సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి మరణాంతరం ఆ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చీనీయాంశమైంది. నిజమైన డీఎంకే కార్యకర్తలు తన వెంటే ఉన్నారని, డీఎంకేకి తానే అసలైన నాయకుడినని ఇటీవల అళగిరి సంచలన వ్యాఖ్యలకు తెరలేపిన విషయం తెలిసిందే. దీంతో డీఎంకేలో ఎంకే స్టాలిన్, అళగిరి మధ్య వారసత్వం పోరు జరుగుతోందన్న విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలన వార్త వినిపిస్తోంది.
డీఎంకేలో నేతలంతా తనకు వ్యతిరేకంగా ఉన్నారని భావిస్తోన్న అళగిరి.. రజనీకాంత్‌కు చెందిన పార్టీలో చేరబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. కరుణానిధి మృతి అనంతరం చెన్నైలోని కావేరి ఆసుపత్రికి వచ్చిన రజనీకాంత్.. అళగిరి, స్టాలిన్‌లతో కూడిన రెండు పోటోలను డీఎంకే సోమవారం విడుదల చేసింది. దానిలో రజనీకాంత్ అళగిరితో ఎంతో సన్నిహితంగా మాట్లాడుతుండగా, మరో ఫోటోలో స్టాలిన్‌తో మాట్లాడడం మాత్రం ఎంతో ఇబ్బందికరంగా ఫీలయినట్లు తెలుస్తోంది. కాగా రజనీకాంత్ పార్టీ ప్రారంభించిప్పుడు కరుణానిధిని కలిసి ఆశీస్సులు తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రజనీకాంత్, అళగిరి మధ్య స్నేహం కుదిరిందని, డీఎంకేలో తనకు ప్రాధాన్యత లేనందున రజనీకాంత్‌తో కలిసి వెళ్తారనే వార్తలు తమిళనాట వినిపిస్తున్నాయి. ఇదిలా వుండగా నేడు జరగనున్న డీఎంకే కార్యవర్గ సమావేశంలో పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న స్టాలిన్‌నే పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే అళగిరి మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment