Unanimous Election
-
రతన్ వారసుడు నోయెల్
ముంబై: అంతా ఊహించినట్లే టాటా ట్రస్ట్స్ పగ్గాలు రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా (67) చేతికే లభించాయి. టాటా ట్రస్ట్స్‌తో పాటు అందులో భాగమైన మిగతా ట్రస్ట్లన్నింటికి కూడా చైర్మన్‌గా ట్రస్టీలు శుక్రవారం జరిగిన సమావేశంలో నోయెల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టాటా గ్రూప్‌తో పాటు జాతి నిర్మాణంలోనూ దివంగత రతన్ టాటా కీలక పాత్ర పోషించారని, ఎనలేని సేవలందించారని ట్రస్టీలు నివాళులరి్పంచారు. టాటా ట్రస్ట్స్ ఒక ప్రకటనలో ఈ విషయాలు వెల్లడించింది. నోయెల్ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ‘రతన్ టాటా, అలాగే టాటా గ్రూప్ వ్యవస్థాపకులు అందించిన ఘన వారసత్వాన్ని ఇకపైనా కొనసాగిస్తాము. అభివృద్ధి, దాతృత్వ కార్యకలాపాలను కొనసాగిస్తూ జాతి నిర్మాణంలో మా వంతు పాత్రను పోషించడానికి పునరంకితమవుతాము‘ అని ఈ సందర్భంగా నోయెల్ తెలిపారు.పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వారసుడిని ఎన్నుకునేందుకు టాటా ట్రస్ట్స్ ట్రస్టీలు సమావేశమయ్యారు. 165 బిలియన్ డాలర్ల టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం పరోక్షంగా టాటా ట్రస్ట్స్ నియంత్రణలో ఉంటుంది. టాటా ట్రస్ట్స్ కింద సర్ రతన్ టాటా ట్రస్ట్ .. దాని అనుబంధ ట్రస్టులు, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్.. దాని అనుబంధ ట్రస్ట్‌లు ఉన్నాయి. వీటన్నింటికి టాటా గ్రూప్ కంపెనీలకు హోల్డింగ్ సంస్థ, ప్రమోటర్ అయిన టాటా సన్స్‌లో 66 శాతం వాటాలు ఉన్నాయి. ఇప్పటివరకు రతన్ టాటా నీడలో ఉన్న నోయెల్ టాటా ఇకపై సొంతంగా వీటి బాధ్యతలను చేపట్టనున్నారు. ముగ్గురు సంతానం.. టాటా సన్స్‌లో 18.4 శాతం వాటా ఉన్న షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి చెందిన ఆలూ మిస్త్రీని నోయెల్ వివాహం చేసుకున్నారు. ఆమె టాటా సన్స్ మాజీ చైర్మన్, దివంగత సైరస్ మిస్త్రీ సోదరి. నోయెల్, ఆలూకి ఇద్దరు కుమార్తెలు (లియా, మాయా), ఒక కుమారుడు (నెవిల్) ఉన్నారు. పెద్ద కుమార్తె లియా టాటా ప్రస్తుతం ఇండియన్ హోటల్స్‌కి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. చిన్న కుమార్తె మాయా తన ప్రొఫెషనల్ కెరియర్ను టాటా ఆపర్చూనిటీస్ ఫండ్‌తో ప్రారంభించారు. తర్వాత టాటా డిజిటల్‌కి మారారు. టాటా న్యూ యాప్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. నెవిల్ టాటా తన వ్యాపార నైపుణ్యాలతో జుడియో బ్రాండ్‌ను విజయవంతం చేశారు. ట్రెంట్, స్టార్ బజార్లను పర్యవేక్షిస్తున్నారు. వ్యాపార దిగ్గజం విక్రమ్ కిర్లోస్కర్ కుమార్తె మానసి కిర్లోస్కర్‌ను వివాహం చేసుకున్నారు.నాలుగు దశాబ్దాలుగా టాటా గ్రూప్‌లో...ఐరిష్ పౌరసత్వం ఉన్న నోయెల్ టాటా గత నాలుగు దశాబ్దాలుగా టాటా గ్రూప్‌లో ఉన్నారు. ఆయన అంతగా బైటికి కనిపించరు. రతన్ టాటా తండ్రి నావల్ టాటాకు సూనూ, సిమోన్ అని ఇద్దరు భార్యలు. వారిలో సూనూ టాటా కుమారులు రతన్ టాటా, జిమ్మీ టాటా కాగా మరో భార్య సిమోన్ కుమారుడే నోయెల్ టాటా. ఆయన ససెక్స్ యూనివర్సిటీలో (యూకే) గ్రాడ్యుయేషన్ చేశారు. ఇన్సీడ్లో (ఫ్రాన్స్) ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం చేశారు. టాటా ఇంటర్నేషనల్‌లో కెరియర్ ప్రారంభించిన నోయెల్ 1999లో రిటైల్ వ్యాపారం ట్రెంట్కి మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అప్పటికి ఒకటే స్టోర్ ఉన్న ట్రెంట్ .. ఆయన సారథ్యంలోకి వచ్చాక గణనీయంగా వృద్ధి చెంది 700 పైచిలుకు స్టోర్స్‌కి విస్తరించింది. ముఖ్యంగా వెస్ట్‌సైడ్ రిటైల్ చెయిన్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఇది మరింత వేగవంతమైంది. 2003లో వోల్టాస్, టైటాన్ ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు. టాటా ఇంటర్నేషనల్ ఆయన సారథ్యంలో 500 మిలియన్ డాలర్ల టర్నోవర్ నుండి 3 బిలియన్ డాలర్ల స్థాయి కి ఎదిగింది. ప్రస్తుతం ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, వోల్టాస్ అండ్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లకు చైర్మన్‌గా, టాటా స్టీల్, టైటాన్లకు వైస్ చైర్మన్‌గా నోయెల్ వ్యవహరిస్తున్నారు. అలాగే 2019 నుంచి టాటా ట్రస్టుల్లో ట్రస్టీగా కూడా ఉన్నారు. స్మిత్స్ పీఎల్సీ, కాన్సాయ్ నెరోలాక్ పెయింట్స్ కంపెనీల బోర్డుల్లోనూ నోయెల్ ఉన్నారు. -
రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవమైంది. తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, ఇండిపెండెంట్‌గా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఎమ్మెల్యేలు బలపరచకపోవడంతో పద్మరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో రాజ్యసభ సభ్యుడిగా సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవమైంది. -
ఇది ఏకగ్రీవ సి‘ఫార్సు’
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటీ ఊహించినట్టుగానే జమిలి ఎన్నికలకు జైకొట్టింది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో, ఆ తర్వాత వంద రోజుల్లో మునిసిపాలిటీలు, పంచాయతీల ఎన్నికలు జరపాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేస్తూ, సదరు కమిటీ గత వారం నివేదిక సమర్పించింది. సిఫార్సులు ఊహించినవే అయినప్పటికీ, నిర్ణీత కాలవ్యవధి ఏమీ లేకపోయినా 2024 సార్వత్రిక ఎన్నికలకు కొద్దిగా ముందుగా కమిటీ ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ (ఓఎన్ఓఈ) ప్రతిపాదనను తెర మీదకు తేవడం అనుమానాలు రేపింది. రాజ్యాంగ సవరణ, ఒకే ఎన్నికల జాబితా – ఎన్నికల గుర్తింపు కార్డు, త్రిశంకు సభ – అవిశ్వాస తీర్మాన పరిస్థితులు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు – పోలింగ్ సిబ్బంది – పోలీసు బలగాల ఏర్పాట్ల లాంటి పలు అంశాలపై కమిటీ కీలక సిఫార్సులు ఇప్పుడు చర్చ రేపుతున్నాయి. మన ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలనూ, సమాఖ్య చట్రాన్నే మార్చేసే సత్తా ఈ ప్రతిపాదనకు ఉండడమే అందుకు కారణం. కోవింద్ సారథ్యంలో 2023 సెప్టెంబర్‌లో ఈ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి కమిటీలో భాగం కావడానికి నిరాకరించారు. మొత్తం 8 మంది సభ్యుల కమిటీ 65 సమావేశాలు జరిపి, అనుకున్నట్టుగానే ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. జాతీయ, రాష్ట్ర పార్టీల అభిప్రాయాల్ని తెలుసుకున్నామనీ, న్యాయకోవిదుల మొదలు ఆర్థికవేత్తల దాకా పలువురి సూచనలు కోరామనీ కమిటీ తెలిపింది. అయితే, నివేదికను గమనిస్తే అవసరమైన లోతైన అధ్యయనం, విశ్లేషణ సాగినట్టు తోచదు. అన్ని వర్గాలనూ ఈ అధ్యయన ప్రక్రియలో భాగం చేసినట్టు అనిపించదు. తూతూ మంత్రపు తతంగం చివరకు 21 సంపుటాల్లో, 18,626 పేజీల్లో, మొత్తం 11 అధ్యాయాలు, అనేక అనుబంధాల బృహన్నివేదిక రూపం మాత్రం సంతరించుకుంది. రాష్ట్రపతికి మార్చి 14న కమిటీ తన నివేదికను అందించడంతో ప్రధాన ఘట్టం ముగిసింది. త్వర లోనే లా కమిషన్ సైతం తన నివేదికను ఇవ్వనుంది. ఇక, వచ్చే 2029 ఎన్నికల్లోగా దాన్ని ఎలా ఆచ రణలోకి తేవాలన్నది కేంద్రం చేతిలో ఉంది. కమిటీ ఏకగ్రీవ సిఫార్సు గనక అది ముగిసిన కథ అన కుండా, వ్యతిరేకిస్తున్న వారి సముచితమైన భయాందోళనల్ని విని, సమాధానపరచడం అవసరం. నిజానికి, ఒకేసారి లోక్‌సభ, శాసనసభలకు ఎన్నికలు జరగడం కనివిని ఎరుగనిదేమీ కాదు. చట్టం ఏమీ లేకపోయినా స్వతంత్ర భారతావనిలో ఎన్నికలు మొదలయ్యాక తొలి రోజుల్లో ఏకకాలంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. అయితే, అయిదేళ్ళ కాలవ్యవధి పూర్తికాక ముందే రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసే ధోరణి మొదలయ్యాక, 1967 తర్వాత నుంచి ఈ ఏకకాల విధానానికి తెర పడింది. తరువాత కూడా మధ్య మధ్యలో ఈ జమిలి ఎన్నికల ఆలోచన తొంగిచూసినా, వడివడిగా అడుగులు పడింది మాత్రం ఇప్పుడే. మోదీ సారథ్యంలోని బీజేపీ ఆది నుంచి జమిలి ఎన్నికల నిర్వహణ జపం చేస్తోంది. అందుకు తగ్గట్టే ఇప్పుడు కోవింద్ కమిటీ జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసింది. జమిలి ఎన్నికలను 15 పార్టీలు వ్యతిరేకించాయని కమిటీ పేర్కొంది కానీ, వ్యతిరేకిస్తున్నవారిని ఒప్పించడానికీ, సద్విమర్శలను తీసుకొని సరిదిద్దుకోవడానికీ చేసిందేమిటో తెలియదు. అలాగే, ఒకే దశలో ఎన్నికలు చేయలేక 7 విడతల్లో, 40 రోజులపైగా ఎన్నికలు జరుపుతున్న పాలకులు ఒకేసారి ఎన్నికలు ఎలా చేయగలరన్నదీ సందేహమే! ఒకరకంగా, ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ వల్ల అటు ప్రభుత్వానికీ, ఇటు పార్టీలకూ ఎన్నికల ఖర్చు తగ్గుతుందనే మాట నిజమే. అలాగే, కాస్తంత వ్యవధి తేడాతో మునిసిపల్, పంచాయతీ సహా అన్ని ఎన్నికలూ ఒకేసారి జరగడం వల్ల పాలనకు తరచూ అంతరాయాలు ఏర్పడవు. అయితే, ఈ విధానం మన సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందనేదీ అంతే వాస్తవం. ఇక, ఈ పద్ధతిలో రాష్ట్ర అసెంబ్లీలకు నిర్ణీత కాలవ్యవధి కన్నా ముందే మంగళం పాడి, ఆనక ప్రతి ప్రభుత్వానికీ నిర్ణీత వ్యవధిని నిర్ణయించడం ప్రజాస్వామ్య సిద్ధాంతాలకే విరుద్ధం. ఒకవేళ గనక ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అర్ధంతరంగా కూలిపోతే, ఆ తర్వాత ఎన్నికైన ప్రభుత్వం ఆ వర్తమాన లోక్‌సభా కాలం ఉన్నంత వరకే అధికారంలో కొనసాగాలనడం మరో తిరకాసు. అన్నిటి కన్నా పెద్ద భయం మరొకటుంది. ఏకకాలంలో కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల వల్ల ప్రాంతీయ, స్థానిక అంశాలను మింగేసి, జాతీయ అంశాలే పైకొచ్చే ప్రమాదం ఉంది. ఎన్నికల వ్యూహంలో, వ్యయంలో జాతీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి పార్టీలు దీటుగా నిలబడడమూ కష్టమే. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా చిన్న పార్టీలు కనిపించకుండా పోతాయని సమాజ్‌వాదీ పార్టీ లాంటివి బాహాటంగానే చెబుతున్నాయి. నిజానికి, ఏకకాలపు ఎన్నికల వల్ల ఓటర్లలో 77 శాతం మంది కేంద్రంలో, రాష్ట్రంలో – రెండు చోట్లా ఒకే పార్టీకి ఓటేస్తారని 2015 నాటి ఓ సర్వే తేల్చింది. రెండు ఎన్నికల మధ్య ఆరు నెలల విరామం ఉంటే, 61 శాతమే అలా ఓటేస్తారట. అంటే ఒక రకంగా ఈ జమిలి ఎన్నిక కేంద్రంలో చక్రం తిప్పుతున్న పార్టీలకే వాటంగా మారవచ్చు. అసలు ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అనే ఈ ఆలోచన వెనుక అసలు మతలబు... దేశంలో అధ్యక్ష తరహా పాలన తీసుకు రావాలన్న బీజేపీ ఆలోచన అని మరికొందరి వాదన. అందుకు రాజ్యాంగ సవరణలు సహా అనేకం అవసరం. దానికి తగ్గట్టే దీర్ఘకాలిక వ్యూహంతో బీజేపీ 400 పైచిలుకు సీట్లతో సంపూర్ణ మెజారిటీని కోరుతోందని విశ్లేషణ. అవతలి వారివి ‘అనవసర భయాందోళనలు’ అని కొట్టిపారేస్తే సరిపోదు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొనే ముందు మరింత విస్తృత స్థాయి సంప్రతింపులు జరపడం అవసరం. అంతేకానీ, డబ్బు ఆదా పేరిట ప్రజాస్వామ్య స్ఫూర్తినీ, సమాఖ్య స్వభావాన్నీ నీరు గార్చడం సమర్థనీయం కానే కాదు. -
Telangana: మా ఓటు కేసీఆర్‌కే..
మాచారెడ్డి/కామారెడ్డి: సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఆయనకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు తీర్మానాలు చేస్తున్నారు. శనివారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగరావ్ ఆధ్వర్యంలో ఎల్లంపేటతో పాటు మరో ఎనిమిది గిరిజన గ్రామాల ప్రజలు ఆయా గ్రామాల సర్పంచ్‌లతో కలసి సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. అలాగే పాల్వంచ మండలం మంతన్ దేవునిపల్లి గ్రామస్తులు సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు తప్ప ఎవరికీ ఓటేయమని ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. ఎంపీపీ నర్సింగరావు, జెడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, వైస్‌ఎంపీపీ జీడిపల్లి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సంతకాలు చేశారు. ఎల్లంపేటలో ర్యాలీ అనంతరం తమ తీర్మాన ప్రతులతో కేసీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లారు. అయితే ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్సీ కవితను కలసి తీర్మాన కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎన్నికల ఖర్చుకోసం 10 గ్రామాల ప్రజలు రూ.50 వేలు జమచేసి కవితకు అందజేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ కోసం అప్పట్లో టీఆర్ఎస్ ఆవిర్భవించిన తొలినాళ్లలోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు ఎంపీటీసీలను ఏకగ్రీవంగా ఎన్నుకుని చరిత్ర సృష్టించారు. అప్పట్లో 13 ఎంపీటీసీలకు గాను 8 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నుకుని ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే జెడ్పీటీసీని కూడా గెలిపించారు. కేసీఆర్‌కే జై కొడుతున్న పంచాయతీలు: కవిత సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిజామాబాద్ బిడ్డగా స్వాగతిస్తున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తారని ప్రకటించడంతో గ్రామ పంచాయతీలు, గిరిజన తండాలు కేసీఆర్‌కు జై కొడుతున్నాయన్నారు. కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలసి ఏకగ్రీవ తీర్మాన ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీచేస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కేసీఆర్‌ను పోటీ చేయాలని అహా్వనించారని చెప్పా రు. మాచారెడ్డి మండలంలోని గ్రామాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేశారని, షబ్బీర్ అలీ వంటి వారు ఎన్నిమాట్లాడినా, ప్రజలు కేసీఆర్‌ను పార్టీలు, కులమతాలకు అతీతంగానే చూస్తారని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో 28న కామారెడ్డిలో భారీ సమావేశం జరుగుతుందని ఆ సమావేశంలో తాను కూడా పాల్గొంటానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అయచితం శ్రీధర్, మఠం భిక్షపతి, మేడే రాజీవ్ సాగర్, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు, గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యంరావు పాల్గొన్నారు. కాగా, ఎంపీపీ నర్సింగరావుకు శనివారం రాత్రి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి అభినందించారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మ ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల స్క్రూటినీ కార్యక్రమం జరిగింది. టీడీపీ నేత వేలూరు రంగయ్య దాఖలు చేసిన నామినేషన్లో సరైన వివరాలు, డాక్యూమెంట్లు లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మ నామినేషన్ ఒక్కటే ఉండటంతో ఆమె ఏకగ్రీవం లాంఛనం కానుంది. వాల్మీకి మంగమ్మ కు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంతపురం జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పైలా నరసింహయ్య శుభాకాంక్షలు తెలిపారు. వెనుకబడిన వర్గానికి చెందిన తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు -
UK political crisis: బ్రిటన్‌లో రిషీరాజ్..
లండన్: నూటా యాభయ్యేళ్లకు పైగా మనల్ని పాలించిన బ్రిటన్ను ఇక మనవాడు పాలించనున్నాడు. దేశ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ (42) సరికొత్త చరిత్ర లిఖించారు. సోమవారం పలు ఆసక్తికర పరిణామాల నడుమ అధికార కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తద్వారా బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న నేతగా రికార్డు సృష్టించారు. ఈ ఘనత సాధించిన తొలి శ్వేతేతరుడు కూడా రిషియే కావడం మరో విశేషం! అంతేగాక గత 210 ఏళ్లలో అతి పిన్న వయస్కుడైన బ్రిటన్ పీఎంగా కూడా రిషి మరో రికార్డు నెలకొల్పారు. ప్రధాన పోటీదారుగా భావించిన మాజీ ప్రధాని బోరిస్ సోమవారం అనూహ్యంగా తప్పుకోవడంతో ఆయనకు ఒక్కసారిగా లైన్ క్లియరైంది. మూడో అభ్యర్థి పెన్నీ మోర్డంట్ గడువు లోపు 100 మంది ఎంపీల మద్దతు కూడగట్టడంలో విఫలమవడంతో రిషి ఎన్నిక ఏకగ్రీవమైంది. అలా, నెలన్నర క్రితం లిజ్ ట్రస్‌తో హోరాహోరీగా జరిగిన పోటీలో అందినట్టే అంది తృటిలో చేజారిన ప్రధాని పదవి ఈసారి రిషిని వచ్చి వరించింది. తాను హిందువునని ప్రతి వేదికపైనా సగర్వంగా ప్రకటించుకునే రిషి సరిగ్గా దీపావళి పర్వదినం నాడే ప్రధానిగా ఎన్నికవడం భారతీయుల హర్షోత్సాహాలను రెట్టింపు చేసింది. మంగళవారం టోరీ ఎంపీలనుద్దేశించి ప్రసంగించాక ఆయన రాజు చార్లెస్–3ని కలిశారు. అనంతరం దేశ 57వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అస్తవ్యస్తంగా మారిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే గురుతర బాధ్యత ఇప్పుడు రిషి భుజస్కంధాలపై ఉంది. ఈ విషయంలో విఫలమవడం వల్లే ట్రస్ కేవలం 45 రోజులకే రాజీనామా చేయాల్సి రావడం, బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ కాలం పీఎంగా కొనసాగిన చెత్త రికార్డును మూటగట్టుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా తన అపారమైన ఆర్థిక అనుభవాన్ని రంగరించి దేశాన్ని రిషి ఎలా ఒడ్డున పడేస్తారన్నది ఆసక్తికరం. ప్రధాని అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి చేసిన తొలి అధికారిక ప్రసంగంలోనూ రిషి ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. బ్రిటన్ అత్యంత కఠినమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అంగీకరించారు. ‘‘ఈ సవాలును దీటుగా ఎదుర్కొనేందుకు ఏ మాత్రం వెనకాడబోను. నాపై ఉన్న ఆకాంక్షలను పూర్తిగా నెరవేరుస్తా’’అంటూ ప్రతిజ్ఞ చేశారు. దేశాన్ని బంగారు భవిష్యత్తులోకి నడిపిస్తానంటూ నిండైన ఆత్మవిశ్వాసంతో దేశవాసులకు హామీ ఇచ్చారు. రెండు నెలల్లో మూడో ప్రధాని! బోరిస్ జాన్సన్, ట్రస్ తర్వాత గత ఏడు వారాల్లో బ్రిటన్‌కు రిషి మూడో ప్రధాని కావడం విశేషం. పార్టీ గేట్ కుంభకోణం తదితరాల దెబ్బకు మంత్రులు సొంత పార్టీ ఎంపీల డిమాండ్‌కు తలొగ్గి జాన్సన్ రాజీనామా చేయడం తెలిసిందే. అనంతరం సెప్టెంబర్‌లో జరిగిన హోరాహోరీ పోరులో రిషిపై నెగ్గి ట్రస్ ప్రధాని అయ్యారు. కానీ పన్ను కోతలు, అనాలోచిత మినీ బడ్జెట్‌తో ఆర్థిక పరిస్థితిని పెనం నుంచి పొయ్యిలో పడేశారంటూ ఇంటా బయటా తీవ్ర విమర్శల పాలయ్యారు. తప్పుకోవాలంటూ సొంత ఎంపీలే డిమాండ్ చేయడం, అవసరమైతే అవిశ్వాసం పెట్టేందుకూ సిద్ధమవడంతో మరో మార్గం లేక ఆమె గురువారం రాజీనామా ప్రకటించారు. మంగళవారం ఆపద్ధర్మ ప్రధాని హోదాలో ట్రస్ చివరి కేబినెట్ సమావేశానికి సారథ్యం వహించారు. అనంతరం బకింగ్‌హం ప్యాలెస్‌కు వెళ్లి చార్లెస్–3కి లాంఛనంగా రాజీనామా సమర్పించారు. తర్వాత రిషి రాజసౌధానికి వెళ్లి రాజుతో లాంఛనంగా భేటీ అయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న రాజు ఆహ్వానాన్ని అంగీకరిస్తూ రాచరిక సంప్రదాయాన్ని అనుసరించి ఆయన ముంజేతిని ముద్దాడారు. కల్లోల సమయంలో కఠిన బాధ్యతలను చేపడుతున్న రిషి తన బాధ్యతలను సమర్థంగా నెరవేర్చాలంటూ ప్రార్థించాల్సిందిగా బ్రిటన్ పౌరులకు కాంటర్బరీ ఆర్చిబిషప్ జస్టిన్ వెల్బీ పిలుపునిచ్చారు. ‘‘ఇది మన దేశానికి అత్యంత కష్టకాలం. ఈ అస్థిర పరిస్థితుల్లో బాధ్యతలు చేపడుఉతన్న రిషి కోసం నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా’’అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని గ్టటెక్కించగలిగే సత్తా ఉన్న నేత రిషి మాత్రమేనని టోరీ ఎంపీల్లో అత్యధికులు నమ్ముతున్నారు. వారిలో సగం మందికి పైగా ఆయనకు బాహాటంగా మద్దతు ప్రకటించడం అందుకు నిదర్శనంగా నిలిచింది. అభినందనల వెల్లువ... రిషికి నా హార్దిక శుభాభినందనలు. బ్రిటన్‌తో భారత్ చారిత్రక సంబంధాలను ఆధునిక భాగస్వామ్యంగా మార్చుకుంటున్న వేళ ఇది నిజంగా గొప్ప పరిణామం. ప్రపంచ సమస్యల పరిష్కారానికి రిషితో కలిసి పని చేసేందుకు, 2030–రోడ్‌మ్యాప్‌ను అమలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నా – ప్రధాని నరేంద్ర మోదీ రిషి సాధించింది అపురూప విజయం. ఇదో చరిత్రాత్మక మైలు రాయి. ప్రపంచ భద్రత, ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా – అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, యూరప్, మిగతా ప్రపంచంపై దాని ప్రభావాలను రిషితో కలిసి ఉమ్మడిగా ఎదుర్కొంటాం – ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రిషికి హార్దిక అభినందనలు. ఆయన హయాంలో బ్రిటన్–ఉక్రెయిన్ బంధం మరింత బలపడాలి – ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పలు అంశాలపై ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం – ఐర్లండ్ ప్రధాని మైఖేల్ మార్టిన్ రిషి హయాంలో బ్రిటన్–ఈయూ సంబంధాలు ఇరుపక్షాల ఒప్పందాలను పరస్పరం గౌరవిస్తూ సాగుతాయని ఆశిస్తున్నాం – యూరోపియన్ కమిషన్ ప్రసిడెంట్ ఉర్సులా వాండెర్ లియాన్ ఇదో చరిత్రాత్మక రోజు. రిషికి అభినందనలు. టోరీ ఎంపీలంతా కొత్త ప్రధానికి పూర్తి మద్దతివ్వాల్సిన వేళ ఇది – బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధానిగా పని చేయడం నాకు దక్కిన అతి గొప్ప గౌరవం. రిషికి నా అభినందనలు. అన్ని అంశాల్లో నూ ఆయనకు నా పూర్తి మద్దతుంటుంది – బ్రిటన్ తాజా మాజీ ప్రధాని లిజ్ ట్రస్ రిషికి శుభాకాంక్షలు – కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రిషికి అభినందనలు. కానీ దేశంలో తక్షణం ఎన్నికలు జరపాల్సిన అవసరముంది – బ్రిటన్ విపక్ష లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ రిషి వచ్చినా బ్రిటన్‌తో సమీప భవిష్యత్తులోనూ రష్యా సంబంధాలు మెరుగు పడతాయన్న ఆశలేమీ లేవు – రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ రిషి హయాంలో బ్రిటన్‌తో చైనా సంబంధాలు ముందుకు వెళ్తాయని ఆశిస్తున్నాం – చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ రిషిని చూసి ఎంతో గర్విస్తున్నాం. ప్రధానిగా అద్భుతంగా పాలించాలని కోరుకుంటున్నాం. – రిషి మామ, ఇన్ఫోసిస్ సహ–వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి -
రాజ్యసభకు 41 మంది ఏకగ్రీవం
న్యూఢిల్లీ: పెద్దల సభకు కొత్తగా 41 మంది పోటీ లేకుండానే ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పి.చిదంబరం, రాజీవ్ శుక్లా, బీజేపీ నుంచి సుమిత్రా వాల్మీకి, కవితా పటిదార్, కాంగ్రెస్ మాజీ నేత కపిల్ సిబల్, ఆర్జేడీ నుంచి మీసా భారతి, ఆర్ఎల్డీ నుంచి జయంత్ చౌదరి తదితరులు రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం 11 మంది, తమిళనాడు నుంచి ఆరుగురు, బిహార్ నుంచి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు, ఒడిశా నుంచి ముగ్గురు, చత్తీస్‌గఢ్ నుంచి ఇద్దరు, పంజాబ్ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఇద్దరు, జార్ఖండ్ నుంచి ఇద్దరు, ఉత్తరాఖండ్‌నుంచి ఒక్కరు ఎన్నికయ్యారు. మొత్తం 41 మందిలో 14 మంది బీజేపీ, నలుగురు కాంగ్రెస్, నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ముగ్గురు డీఎంకే, ముగ్గురు బీజేడీకి చెందినవారున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్జేడీ, తెలంగాణ రాష్ట్ర సమితి, ఏఐఏడీఎంకే నుంచి ఇద్దరు చొప్పున ఎన్నికయ్యారు. జేఎంఎం, జేడీయూ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్డీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పెద్దల సభలోకి అడుగుపెట్టబోతున్నారు. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ నుంచి 11 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. తాజా ఎన్నికతో ఎగువ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ఏకంగా తొమ్మిదికి చేరింది. రాజ్యసభలో ఖాళీ అయిన 57 స్థానాల భర్తీ చేయడానికి ఈ నెల 10న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం ముగిసింది. ఏకగ్రీవం కాగా మిగిలిన 16 సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. మహారాష్ట్రలో 6, రాజస్తాన్‌లో 4, కర్ణాటకలో 4, హరియాణాలో 2 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. రాజస్తాన్‌లో కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమయ్యింది. తమ పార్టీకి చెందిన దాదాపు 70 మంది ఎమ్మెల్యేలను ఉదయ్‌పూర్‌లో క్యాంప్‌నకు తరలించింది. తమ ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష బీజేపీ గాలం వేస్తుందన్న అనుమానంతోనే ఈ క్యాంపు నిర్వహిస్తోంది. -
నాలుగు స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం
-
చెన్నై తొలి దళిత మహిళా మేయర్: ఆమెకు అభినందనలు
నార్త్ చెన్నై అంటే తమిళ సినిమాల్లో రౌడీల పుట్టిల్లుగా చూపిస్తారు. మురికివాడలు.. ఇరుకు గల్లీలు పంపుల దగ్గర స్త్రీల బాహాబాహీ అలాంటి చోట నుంచి ఇప్పుడు 29 ఏళ్ల ఆర్.ప్రియ మేయర్‌గా నగరాన్ని పాలించడానికి వచ్చింది. తమిళనాడు సి.ఎం. స్టాలిన్ స్ఫూర్తితో రాజకీయాలలో వచ్చిన ప్రియ చెన్నై మేయర్ పీఠం పై కూచున్న తొలి దళిత యువతిగా చరిత్ర సృష్టించింది. చెన్నైకు ఆర్.ప్రియ 49వ మేయర్. అంటే ఆమెకు ముందు 48 మంది మేయర్లు ఆ నగరానికి పని చేస్తే వారిలో ఇద్దరే మహిళా మేయర్లు. 1957లో కాంగ్రెస్ నుంచి తారా చెరియన్, 1971లో డి.ఎం.కె నుంచి కామాక్షి జయరామన్‌లు మాత్రమే మేయర్లుగా పని చేశారు. మిగిలిన వారంతా పురుషులే. ఇక దళిత మహిళ ఈ స్థానంలో కూచోవడం అనేది చరిత్రలోనే లేదు. కాని ఆర్.ప్రియ దళిత మహిళగా ఆ రికార్డును తన సొంతం చేసుకుంది. ఇదంతా ఆమెకు రాసి పెట్టినట్టుగా క్షణాల్లో జరిగిపోయింది గాని సరైన సమయంలో తాను రాజకీయాల్లో దిగాలి అని ప్రియ భావించడం వల్ల కూడా ఈ ఘనత సాధ్యమైంది. చెన్నై నగరానికి గత ఐదేళ్లుగా కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు. స్టాలిన్ ప్రభుత్వం వచ్చాక ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికలు నిర్వహిస్తే గ్రేటర్ చెన్నైలోని 200 వార్డులలో 153 స్థానాలు డి.ఎం.కెకు వచ్చాయి. ఇంకో 25 స్థానాలు డి.ఎం.కె మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. అన్నా డిఎంకెకు కేవలం 15 వార్డులు దక్కాయి. ఈసారి ఎన్నికలలో చెన్నై మేయర్ పదవిని దళిత మహిళకు రిజర్వ్ చేయడం వల్ల నార్త్ చెన్నై 74వ వార్డు (తిరువికనగర్) నుంచి గెలిచిన ఆర్.ప్రియకు ఏకగ్రీవంగా ఈ పదవి దక్కింది. మార్చి 4, శుక్రవారం ఆమె మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసింది. ‘చెన్నైకి మేయర్‌గా చేసిన స్టాలిన్ మార్గదర్శనంలో నేను మేయర్‌గా పని చేసే అవకాశం రావడం గొప్ప విషయం’ అంది ప్రియ. ఆమె కుటుంబం డిఎంకెకి వీరభక్తులు. ఆమె తండ్రి ఆర్.రాజన్ ముప్పై ఏళ్లుగా పార్టీలో పని చేస్తున్నాడు. ఇంట్లో రాజకీయ వాతావరణం ఉండటంతో 18 ఏళ్ల వయసులో ప్రియ కూడా డి.ఎం.కె కార్యకర్త అయ్యింది. ‘అయితే నేను నిజంగా పార్టీ పనుల్లో చురుగ్గా పాల్గొంది స్టాలిన్ సి.ఎం అయ్యాకే. ఆయన పాలనా పద్ధతులు గమనించాక నా ప్రాంత సమస్యలు తీరాలంటే ఇదే అదను అని నాకు అనిపించి నేను కూడా పని చేయడం మొదలుపెట్టాను’ అంది ప్రియ. ఎం.కాం చేసిన ప్రియకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ‘నిజానికి ఎలక్షన్లకు ముందే నా గెలుపు ఖాయమైపోయింది. నా ప్రాంత సమస్యలను వేటి వేటిని తీరుస్తానో నేను చెప్పాక అందరూ నాకే ఓటు వేస్తామని చెప్పేశారు’ అంది ప్రియ. సాధారణంగా నార్త్ చెన్నై ప్రాంతం చాలా ఏళ్లుగా సౌకర్యాల ఏర్పాట్లలో నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. ఆ ప్రాంతం నుంచి ఇప్పుడు ఏకంగా మేయరే రావడం అందరూ ఎన్నో అంచనాలతో ప్రియ వైపు చూస్తున్నారు. ‘మా ఏరియా స్త్రీలు వేసవిలో 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆటోల్లో 4 కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. ముందు దీనిని మార్చాలి. పారిశుద్ధ్యం ముఖ్యం. అలాగే పిల్లలకు ఆటస్థలాలు ఏర్పాటు చేయాలి. స్టాలిన్ యువ శక్తికి పూర్తి అవకాశం ఇస్తున్నారు. నేను బాగా పని చేయాలనుకుంటున్నాను’ అంది ప్రియ. స్టాలిన్ ప్రభుత్వం ఈసారి స్త్రీలకు పట్టణ, నగర పాలనా వ్యవస్థల బాధ్యతలు అప్పజెప్పడంలో శ్రద్ధ పెట్టింది. తమిళనాడులో మొత్తం 11 మేయర్ పదవులను, 5 డిప్యూటీ మేయర్ పదవులను స్త్రీలకు కేటాయించింది. కోయంబత్తూరు మేయర్‌గా మధ్యతరగతికి చెందిన ఏ.కల్పన అనే మహిళను ఎంపిక చేసింది. అయితే జయలలిత హయాంలో స్త్రీలు పదవుల్లోకి వచ్చాక వారి భర్తలు, తండ్రులు, సోదరులు పెత్తనం చెలాయించి ఆ గెలిచిన స్త్రీలను వెనక్కు నెట్టడం కొన్నిచోట్ల కనిపించేది. ‘అలా నా విషయంలో జరగదు. ఇప్పుడు స్త్రీలు తమ ఇళ్ల పురుషులకు ఆ అవకాశం ఇవ్వరు. వారు తమ పూర్తి శక్తి సామర్థ్యాలతో పని చేయాలనుకుంటున్నారు. మీరే చూస్తారుగా’ అంది ప్రియ. ఆమె నిర్ణయాలు చెన్నైకి మేలు చేస్తాయని ఆశిద్దాం. నిజానికి ఎలక్షన్లకు ముందే నా గెలుపు ఖాయమైపోయింది. నా ప్రాంత సమస్యలను వేటి వేటిని తీరుస్తానో నేను చెప్పాక అందరూ నాకే ఓటు వేస్తామని చెప్పేశారు. – ఆర్.ప్రియ -
11 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల కోటాలో 11 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిచినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 8 జిల్లాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు నవంబర్ 16న గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేసిన స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం నుంచి యల్లారెడ్డిగారి శివరామిరెడ్డి, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురామ్, మొండితోక అరుణ్‌కుమార్, తూర్పుగోదావరి నుంచి అనంత సత్యఉదయ్‌భాస్కర్, గుంటూరు నుంచి డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు, విశాఖపట్నం నుంచి వరుదు కళ్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు, చిత్తూరు నుంచి కృష్ణరాఘవ జయేంద్రభరత్, ప్రకాశం నుంచి తూమాటి మాధవరావులు ఎన్నికైనట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోణీ.. కవిత సహా ముగ్గురు ఏకగ్రీవం..!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలోని 12 స్థానిక సంస్థల కోటా స్థానాలకు జరుగుతున్న ఎన్నిక ల్లో.. మూడు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థుల ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. బుధవారం జరిగిన నామినేషన్ల స్క్రూటినీ అనంతరం నిజామాబాద్ జిల్లాలోని ఒక స్థానంలో కల్వకుంట్ల కవిత.. రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు ఇద్దరే బరిలో మిగిలారు. వీరి ఎన్నిక దాదాపు ఖరారైనా.. ఈ నెల 26న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసాక అధికారికంగా ప్రకటించనున్నారు. తిరస్కరణలతో..: నిజామాబాద్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు వేశారు. బుధవారం జరిగిన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ)లో స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్‌ను అధికా రులు తిరస్కరించారు. దీనితో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత ఒక్కరే పోటీలో మిగిలారు. రంగారెడ్డి జిల్లా లోని రెండు స్థానాలకుగాను.. టీఆర్ఎస్ తరఫున పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజుతోపాటు స్వతంత్ర అభ్యర్థిగా చాలిక చంద్రశేఖర్ నామినేషన్లు వేశారు. ఇందులో చంద్రశేఖర్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో.. ఉన్న రెండు స్థానాలకు ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులే మిగిలారు. దీనితో ఈ ముగ్గురి ఏకగ్రీవం ఖాయమైంది. అయితే ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉప సంహరణకు ఈ నెల 26 వరకు గడువు ఉంది. నిబంధనల మేరకు ఈ గడువు ముగిశాకే రిటర్నింగ్ అధికారులు ఏకగ్రీవాలను ప్రకటించాల్సి ఉంటుంది. మెదక్, ఖమ్మం బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవాలు ఖాయమైన మూడు స్థానాలుపోగా.. మిగతా తొమ్మిది స్థానాల్లో రెండు చోట్ల మాత్రమే కా>ంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మెదక్‌లో నిర్మల జగ్గారెడ్డి, ఖమ్మంలో రాయల నాగేశ్వర్రావు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. మరో ఏడు చోట్ల టీఆర్ఎస్తోపాటు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు ఉండటంతో.. స్వతంత్ర అభ్యర్థులను విత్‌డ్రా చేయించి ఈ ఏడు స్థానాలనూ ఏకగ్రీవం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. కరీంనగర్‌లోని రెండు స్థానాలకుగాను ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో ఉండగా.. టీఆర్ఎస్కే చెందిన సర్దార్ రవీందర్‌సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీనితోపాటు పోటీలో ఎక్కువ మంది ఉండటంతో.. టీఆర్ఎస్ పార్టీ తమ ఓటర్లను క్యాంపుకు తరలించింది. ఇక పలు సాంకేతిక కారణాల వల్ల వరంగల్ స్థానంలో నామినేషన్ల పరిశీలనను గురువారానికి వాయిదా వేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వరంగల్‌లో ఐదుగురు నామినేషన్లు వేయగా.. అందులో నలుగురి నామినేషన్లు సరైనవిగా ధ్రువీకరించారు. ఐదో నామినేషన్‌పై నిర్ణయాన్ని గురువారం వెల్లడించనున్నట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ‘రంగారెడ్డి’ ఎన్నిక రద్దు చేయండి రంగారెడ్డి ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం నామినేషన్ వేసేందుకు వెళ్లిన తమను అధికార పార్టీ నేతలు అడ్డుకుని, నామినేషన్ పత్రాలను చించేశారంటూ.. పంచాయతీరాజ్ చాంబర్స్ ఫోరం అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, చింపుల శైలజారెడ్డి బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్, రిటర్నింగ్ అధికారి అమయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి ‘స్థానిక’ ఎన్నికను రద్దు చేయాలని.. తిరిగి నోటిఫికేషన్ ఇచ్చి, తమకు పోటీ అవకాశం కల్పించాలని కోరారు. ఈ అంశంపై హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. స్క్రూటినీ తర్వాత అభ్యర్థుల లెక్క ఇదీ.. స్థానం టీఆర్ఎస్ కాంగ్రెస్ స్వతంత్ర మొత్తం ఆదిలాబాద్ 1 – 23 24 వరంగల్ 1 – 03 04 నల్లగొండ 1 – 05 06 మెదక్ 1 1 03 05 నిజామాబాద్ 1 – – 01 ఖమ్మం 1 1 02 04 కరీంనగర్ 2 – 22 24 మహబూబ్‌నగర్ 2 – 02 04 రంగారెడ్డి 2 – – 02 -
మండలి పీఠంపై దళిత బిడ్డ
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల చట్ట సభల్లో సరికొత్త అధ్యాయానికి రాష్ట్ర శాసన మండలి తెరతీసింది. పెద్దల సభగా పిలుచుకునే మండలి చైర్మన్ పీఠంపై తొలిసారిగా దళిత వ్యక్తి ఆసీనులయ్యారు. శుక్రవారం జరిగిన మండలి సమావేశంలో శాసన మండలి చైర్మన్‌గా కొయ్యే మోషేన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన అభ్యర్థిత్వాన్ని గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రతిపాదించగా సభ్యులు దువ్వాడ శ్రీనివాసరావు, బల్లి కల్యాణ చక్రవర్తి బలపర్చారు. రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రకటించారు. రాజును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీల నేతలు తోడ్కొనివచ్చి చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘ఒక సామాన్య దళిత రైతు కుటుంబం నుంచి మోషేన్ అన్న వచ్చారు. అతి చిన్న వయసులోనే భీమవరం మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఇవాళ శాసన మండలి చైర్మన్ స్థాయికి ఎదిగారు. మోషేన్ రాజుకు హృదయపూర్వక అభినందనలు. మోషేన్ రాజు నాన్నగారి సమయం నుంచి కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తొలి రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కూడా క్రియాశీలకంగా పనిచేశారు. పదేళ్లుగా నాతోనే ఉన్నారు. ఇవాళ మండలి చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టడం చాలా సంతోషం కలిగిస్తోంది’’ అని చెప్పారు. కార్యక్రమానికి దూరంగా టీడీపీ! తొలిసారిగా పెద్దల సభ చైర్మన్‌గా దళిత వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమాన్ని ప్రధాన ప్రతి పక్ష పార్టీ బహిష్కరించింది. టీడీపీ చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. దళిత వ్యక్తి మండలి చైర్మన్ అవుతున్న కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా చక్కటి సందేశాన్ని ఇవ్వాల్సిన ప్రతిపక్ష టీడీపీ ఒక దుష్ట సంప్రదాయానికి తెరతీసిందని మండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. దేశంలోని దళితులంతా రాష్ట్రం వైపు చూస్తున్న ఇటువంటి కార్యక్రమంలో టీడీపీ పాల్గొనకపోవడం దురదృష్టకరమని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. సాహసోపేత నిర్ణయం : మోషేన్ రాజు మోషేన్ రాజు మాట్లాడుతూ... పేద, వ్యవసాయ, దళిత కుటుంబానికి చెందిన తనను మండలి చైర్మన్‌గా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో పైకి రావాలంటే డబ్బు, కులం, రాజకీయ నేపథ్యం అవసరమని అందరిలానే తానూ భావించే వాడినని చెప్పారు. ఈ పదవి వచ్చిన తర్వాత అవన్నీ అవసరం లేదని.. విశ్వాసం, నమ్మకం, కష్టపడి పనిచేసే తత్వం ఉంటే చాలని అర్థమైందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తన తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే.. తాను రెండు అడుగులు ముందుకు వేస్తానని చెప్పారని.. దాని అర్థం ఇప్పుడు అర్థమయ్యిందని అన్నారు. తనను మండలి సభ్యుడిని చేయడంతో పాటు చైర్మన్ పదవి కూడా ఇచ్చారని తెలిపారు. జగన్ తప్ప మరెవరూ ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోలేరని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశలో ప్రతిపక్షాలకు ఒక వంతు ఎక్కువే అవకాశం ఇస్తానని తెలిపారు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తించి మాట్లాడాలని ఆయన సూచించారు. -
Andhra Pradesh: ఆ ఊళ్లన్నీ ఏకతాటిపై..
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా నిజాంపట్నం మండల కేంద్రంలో అత్యధికంగా మత్స్యకార కుటుంబాలే నివశిస్తుంటాయి. ఆ గ్రామంలో దాదాపు 19 వేల జనాభా ఉంది. ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామంలో ఉండే 18 వార్డు సభ్యులతో పాటు సర్పంచి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికలు ముగిశాయి. ఎవరెన్ని చెప్పి చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినా, ఈ ఊళ్లో వారి పప్పులు ఉడకలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య వివిధ రూపాల్లో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోవడంలేదని మొన్నటి స్థానికసంస్థల ఎన్నికల్లో తేటతెల్లమైంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు ఈ పరిణామం అద్దం పట్టింది. పదివేలకుపైగా జనాభా ఉండే 11 పెద్ద గ్రామాల్లో సైతం ప్రజలు ఒకే పక్షా న ఉంటూ మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో మొ త్తం వార్డు సభ్యులతోపాటు సర్పంచిని ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 13,095 పంచాయతీల్లో సర్పంచుల పదవులతోపాటు దాదాపు 1.31 లక్షల వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగితే.. అందులో 2,199 సర్పంచి పదవులకు, 48,022 వార్డు సభ్యులకు ఏకగ్రీవం గా ఎన్నికలు జరిగాయి. అయితే 2001 గ్రామాల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులన్నింటికీ ఏకగ్రీ వంగా ఎన్నికలు ముగిశాయి. బీసీల జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లోనే ఎక్కువశాతం పదవులు ఏకగ్రీవమయ్యాయి. రెండు వేల లోపు జనాభా ఉండే గ్రామాల్లో అత్యధికం రెండు వేలు, అంతకంటే తక్కువ జనాభా ఉన్న చిన్న గ్రామాల్లో అత్యధికంగా సర్పంచి, వార్డు సభ్యుల పదవులన్నింటికీ ఏకగ్రీవంగా ఎన్నికలు ముగిశాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ తాజాగా జిల్లాల వారీగా వివరాలను సేకరించి ఒక నివేదికను సిద్ధం చేసింది. రెండు వేలు, అంతకు తక్కువ జనాభా ఉండే గ్రామాల్లో 1,401 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినట్టు నిర్ధారించారు. -
భద్రతామండలికి ఐదు దేశాలు ఏకగ్రీవ ఎన్నిక
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో శక్తివంతమై న భద్రతామండలికి శుక్రవారం బ్రెజిల్, యూఏఈ, అల్బేనియా, ఘనా, గబాన్ దేశాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 15 మంది సభ్యులుండే మండలిలో చోటు సంపాదించడం చాలా దేశాలు ఒక మహదవకాశంగా భావిస్తాయి. సిరియా, యెమెన్, మాలి, మయన్మార్ దేశాల్లో సంక్షోభాలు మొదలుకొని.. ఉత్తరకొరియా, ఇరాన్‌ల అణ్వాయుధ ముప్పు, ఇస్లామిక్ స్టేట్(ఐఎస్), అల్ ఖాయిదా వంటి ఉగ్ర సంస్థల దాడులు దాకా అనేక అంశాలపై తమ వాణిని బలంగా వినిపించేందుకు మండలి ముఖ్య వేదిక కావడమే ఇందుకు కారణం. ఆల్బేనియాకు మండలిలో చోటు లభించడం ఇదే మొదటిసారి కాగా, బ్రెజిల్‌కు ఇది 11వ సారి. రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల ఫలితాలను జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ వొల్కన్ బొజ్కిర్ ప్రకటించారు. మండలిలోని 15 సభ్య దేశాల్లో వీటో అధికారం ఉన్న అమెరికా, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్సులతోపాటు 10 తాత్కాలిక సభ్య దేశాలుంటాయి. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాలు యథాతథం
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జడ్పీటీసీలు యథాతథంగా ఉంటారని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార వర్గాలు శుక్రవారం స్పష్టం చేశాయి. 2020 మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 126 జడ్పీటీసీ స్థానాలు, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. 2020 మార్చిలో జరిగిన నామినేషన్ల ప్రక్రియను హైకోర్టు రద్దు చేయలేదని.. కరోనా అనంతరం మధ్యలో ఆగిపోయిన ఎన్నికలను తిరిగి నిర్వహించడానికి ఇచ్చిన నోటిఫికేషన్‌ను మాత్రమే రద్దు చేసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. హైకోర్టు తీర్పుపై మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయని వివరించాయి. 2020 మార్చిలో మధ్యలో ఆగిపోయిన ఎన్నికలను 2021 ఏప్రిల్‌లో తిరిగి నిర్వహించేటప్పుడు నోటిఫికేషన్‌కు, పోలింగ్‌కు మధ్య 4 వారాల గడువును పాటించలేదని మాత్రమే కోర్టు తప్పుపట్టిందని తెలిపాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1న జారీ చేసిన నోటిఫికేషన్‌నే కోర్టు రద్దు చేసిందన్నాయి. 2020 మార్చిలో ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం.. నామినేషన్ల ఉపసంహరణ వరకు జరిగిన ప్రక్రియంతా చెల్లుబాటులో ఉన్నట్లేనని వెల్లడించాయి. హైకోర్టు తాజా తీర్పు ప్రకారం.. ఏప్రిల్ 8న జరిగిన పోలింగ్ ప్రక్రియ మాత్రమే రద్దు అయినట్టుగా భావించాలని, అంతకు ముందు జరిగిన నామినేషన్లన్నీ చెల్లుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. తాజా తీర్పుపై డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలని ఎస్ఈసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. -
ఏపీ ఎస్ఈసీకి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల సంఘానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏకగ్రీవాలపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఏకగ్రీవాలపై దర్యాప్తు చేసే అధికారం ఎస్ఈసీకి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఈసీ ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలని హైకోర్టు ఎస్ఈసీని ఆదేశించింది. తక్షణమే ఎంపికైన అభ్యర్ధులకు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, గత ఏడాది మార్చ్15న కరోనా కారణంగా జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాయిదా పడే సమయానికి నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తి అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్ధానాలకి నోటిఫికేషన్ విడుదల కాగా, 8 జెడ్పీటీసీ స్ధానాలకు కోర్టు వివాదాలతో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. మిగిలిన 652 జెడ్పీటీసీ స్ధానాలకి 126 జెడ్పీటీసీలు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్సార్ కడప జిల్లాలో 50 జెడ్పీటీసీ స్ధానాలకు 38, చిత్తూరులో 65 స్ధానాలకి 30, కర్నూలు జిల్లాలో 53 స్ధానాలకి 16, ప్రకాశంలో 56 స్ధానాలకి 14 జెడ్పీటీసీ స్ధానాలు, నెల్లూరులో 46కు 12, గుంటూరులో 57కు 8 స్ధానాలు, కృష్ణాలో 49కి రెండు స్ధానాలు, పశ్చిమ గోదావరి 48కి రెండు స్ధానాలు, విజయనగరంలో 34 స్ధానాలకు మూడు, విశాఖపట్నంలో 39కి ఒక జెడ్పీటీసీ స్థానం వైఎస్సార్సీపీకి ఏకగ్రీవం అయింది. అనంతపురం, శ్రీకాకుళం, తూర్పుగోదావరిలోఏకగ్రీవాలు కాలేదు. ఏకగ్రీవాలైన 126 మంది జెడ్పీటీసీలను అధికారికంగా ప్రకటించి మిగిలిన 526 జెడ్పీటీసీ స్ధానాలకు ఎస్ఈసీ ఎన్నికలు జరిపించాల్సి ఉంది. చదవండి: 126 జెడ్పీటీసీ, 2,406 ఎంపీటీసీలు ఏకగ్రీవం అమరావతి భూ కుంభకోణంపై సమగ్ర నివేదిక -
'తూర్పు' తీర్పు విలక్షణమే
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: గౌతమి, వృద్ధగౌతమి, వైనతేయ, వశిష్ట నదుల సవ్వడితో రాజకీయ చైతన్యం మెండుగా ఉండే తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఇచ్చే తీర్పు ఎప్పుడూ విలక్షణంగానే ఉంటుంది. అవి సార్వత్రిక ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలైనా.. ఏ ఎన్నికలైనా ఇక్కడి ఓటర్ల తీర్పు ఏకపక్షంగానే ఉంటుంది. ఆ తీర్పునకు ప్రాంతాలు, పార్టీలు, వర్గాలు అనే వ్యత్యాసం ఉండదు. ఇందుకు 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలే నిదర్శనం. నాటి ఎన్నికల్లో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 14 చోట్ల వైఎస్సార్సీపీకి తూర్పు ఓటర్లు పట్టం కట్టారు. తాజాగా పార్టీ రహితంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం 90 శాతం ఆ పార్టీ అభిమానుల్నే గెలిపించారు. వారం రోజుల్లో జరగనున్న పురపాలక సంఘాల ఎన్నికల్లో సైతం పంచాయతీ ఫలితాలే పునరావృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా రెండు నగరపాలక సంస్థలు, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలు.. ఈ జిల్లాలో ఉన్నాయి. వీటిలో కాకినాడ నగరపాలక సంస్థకు పాలకవర్గం ఉంది. పంచాయతీల విలీన వివాదం న్యాయస్థానంలో ఉండటంతో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు జరగడం లేదు. తుని, అమలాపురం, మండపేట, పెద్దాపురం, సామర్లకోట, రామచంద్రపురం, పెద్దాపురం మున్సిపాలిటీలకు, గొల్లప్రోలు, ముమ్మిడివరం, ఏలేశ్వరం నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మొత్తం 268 వార్డులుండగా 35 ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారంతా వైఎస్సార్సీపీ అభ్యర్థులే. ► 1959లో ఆవిర్భవించిన తుని మున్సిపాలిటీ పేరున ఒక అరుదైన రికార్డు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 30 వార్డుల్లోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థులే విజయం సాధించారు. ప్రస్తుతం 30 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా.. 15 వార్డులలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఎన్నికలు జరిగే 15 వార్డుల్లో 10 చోట్ల గెలుపుపై వైఎస్సార్సీపీ ధీమాగా ఉంది. ► కేరళ తరువాత కొబ్బరికి పుట్టిల్లు కోనసీమలో ఏ కైక మున్సిపాలిటీ అమలాపురంలో కూడా వైఎస్సార్సీపీకే అనుకూలంగా ఉంది. స్వాతం్రత్యానంతరం 1948లో ఏర్పాటైన ఈ మున్సిపాలిటీలో గత టీడీపీ హయాంలో ఆ పార్టీ 22 వార్డులు, వైఎస్సార్సీపీ 8 వార్డుల్లో గెలుపొందాయి. ఈసారి 30 వార్డుల్లో ఇప్పటికే ఆరు వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఎన్నికలు జరిగే 24 వార్డుల్లో 20కిపైనే వైఎస్సార్సీపీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్టణాన్ని ఆనుకుని ఉన్న మూడు మేజర్ పంచాయతీలు కామనగరువు, బండార్లంక, పేరూరుల్లో వైఎస్సార్సీపీ అభిమానులు సర్పంచులుగా విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఫలితాలే పునరావృతం కానున్నాయని అంచనా. ► ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న మండపేటలో ఈసారి ఆ పార్టీ ఎదురీదుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 43 పంచాయతీలకు 31 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ అభిమానులను ప్రజలు ఎన్నుకున్నారు. పట్టణ సమీపంలోని టీడీపీ ఓటమి ఎరుగని ఏడిద, నేలటూరు, మారేడుబాక, అర్తమూరు తదితర పంచాయతీల్లో వైఎస్సార్సీపీ అభిమానులు విజయం సాధించడంతో మున్సిపల్ ఎన్నికల్లోను అదే ఒరవడి కనిపిస్తోంది. ► పెద్దాపురంలోని 29 వార్డుల్లో 18 చోట్ల వైఎస్సార్సీపీ సునాయసంగా గెలిచే అవకాశాలున్నాయి. మిగిలిన వార్డుల్లో సైతం పారీ్టకి సానుకూల పవనాలు వీస్తున్నాయి. పట్టణానికి దగ్గర్లోని గుడివాడ, ఆర్బీ కొత్తూరు, కట్టమూరు, దివిలి వంటి పంచాయతీల్లో వైఎస్సార్సీపీ పాగా వేయడంతో మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతం కానున్నాయి. ► టీడీపీకి కంచుకోట అయిన సామర్లకోటలో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మున్సిపాలిటీ సమీపాన వేట్లపాలెం, మేడపాడు మేజర్ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ అభిమానులు విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీలోని 31 వార్డుల్లో రెండింటిని వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. 20 నుంచి 22 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ► రామచంద్రపురంలోని 28 వార్డుల్లో 10 వార్డులను వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. 12 వార్డుల్లో వైఎస్సార్సీపీ గెలుపొందే సూచనలున్నాయి. పిఠాపురంలో 30 వార్డులున్నాయి. ఒక వార్డును ఏకగ్రీవంగా గెలుచుకున్న వైఎస్సార్సీపీ మరో 26 వార్డుల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. నగర పంచాయతీల్లో.. వాణిజ్యపంటల కేంద్రమైన గొల్లప్రోలు నగర పంచాయతీలో 20 వార్డులున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ చెరిసగం గెలుచుకున్నాయి. టీడీపీ అధికారబలంతో వైఎస్సార్సీపీ తరఫున గెలిచినవ్యక్తిని లోబరుచుకుని చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 15 వార్డులకుపైగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముమ్మిడివరం, ఏలేశ్వరం నగర పంచాయతీ పీఠాలను సైతం వైఎస్సార్సీపీ కైవశం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పారదర్శకంగా అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలు పల్లె ప్రజలతో పాటు పట్టణ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. -
'పురం'లోనూ ఫ్యాన్ హవా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల రాష్ట్రంలో తిరుగులేని ప్రజాదరణ వ్యక్తమవుతోందని మరోసారి స్పష్టమైంది. పురపాలక ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఘన విజయం సాధించనుందని దాదాపు తేటతెల్లమైపోయింది. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న 12 నగర పాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల్లో బుధవారం ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ ఏకంగా 571 వార్డులు/డివిజన్లను ఏకగ్రీవంగా గెలుచుకుంది. (తిరుపతిలో మరో డివిజన్ విషయంలో ఎన్నికల కమిషన్ గురువారం నిర్ణయం తీసుకోనుంది. అది కూడా వైఎస్సార్సీపీ పరం అయ్యే అవకాశాలున్నాయి). రాష్ట్రంలో మొత్తం 2,794 వార్డులు/డివిజన్లకు గాను 578 వార్డులు/డివిజన్లలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాటిలో ఏకంగా 571 వార్డులు/డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందడం విశేషం. పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీల్లో అన్ని వార్డులనూ వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. రాయచోటి, పలమనేరు, నాయుడుపేట, ఆత్మకూరు (కర్నూలు జిల్లా), డోన్ మున్సిపాలిటీలలో మూడింట రెండొంతుల వార్డులు వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. సూళ్లూరుపేట, కొవ్వూరు, తుని మున్సిపాలిటీల్లో సగం వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకుని ఆ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం ఖాయమని తేల్చి చెప్పింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకూ ఏకగ్రీవాల్లో వైఎస్సార్సీపీ పూర్తి స్థాయిలో ఆధిపత్యం కనబరిచి ప్రజాభిప్రాయం తమ పక్షమే అని పునరుద్ఘాటించింది. ఏకగ్రీవాల్లో ‘ఫ్యాన్’ ప్రభంజనం పురపాలక ఎన్నికల్లో ఏకగ్రీవాల్లో ‘ఫ్యాన్’ ప్రభంజనం సృష్టించింది. మొత్తం ఏకగ్రీవాల్లో 98.80 శాతం వైఎస్సార్సీపీ పరమయ్యాయి. తిరుపతిలో ఓ డివిజన్లో మళ్లీ నామినేషన్‌కు ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది. దాంతో ఒకరు రీ నామినేషన్ వేశారు. కానీ రీ నామినేషన్‌కు అవకాశం ఇస్తూ ఎన్నికల కమిషన్ ఇచి్చన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. దాంతో ఆ డివిజన్లో వేసిన రీ నామినేషన్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది చెల్లకపోతే ఆ డివిజన్‌ను కూడా వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంటుంది. ఇక రాష్ట్రంలో టీడీపీ అభ్యర్థులు 6 వార్డుల్లో, బీజేపీ అభ్యర్థి ఒక వార్డులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 578 ఏకగ్రీవమైన వార్డులు/డివిజన్లలో 130 వార్డులతో చిత్తూరు జిల్లా మొదటి స్థానం సాధించగా, 120 వార్డులు/డివిజన్లతో వైఎస్సార్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. చిత్తూరు, తిరుపతి, కడప కార్పొరేషన్లలో హవా ► పోలింగ్‌తో నిమిత్తం లేకుండానే 3 నగర పాలక సంస్థలు, 13 పురపాలక సంఘాలను వైఎస్సార్సీపీ దక్కించుకోవడం ఖాయమని తేలిపోయింది. ► చిత్తూరు నగర పాలక సంస్థలో 50 డివిజన్లలో 37 ఏకగ్రీవంగా గెలుచుకుంది. తిరుపతి నగర పాలక సంస్థలో 50 డివిజన్లలో 21, కడప నగర పాలక సంస్థలో 50 డివిజన్లలో 23 డివిజన్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మున్సిపాలిటీలలో వైఎస్సార్సీపీ ఏకగ్రీవాలు ఇలా.. ► పులివెందుల (31), పుంగనూరు (31), పిడుగురాళ్ల (33), మాచర్ల (31) మున్సిపాలిటీలలో అన్ని వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఈ మున్సిపాలిటీలో పోలింగ్ నిర్వహించాల్సిన అవసరమే లేదు. ► రాయచోటిలో 34 వార్డులకు గాను 31, నాయుడుపేటలో 25 వార్డులకు గాను 23, పలమనేరులో 26 వార్డులకు గాను 18, డోన్‌లో 32 వార్డులకు గాను 22, ఆత్మకూరు (కర్నూలు జిల్లా)లో 24 వార్డులకు గాను 18, కొవ్వూరులో 23 వార్డులకు గాను 13, తునిలో 30 వార్డులకు గాను 15 వార్డులు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవమయ్యాయి. సూళ్లూరుపేటలో 25 వార్డులకు గాను 15 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీలో 20 వార్డులకు గాను 12 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. విశాఖలో నాలుగు చోట్ల టీడీపీకి అభ్యర్థులు కరువు ► గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు నాలుగు వివిజన్లలో అభ్యర్థులు కరువయ్యారు. 15, 49, 72, 78 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో లేరు. ► వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైదుకూరు, రాయచోటి, పులివెందుల, బద్వేలు మున్సిపాలిటీల్లో కూడా వైఎస్సార్సీపీ పలు కౌన్సిలర్ స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది. ► ఏలూరులో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు పోటీలో లేని చోట్ల తాను జనసేనకు ప్రచారం చేస్తానని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని అన్నారు. బుధవారం చింతమనేని కార్పొరేషన్ కార్యాలయం వద్దకు వచ్చి కొద్దిసేపు హల్చల్ చేశారు. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారని తిట్ల దండకం అందుకున్నారు. ఏలూరులోని టీడీపీ నాయకులను కూడా ఇష్టారాజ్యంగా తిట్టారు. -
మూడో విడత పోలింగ్ రేపు
సాక్షి, అమరావతి: మూడో విడతలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 2,640 సర్పంచి పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్‌శాఖ జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు చేశాయి. మూడో విడతలో 3,221 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అందులో 579 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలో ఒక్కొక్క చోట సర్పంచి పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో అక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 2,640 సర్పంచి పదవులకు బుధవారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగే చోట మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ కొనసాగనుంది. ఆయా పంచాయతీల పరిధిలో 19,607 వార్డు పదవులకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో ఎన్నికలు జరిగే 3,221 గ్రామ పంచాయతీల పరిధిలో 31,516 వార్డులున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 11,732 వార్డులకు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 177 వార్డులకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 19,607 వార్డుల్లో ఎన్నికలు జరగుతున్నాయి. ఈ వార్డులకు 43,282 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే బుధవారమే ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. చివరి విడత ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేడు చివరి విడతలో ఈనెల 21న ఎన్నికలు జరగనున్న 3,229 గ్రామ పంచాయతీల్లో మంగళవారం సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. నామినేషన్ల పరిశీలన తర్వాత 3,229 గ్రామ సర్పంచి పదవులకు 18,016 మంది, 33,429 వార్డులకు 86,064 మంది పోటీలో ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది మార్చి 9న నోటిఫికేషన్.. 15న నిలిపివేత రాష్ట్రంలోని 16 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 12 కార్పొరేషన్లలో, 104 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉండగా 75 చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు 2020 మార్చి 9వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల దాఖలు, పరిశీలన ప్రక్రియ ముగిశాక కరోనా పేరుతో అదే నెల 15న ఆ ఎన్నికలను అర్ధంతరంగా నిమ్మగడ్డ నిలిపివేశారు. కాగా ఆగిపోయిన చోట నుంచే ఆ ఎన్నికల ప్రక్రియ మొదలు పెడుతున్నట్టు, వచ్చే నెల 2 నుంచి 3వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇస్తున్నట్లు తాజా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. -
ఆ ఏకగ్రీవాలు సక్రమమే
సాక్షి, అమరావతి: చిత్తూరు, గుంటూరు జిల్లాలో జరిగిన ఏకగ్రీవాలపై 4 రోజుల కిందట అనుమానం వ్యక్తం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్.. సోమవారం ఆ ఏకగ్రీవాలన్నీ సక్రమమేనని తేల్చారు. వీటిని అధికారికంగా ప్రకటించవచ్చని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. కలెక్టర్ల నివేదికలతో పాటు ఆయా జిల్లాల అబ్జర్వర్ల నుంచి తీసుకున్న సమాచారం మేరకు.. 2 జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్ధారణకు వచ్చినట్టు వెల్లడించారు. -
ఏకగ్రీవంతో గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం
అచ్చంపేట (పెదకూరపాడు): ‘‘గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవాలి. అందుకే ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చినంత నేనూ ఇస్తా.. అందరం కలసి గ్రామాన్ని ఏకగ్రీవం చేసుకుందాం. వృథా చేసే డబ్బుతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. అందరికీ ఆదర్శంగా నిలుద్దాం’’ అని ఓ ఎన్ఆర్ఐ ముందుకు వచ్చారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని తాళ్లచెరువుకు చెందిన దొండేటి మర్రెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడ్డారు. వ్యవసాయ ప్రాధాన్యత గల తాళ్లచెరువులో 4,206 మంది ఓటర్లు. వారిలో 2,066 మంది పురుషులు, 2,140 మంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయింది. ప్రతి పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిని గెలుపించుకోవాలంటే సుమారు రెండు వర్గాలు చెరో రూ. 50 లక్షలు ఖర్చు చేస్తారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచే మద్యం ఏరులై పారుతుంది. గెలిచిన అభ్యర్థి ఏడవలేక నవ్వితే, ఓడిన అభ్యర్థి అక్కడే తీవ్ర ఆవేదన పడటం సర్వసాధారణం. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టాలన్న ఆలోచనతో మర్రెడ్డి ముందుకొచ్చారు. ఓ సమర్థ అభ్యర్థిని ఎంపిక చేసుకుని ఏకగ్రీవం చేసుకుంటే ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకం రూ. 10 లక్షలకు తోడు తాను మరో రూ. 10 లక్షలు గ్రామానికి విరాళంగా ఇస్తానని ప్రకటించారు. అలా కాని పక్షంలో మరో మార్గాన్ని కూడా తానే వివరించారు. ప్రస్తుతం తన తల్లి దొండేటి అన్నమ్మ తాళ్లచెరువులోనే ఉంటున్నారని, ఆమెను ఏకగ్రీవంగా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి రూ. 50 లక్షలతో పాటు సామాజిక అవసరాలకు ఉపయోగపడేలా గ్రామానికి సమీపంలోని అర ఎకరం భూమిని ఇచ్చి, అందులో అధునాతన వ్యవసాయ విధానాలకు ఉపయోగపడేలా ఒక భవనాన్ని నిర్మించి ఇస్తానని సూచించారు. ఈ రెండు మార్గాల్లో ఎందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని, దీనివల్ల తన జన్మభూమి అయిన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం తప్ప మరే విధమైన స్వార్థం లేదని వివరించారు. పెట్టిన ఖర్చు తిరిగిరాదు ఇప్పటి వరకు అనేక మంది సర్పంచ్‌లుగా గెలిచారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన సొమ్మును కూడా సంపాదించుకోలేకపోయారు. కేవలం ప్రెస్టేజీకి పోయి ఉన్న ఆస్తులను పోగొట్టుకున్నారు. ఈసారైనా గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నా సూచనలు ఆలకిస్తే మంచిది. – దొండేటి మర్రెడ్డి, ఎన్ఆర్ఐ, తాళ్లచెరువు గ్రామం గ్రామం బాగుపడాలనే... మా అబ్బాయి అమెరికాలో స్థిరపడ్డాడు. ఇక్కడికి వచ్చి పెత్తనం చెలాయించాలని అతనికి లేదు. స్వగ్రామానికి వచ్చినప్పుడల్లా గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేశాడు. హైస్కూల్లో ప్రతి తరగతి గదికి టీవీలు ఇచ్చాడు. నిరుపేదలకు అండగా నిలిచాడు. ఇవన్నీ కేవలం గ్రామం బాగుపడాలనే. – దొండేటి అన్నమ్మ, ఎన్ఆర్ఐ తల్లి, తాళ్లచెరువు -
సాటిలేని సేవ.. పోటీలేని గెలుపు
ఠంఛనుగా పింఛన్ పంచినప్పుడు ఆమె నిబద్ధతను గుర్తించారు.. ప్రభుత్వ పథకమేదైనా అర్హుల చెంతకు చేర్చడంలో ఆమె చూపిన చొరవ గమనించారు. నలుగురినీ ఆప్యాయంగా పలకరించడంలో ఆమె కలుపుగోలుతనాన్ని తెలుసుకున్నారు. 50 ఇళ్లకు వలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఆ కుటుంబాల్లో సభ్యురాలిగా మారిన ఆమె మంచితనానికి ఏకగ్రీవంగా ఓటు వేశారు. కొల్లావారిపాలెంలో వలంటీర్ సరస్వతిని ఊరంతా ఒక్కమాట మీద నిలబడి సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. జిల్లాలో వలంటీర్ల సేవలకు ఆ గ్రామ ప్రజలు పెద్ద బహుమతి ఇచ్చి పట్టం కట్టారు. పర్చూరు: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం కొల్లావారిపాలెం గ్రామంలో 300 కుటుంబాలున్నాయి. సుమారు 1,200 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ 755 మంది ఓటర్లు (పురుషులు 362 మంది, మహిళలు 393 మంది) ఉన్నారు. ఈ పంచాయతీ ఏర్పాటై సుమారు 53 సంవత్సరాలైంది. ఇక్కడ మొదటి నుంచి టీడీపీ ఆధిక్యం కనబరిచేది. 2019 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను కేటాయించి ఆయా గృహాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో వలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా మారారు. కోవిడ్ సమయంలోనూ వీరు అమూల్యమైన సేవలు అందించారు. కొల్లావారిపాలెంలో 2వ క్లస్టర్లో కొల్లా సరస్వతికి వలంటీర్ పోస్టు ఇచ్చారు. ఆమె 2019 ఆగస్టు 15 నుంచి వలంటీరుగా విధులు నిర్వర్తించడం ప్రారంభమైంది. ఈమె బీటెక్ వరకు చదువుకుంది. మొదటి నుంచి ప్రభుత్వ పథకాలు తన పరిధిలోని వారికి అందించడంలో ప్రత్యేక చొరవ చూపించేది. అధికారుల వద్ద నిబద్ధతతో వ్యవహరించి మన్ననలు పొందింది. ఈ పంచాయతీ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో వలంటీర్‌గా పనిచేస్తున్న సరస్వతి పేరు ప్రస్తావనలోకి వచ్చింది. ఆమె సేవాభావాన్ని తెలుసుకున్న గ్రామమంతా మద్దతుగా నిలిచింది. దీంతో ఆమె ఏకగ్రీవంగా సర్పంచ్ అయింది గ్రామాభివృద్ధికి కృషిచేస్తా కొల్లావారిపాలెం గ్రామాభివృద్దికి కృషిచేస్తా. గ్రామస్తులందరూ ఒకేతాటిపైకి వచ్చి నన్ను సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలలోకి తీసుకెళతా. గ్రామ సమస్యలపై నాకు అవగాహన ఉంది. వీటి పరిష్కారానికి కృషిచేస్తా. – కొల్లా సరస్వతి సరస్వతి సేవలు అభినందనీయం కొల్లా సరస్వతి వలంటీర్‌గా తనకు కేటాయించిన 50 ఇళ్లకు తిరిగి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది. వలంటీర్‌గా ఉన్నప్పుడు అందరి సమస్యల పరిష్కారానికి కృషిచేసేది. ఇప్పుడు గ్రామంలో అందరం కలిసి ఆమెనే సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. – అనురాధ, గ్రామస్తురాలు ఐకమత్యంతో అభివృద్ధి పంచాయతీల్లోని గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా ప్రకటించడం సంతోషంగా ఉంది. ఐకమత్యంతో పంచాయతీని ఎంతో అభివృద్ది చెందుతుంది. – సంపత్‌కుమార్, మాజీ సర్పంచి -
‘పంచాయతీ’ల్లో ఏకగ్రీవాలు కొత్తకాదు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై ఎన్నికల కమిషన్ వివరణ కోరడం తొందరపాటు చర్య అని, పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కొత్తేమీకాదని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి తొలినుంచి పంచాయతీ ఏకగ్రీవ ఎన్నికలు ఉంటున్నాయని తెలిపారు. విజయనగరంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. మంత్రి బొత్స మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా ఏకగ్రీవం అయితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. గత ఎన్నికలతో పోల్చితే ఒక శాతం మాత్రమే అదనంగా జరిగిన దానికే ఎన్నికల కమిషన్ ఎలా వివరణ కోరుతుందని ప్రశ్నించారు. ఈ విషయాన్ని గుర్తించి ఎన్నికల కమిషన్ పునరాలోచించుకోవాలని అన్నారు. మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో గందరగోళం సృష్టించి, అశాంతి రేకెత్తించాలని ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తోందని అన్నారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
ఆ రెండు జిల్లాల్లో ఆగండి: నిమ్మగడ్డ ఆదేశాలు
సాక్షి, అమరావతి: గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో తొలివిడత ఎన్నికలు జరిగే చోట్ల ఏకగ్రీవమైన పంచాయతీలను తాను అనుమతి ఇచ్చేవరకు అధికారికంగా ప్రకటించవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆయన కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. రెండు జిల్లాల కలెక్టర్లు పంపే వివరణాత్మక నివేదికలను పరిశీలించిన తర్వాత ఏకగ్రీవమైన పంచాయతీలను ప్రకటించడంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్ఈసీ పేర్కొన్నారు. అయితే తొలిదశలో ఎన్నికలు జరిగే పంచాయతీలకు నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన మర్నాడు కమిషన్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడటం గమనార్హం. నివేదికలను పరిశీలించాక నిర్ణయం ‘రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్వేచ్ఛాయుతమైన ఎన్నికలకు అనుకూల వాతావరణం ఉంది. బలవంతపు ఏకగ్రీవాలు రాష్ట్రంలో జరుగుతున్నట్లు కనిపించడం లేదు. అయితే రాష్ట్రం మొత్తం కనబడుతున్న పరిస్థితికి భిన్నంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవాలు జరిగినట్లు కనిపిస్తోంది. వీటిపై ఆయా జిల్లా కలెక్టర్లను నివేదిక కోరా. వాటిని పరిశీలించాక కమిషన్ తదుపరి చర్యలు తీసుకుంటుంది. ఆయా నివేదికల ప్రకారం ఈ విషయంలో ఏవైనా వైఫల్యాలను గుర్తిస్తే అందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తుంది’ అని నిమ్మగడ్డ ప్రకటనలో పేర్కొన్నారు. డిక్లరేషన్ ఫారాలు కూడా అందుకున్న ఏకగ్రీవ అభ్యర్థులు! గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో 70 నుంచి 80 శాతం మంది అభ్యర్థులు గురువారమే ధ్రువీకరణ పత్రాలు కూడా పొందినట్లు తెలిసింది. తొలివిడతలో ఎన్నికలు జరిగే 3,249 పంచాయతీలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆ సమయానికి ఒకే అభ్యర్ధి పోటీలో ఉంటే సంబంధిత రిటరి్నంగ్ అధికారి (ఆర్వో) ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించి ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థికి ధ్రువీకరణ పత్రాన్ని కూడా వెంటనే అందజేయాల్సి ఉంటుంది. చిత్తూరు జిల్లాలో 454 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 112 చోట్ల సర్పంచి పదవులు, 2,637 వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవం అయ్యాయి. గుంటూరు జిల్లాలో 337 గ్రామ పంచాయతీలకుగానూ 67 సర్పంచి పదవులు, 1,337 వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత ఏకగ్రీవ అభ్యర్ధులు రిటర్నింగ్ అధికారుల నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రాలను అందుకున్నట్లు తెలిసింది. రిటర్నింగ్ అధికారి ఒకసారి ఎవరైనా అభ్యర్ధి గెలిచినట్లు అధికారికంగా ధ్రువీకరణ ప్రతం అందజేస్తే ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏకగ్రీవాలపై కమిషన్‌కు కలెక్టర్ల నివేదికలు గుంటూరు జిల్లాలో 67 సర్పంచి పదవులు, చిత్తూరు జిల్లాలో 112 సర్పంచి పదవులకు ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసినట్లు ఆయా జిల్లా కలెక్టర్లు శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం అత్యధిక స్థానాల్లో గురువారమే రిటర్నింగ్ అధికారులు గెలుపు ధ్రువీకరణ పత్రాలు అందచేశారని కమిషన్‌కు తెలియచేసినట్లు సమాచారం. తొలివిడతలో 2,724 గ్రామాల్లో 9న ఎన్నిక తొలివిడతలో విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాలలో 3,249 గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా 525 గ్రామాల్లో సర్పంచి ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,724 గ్రామ పంచాయతీల్లో ఈనెల 9వతేదీన పోలింగ్ జరగనుంది. ఉదయం 6.30 గంటల నుంచి 3.30 వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. -
ఏకగ్రీవాలపై ఇదేం పంచాయితీ?
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు గతంతో పోల్చితే అప్పుడూ ఇప్పుడూ ఒకేలా నమోదవుతున్నా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తాను చెప్పేవరకు ప్రకటించవద్దని కలెక్టర్లను ఆదేశించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రం మొత్తం చూసినా, జిల్లాలవారీగా చూసినా 2013 పంచాయతీ ఎన్నికల మాదిరిగానే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఇప్పుడూ ఏకగ్రీవాలు ఉన్నాయి. అయినా ఆ రెండు జిల్లాల్లో ఏకగ్రీవమైన పంచాయతీల సంఖ్య ఎక్కువగా ఉందని, అధికారికంగా ప్రకటించరాదని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా చూసినా.. రాష్ట్రవ్యాప్తంగా చూసినా 2013లో 13 జిల్లాల పరిధిలో 12,740 పంచాయతీల్లో 1,980 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. అంటే 15.54 శాతం పంచాయతీలు అప్పట్లో ఏకగ్రీవమయ్యాయి. ఇప్పుడు తొలివిడత ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా 16 శాతం గ్రామ పంచాయతీల్లో సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. 2013లో 33.27 శాతం వార్డులు ఏకగ్రీవం కాగా ఇప్పుడు తొలి విడతలో 37 శాతం ఏకగ్రీవమయ్యాయి. 2013లో సర్పంచి పదవికి సరాసరిన ఆరుగురు చొప్పున నామినేషన్లు దాఖలు చేయగా ఇప్పుడు తొలి విడతలో కూడా అదే రీతిన ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ నినాదం వెనుకబడిందంటూనే.. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలపై నిమ్మగడ్డ ఆది నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు. గ్రామస్తులంతా ఐకమత్యంగా సాగేందుకు ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం పెంచితే అధికారులకు ఎస్ఈసీ సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. ఏకగ్రీవాల నినాదం పూర్తిగా వెనుకబడిపోయిందని ఇటీవల వ్యాఖ్యానించారు. తాజాగా వాటి సంఖ్య ఎక్కువగా ఉందంటూ ఫలితాల ప్రకటనను నిలిపివేస్తూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఆ రెండు జిల్లాల్లో ఇలా.. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో చిత్తూరు జిల్లాలో మొత్తం 1,357 గ్రామ పంచాయతీల్లో 293 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. అంటే 21.59 శాతం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇప్పుడు తొలివిడతలో ఆ జిల్లాలో 454 పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా 112 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. అంటే 24.67 శాతం గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు జిల్లాలో 1,010 గ్రామ పంచాయతీలు ఉండగా 2013లో 162 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. అంటే 16.03 శాతం పంచాయతీలు అప్పట్లో ఏకగ్రీవంగా ముగిశాయి. అదే జిల్లాలో ఇప్పుడు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో 337 పంచాయతీలకుగాను 67 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. అంటే తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో 19.88 శాతం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. -
చిత్తూరు జిల్లా: ఏకగ్రీవ సర్పంచ్‌లు వీరే!
సాక్షి, చిత్తూరు: పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ తరువాత చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలు ఊపందుకున్నాయి. రామచంద్రా పురం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా... నారాయణవనం మండలం లోని 19 పంచాయితీలలోని ఐదు పంచాయతీల్లో కూడా వైఎస్సార్ సీపీ మద్దతుదారులే ఏకగ్రీవం కావడం విశేషం. అంతేగాక పూతలపట్టు నియోజకవర్గం యాదమర్రి మండలంలోని పది గ్రామ పంచాయితీలలో కూడా ఇదే తరహాలో ఏకగ్రీవాలు జరిగాయి.(చదవండి: వైఎస్సార్ జిల్లా: ఏకగ్రీవాలు ఇవే!) ఏకగ్రీవ పంచాయతీలు రాయల చెరువు-మాదాసు మురగదాస్ సి. రామాపురం-సుబ్రమణ్యం రెడ్డి కొత్త వ్యాప కుప్పం-ఇస్మాయిల్ రెడ్డి నారాయణవనం మండలం నారాయణవనం టౌన్- శారద భీముని చెరువు- మురుగేశన్, బొప్పరాజుపాళ్యం- మునికుమారి, కసింమిట్ట- శశికళ, తిరువట్యం- నాగూర్ పూతలపట్టు నియోజకవర్గం యాదమర్రి మండలం కొత్త పాలెం- జి. లోకేష్ మోదం పల్లి- ఎం. సుబ్బులు బొమ్మ సముద్రం- వి. రఘు చిన్న కాలపల్లి-మనోరంజిని ఎం పైపల్లి- జమున పూర్తి మర్ది- పి. సుశీలమ్మ కొత్తపల్లి- కె. బాలాజీ మడి కొత్తపల్లి- కవిత పొలకల- వై. వాసంతి ఇరువారం పల్లి- కె. సులోచన ఇక పూతలపట్టు పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు గాను 12 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో 11 మంది సర్పంచులు వైఎస్సార్ సీపీ మద్దతుదారులు కాగా, ఒకరు టీడీపీకి మద్దతుదారుగా ఉన్నారు. నగిరి మండలం వి.కె.ఆర్.పురం సర్పంచిగా నందిని ఏకగ్రీవం వేలవాడి- చంద్రకళ బుగ్గ అగ్రహారం- రవికుమార్ ఆయనంబాకం- శేఖర్ విజయపురం- మురళీకృష్ణ విజయాపురం మండలం మాధవరం- మమత శ్రీహరిపురం-జ్యోతి కోసలనగరం- ఉమా మహేశ్వరి -
ఏకగ్రీవాలైన చోట అధికారుల్ని మార్చడమేంటి!
కర్నూలు (రాజ్‌విహార్): ఏకగ్రీవాలు జరిగిన చోట ఎంపీడీవోలను మార్చాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖలు రాయడం సరి కాదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డితో కలిసి బొత్స సత్యనారాయణ మీడియాతో బుధవారం మాట్లాడారు. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల క్రమంలో ఏకగ్రీవాలు అయిన చోట ఎంపీడీవోలను బదిలీ చేయాలని సీఎస్‌కు ఎస్ఈసీ లేఖ రాయడం విచారకరమన్నారు. గ్రామ స్వరాజ్యానికి విఘాతం కలిగించేలా నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్‌లు ఉన్నప్పటికీ ఎస్ఈసీ ప్రత్యేక యాప్ తయారు చేసిందని, ఇది తమ హక్కు అని చెప్పే ముందు బాధ్యతలను తెలుసుకుని అనుసరించాలని బొత్స పేర్కొన్నారు. -
చంద్రబాబుపై గరు భక్తి చాటుకుంటున్నారు..
సాక్షి, కాకినాడ: టీడీపీతో కలిసి శవ రాజకీయాలు చేస్తున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. చంద్రబాబుపై గురు భక్తిని చాటుకుంటున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు. గొల్లలగుంట ఘటనలో విచారణ జరగకుండానే ఎస్ఈసీ ఎలా పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు. ఎస్ఈసీ, ట్రైనీ నాయకుడు లోకేశ్ బాబు గొల్లలగుంటలో ఒకేసారి వాలిపోవడంతో వీరి మధ్య చీకటి ఒప్పందం మరోసారి బహిర్గతమైందని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గొల్లలగుంట వ్యక్తి మృతి చాలా బాధాకరమని, దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. టీడీపీ హయాంలో ఎన్నికలు నిర్వహించలేని ఎస్ఈసీ..విపత్కర పరిస్థితుల్లో ఎన్నికల హడావిడి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏకగ్రీవాల సాంప్రదాయం 1992లో గుజరాత్లో మోదీ ప్రవేశపెట్టారని, దేశంలో అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన వివరించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 2600 స్థానాలు ఏకగ్రీవాలయ్యాయని గుర్తు చేశారు. ఏకగ్రీవాలు రాజ్యాంగ స్పూర్తి అని పేర్కొన్నారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు కుటుంబం హత్యారాజకీయాలకు పాల్పడుతూ.. సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుందన్నారు. పార్టీలతో సంబంధం లేని ఎన్నికలకు చంద్రబాబు మేనిఫెస్టో ఎలా ప్రకటిస్తారని ఆయన నిలదీశారు. టీడీపీ మేనిఫెస్టోపై నిమ్మగడ్డ ఏం చర్యలు తీసుకున్నారని కన్నబాబు ప్రశ్నించారు. -
అచ్చెన్న బరితెగింపు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/టెక్కలి: ఒకవైపు.. బలవంతపు ఏకగ్రీవాలను సహించబోమంటూ కూడబలుక్కున్నట్లుగా ఎస్ఈసీ నిమ్మగడ్డ, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేవ్ లెంగ్త్‌తో చెబుతుంటారు. ఆ పార్టీ నేతలు మాత్రం బలవంతపు ఏకగ్రీవాలే కాదు.. ప్రత్యర్థులను బెదిరిస్తూ భౌతిక దాడులతో అంతం చేసేందుకూ వెనుకాడటం లేదు. ఇదీ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై టీడీపీ దుర్నీతి! నిమ్మాడలో అచ్చెన్న నియంతృత్వం.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో ఎప్పటిలాగే నియంతృత్వ పోకడలకు తెర తీశారు. బలవంతంగా ఏకగ్రీవం చేసుకునేందుకు అరాచకానికి ఒడిగట్టారు. తమకు పోటీగా సర్పంచ్ పదవికి బరిలో నిలిచారనే అక్కసుతో వరుసకు తన సోదరుడి కుమారుడైన కింజరాపు అప్పన్నపై పార్టీ శ్రేణులను దాడులకు పురిగొల్పారు. నామినేషన్ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అప్పన్న వెనక్కి తగ్గకపోవడంతో అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ నామినేషన్ కేంద్రంలోకి చొరబడి వీరంగం సృష్టించాడు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల దాడిలో టెక్కలి సీఐ నీలయ్య దుస్తులు చిరిగిపోయాయి. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మద్దతుదారులు భారీగా తరలిరావడం, పోలీసులు బందోబస్తు కల్పించడంతో ఎట్టకేలకు ఆదివారం సాయంత్రం కింజరాపు అప్పన్న నామినేషన్ దాఖలు చేయగలిగారు. ఇదేమైనా రాష్ట్రపతి పదవా? అంటూ ఎద్దేవా నిమ్మాడ పంచాయతీని బలవంతంగా ఏకగ్రీవం చేసుకునేందుకు అచ్చెన్నాయుడు తన సోదరుడు హరిప్రసాద్ కుమారుడు సురేష్‌ను బరిలోకి దించారు. ఆయనకు పోటీగా ఏ ఒక్కరూ నామినేషన్ వేయకుండా జాగ్రత్తపడ్డారు. అయితే టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు వల్ల పలు ఇబ్బందులకు గురైన కింజరాపు అప్పన్న సర్పంచ్‌గా పోటీకి దిగారు. దీంతో ఆయన ఇంటికి అచ్చెన్నాయుడు తన బంధువులను పంపి వార్నింగ్ ఇచ్చారు. అయితే అప్పన్న వెనక్కి తగ్గకపోవడంతో నేరుగా ఫోన్ చేసి బెదిరించారు. గత ప్రభుత్వంలో మీవల్లే తన భార్య ఉద్యోగం పోయిందంటూ అప్పన్న ఫోన్లోనే ఆవేదన వ్యక్తం చేయగా ‘‘సర్పంచ్ పదవి ఏమైనా రాష్ట్రపతి పదవా?..’’ అంటూ అచ్చెన్న ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో అప్పన్న టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ వద్దకు వచ్చి నామినేషన్ వేస్తానని, తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ఆయన అప్పన్న నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అంగీకరించారు. నామినేషన్ కేంద్రంలోనే దాడి.. నామినేషన్ కేంద్రానికి వచ్చిన అప్పన్నపై టీడీపీ మద్దతుదారుడిగా పోటీ చేస్తున్న కింజరాపు సురేష్ తండ్రి హరిప్రసాద్ దూషణలకు దిగారు. దువ్వాడ శ్రీనివాస్ తదితరులను దుర్భాషలాడారు. అనంతరం హరిప్రసాద్, సురేష్, అచ్చెన్నాయుడు అనుయాయులు నామినేషన్ కేంద్రంలోకి చొచ్చుకెళ్లి అప్పన్న, దువ్వాడ శ్రీనివాస్‌లను గెంటేసి దాడికి దిగారు. నామినేషన్ కేంద్రం బయట నిరీక్షిస్తున్న వాన ఆదినారాయణ కారును ధ్వంసం చేయడమే కాకుండా భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన ఆభరణాలు కూడా పోయాయి. దువ్వాడ శ్రీనివాస్‌పై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఆయన అనుచరులు కారులో తరలించారు. అప్పన్న, దువ్వాడ శ్రీనివాస్, వాన ఆదినారాయణ రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. గ్రామంలో కనిపించిన కొత్త వ్యక్తులపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘటనలను చిత్రీకరిస్తున్న వారి ఫోన్లను లాక్కున్నారు. ఈ సమాచారం తెలియడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అప్పన్నతోపాటు మరో ఇద్దర్ని పోలీసు వాహనంలో తరలించి నామినేషన్ వేయించారు. అచ్చెన్నాయుడు ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అప్పన్న సిద్ధమయ్యారని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. నిమ్మాడలో అచ్చెన్న అనుచరుల దౌర్జన్యకాండపై ఆయన కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేపు నిమ్మాడకు విజయసాయిరెడ్డి... వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఫిబ్రవరి 2న నిమ్మాడకు రానున్నారు. అప్పన్నను పరామర్శించి అండగా నిలుస్తామని భరోసా ఇవ్వనున్నారు. అచ్చెన్నపై ఈసీ చర్యలు తీసుకోవాలి: ధర్మాన శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నామినేషన్ వేసేందుకు వెళ్లిన వారిని అడ్డుకుని బెదిరింపులకు పాల్పడిన కింజరాపు అచ్చెన్నాయుడు, ఆయన అనుచరులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆదివారం డిమాండ్ చేశారు. గ్రామాల్లో అలజడులు రేపేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. -
ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం
సాక్షి, అనంతరపురం: ఆంధ్రప్రదేవ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన ప్రాంతాలను హైసెన్సిటివ్ ఏరియాలుగా ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో వీటిని సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించారు. ఈ వివాదస్పద నిర్ణయంపై మీడియా నిమ్మగడ్డను ప్రశ్నించిగా.. సమాధానం చెప్పకుండా దాటవేశారు. (చదవండి: నిమ్మగడ్డ తీరు: నాడు అలా.. నేడు ఇలా.. ) అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర సిబ్బందిపై పూర్తి విశ్వాసం ఉంది. అత్యవసరమైతేనే కేంద్ర బలగాలు కావాలని కోరాం. రాష్ట్ర సిబ్బందితోనే పంచాయతీ ఎన్నికలు జరుపుతాం. ఏకగ్రీవాలపై గవర్నర్‌కు కొన్ని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఏకగ్రీవాలు గతంలో ఉన్నాయి.. ఇప్పుడు ఉన్నాయి. ఏకగ్రీవాలన్నీ తప్పు అని చెప్పట్లేదు. మీడియాలో యాడ్స్ ఇవ్వటం వల్లే సమాచార అధికారులకు నోటీసులు ఇచ్చాం. బలవంతపు ఏకగ్రీవాలు ఉండకూదన్నదే మా ఉద్దేశ్యం. ఏపీ పంచాయతీ యాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తాం’’ అని తెలిపారు. ఇక సమావేశం అనంతరం విలేకరుల ప్రశ్నలకు నిమ్మగడ్డ సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం గమనార్హం. -
ఏకగ్రీవాలకు నజరానాలు ఆనవాయితీనే
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఏకగ్రీవ పంచాయతీలకు నజరానాలు ప్రకటించడం దశాబ్దాలుగా కొనసాగుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం, ప్రజల మధ్య సఖ్యత, సోదరభావం పెంపొందాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంలో రాజకీయం ఎక్కడుందో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ చెప్పాలన్నారు. ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేసిన వ్యాఖ్యలపై పలు ప్రశ్నలను సంధిస్తూ మంత్రి బుధవారం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. పెద్దిరెడ్డి ఏమన్నారంటే.. నిమ్మగడ్డకు కంగారెందుకు? ► ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవాలు జరగకూడదా? ఏకగ్రీవాలను అడ్డుకోవడమే మీ ఉద్దేశమా? రాష్ట్రంలోలో గ్రామీణ పాలన, సచివాలయ వ్యవస్థ, ఇళ్ల వద్దకే సంక్షేమ పాలనను ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు కొనియాడుతుంటే ఎస్ఈసీని అడ్డుపెట్టుకొని టీడీపీ అధినేత చంద్రబాబు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ► ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు నజరానాలు ప్రకటించడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. స్వాతంత్య్రం రాకముందు నుంచి ‘పంచాల’ పేరుతో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. టీడీపీ హయాంలో ఏకగ్రీవాలను ఎందుకు తప్పుబట్టలేదు? అప్పటికే ఉన్న జీవోపై కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? ► ఏకగ్రీవాలను అడ్డుకోవాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచనలు చేయడం దురదృష్టకరం. ఏకగ్రీవాలకు అస్కారం ఇవ్వరాదని బాబు టెలికాన్ఫరెన్సులో చెప్పిన మాటలనే ఎస్ఈసీ వల్లె వేశారు. ► ఏకగ్రీవాలు ఎక్కువైతే వ్యతిరేకిస్తామన్నట్లు నిమ్మగడ్డ అనడం రాజకీయం కాదా? ► ఏకగ్రీవాలు ఎన్ని అవుతాయో ముందుగానే ఎందుకు ఊహించి కంగారుపడుతున్నారు? ► పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా, పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతాయని తెలిసి కూడా ఏకగ్రీవాలు ఫలానా పార్టీకి అనుకూలంగా, కొన్ని పార్టీలకు వ్యతిరేకంగా ఉంటాయనే అభిప్రాయాన్ని కలిగించేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ► పరిమితులకు లోబడే ఏకగ్రీవాలు ఉండాలనేందుకు రాజ్యాంగపరమైన, చట్టపరమైన ప్రాతిపదిక ఏముందో, ఏ చట్టంలో అది పొందుపరిచారో నిమ్మగడ్డ వెల్లడించగలరా? ► అధికారులతో ఎలాంటి సమస్యా లేదంటూనే.. తనకన్నా మెరుగైన స్థితిలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించి అవార్డు పొందిన అధికారికి నిబంధనలు, నియమాలు తెలియవు అన్నట్లుగా కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయంలో భాగం కాదా? ► సీనియర్ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్‌లకు ఎస్ఈసీ పంపిన 9 పేజీల అభిశంసన లేఖను తిరిగి ఎన్నికల కమిషన్‌కే పంపాలని నిర్ణయించాం. మార్చి 31 తరువాత నిమ్మగడ్డ రమేష్ చౌదరి టీడీపీలో చేరి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఎన్నికల కమిషనరే చట్టాలను ఉల్లంఘించారు ఎన్నికల కమిషనర్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994 కి విరుద్ధంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రంలో లక్షలాది మంది పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి వచ్చిందని రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టం–1994 సెక్షన్ 2 (34) ప్రకారం ఎన్నికల జాబితా తయారు చేయడం, దానిని ప్రచురించడానికి ఏ సంవత్సరంలో జాబితా సిద్ధం చేశారో ఆ ఏడాది జనవరి 1వ తేదీని అర్హత తేదీ (క్వాలిఫైయింగ్ డేట్)గా గుర్తిస్తారని తెలిపారు. సెక్షన్ 11 ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన అధికారి ఈ క్వాలిఫయింగ్ డేట్‌ను ఆధారంగా చేసుకుని పంచాయతీ ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తారని, ఈ బాధ్యతలను జిల్లా పంచాయతీ అధికారికి అప్పగిస్తూ 2000 ఆగస్టు 4న అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. దీనినే ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని చెప్పారు. నిబంధనలకు ఎస్ఈసీ తిలోదకాలు.. 2019లో చట్టపరంగా ఈ ప్రక్రియను అనుసరించిన కమిషనర్ 2021 పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ సమయంలో ఎందుకు తిలోదకాలు ఇచ్చారని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ఓటర్లు ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. 2021 జనవరి 1 క్వాలిఫైయింగ్ డేట్ ప్రకారం పంచాయతీల్లో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఎన్నికల కమిషన్ ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను కూడా ఖరారు చేయాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియను పక్కన పెట్టడంతో ఎన్నికల చట్ట నిబంధనలను సాక్షాత్తూ ఎన్నికల కమిషనరే ఉల్లంఘించినట్లు అవుతోందన్నారు. దీనికి ప్రభుత్వం, ఉద్యోగులను కారణంగా చూపడం సమంజసం కాదన్నారు. -
‘ఐక్యత’తోనే ప్రగతి
సాక్షి, అమరావతి: రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఐకమత్యంగా ఉండటం ద్వారా గ్రామాలు ప్రగతి బాట పట్టాలని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష, ఆశయం. గ్రామ స్వరాజ్య స్థాపన కోసం కలలుగన్న జాతిపిత మహాత్మాగాంధీ కూడా ఇదే కోరుకున్నారు. గ్రామస్తులంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యతాభావంతో కలసి, మెలసి పరస్పర సుహృద్భావ వాతావరణంలో గ్రామాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని, స్వపరిపాలన సాగించుకోవాలని రాజ్యాంగ నిర్మాతలు కూడా సూచించారు. ఈ లక్ష్యంతోనే గాంధీజీ సొంత రాష్ట్రమైన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల ఎన్నికలను పార్టీ రహితంగా నిర్వహించేలా పంచాయతీరాజ్ చట్టంలో నిబంధన పెట్టాయి. రాజకీయ పార్టీల వారీగా గ్రామాల్లో వర్గాలు ఏర్పడితే మనస్పర్థలు వస్తాయని, గ్రామ ప్రగతిపై ఇవి దుష్ప్రభావం చూపుతాయన్న ఆలోచనతోనే పార్టీ రహిత ఎన్నికలకు బీజం వేశాయి. స్వపరిపాలనే గ్రామ పంచాయతీల లక్ష్యమైనందున గ్రామంలోని వారంతా ఐకమత్యంగా ఉండి అభివృద్ధి ప్రణాళికలు వేసుకోవడం ద్వారా అనూహ్య ప్రగతి సాధించాలన్నదే దీని వెనుక ఉద్దేశమన్నది అందరికీ తెలిసిన అంశమే. అందుకే ప్రోత్సాహకాలు – గ్రామంలో కలసి మెలసి ఉన్న వారు ఎన్నికల్లో పరస్పరం పోటీ పడినప్పుడు మనస్పర్థలకు, వివాదాలకు దారితీసిన ఉదంతాలు కోకొల్లలు. పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘర్షణల వల్ల కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వర్గాలు, ఘర్షణలు పల్లెల ప్రగతికి ప్రతిబంధకంగా మారతాయన్నది నిర్వివాదాంశం. – అందుకే రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రజల మధ్య శాంతి సౌభ్రాతృత్వాలు, పరస్పర సహకార భావాలు విరాజిల్లాలని బలంగా కోరుకుంటోంది. గ్రామ ప్రజలంతా పరస్పర సహకారంతో, సోదర భావంతో మెలగాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. – ఐకమత్యంతో సర్పంచి, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్న గ్రామాలను ఉత్తమ/ ఆదర్శ పంచాయతీలుగా గుర్తించి పోత్రాహకాలు అందించే పథనికి ఈ ఉదాత్త ఆశయంతోనే శ్రీకారం చుట్టింది. – పోటీ లేకుండా ఏకగ్రీవ పంచాయతీ చేసుకుంటే ప్రభుత్వం అందించే ప్రోత్సాహక మొత్తంతో గ్రామంలో ఏమైనా అభివృద్ధి పనులు చేసుకోవచ్చనే ఆశ కల్పించాలన్నదే దీని ఉద్దేశం. – ఆదర్శ పంచాయతీలకు పోత్సాహకాలు అందించడం ద్వారా గ్రామాలను కక్షలు, కార్పణ్యాలకు దూరంగా ఉంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇది ప్రతిఒక్కరూ ప్రశంసించే అంశమే. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు. – ఏకగ్రీవ చాయతీలకు నజరానా అందించే విధానం దశాబ్దాలుగా అమల్లో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రత్యేకించి పార్టీ రహిత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోతహించడం అన్నివిధాలా మంచిదేనని అన్ని రంగాల నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఏకగ్రీవ ఎన్నికలతోనే గ్రామ స్వరాజ్యం మన పరిపాలన వ్యవస్థలో పరిమాణపరంగా గ్రామ పంచాయతీలు చిన్నవి. కానీ అభివృద్ధికి అత్యంత కీలకమైనవి. అటువంటి పంచాయతీల్లో ప్రజలు వర్గ విభేదాలకు అవకాశం లేకుండా సమైక్యంగా ఉంటేనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యపడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోగలం. గ్రామ స్వరాజ్యం, అందరి సంక్షేమాన్ని సామరస్యంగా సాధించేందుకు పంచాయతీ ఎన్నికలను ఏకగీవ్రం చేసుకోవడం ఉత్తమ మార్గం. – ప్రొ.ఆర్జీబీ భగవత్ కుమార్, రిటైర్డ్ వీసీ, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, విశాఖపట్నం గ్రామాభ్యుదయం సుసాధ్యం పంచాతీయలకు ఏకగ్రీవ ఎన్నికలతోనే గ్రామాభ్యుదయం సుసాధ్యమవుతుంది. గ్రామాల్లో ప్రజలు అంతా ఒకే కుటుంబం అనే భావనతో పంచాయతీ ఎన్నికల్లో ఏకతాటిపైకి రావాలి. అనవసరమైన పంతాలు, పోటీలు విడిచిపెట్టి గ్రామ అభివృద్ధి కోసం ఏకాభిప్రాయానికి రావాలి. అందరం బాగుండాలి.. తమ గ్రామాలు అభివృద్ధి చెందాలి.. అనే లక్ష్య సాధనకు ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవడం దోహదపడుతుంది. ఇందుకోసం నియోజకవర్గ స్థాయి నేతలు కూడా చొరవ తీసుకుని, గ్రామాల్లోని నేతలను ఏకతాటిపైకి తీసుకురావాలి. – హెచ్.లజపతిరాయ్, మాజీ వీసీ, బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం. -
‘ఏకగ్రీవాలను అప్పుడు ఎందుకు తప్పు పట్టలేదు?’
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య ప్రక్రియలో ఏకగ్రీవాలు ఎక్కువ అయితే వాటిని వ్యతిరేకిస్తానన్నట్టుగా నిమ్మగడ్డ చెప్పడం రాజకీయం కాదా.. అసలు ఏకగ్రీవాలు ఎన్ని అవుతాయో ముందుగానే నిమ్మగడ్డ ఎందుకు ఊహించి కంగారుపడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలి. ప్రజల మధ్య సఖ్యత, సోదరభావం ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంలో రాజకీయం ఎక్కడ ఉందో రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పాలి. ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు నజరానా ప్రకటించడం అన్నది దశాబ్దాలుగా ఉంది. ఆ ప్రక్రియను తప్పు బట్టదలచుకుంటే టీడీపీ హయాంలో ఎందుకు తప్పుబట్టలేదు. అప్పుడు ఎన్నికలు ఎందుకు జరపలేదు. అప్పటికే ఉన్న జీవో మీద కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. నామినేషన్లు వేయకముందే నిమ్మగడ్డ ఎందుకు ప్రెస్మీట్లో దాని మీద మాట్లాడాల్సి వచ్చింది’’ అని ప్రశ్నించారు. (చదవండి: ఏకగ్రీవాలతో గ్రామ స్వరాజ్యం) ‘‘పంచాయతీ ఎన్నికలనేవి పార్టీలకు అతీతంగా.. వాటి ప్రమేయం లేకుండా.. గుర్తులకు సంబంధం లేకుండా జరుగుతాయని తెలిసి కూడా.. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు పలానా పార్టీకి అనుకూలంగానూ, కొన్ని పార్టీలకు వ్యతిరేకంగానూ జరుగుతాయనే అభిప్రాయాన్ని కలిగించేలా నిమ్మగడ్డ మీడియా సమావేశంలో మాట్లాడ్డం ఎంతవరకు సమంజసం. ఇంతకుముందు రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ఎన్నికల కమిషనర్ అయినా నిమ్మగడ్డ మాదిరిగా ఇలా మాట్లాడారా. ఇంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితి ఏనాడైనా తలెత్తిందా. పంచాయతీల్లో ఏకగ్రీవాలపై అటు చంద్రబాబు, ఇటు నిమ్మగడ్డ ఒకే రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం వెనుక కారణాలు ఏంటి. పరిమితులకు లోబడే ఏకగ్రీవాలు ఉండాలంటూ... నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలకు రాజ్యాంగపరమైన, చట్టపరమైన ప్రాతిపదిక ఏముందో... ఏ చట్టంలో ఇది రాసి ఉందో ఆయన వెల్లడించగలరా’’ అంటూ రామచంద్రారెడ్డి వరుస ప్రశ్నలు కురిపించారు. (చదవండి: ఆ ఇద్దరి బదిలీకి ఎస్ఈసీ ‘నో’) ‘‘ఏ చట్టంలో లేని వ్యవహారాన్ని నిమ్మగడ్డ ఒక ఉద్దేశంతో చెప్తున్నారు కాబట్టి ఆయన్ను ప్రశ్నించాల్సి వస్తోంది. పార్టీలకు సంబంధంలేని ఎన్నికలు అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి, అధికార పార్టీకి దురుద్దేశాలను అంటగట్టేలా మాట్లాడ్డం దేనికి నిదర్శనం. ఏకగ్రీవ ఎన్నికలకు నజారానా ఇస్తూ, దశాబ్దాలుగా ఉన్న నియమ నిబంధనలను జీవోల ఆధారంగా స్పష్టం చేస్తూ ఐఅండ్‌పీఆర్ కమిషనర్ ఇచ్చిన ప్రకటనను తప్పుబట్టడం కూడా నిమ్మగడ్డ రాజకీయాల్లో భాగం కాదా. అధికారులతో ఎలాంటి సమస్యాలేదంటూనే.... తనకన్నా మెరుగైన స్థితిలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా, ఏకంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి అవార్డు పొందిన అధికారికి నిబంధనలు, నియమాలు తెలియవన్నట్టుగా, అసమర్థుడు అన్నట్టుగా కించపరుస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయంలో భాగం కాదా. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్లను తొలగించాలంటూ ముందు సీఎస్‌కు లేఖ రాసి, తర్వాత లేదు అది నా ఉద్దేశం కాదంటూ మరో లేఖ అదే రోజు రాసి, మరుసటి రోజు వారిని అభిసంశిస్తూ మరో లేఖ రాసి, ఈమేరకు డీఓపీటికి కూడా లేఖ రాసి.. ఇవాళ మీడియా కాన్ఫరెన్స్‌లో తాను ఏమీ చేయలేదంటూ కక్షసాధించలేదంటూ నిమ్మగడ్డ చెప్పుకోవడం... ఇది చంద్రబాబు మార్కు రాజకీయ ఎత్తుగడల్లో భాగం కాదా. వ్యవస్థలను సవ్యంగా, నిష్పక్షపాతంగా నడిపించాల్సిన వ్యక్తి ఇన్ని దురాగాతాలకు పాల్పడుతుంతే.. ఇక ఎన్నికల కమిషనర్ మీద ప్రజలకు నమ్మకం, విశ్వాసం సన్నగిల్లిపోవా’’ అని రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏకగ్రీవంతో పల్లెలు ప్రశాంతం
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ దిశగా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలపెట్టిన సంక్షేమ మహాయజ్ఞం నిర్విఘ్నంగా సాగేందుకు గ్రామాల్లో ప్రశాంతత అవసరమన్నారు. ఏకగ్రీవాలను ప్రోత్సహించాల్సిన ఎన్నికల కమిషన్ అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని ఆక్షేపించారు. ఎన్నికల పేరుతో పల్లెల్లో కక్షలు రగిల్చేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని, ప్రలోభాలకు గురిచేస్తే కఠినంగా శిక్షించే చట్టాలను ప్రభుత్వం తెచ్చిందని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మంగళవారం మీడియాతో మాట్లాడారు. గ్రామీణ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. అందుకే ఈ పంచాయతీ ఎన్నికలు చరిత్రాత్మకమైనవి. కొత్త నాయకత్వానికి అవసరమైన అన్ని సదుపాయాలూ సీఎం ఇప్పటికే సమకూర్చారు. మహాత్ముడు కోరుకున్న గ్రామ స్వరాజ్యం రావాలంటే పంచాయతీ ఎన్నికలు అవసరమే. అయితే ఇవి పట్టుదల, కక్షలకు కారణమవుతున్నాయి. గ్రామ ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితి రాకూడదని ప్రభుత్వం కోరుకుంటోంది. అందుకే పార్టీ రహితంగా పంచాయతీ ఎన్నికలను స్వాగతిస్తోంది. ఏకగ్రీవాలకు కృషి చేద్దాం... గ్రామాభివృద్ధిని కాంక్షించే స్వచ్ఛంధ సంస్థలు, మేధావులు, రాజకీయ పార్టీలూ పట్టుదలకు పోకుండా ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి. ఏకగ్రీవ ఎన్నికలు జరిగే పంచాయతీలకిచ్చే ప్రోత్సాహాకాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెంచింది. ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగేలా ప్రోత్సహిస్తాం. అన్ని పార్టీలూ దీనికి సహకరించాలని కోరుతున్నాం. గ్రామాల్లో పెద్ద మనుషులతో కూర్చుని మాట్లాడుకుని ఏకగ్రీవం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రలోభాలకు జైలే... పంచాయతీ ఎన్నికల చట్టంలో అనేక మార్పులు తెచ్చాం. ఎన్నికల సమయాన్ని తగ్గించాం. హింస, ప్రలోభాలకు పాల్పడితే అనర్హత వేటు, మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఎన్నికైన తర్వాత కూడా ఆరేళ్లపాటు పోటీ చేసే అవకాశం ఉండదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సగంలో ఆపేసి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు తెరమీదకు తెచ్చిన ఎన్నికల కమిషన్‌పై మాకు అనుమానాలున్నాయి. ఆయన మాటల్లోనూ దురుద్దేశం ఉందనేది స్పష్టమైంది. గత మార్చిలో ఏకగ్రీవాలు సమ్మతమన్న ఎన్నికల కమిషనర్ ఇప్పుడు ఏకగ్రీవాలు జరిగే పంచాయతీలను ఓ చూపు చూడాలని హెచ్చరించడం వింతగా ఉంది. 60 ఏళ్లుగా ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని అంతా కోరుకున్నారు. ఏకగ్రీవాల కోసం ప్రోత్సాహకాలూ ఇస్తున్నారు. ఇందుకు భిన్నంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాట్లాడటం విచారకరం. ఉద్రిక్తతలకు టీడీపీ కుట్ర ఎస్ఈసీ ఉద్దేశాల వెనుక ప్రతిపక్ష టీడీపీ ఉందనే అనుమానం కలుగుతోంది. పల్లెల్లో కక్షలు రెచ్చగొట్టి, వర్గాలుగా చీల్చే కుట్ర కోణం ఉందనే సందేహాలొస్తున్నాయి. దేవాలయాల్లో మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసిన ఈ పార్టీ ఇప్పుడు కక్షలు, కార్పణ్యాలు రెచ్చగొట్టాలనే దుర్భుద్దితో ఉందని తెలుస్తోంది. డబ్బు, మద్యం ద్వారా నీతిమాలిన వ్యవహారాలు చేస్తే కఠిన శిక్ష తప్పదని గుర్తుంచుకోవాలి. రెచ్చగొట్టే మాటలు విని యువత బలి కావద్దు. ముఖ్యంగా టీడీపీ నేతల తప్పుడు మాటలు ఏమాత్రం వినొద్దు. జీవితాలను పాడు చేసుకోవద్దు. గ్రామాల్లో కక్షలకు కారణం కావద్దు. సంక్షేమ యజ్ఞం సజావుగా సాగాలనే... వైఎస్సార్ సీపీ 50 శాతానికిపైగా ఓట్లతో అధికారంలోకొచ్చింది. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల అమలుతో 90 శాతం ప్రజలు మావైపే ఉన్నారు. టీడీపీ మాతో పోటీ పడే స్థాయిలో లేదనేది స్పష్టం. ముఖ్యమంత్రి జగన్ తలపెట్టిన అభివృద్ధి, సంక్షేమ యజ్ఞం ముందుకు సాగాలంటే గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి. అందుకే ఏకగ్రీవాలను కోరుకుంటున్నాం. పార్టీ బలాబలాలు పరీక్షించుకోవడానికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలున్నాయి కదా? అక్కడ చూసుకుందాం. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు పూర్తై వైఎస్సార్ సీపీ 90 శాతం గెలుచుకునే పరిస్థితి ఉండటంతో టీడీపీ ఎన్నికల కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చి ఎన్నికలను నిలిపివేయించింది. వాటిని నిర్వహించకుండా పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం దురాలోచనే. దీని వెనుక టీడీపీ హస్తం ఉంది. గ్రామాల్లో కక్షలు రేపే దుర్భుద్ది ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అలజడి సృష్టించాలని చూస్తోంది. ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలి. -
ఏకగ్రీవాలకు భారీ నజరానా
సాక్షి, అమరావతి: పార్టీ రహితంగా జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో గ్రూపులు, ఘర్షణలకు తావు లేకుండా ప్రజలంతా అన్నదమ్ముల్లా కలసి మెలసి జీవించేలా ఏకగ్రీవాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవమైతే ఊరు అభివృద్ధికి ప్రభుత్వం నుంచి గరిష్టంగా రూ.20 లక్షలు వరకు ప్రోత్సాహకంగా అందనున్నాయి. పచ్చని పల్లెల్లో ఎన్నికలు కక్షలు, కార్పణ్యాలకు కారణం కాకూడదని, గ్రామీణుల సర్వశక్తులు అభివృద్ధికి దోహద పడాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మధ్య విభేదాలు పొడచూపకుండా ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని సమాచార శాఖకు నిర్దేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల వల్ల ప్రజలు వర్గాలుగా విడిపోయి గ్రామాభివృద్ధిని ఇబ్బందుల్లోకి నెట్టరాదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2020 మార్చి 12వ తేదీన ఈ ప్రోత్సాహకాలను ప్రకటించిన విషయం విదితమే. ఒక గ్రామానికి ఏడాది వ్యవధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే అన్ని రకాల గ్రాంట్లు, ఇంటి పన్ను రూపంలో వసూలయ్యే డబ్బుల కంటే ఏకగ్రీవమయ్యే గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాల ద్వారా అధికంగా నిధులు అందనున్నాయి. నిధుల కొరతతో సమస్యల మధ్య కొట్టుమిట్టాడే గ్రామాలు పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా ప్రోత్సాహకంగా భారీగా నిధులను పొందే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్ర హయాం నుంచే ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను అమలు చేస్తున్నారు. ప్రోత్సాహకాలపై విస్త్రత ప్రచారం.. పంచాయతీ మొదటి దశ ఎన్నికలకు ఈనెల 29వతేదీ నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పల్లెల్లో శాంతియుత వాతావరణం వెల్లివిరిసేందుకు ఏకగ్రీవ గ్రామాలకు అందచేసే ప్రోత్సాహక నిధుల గురించి సమాచార శాఖ ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 2020 మార్చిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించగా అప్పట్లోనే ఏకగ్రీవమయ్యే గ్రామాలకు గరిష్టంగా రూ.20 లక్షలు చొప్పున ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ గతేడాది మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని తాజా ఉత్తర్వులలో సీఎస్ గుర్తు చేశారు. కరోనా కారణంగా అప్పుడు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకుండా ఎన్నికలు వాయిదా పడడంతో ప్రభుత్వం ప్రకటించిన ఏకగ్రీవ ప్రోత్సాహక నిధులపై మరోసారి తెలియచేయడం సముచితమని భావిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలోనూ ఆనవాయితీ... 73, 74వ రాజ్యాంగ సవరణల తర్వాత ఇప్పటివరకు నాలుగు సార్లు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఐదోసారి జరగనున్నాయి. 2001 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, విభజన తర్వాత కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రోత్సాహకాలను అందించడం ఆనవాయితీగా వస్తోంది. గుజరాత్, హర్యానా, తెలంగాణలో కూడా.. గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాలలోనూ ఎన్నికల కారణంగా గ్రామాల్లో వైషమ్యాలు చెలరేగకూడదనే ఉద్దేశంతో ఏకగ్రీవమయ్యే చోట్ల ప్రోత్సాహక నిధులు అందచేస్తున్నారు. గుజరాత్లో పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునే గ్రామాలకు ‘సమ్రాస్’ పథకం పేరుతో రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రత్యేక పోత్సాహక నిధులను అందజేస్తోంది. తెలంగాణలోనూ రెండేళ్ల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికలల్లో ఈ తరహా ప్రోత్సాహకాలను అందచేశారు. ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు ► 2001 ఎన్నికలలో ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ అప్పటి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అదే ఏడాది ఆగస్టు 4వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ► 2006లోనూ ఉమ్మడి రాష్ట్రంలో 2,924 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. ఆయా గ్రామాలకు ప్రోత్సాహక నిధులను విడుదల చేస్తూ 2008 నవంబరు 25వతేదీన అప్పటి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ► 2013లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో 13 జిల్లాల పరిధిలో 1,835 గ్రామాలలో ఎన్నికలు ఏకగ్రీవాలు కాగా వాటికి రూ.128.45 కోట్లను విడుదల చేస్తూ 2015 ఏప్రిల్ 23వ తేదీన అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ► ఇదే తరహాలో ఇప్పుడు జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవమయ్యే గ్రామాలకు ప్రోత్సాహకాలు అందజేసేందుకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్యి 2020 మార్చి 12న ఉత్తర్వులు జారీ చేశారు. -
మాట తప్పడమే బాబు నైజం!
సాక్షి, తిరుపతి: చంద్రబాబు అసలు నైజం బట్టబయలైంది. మాటకు కట్టుబడే అలవాటు తనకు లేదనే విషయం మరోసారి రుజువైంది. ప్రజాప్రతినిధి ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి ఏకగ్రీవంగా అవకాశం కల్పించడమనే సంప్రదాయం రాష్ట్రంలో ఉంది. దీనికి కట్టుబడి అప్పట్లో తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణ మృతితో వచ్చిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఆ సమయంలో ఎంత ఒత్తిడి వచ్చినా సంప్రదాయాన్నే గౌరవించింది. అలాగే తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆ స్థానానికి ఆయన కుటుంబంలోనే ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని అంతా అనుకున్నారు. నాటి విలువలకు నేడు టీడీపీ, బీజేపీ తిలోదకాలిచ్చాయి. (పోలవరంపై తప్పుడు ప్రచారం) ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తిరుపతి ఉపపోరులో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే సోమవారం చంద్రబాబు సైతం టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీని ప్రకటించారు. అయితే పనబాక కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం సాగింది. ఆమె కూడా టీడీపీ నుంచి జారిపోకుండా చూసుకునేందుకు అభ్యర్థిగా ఖరారు చేశారని సమాచారం. బీజేపీ అభ్యర్థి ఎంపిక సైతం కొలిక్కివచ్చినట్లు తెలిసింది. ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారిని బరిలో దింపనున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఈక్రమంలో టీడీపీ, బీజేపీ దొందూ.. దొందే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమే అనుకుంటున్నారు. చదవండి: ‘అచ్చోసిన’ ఆరు అబద్ధాలు -
హాకీ ఇండియా అధ్యక్షుడిగా జ్ఞానేంద్రో
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్చ్ఐ) కొత్త అధ్యక్షుడిగా మణిపూర్‌కు చెందిన జ్ఞానేంద్రో నింగోంబం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన వీడియో సమావేశంలో ఆయనను ఎన్నుకుంటూ హెచ్ఐ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఈశాన్య రాష్ట్రాల నుంచి హెచ్ఐ అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా నింగోంబం నిలిచారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉండనున్నారు. ఆయన 2009–14 మధ్య మణిపూర్ హాకీ సీఈవోగా పనిచేయడం విశేషం. 2018లో అధ్యక్ష పదవిని చేపట్టిన మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్ ఎన్నిక చెల్లదంటూ గతంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ క్రీడా నియమావళి ప్రకారం ఏ వ్యక్తి కూడా వరుసగా మూడు పర్యాయాలు ఆఫీస్ బేరర్‌గా ఉండరాదు. ముస్తాక్ అహ్మద్ 2010–14 మధ్య హెచ్ఐ కోశాధికారిగా, 2014–18 మధ్య సెక్రటరీ జనరల్‌గా పనిచేశారు. 2018లో జాతీయ క్రీడా నియమావళి నిబంధనలను ఉల్లంఘిస్తూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాంతో ఆగ్రహించిన క్రీడా మంత్రిత్వ శాఖ... అహ్మద్‌ను వెంటనే పదవి నుంచి దిగిపోవాలని, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో అహ్మద్‌ను సీనియర్ ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకోవడం విశేషం. -
ఉపాధ్యక్షురాలిగా అంజూ జార్జ్
గురుగ్రామ్: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)లో ఆదిల్ సుమరివాలా తన పట్టు నిలుపుకున్నారు. మళ్లీ తనే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత దిగ్గజ అథ్లెట్ అంజూ బాబీజార్జ్ సీనియర్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైంది. అధ్యక్షుడి తర్వాత అత్యంత కీలకమైన సీనియర్ ఉపాధ్యక్ష పదవికి ఓ మహిళ ఎన్నికవడం ఏఎఫ్ఐ చరిత్రలో ఇదే మొదటిసారి. గత కార్యవర్గంలో ఆమె ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరించింది. రెండు రోజుల పాటు జరిగిన సర్వసభ్య సమావేశంలో శనివారం ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సుమరివాలా వరుసగా మూడో సారి అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. 2012, 2016లలో కూడా ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌నుంచి ఇద్దరు... కొత్త కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ సంఘంనుంచి ఇద్దరికి చోటు దక్కింది. సంయుక్త కార్యదర్శిగా ఏవీ రాఘవేంద్ర, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎ.హైమ ఎంపికయ్యారు. -
బైడెన్ అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్‌ను అధికారికంగా ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్లో జరుగుతున్న డెమొక్రటిక్ జాతీయ సదస్సులో పార్టీ ప్రతినిధులందరూ ఏకగ్రీవంగా అధ్యక్ష అభ్యర్థిగా 77 ఏళ్ల వయసున్న జో బైడెన్‌ను నామినేట్ చేశారు. కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సాహసం కలిగిన నాయకుడు బైడెన్ అని నేతలందరూ కొనియాడారు. నామినేట్ అయ్యాక జో బైడెన్‌తన జీవితంలో దక్కిన అతి గొప్ప గౌరవం ఇదేనని ట్వీట్ చేశారు. అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్‌ను అధికారికంగా ప్రకటించి అమెరికా ప్రజల గుండె చప్పుడు ఏంటో పార్టీ చెప్పిందని బైడెన్ సతీమణి జిల్ బైడెన్ భావోద్వేగానికి లోనయ్యారు. అధ్యక్ష ఎన్నికల సర్వేల్లో ట్రంప్ కంటే బైడెన్ 7.7 పాయింట్లు అధికంగా సంపాదించి ముందంజలో ఉన్నారు. టీవీ చూడడమే ట్రంప్ చేసే పని :క్లింటన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశానికి అధ్యక్షుడిగా ఉంటూ టీవీ చూస్తూ కాలం గడపడం, సోషల్ మీడియాలో ప్రజల్ని గందరగోళానికి గురి చేయడమే ఆయన చేస్తున్న పని అని ఆరోపించారు. అధ్యక్ష కార్యాలయాన్ని కమాండ్ సెంటర్ బదులుగా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. అమెరికాకి పూర్వ వైభవం తీసుకువచ్చే సత్తా బైడెన్‌కే ఉందని క్లింటన్ వ్యాఖ్యానించారు. -
వైఎస్సార్సీపీ హవా.. ఏకగ్రీవాల వెల్లువ!
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. నేటితో నామినేషన్ల గడువు ముగియడంతో రాష్ట్రంలోని చాలా చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థవంతమైన పాలన నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారు. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో వైఎస్సార్సీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. నియోజకవర్గం పరిధిలో ఉన్న 95 ఎంపీటీసీలకుగాను 86 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. (చదవండి: వలసలతో టీడీపీ కుదేలు..) చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో సైతం 4 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాంతోపాటు చిత్తూరు జిల్లాలోని 65 జడ్పీటీసీలకుగాను 15 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా మొత్తంలో 858 ఎంపీటీసీలకుగాను 225 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక వైఎస్సార్ కడప జిల్లా చైర్మన్ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 50 జడ్పీటీసీలకుగాను 35 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటి నుంచి పార్టీకి సేవ చేస్తున్న ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికవడం లాంఛనమే! (చదవండి: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల) వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఏకగ్రీవాలు.. నెల్లూరు: 46 జడ్పీటీసీలకుగాను 12చోట్ల ఏకగ్రీవం. గుంటూరు: జిల్లాలో ఉన్న 54 జడ్పీటీసీలకుగాను 8చోట్ల ఏకగ్రీవం, మాచర్ల నియోజకవర్గంలో 70 చోట్ల ఏకగ్రీవం. వైఎస్సార్ కడప: 50 జడ్పీటీసీలకుగాను 35 చోట్ల ఏకగ్రీవం. జడ్పీ చైర్మన్‌ను కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ. కృష్ణా: మండవల్లి జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయనిర్మల ఏకగ్రీవం, గన్నవరం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి దుట్టా సీతారామలక్ష్మి ఏకగ్రీవం. పశ్చిమగోదావరి: ఏలూరు రూరల్ జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి సరస్వతి ఏకగ్రీవం, జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి బాబ్జి ఏకగ్రీవం. కర్నూలు: 53 జడ్పీటీసీలకుగాను 14చోట్ల ఏకగ్రీవం, 805 ఎంపీటీసీలకుగాను 150చోట్ల ఏకగ్రీవం. ప్రకాశం: 55 జడ్పీటీసీలకుగాను 11చోట్ల ఏకగ్రీవం. శ్రీకాకుళం: 667 ఎంపీటీసీలకుగాను 48చోట్ల ఏకగ్రీవం. టీడీపీ రాష్ట్రఅధ్యక్షుడు కళా వెంకట్రావ్ సొంత మండలంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం, 12 ఎంపీటీసీలకుగాను 12 చోట్లా ఏకగ్రీవం. విజయనగరం: 34 జడ్పీటీసీలకుగాను 3చోట్ల ఏకగ్రీవం, 549 ఎంపీటీసీలకుగాను 25 చోట్ల ఏకగ్రీవం. విశాఖపట్నం: 39 జడ్పీటీసీలకుగాను ఒకచోట ఏకగ్రీవం. 651 ఎంపీటీసీలకుగాను 20 చోట్ల ఏకగ్రీవం. తూర్పుగోదావరి: 1086 ఎంపీటీసీలకుగాను 30చోట్ల ఏకగ్రీవం. అనంతపురం: 841 ఎంపీటీసీలకుగాను 41చోట్ల ఏకగ్రీవం. -
కమలనాథులకు కొత్త దళపతి
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేపీ నడ్డా బీజేపీ 11వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని సోమవారం పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జ్ రాధామోహన్ సింగ్ ప్రకటించారు. నూతన అధ్యక్షుడు జేపీ నడ్డాకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి, పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్న అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇతర సీనియర్ నేతలు అభినందనలు తెలిపారు. ఐదున్నర ఏళ్ల పాటు పార్టీని విజయవంతంగా నడిపి, పలు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో నిలిపిన అమిత్ షా స్థానంలో నడ్డా పార్టీ పగ్గాలు చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన నడ్డాకు హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండే నేతగా పేరుంది. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ సైద్ధాంతిక దిక్సూచి ఆరెస్సెస్, ప్రధాని మోదీ, అమిత్ షా సమర్ధించారు. ఈ సంస్థాగత ఎన్నికలో నడ్డా తరఫున మాత్రమే నామినేషన్లు దాఖలు కావడంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయంగానే ముగిసింది. నడ్డా తరఫున కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పలువురు రాష్ట్ర శాఖల ప్రతినిధులు నామినేషన్లు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని అందించడం కొత్త అధ్యక్షుడిగా నడ్డా ముందున్న తక్షణ సవాలు. ఇప్పటివరకు విజయం సాధించని రాష్ట్రాల్లో బీజేపీకి అధికారాన్ని సాధించిపెట్టడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని నడ్డా పేర్కొన్నారు. ఎన్నిక అనంతరం నడ్డా అభినందన కార్యక్రమం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి షా, పార్టీ అగ్ర నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. మోదీ కొత్త ప్రభుత్వంలో హోంమంత్రిగా అమిత్ షా చేరడంతో.. గత జూన్‌లోనే బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నడ్డా ఎన్నికయ్యారు. అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉండటం వల్ల.. ఒక వ్యక్తికి ఒకే పదవి అని బీజేపీలో ఉన్న సంప్రదాయం నేపథ్యంలో నడ్డా నాడు కార్యనిర్వాహక అధ్యక్షుడు అయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా నడ్డా ఎన్నికవడంపై అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్షుడి హయాంలో, మోదీ మార్గనిర్దేశంలో బీజేపీ కొత్త శిఖరాలకు చేరుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘నడ్డా నేతృత్వంలో పార్టీ మరింత వైభవాన్ని, మరిన్ని విజయాలను సాధించాలి’ అని రాజ్‌నాథ్ సింగ్ ఆకాంక్షించారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పార్టీ అధ్యక్షుడి స్థాయికి నడ్డా ఎదగడం బీజేపీ కార్యకర్తల పార్టీ అనే విషయాన్ని స్పష్టం చేస్తోందని మరోమంత్రి గడ్కరీ పేర్కొన్నారు. ఇది బీజేపీలోనే సాధ్యం ఒక సాధారణ కార్యకర్త పార్టీ అధ్యక్షుడు కావడం కేవలం బీజేపీలోనే సాధ్యమని కొత్త అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ‘దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ బీజేపీనే. అయితే, మనం ఇక్కడే ఆగిపోం. కొన్ని రాష్ట్రాలు మిగిలాయి. మన దృష్టి ఇకపై వాటిపైననే. త్వరలో వాటినీ సాధిస్తాం’ అన్నారు. కలిసి స్కూటర్‌పై తిరిగాం నడ్డా అభినందన కార్యక్రమంలో ప్రధాని మోదీ.. గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. నడ్డా, తాను పాత స్నేహితులమని, పార్టీ కార్యక్రమాల్లో భాగంగా తాము కలిసి స్కూటర్‌పై తిరిగేవారమని చెప్పారు. నడ్డా హయాంలో పార్టీకి కొత్త శక్తి, ఆశ, ఆకాంక్షలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యక్షుడికి అందరం పూర్తి సహకారం అందించాలన్నారు. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగుతున్న అమిత్ షా నిరుపమాన కార్యకర్త అని ప్రశంసించారు. మరోవైపు, ఇదే వేదికపై నుంచి మోదీ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన వారు కొత్త ఆయుధాలను పట్టుకు తిరుగుతున్నారని ఆరోపించారు. అబద్ధాలను, గందరగోళాన్ని వ్యాప్తి చేయడమే వారు పనిగా పెట్టుకున్నారన్నారు. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలను ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోవాలని, అదే బీజేపీ బలమని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
ఆంధ్ర క్రికెట్ సంఘం కొత్త అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి
సాక్షి, విజయవాడ: ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు, లోధా కమిటీ సూచనలకు అనుగుణంగా ఏసీఏ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కాగా... ప్రత్యర్థులు లేకపోవడంతో ఆరు పదవులకు కూడా ఏకగ్రీవ ఎంపిక జరిగింది. ఈ వివరాలను సోమవారం ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ప్రకటించారు. కొత్త అధ్యక్షుడిగా పి.శరత్ చంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా వీవీఎస్‌ఎస్‌కేకే యాచేంద్ర, కార్యదర్శిగా వి.దుర్గాప్రసాద్‌లకు అవకాశం దక్కింది. సంయుక్త కార్యదర్శిగా కేఎస్ రామచంద్ర రావు, కోశాధికారిగా ఎస్.గోపీనాథ్ రెడ్డి బాధ్యతలు చేపడతారు. కౌన్సిలర్‌గా ఆర్.ధనంజయ రెడ్డి వ్యవహరిస్తారు. ఈ ఆరుగురితో పాటు బీసీసీఐ నామినేట్ చేసే ఇద్దరు మాజీ ఆంధ్ర ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు (ఒక పురుషుడు, ఒక మహిళ), ఏపీ ఆడిటర్ జనరల్ కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారి కూడా అపెక్స్ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు. కొత్త సభ్యుల పదవీ కాలం మూడేళ్ల పాటు ఉంటుంది. -
‘పరిషత్’ ఏకగ్రీవాల్లో టీఆర్ఎస్ జోరు
సాక్షి, హైదరాబాద్: తొలిదశ పరిషత్ ఎన్నికల ఏకగ్రీవాల్లో టీఆర్ఎస్ జోరు ప్రదర్శించింది. వివిధ జిల్లాల పరిధిలో ఏకగ్రీవమైన 69 ఎంపీటీసీల్లో టీఆర్ఎస్ 67, కాంగ్రెస్ 2 కైవసం చేసుకున్నాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరు జెడ్పీటీసీ, నిజామాబాద్ జిల్లా మాక్లూరు జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమవగా వాటిని కూడా టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో 96 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వాటిలో 10 స్థానాలు టీఆర్ఎస్ పక్షాన ఏకగ్రీవమయ్యాయి. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఆరేసి ఎంపీటీసీ సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో చెరో ఎంపీటీసీ సీటును కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. ఈ నెల 6న (సోమవారం) మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉండగా గత నెల 28న నామినేషన్ల ఉపసంహరణలు పూర్తయ్యాక ఎక్కడెక్కడ ఒక్కో అభ్యర్థే మిగిలారన్న దానిపై స్పష్టత వచ్చింది. సాధారణంగా నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక ఏదైనా స్థానంలో చెల్లుబాటయ్యే నామినేషన్ ఒక్కటే మిగిలితే సదరు అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. సీట్ల వేలం మొదలుకొని నామినేషన్లు వేయకుండా అభ్యర్థులకు బెదిరింపులు, నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిళ్లు పనిచేస్తున్నాయని గతంలో వచ్చిన వార్తల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారుల నుంచి క్లియరెన్స్ వచ్చాకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఏకగ్రీవాలను రిటర్నింగ్ అధికారులు ప్రకటించాలని ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఆదేశించింది. ఈ పరిణామాలతో ఏకగ్రీవాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు నివేదికలు పంపించారు. వాటిని పూర్తిస్థాయిలో సమీక్షించాక ఏకగ్రీవాలపై జిల్లా కలెక్టర్లు, అధికారులు నిర్ణయం ప్రకటించారు. -
ఆదర్శం.. నక్కవానికుంట తండా
కోయిల్‌కొండ (నారాయణపేట): మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలంలోని నక్కవాని కుంట తండా కొద్దినెలల క్రితం గ్రామపంచాయతీగా అప్‌గ్రేడ్ అయింది. ఈ మేరకు ఎన్నికలు రావడంతో ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని ఎన్నుకునే పంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం నుంచి రూ.10లక్షలు, ఎమ్మెల్యే నిధుల నుంచి మరో రూ.10లక్షలు అందజేయనున్నారన్న విషయం తండా పంచాయతీ వాసులకు తెలిసింది. ఇంకేం.. పంచాయతీ కార్యవర్గాని ఏకగ్రీవం చేసుకుందామని నిర్ణయించి, సర్పంచ్, వార్డు సభ్యులపేర్లను కూడా ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. 770 మంది జనాభా.. 462 మందిఓటర్లు కోయిల్‌కొండ మండలంలో గ్రామపంచాయతీగా మారిన నక్కవాని కుంట తండాలో 770 జనాభా, 462 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు జీపీని 8 వార్డులుగా విభజించారు. ఈ సందర్భంగా పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకోవడానికి మాజీ సర్పంచ్ రాజునాయక్ అధ్యక్షతన తండా వాసులు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ మేరకు సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు వార్డుసభ్యులను ఏకగ్రీవంగా చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా డి.రాందాస్, ఉపసర్పంచ్‌గా ముడావత్ బాలునాయక్, వార్డు సభ్యులుగా హరిచన్, రుక్కమ్మ, బి.చంద్రమ్మ, శాంతమ్మ, బాలునాయక్, లక్ష్మీబాయి, ధారాసింగ్, హూమ్లానాయక్ పేర్లను 1నుంచి 8వ వార్డులకు నిర్ణయించుకున్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయితీలో పోటీ జరగకుండా తండా ప్రజలందరూ ముందుకొచ్చి ఏకగ్రీవం చేయాలని నిర్ణయించుకున్నట్లు మాజీ సర్పంచ్ రాజునాయక్, స్థానికులు బాల్‌రాంనాయక్, హరినాథ్, మోహన్, ధారాసింగ్‌స్వామి, రాందాస్, బాబునాయక్, సక్రునాయక్, గౌడనాయక్ తెలిపారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తా.. సర్పంచ్‌గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు నిర్ణయించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. నిత్యం తండాలోనే ఉంటూ స్థానికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ప్రభుత్వం నుంచి అందే నిధులతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా. – డి.రాందాస్, సర్పంచ్ అభ్యర్థి తండాలకు వరం.. కొత్త గ్రామపంచాయితీలుగా తండాలు ఏర్పాటు కావడం ఒక వరం. గతంలో మా తండాలను ఎవ్వరు పట్టించుకునే వారే కారు. ఇప్పుడు మా తండాలు పంచాయితీలు మారడంతో నేరుగా నిధుల వస్తాయి. ఈ నిధులతో అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. – బాలునాయక్, ఉపసర్పంచ్ అభ్యర్థి గతంలో నిధులు రాలేదు.. గిరిజన తండా కావడంతో గత ఉమ్మడి గ్రామపంచాయితీలో ఎక్కువ నిధులు వచ్చేవి కావు. ఎక్కువగా గ్రామానికే వెళ్లేవి. కొత్తగా గ్రామపంచాయితీ ఏర్పడడంతో ఈసారి మా తండా ను అభివృద్ధి చేసుకునే అవకాశం మాకే లభించింది. – రాజునాయక్, మాజీ సర్పంచ్ -
అన్నీ హిందూ కుటుంబాలే.. ఏకగ్రీవంగా ముస్లిం సర్పంచ్
బద్వేరా/జమ్మూ,కశ్మీర్ : కుల, మతాల కుమ్ములాటలతో భారతావని ఓ పక్క ‘రాజకీయాల’ల్లో చిక్కుకుని తల్లడిల్లుతోంటే.. కశ్మీర్‌లోని ఓ గ్రామం మాత్రం అందరికీ కనువిప్పు కలిగే పనిచేసింది. గ్రామంలో ఉన్న ఒకేఒక్క ముస్లిం కుటుంబానికి అధికారాన్నిచ్చింది. కులం, మతం కాదు ముఖ్యం.. పనిచేసే తత్వం అని ప్రపంచానికి తెలియజెప్పింది. వివరాలు.. కశ్మీర్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో బేలన్-కరోఠి గ్రామం చౌదరీ మహ్మద్ హుస్సేన్ (54) అనే వ్యక్తిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మొత్తం 450 కుటుంబాలు గల ఈ గ్రామంలో హుస్సేన్ది మాత్రమే ముస్లిం కుటుంబం. మిగతా వారంతా హిందువులే. తమ మధ్య హిందూ ముస్లిం భేదాలు లేవని ప్రపంచానికి తెలిపేందుకు, హుస్సేన్ కుటుంబం ఒంటరిది కాదని దన్నుగా నిలిచేందుకే ఆయన్ని తమ గ్రామ పెద్దగా ఎన్నుకున్నామని అక్కడి ప్రజలు తెలిపారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. తద్వారా ‘భారతదేశం భిన్న మతాల సమ్మేళనం. భిన్నత్వంలో ఏకత్వం భారత్ సొంతం’ అనే మాటలకు నిజమైన అర్థం చెప్పారు. హుస్సేన్‌కు నలుగురు కుమార్తెలు, ఐదుగురు కుమారులున్నారు. గ్రామం మొత్తం హిందువులే నివసిస్తున్నా హుస్సేన్ కుటుంబం మాత్రం ఎప్పుడూ వివక్షకు గురికాలేదు. స్థానికులతో సన్నిహితంగా ఉంటూ, అందరితోనూ తలలో నాలుకలా మెలిగే హుస్సేన్ అంటే గ్రామస్తులకు ఎంతో గౌరవం. అందుకనే ప్రస్తుత ఎన్నికల్లో ఆయనను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుని మతసామరస్యాన్ని చాటారు. ‘ఈ గ్రామంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను’అని హుస్సేన్ ఉద్వేగంగా చెప్పారు. -
డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్!
