ఆదివారం డీఎంకే ప్రధాన కార్యాలయంలో స్టాలిన్‌ను అభినందిస్తున్న కనిమొళి
సాక్షి, చెన్నై : డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవ ఎంపిక దాదాపు ఖరారైంది. మంగళవారం జరగనున్న పార్టీ సర్వసభ్య సమావేశంలో డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ స్టాలిన్ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. కోశాధికారి పదవికి సీనియర్ నేత దురై మురుగన్ ఎన్నిక కూడా ఏకగ్రీవం కానుంది. ఆదివారం ఉదయాన్నే పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ఆశీస్సులు తీసుకున్న స్టాలిన్ మెరీనా తీరం చేరుకున్నారు. అక్కడ దివంగత అన్నాదురై సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం కరుణానిధి సమాధి వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి ఆశీస్సులు అందుకున్నారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకుని తల్లి దయాళు అమ్మాల్ ఆశీర్వాదం పొందారు.
తదుపరి అభిమానుల నినాదాల నడుమ తేనంపేటలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివాళయానికి వెళ్లారు. పార్టీ నిర్వాహక కార్యదర్శి, ఎన్నికల అధికారి ఆర్‌ఎస్ భారతికి స్టాలిన్ నామినేషన్‌ను సమర్పించారు. స్టాలిన్ నామినేషన్‌ను ఆమోదిస్తూ జిల్లాల కార్యదర్శులు ప్రతిపాదన చేశారు. ఆయా జిల్లాలల నుంచి స్టాలిన్‌కు మద్దతుగా రెండు వందలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీ కోశాధికారి పదవికి దురై మురుగన్ నామినేషన్ వేశారు. ఆయనకు మద్దతుగా సైతం పలు నామినేషన్లు దాఖలయ్యాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు సాగిన నామినేషన్ల ప్రక్రియలో అ«ధ్యక్ష పదవికి స్టాలిన్, కోశాధికారి పదవికి దురై మురుగన్‌లకు మద్దతుగానే అన్ని నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆ ఇద్దరు ఎంపిక ఏకగ్రీవమైంది.
ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా: అళగిరి!
తమిళనాట ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తే పోటీ చేస్తానని కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి అన్నారు. తన బలాన్ని చాటేందుకు సెప్టెంబరు 5న చెన్నైలో శాంతి ర్యాలీని నిర్వహించాలని ఆయన నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీ విజయవంతం లక్ష్యంగా, తన మద్దతుదారుల్ని ఏకంచేస్తూ గత మూడు రోజులుగా మదురైలో అళగిరి బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment