చెన్నై: హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దని కేంద్రానికి లేఖ రాశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అది భాషాయుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరించారు. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ నిలయమని, అన్ని భాషలను సమానంగా చూడాలని సూచించారు. దేశంలోని అన్ని భాషలను అధికారిక భాషలుగా గుర్తించే స్థాయికి మనం చేరుకోవాలని పేర్కొన్నారు. భారత సమగ్రతను కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు లేఖలో పేర్కొన్నారు.
దేశంలోని ఐఐటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులకు హిందీలో పాఠాలు బోధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసిన మరునాడే స్టాలిన్ లేఖ రాశారు. మాతృభాషను ఆరాధించే ఏ రాష్ట్రమైనా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు.
'హిందీ దివస్' సందర్భంగా హిందీ అధికారిక భాష అని అమిత్ షా చెప్పిన విషయాన్ని స్టాలిన్ గుర్తు చేశారు. దేశంలోని మెజారిటీ విద్యాసంస్థల్లో సిబ్బంది, విద్యార్థులు హిందీ మాట్లాడరని అన్నారు. హిందీ మాట్లాడేవారిని ఫస్ట్ క్లాస్ సిటిజెన్లుగా, మాట్లాడని వారిని సెకండ్ క్లాస్ సిటిజెన్లుగా చూస్తే అది కచ్చితంగా 'విభజించు పాలించు' విధానమే అవుతుందని వ్యాఖ్యానించారు.
మరో దక్షిణాది రాష్ట్రం కేరళ కూడా హిందీని బలవంతంగా రుద్దొద్దని ఇప్పటికే స్పష్టం చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి, దేశంలో భాషా వైవిధ్యానికి ఇది పూర్తి విరుద్ధమని పేర్కొంది. భారత వైవిధ్యాన్ని బీజేపీ ఎప్పుడూ విశ్వసించదని కేరళ మాజీ మంత్రి టీఎం థామస్ విమర్శించారు. 'ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే దేశం' అనే ఆర్‌ఎస్ఎస్ భావజాలాన్ని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
చదవండి: పార్టీ చీలొద్దని సొంత కుమారుడినే సస్పెండ్ చేసిన మహానేత ములాయం
Comments
Please login to add a commentAdd a comment