ఆంతర్యమేమిటో!
Published Fri, Mar 14 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM
డీఎంకే అధినేత ఎం కరుణానిధి పెద్ద కుమారుడు, దక్షిణాది కింగ్ మేకర్ ఎంకే అళగిరి తదుపరి అడుగు ఏమిటోనన్న ఉత్కంఠ నెలకొంది. గురువారం ఢిల్లీలో అళగిరి బిజీబిజీగా గడపడంతో ఆంతర్యం వెతికే పనిలో డీఎంకే వర్గాలు పడ్డాయి. ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో మంతనాలకు సిద్ధపడడం చర్చకు దారి తీస్తోంది.
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత ఎం కరుణానిధికి ఆయన పెద్ద కుమారుడు అళగిరి రూపంలో షాక్‌ల మీద షాక్‌లు ఎదురవుతున్నాయి. పార్టీ నుంచి బహిష్కరించినా అళగిరి మాత్రం తగ్గడం లేదు. డీఎంకే అధిష్టానంపై ఆరోపణాస్త్రాలను, ఘాటైన విమర్శలు చేస్తూ వస్తున్న అళగిరి, త్వరలో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. మద్దతుదారులతో మంతనాల అనంతరం తన నిర్ణయం ఉంటుందని రెండు రోజుల క్రితం అళగిరి ప్రకటించారు. చెన్నైలో తిష్ట వేసి వరుస బెట్టి డీఎంకేపై ఆరోపణలు సంధిస్తూ వచ్చిన అళగిరి ఉన్నట్టుండి బుధవారం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆగమేఘాలపై అళగిరి పర్యటనలు సాగుతుండంటంతో ఆంతర్యాన్ని వెతికే పనిలో డీఎంకే వర్గాలు పడ్డాయి.
ఢిల్లీలో బిజీ బిజీ : ఉదయాన్నే ఢిల్లీలో ప్రత్యక్షమైన అళగిరి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. అరగంట పాటుగా మన్మోహన్ సింగ్‌తో చర్చలు సాగించినానంతరం వెలుపలకు వచ్చిన అళగిరి యథా ప్రకారం మర్యాదేనంటూ సెలవు ఇచ్చారు. మీడియా పదే పదే గుచ్చి గుచ్చి ప్రశ్నించగా, మదురై విమానాశ్రయానికి ముత్తు రామలింగ దేవర్ పేరు పెట్టాలని ప్రధానిని కోరడం జరిగిందంటూ దాట వేశారు. తాను కేంద్ర కేబినెట్‌లో పని చేశానని, తనకు ఆ అవకాశం ఇచ్చిన మన్మోహన్ సింగ్‌ను మర్యాద పూర్వకంగానే కలిశానంటూనే, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ నేతల్లో అనేక మంది తన మిత్రులేనని పేర్కొన్నారు. వారిని ఓ మారు పలకరించి వెళ్దామని వచ్చానేగానీ, రాజకీయాలు లేవని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ కూటమి నుంచి డీఎంకే బయటకు రావడంపై మన్మోహన్ సింగ్ విచారం వ్యక్తం చేశారని, ఇదొక్కటే రాజకీయ అంశం అని ముగించారు. మన్మోహన్‌తో భేటీ అనంతరం కాంగ్రెస్ సీనియర్లు, కేంద్ర మంత్రులను అళగిరి రహస్యంగా కలిసినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను సైతం కలవడానికి ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.
మద్దతుదారులకు పిలుపు : ఢిల్లీలో అళగిరి బిజీబిజీ పర్యటనపై ఆంతర్యాన్ని వెతుకుతున్న సమయంలో మద్దతుదారులతో మంతనాలకు ఆయన నిర్ణయించడం చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన మద్దతుదారులను శనివారం మదురైకు తరలి రావాలని అళగిరి పిలుపునిచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందు కోసం మదురైలోని దయామహల్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయమై అళగిరి మద్దతు నేత ఒకరు పేర్కొంటూ, శనివారం మద్దతుదారులతో అళగిరి భేటీ కాబోతున్నారని, ఇందులో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు.
కాంగ్రెస్‌కు మద్దతా..: దక్షిణాదిలో తన సత్తాను చాటే రీతిలో మద్దతు దారుల్ని కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేయించేందుకు అళగిరి నిర్ణయించారా..? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న తన మద్దతు దారుల్ని సీట్లు ఇవ్వకుండా డీఎంకే తిరస్కరించిన దృష్ట్యా, ఆ స్థానాల్లో నిలబడే కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానంటూ మన్మోహన్ సింగ్‌కు అళగిరి హామీ ఇచ్చినట్టు తెలిసింది. అయితే, ఆ స్థానాల్లో తాను సూచించే అభ్యర్థులకు సీట్లు ఇవ్వాలని, వారి గెలుపు భారం తనదేనని చాటుతూ, తన బలాన్ని డీఎంకేకు రుచి చూపించేందుకు అళగిరి సిద్ధం అవుతోన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో మరి కొన్ని ముఖ్య నియోజకవర్గాల్లో బీజేపీ కూట మి అభ్యర్థులకు సైతం మద్దతు ఇచ్చేం దుకు అళగిరి వ్యూహంలో భాగంగానే రాజ్‌నాథ్‌తో మంతనాలకు సిద్ధ పడ్డట్టు సమాచారం. అళగిరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.
Advertisement