సాక్షి, చెన్నై : కలైంజ్ఞర్ కరుణానిధి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. డీఎంకే అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన స్టాలిన్.. పార్టీలో పలు సంస్కరణలు చేపట్టి తన మార్కును ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పార్టీ అధినాయత్వం కార్యకర్తలకు పలు సూచనలు చేసింది. స్టాలిన్ కాళ్లపై పడటం, భారీ పూలమాలతో సత్కరించడం వంటి పనులు మానుకోవాలంటూ సూచించింది. ‘అధ్యక్షుడి దృష్టిలో పడేందుకు ఆయన పాదాలు తాకడం వంటి దాస్యపు పనులు మనకు వద్దు. ప్రేమతో నమస్కరిస్తే చాలు. అలాగే మన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా కృషి చేద్దాం. ద్రవిడ సిద్ధాంతాలకు అనుగుణంగా క్రమశిక్షణతో మెలుగుదామని’ పిలుపునిచ్చింది.
వాటికి బదులు పుస్తకాలు..
అధ్యక్షుడు స్టాలిన్, పార్టీ సీనియర్ నేతలను కలిసినపుడు... పూల మాలలు, శాలువాలతో సత్కరించే బదులుగా వారికి పుస్తకాలు బహూకరించాలని డీఎంకే అధినాయకత్వం కోరింది. అలా వచ్చిన పుస్తకాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రంథాయాలకు పంపడం ద్వారా ఎంతో మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని పేర్కొంది. అదే విధంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే పోస్టర్లు, ఫ్లెక్సీల సంస్కృతికి చరమగీతం పాడాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment