స్టాలిన్‌కు పార్టీ పగ్గాలు, కింగ్ మేకర్ ఎంట్రీ!
చెన్నై : తమిళనాట రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. జయలలిత మరణంతో ఓ వైపు అన్నాడీఎంకేలో కుర్చీ కోసం కుమ్ములాటలు జరుగుతుంటే...మరోవైపు ప్రతిపక్ష పార్టీ డీఎంకేలోనూ వారసత్వ పోరు మళ్లీ తెరపైకి వస్తోంది. ఈ నెల 4వ తేదీన (బుధవారం) డీఎంకే సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా స్టాలిన్‌ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కరుణానిధి పెద్దకుమారుడు అళగిరి కూడా కీలక పదవి ఇస్తే తిరిగి పార్టీలోకి వస్తానంటూ సంకేతాలు ఇస్తున్నారు. డీఎంకే దక్షిణాది కింగ్‌మేకర్‌గా ఒకప్పుడు అళగిరి చక్రం తిప్పిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఆయన్ని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించేందుకు కుటుంబీకులు కరుణపై ఒత్తిడి కూడా వచ్చింది. దీంతో అళగిరి మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మరోవైపు కనిమొళికి కూడా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కరుణానిధి పాల్గొంటారా? లేదా అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా ఈ సమావేశం గతంలోనే జరగాల్సి ఉండగా, ఆయన అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దాంతో ఈ భేటీ వాయిదా పడింది. కాగా ఈ సమావేశంలో కరుణానిధి పాల్గొంటారని పార్టీ సీనియర్ నేత అన్బళగన్ తెలిపారు. సర్వసభ్య సమావేశంలో స్టాలిన్‌కు ముఖ్య బాధ‍్యతలు అప్పగించేవిధంగా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో డీఎంకే సర్వసభ్య సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.