేశారు. తాను కేంద్ర కేబినెట్లో పని చేశానని, తనకు ఆ అవకాశం ఇచ్చిన మన్మోహన్ సింగ్‌ను మర్యాద పూర్వకంగానే కలిశానంటూనే, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ నేతల్లో అనేక మంది తన మిత్రులేనని పేర్కొన్నారు. వారిని ఓ మారు పలకరించి వెళ్దామని వచ్చానేగానీ, రాజకీయాలు లేవని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ కూటమి నుంచి డీఎంకే బయటకు రావడంపై మన్మోహన్ సింగ్ విచారం వ్యక్తం చేశారని, ఇదొక్కటే రాజకీయ అంశం అని ముగించారు. మన్మోహన్‌తో భేటీ అనంతరం కాంగ్రెస్ సీనియర్లు, కేంద్ర మంత్రులను అళగిరి రహస్యంగా కలిసినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను సైతం కలవడానికి ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. మద్దతుదారులకు పిలుపు : ఢిల్లీలో అళగిరి బిజీబిజీ పర్యటనపై ఆంతర్యాన్ని వెతుకుతున్న సమయంలో మద్దతుదారులతో మంతనాలకు ఆయన నిర్ణయించడం చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన మద్దతుదారులను శనివారం మదురైకు తరలి రావాలని అళగిరి పిలుపునిచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందు కోసం మదురైలోని దయామహల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయమై అళగిరి మద్దతు నేత ఒకరు పేర్కొంటూ, శనివారం మద్దతుదారులతో అళగిరి భేటీ కాబోతున్నారని, ఇందులో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌కు మద్దతా..: దక్షిణాదిలో తన సత్తాను చాటే రీతిలో మద్దతు దారుల్ని కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేయించేందుకు అళగిరి నిర్ణయించారా..? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న తన మద్దతు దారుల్ని సీట్లు ఇవ్వకుండా డీఎంకే తిరస్కరించిన దృష్ట్యా, ఆ స్థానాల్లో నిలబడే కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానంటూ మన్మోహన్ సింగ్‌కు అళగిరి హామీ ఇచ్చినట్టు తెలిసింది. అయితే, ఆ స్థానాల్లో తాను సూచించే అభ్యర్థులకు సీట్లు ఇవ్వాలని, వారి గెలుపు భారం తనదేనని చాటుతూ, తన బలాన్ని డీఎంకేకు రుచి చూపించేందుకు అళగిరి సిద్ధం అవుతోన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో మరి కొన్ని ముఖ్య నియోజకవర్గాల్లో బీజేపీ కూట మి అభ్యర్థులకు సైతం మద్దతు ఇచ్చేం దుకు అళగిరి వ్యూహంలో భాగంగానే రాజ్‌నాథ్‌తో మంతనాలకు సిద్ధ పడ్డట్టు సమాచారం. అళగిరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.