
మదురై: తమిళనాడు ప్రధాన ప్రతిపక్షంలో ముసలం పుట్టింది. అసలైన డీఎంకే కేడర్ అంతా తనతోనే ఉన్నారని ఆ పార్టీ అధినేత కరుణానిధి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అళగిరి ప్రకటించుకున్నారు. తన సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌ను ‘నాన్‌వర్కింగ్ ప్రెసిడెంట్’ అంటూ పరోక్షంగా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత ఏడు జిల్లాల్లో స్టాలిన్ పార్టీ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన నేపథ్యంలో అళగిరి ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. గురువారం మదురైలో జరిగిన పార్టీ నేత ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. ‘ప్రస్తుతం పార్టీలో వివిధ స్థానాల్లో ఉన్న వారంతా పదవుల కోసమే తప్ప పనిచేసే వారు కాదు. అసలైన కేడర్ అంతా నా వెంటే ఉంది. పార్టీ అధ్యక్షుడు కరుణానిధిని మాత్రమే మా నాయకుడు’ అని అన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ 2014 లోక్‌సభకు ఎన్నికలకు ముందు అధ్యక్షుడు కరుణానిధి ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. అయినప్పటికీ దక్షిణ జిల్లాల్లోని పార్టీ క్యాడర్‌లో ఆయనకు మంచి పట్టుంది.