హెచ్చరిక
Published Mon, Apr 7 2014 12:01 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
సాక్షి, చెన్నై: కోట్లు కుమ్మరించి సీట్లు దక్కించుకున్న డీఎంకే అభ్యర్థులకు గుణపాఠం చెబుతామని ఎంకే అళగిరి హెచ్చరించారు. డీఎంకే నుంచి శాశ్వతంగా తనను బహిష్కరించడంతో అళగిరి స్వరాన్ని పెంచారు. ఆ పార్టీ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పార్టీ అధినేత కరుణానిధి మినహా తక్కిన వారిపైఆరోపణ అస్త్రాలను సంధిస్తూ వస్తున్న అళగిరి ఆదివారం తన మద్దతుదారులకు విరుదునగర్ వేదికగా ఓ పిలుపునిచ్చారు. డీఎంకే అభ్యర్థులకు గుణపాఠం చెబుదామని, ఇందుకు ప్రతి మద్దతుదారుడు సిద్ధం కావాలని ఆయన ఇచ్చిన పిలుపు డీఎంకే అభ్యర్థుల్లో గుబులురేపుతోంది. విరుదునగర్ కాస్యపట్టిలోని తన మద్దతుదారులను అళగిరి ఉదయం కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. విరుదునగర్‌లో బీజేపీ కూటమి తరపున ఎండీఎంకే అభ్యర్థి వైగో బరిలో ఉన్న విషయం తెలిసింది. ఆయనకు అనుకూలంగా వ్యవహరించే విధంగా మద్దతుదారులకు అళగిరి సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు అద్దంపట్టే విధంగా మీడియాతో ఆయన మాట్లాడారు.
కోట్లు కుమ్మరించి సీట్లు దగ్గించుకున్న డీఎంకే అభ్యర్థులకు గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. మద్దతుదారులందరూ వారికి గుణపాఠం నేర్పడమే లక్ష్యంగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. డీఎంకేలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, నిజమైన కార్యకర్తలకు, నాయకులకు న్యాయం జరగడం లేదని శివాలెత్తారు. ఆర్థిక బలం ఉన్నంత మాత్రాన గెలుస్తామని జబ్బలు చరచడం కాదని, ప్రజా మద్దతు, మద్దతుదారుల సహకారం అవసరం అన్న విషయాన్ని డీఎంకేకు గుర్తుచేస్తామని హెచ్చరించారు. తాను దక్షిణాది జిల్లాల కార్యదర్శిగా ఉన్న సమయంలో అభ్యర్థులను నిలబెట్టేందుకు భయపడే అన్నాడీఎంకే ఇప్పుడు కొత్త వారిని తెరపైకి తెచ్చిందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. డీఎంకే అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతుకావడం తథ్యమని అళగిరి పేర్కొన్నారు.
Advertisement
Advertisement