-
డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్!
సాక్షి, చెన్నై : డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవ ఎంపిక దాదాపు ఖరారైంది. మంగళవారం జరగనున్న పార్టీ సర్వసభ్య సమావేశంలో డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ స్టాలిన్ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. కోశాధికారి పదవికి సీనియర్ నేత దురై మురుగన్ ఎన్నిక కూడా ఏకగ్రీవం కానుంది. ఆదివారం ఉదయాన్నే పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ఆశీస్సులు తీసుకున్న స్టాలిన్ మెరీనా తీరం చేరుకున్నారు. అక్కడ దివంగత అన్నాదురై సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం కరుణానిధి సమాధి వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి ఆశీస్సులు అందుకున్నారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకుని తల్లి దయాళు అమ్మాల్ ఆశీర్వాదం పొందారు. తదుపరి అభిమానుల నినాదాల నడుమ తేనంపేటలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివాళయానికి వెళ్లారు. పార్టీ నిర్వాహక కార్యదర్శి, ఎన్నికల అధికారి ఆర్ఎస్ భారతికి స్టాలిన్ నామినేషన్‌ను సమర్పించారు. స్టాలిన్ నామినేషన్‌ను ఆమోదిస్తూ జిల్లాల కార్యదర్శులు ప్రతిపాదన చేశారు. ఆయా జిల్లాలల నుంచి స్టాలిన్‌కు మద్దతుగా రెండు వందలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీ కోశాధికారి పదవికి దురై మురుగన్ నామినేషన్ వేశారు. ఆయనకు మద్దతుగా సైతం పలు నామినేషన్లు దాఖలయ్యాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు సాగిన నామినేషన్ల ప్రక్రియలో అ«ధ్యక్ష పదవికి స్టాలిన్, కోశాధికారి పదవికి దురై మురుగన్‌లకు మద్దతుగానే అన్ని నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆ ఇద్దరు ఎంపిక ఏకగ్రీవమైంది. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా: అళగిరి! తమిళనాట ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తే పోటీ చేస్తానని కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి అన్నారు. తన బలాన్ని చాటేందుకు సెప్టెంబరు 5న చెన్నైలో శాంతి ర్యాలీని నిర్వహించాలని ఆయన నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీ విజయవంతం లక్ష్యంగా, తన మద్దతుదారుల్ని ఏకంచేస్తూ గత మూడు రోజులుగా మదురైలో అళగిరి బిజీగా ఉన్నారు. -
సురవరం హ్యాట్రిక్
కొల్లాం: సీపీఐ సీనియర్ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి(76) ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవి చేపట్టడం ఇది వరసగా మూడోసారి. కేరళలోని కొల్లాంలో ఆదివారం ముగిసిన పార్టీ 23వ ప్లీనరీ సమావేశాల్లో ప్రధాన కార్యదర్శితో పాటు 126 మంది సభ్యుల జాతీయ మండలి, 11 మందితో కూడిన సెక్రటేరియట్, 11 మంది సభ్యులుగా గల కంట్రోల్ మిషన్‌ను కూడా ఎన్నుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్‌కు జాతీయ మండలిలో చోటు దక్కింది. ఆ తరువాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆరెస్సెస్–బీజేపీని ఎదుర్కోవాలంటే లౌకిక, ప్రజాస్వామ్య, లెఫ్ట్ పార్టీల మధ్య ఐక్యత అవసరమని నొక్కి చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పోరులో కాంగ్రెస్‌తో కలసి పనిచేస్తామని చెప్పారు. కేరళలో మాత్రం తాము భాగస్వామిగా ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రత్యర్థే అని పేర్కొన్నారు. జాతీయ మండలికి ఎన్నిక కాలేకపోయిన సీనియర్ నాయకుడు, కేరళ మాజీ మంత్రి సి.దివాకరన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2012లో తొలిసారి.. తెలంగాణలోని నల్గొండ నియోజక వర్గం నుంచి రెండు సార్లు(1998–99, 2004–09) లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన సుధాకర్ రెడ్డి 2012లో తొలిసారి సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ కార్మిక స్థాయీ సంఘానికి చైర్మన్‌గా వ్యవహరించారు. 1942లో మహబూబ్‌నగర్‌లో జన్మించిన సుధాకర్ రెడ్డి 1967లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తిచేశారు. -
ఏపీ రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం
-
ఏపీ రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న నేపథ్యంలో మిగతా ముగ్గురి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీకి చెందిన సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన ఈ నెల(మార్చి) 15న వెల్లడించే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్ధిగా నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఆయనకు అనుబంధంగా ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ప్రశాంతిరెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇక టీడీపీ అభ్యర్థుల ఎంపికపై రెండు రోజులపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైడ్రామా నడిపించిన విషయం తెలిసిందే. పలువురు ఆశావహులు ఆయనను కలిసినా చివరకు సీఎం రమేశ్, వర్ల రామయ్య, బీద మస్తాన్‌రావుల్లో ఇద్దరికి అవకాశం కల్పించనున్నట్లు తొలుత లీకులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో నేరుగా పోటీ చేసే అవకాశం ఇస్తానని చెప్పి.. బీద మస్తాన్‌రావును తప్పించి సీఎం రమేశ్, వర్లకు లైన్‌క్లియర్ చేసినట్లు ప్రచారం సాగింది. కానీ, అనూహ్యంగా సీఎం రమేష్‌ను ఖరారు చేసి వర్లను తప్పించి రెండో అభ్యర్థిగా న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ పేరును తెరపైకి తెచ్చి వారిద్దరితో నామినేషన్ వేయించారు. -
ధ్రువీకరణ పత్రం అందుకున్న విజయసాయిరెడ్డి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి బుధవారం రాజ్యసభకు ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు. ఆయన వైఎస్ఆర్ సీపీ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ సాయిరెడ్డి శాసనసభ ప్రాంగణంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన శాయశక్తుల కృషి చేస్తామన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు. ప్రత్యేక హోదాపై తమ పోరాటం కొనసాగుతోందని, ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పోరాడుతూనే ఉందన్నారు. హోదా విషయంలో అన్ని పార్టీల మద్దతుతో ముందుకు వెళతామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్నా, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆ పార్టీ విఫలం అయిందని విజయ సాయిరెడ్డి విమర్శించారు. కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి, టీడీపీ నుంచి సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, బీజేపీ నుంచి సురేష్ ప్రభు, తెలంగాణ నుంచి డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఏకగ్రీవంగా ఎన్నిక అయిన విషయం విదితమే. సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డీ శ్రీనివాస్ ఈ నెల 4వ తేదీనే ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. -
రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఉపసంహరణ గడువు నేటితో ముగియడంతో వారి ఎన్నిక లాంఛనమే అయింది. జూన్ 11న జరిగే ఎన్నికల్లో మొత్తం 15 రాష్ట్రాల నుంచి 57 స్థానాలకు పోటీ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి, టీడీపీ నుంచి సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, బీజేపీ నుంచి సురేష్ ప్రభు, తెలంగాణ నుంచి డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డీ శ్రీనివాస్ మరికాసేపట్లో ధ్రువీకరణ పత్రాలు అందుకోనున్నారు. కాగా విజయ సాయిరెడ్డి ఈ నెల 6న ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోనున్నారు. -
రెండు జిల్లాల్లోనే పోటీ.. మిగిలినవి ఏకగ్రీవం
-
రెండు జిల్లాల్లోనే పోటీ.. మిగిలినవి ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పలువురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో మిగలడంతో అక్కడ ఎమ్మెల్సీ పదవులకు ఎన్నిక తప్పడంలేదు. కర్నూలు బరిలో టీడీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డి. వెంకటేశ్వరరెడ్డి బరిలో ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లా బరిలో టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి, వైఎస్ఆర్సీపీ నుంచి అట్ల చినవెంకటరెడ్డి పోటీ పడుతున్నారు. గుంటూరు జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణాజిల్లా నుంచి టీడీపీ అభ్యర్థులు బుద్దా వెంకన్న, రాజేంద్రప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి రెడ్డి సుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమనాయుడు, విశాఖ జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థులు ఎంవీవీఎస్ మూర్తి, పప్పల చలపతిరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అక్కడ టీడీపీ అధిష్ఠానం బుజ్జగించడంతో మరో సీనియర్ నాయకుడు కన్నబాబు రాజు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అలాగే మంత్రి అయ్యన్నపాత్రుడు బుజ్జగింపుతో గవిరెడ్డి రామానాయుడు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. అందుకే అక్కడ ఏకగ్రీవం సాధ్యమైంది. ఇక విజయనగరం జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థి ద్వారపురెడ్డి జగదీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
ఆళ్లగడ్డ ఎన్నిక ఏకగ్రీవం: ఆర్వో ప్రకటన
-
ఆళ్లగడ్డ ఎన్నిక ఏకగ్రీవం: ఆర్వో ప్రకటన
ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శుక్రవారం మధ్యాహ్నం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఖిల ప్రియ ఎన్నిక లాంఛనప్రాయమైంది. గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈనెల 17న వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా భూమా అఖిల ప్రియ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఉప ఎన్నికకు దూరంగా ఉన్నాయి. -
ప్రజల నమ్మకాన్ని నిలబెడతా: అఖిల ప్రియ
ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో భూమా అఖిల ప్రియ ఆనందం వ్యక్తం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన వారికి ఆమె శుక్రవారం కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజక వర్గ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కుటుంబ సభ్యులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని అఖిల ప్రియ తెలిపారు. తల్లి ఆశయ సాధనకు పాటుపడతానని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ చేయనందువల్లే తన ఎన్నిక ఏకగ్రీవమైందని అఖిల ప్రియ అన్నారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నిక బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు ఉపసంహరించుకోవటంతో అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవమైంది. -
ఆళ్లగడ్డలో అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవం
-
ఆళ్లగడ్డలో అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవం
ఆళ్లగడ్డ : అనుకున్నట్లుగానే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఖిల ప్రియ ఎన్నిక లాంఛనప్రాయమైంది. దీనిపై ఎన్నికల అధికారులు మరికొద్ది సేపట్లో అఖిల ప్రియ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం తెలిసిందే. దాంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే సాంకేతిక కారణాలతో ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఆలస్యంగా పచ్చజెండా ఊపింది. దీంతో ఈనెల 17న వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా భూమా అఖిల ప్రియ నామినేషన్ దాఖలు చేశారు. నేటితో నామినేషన్ల గడువు ముగియటంతో బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఉప ఎన్నికకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. -
నేడు నామినేషన్ల ఉప సంహరణ
-
నేడు నామినేషన్ల ఉప సంహరణ
ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు శుక్రవారం సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అఖిల ప్రియతో పాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను నిలబెట్టకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు.. ఆళ్లగడ్డ ఉప ఎన్నికలలో తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. అంతకుముందే తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని అక్కడ పోటీ చేయించడం లేదని ప్రకటించింది. -
ఏకగ్రీవం లాంఛనమే!
సాక్షి, కర్నూలు/ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ చరిత్రలో ఓ సరికొత్త రికార్డు నమోదు కాబోతోంది. ఐదు దశాబ్దాల కాలంలో మొదటి సారిగా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏకగ్రీవం కానుంది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు సంప్రదాయానికి మద్దతుగా పోటీకి దూరం కావడంతో ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేయగా.. ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే స్వతంత్రులు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమని అధికారికంగా ప్రకటించడం ఇక లాంఛనం కానుంది. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్థానానికి 16 సార్లు ఎన్నికలు నిర్వహించగా ప్రధాన పార్టీలన్నీ పోటీ చేశాయి. 1967 నుంచి ఎస్వీ, భూమా కుటుంబీకులకు, గంగుల కుటుంబీకుల మధ్యే రాజకీయం పోటీ సాగుతోంది. ఇప్పటి వరకు 8 సార్లు భూమా కుటుంబీకులు గెలవగా, ఎస్వీ సుబ్బారెడ్డి ఒకసారి విజయం సాధించారు. ఐదు సార్లు గంగుల కుటుంబీకులు పైచేయి సాధించారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపు బావుటా ఎగురవేశారు. కాగా.. 2014 మే నెలలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శోభా నాగిరెడ్డి పోటీ చేశారు. అయితే ఏప్రిల్ 24న ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అప్పటికే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఆమె పేరును ఈవీఎంల నుంచి తొలగించలేదు. ఆమె అభ్యర్థిగానే పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి విజయం సాధించింది. అమె మృతిచెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి 92,108 ఓట్లు సాధించగా.. ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గంగుల ప్రభాకర్‌రెడ్డికి 74,180 ఓట్లు పోలయ్యాయి. దీంతో 17,928 ఓట్లతో శోభా నాగిరెడ్డి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే ఎన్నికల ముందే ఆమె ప్రమాదంలో మృతి చెందడం వల్ల ఆమె గెలుపు చెల్లదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆళ్లగడ్డ ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ చట్టపరంగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలంటూ ఆదేశించింది. ఆ వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆళ్లగడ్డలో ఎన్నికల సందడి మొదలైంది. కాగా శాససభ్యులు ఎవరైనా మరణిస్తే వారి స్థానంలో కుటుంబ సభ్యులు పోటీ చేస్తే ఇతర పార్టీలు పోటీ పెట్టరాదనే సంప్రదాయం ఉంది. ఆళ్లగడ్డ ఉప ఎన్నికల బరిలో నుంచి తెలుగుదేశం, కాంగ్రెస్ అభ్యర్థులు మొదట నిలవాలని యోచించినా.. సంప్రదాయానికి భిన్నంగా వెళ్లరాదన్న ఆయా పార్టీల అధిష్టానం ఆదేశాల మేరకు పోటీ నుంచి తప్పుకున్నారు. ఇదే ప్రకారం సీపీఎం, సీపీఐ, బీజేపీ, ఎంఐఎం తదితర పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి పెట్టలేదు. ప్రధాన పార్టీలు పోటీ పెట్టకపోవడంతో ఉప ఎన్నిక నామమాత్రం కానుంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్ల ఉపసంహరణ రోజు విత్‌డ్రా చేసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అఖిలప్రియ ఎన్నిక ఇక లాంఛనమే!
ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను నిలబెట్టకూడదని నిర్ణయించడంతో ఇక ఆళ్లగడ్డ ఉప ఎన్నిక లాంఛనప్రాయంగా మిగిలింది. కర్నూలు జిల్లా కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు.. ఆళ్లగడ్డ ఉప ఎన్నికలలో తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. అంతకుముందే తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని అక్కడ పోటీచేయించడం లేదని ప్రకటించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏప్రిల్ 24న రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అప్పుడు నిర్వహించిన ఎన్నికల్లో అమె మరణానంతరం గెలిచినట్లు ప్రకటించారు. దాంతో ఆ స్థానానికి నవంబరు 8న ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియాజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శోభా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ్యులు మృతి చెంది.. పోటీలో వారి కుటుంబసభ్యులే నిలబడితే ఇతర పార్టీలు పోటీ చేయకూడదన్న సాంప్రదాయాన్ని అన్ని పార్టీలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన నందిగామ ఉప ఎన్నికలో టీడీపీ కూడా సాంప్రదాయాన్ని కొనసాగించాలంటూ చేసిన విజ్ఞప్తి మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ అభ్యర్థిని పోటీలో నిలబెట్టడం లేదని తక్షణమే ప్రకటించారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే.. అందరూ అక్కడ పోటీ ఉండదని, ఏకగ్రీవం తప్పదని భావించారు. అనుకున్నట్లు గానే.. భూమా అఖిలప్రియ ఏకగ్రీంగా ఎన్నిక కావడం దాదాపు ఖాయమైపోయింది. నామినేషన్లు దాఖలు చేయడానికి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సమయం ఉండటంతో అప్పటికల్లా మొత్తం విషయం తేలిపోతుంది. -
గీర్వాణి అనే నేను...జెడ్పీ చైర్పర్సన్ !
‘‘జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలి నయిన ఎస్ గీర్వాణి అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడ్డ భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగివుండి నేను స్వీకరించబోవు పదవిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నా. సత్యనిష్టతో ధ్రువపరస్తున్నాను...’’అంటూ జిల్లా ప్రజాపరిషత్ నూతన చైర్పర్సన్ గీర్వాణి ప్రమాణ స్వీకారం చేశారు.చిత్తూరు (అర్బన్): జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు శనివారం చిత్తూరు నగరంలోని జెడ్పీ సమావేశ హాలులో నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జెడ్పీ ప్రత్యేకాధికారి కే.రాంగోపాల్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. జెడ్పీటీసీ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షుల చేత పదవీ ప్రమాణ స్వీకా రం చేయించారు. జెడ్పీ ముఖ్యకార్యనిర్వాహణాధికారి ఎం.వేణుగోపాలరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్నిక ఏకగ్రీవం... చిత్తూరు రూరల్ మండల జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచిన ఎస్ గీర్వాణిని తెలుగుదేశం పార్టీ తరఫున జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా కార్వేటినగరం జెడ్పీటీసీ సభ్యురాలు ఏసీ గీత ప్రతిపాదించారు. నగరి జెడ్పీటీసీ సభ్యులు వెంకటరత్నం బలపరిచారు. ఇతరులెవరూ పోటీచేయకపోవడంతో గీర్వాణి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ రాంగోపాల్ ప్రకటించారు. సత్యవేడు జెడ్పీటీసీ సభ్యుడు కే సుందరరామిరెడ్డిని వైస్ ైచైర్మన్‌గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులకు ధ్రువీకరణ పత్రాలు అందచేశారు.జిల్లాలోని మొత్తం 65 జెడ్పీటీసీ స్థానాలకుగానూ టీడీపీ 37 స్థానాలను దక్కించుకోవడంతో జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఆ పార్టీ అభ్యర్థి గీర్వాణి ఎన్నిక లాంఛనంగా జరిగింది. అంతకుముందు 65 మంది జెడ్పీటీసీ సభ్యుల చేత జిల్లా కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఛైర్పర్సన్ ఎన్నికకు మెజారిటీ స్థానాలు లేకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హుందాగా వ్యవహరించి అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది. వైఎస్సార్సీపీకి చెందిన 22 మంది జెడ్పీటీసీ సభ్యులు ఈ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డియాదవ్ వైఎస్సార్సీపీ తరఫున విప్ జారీ చేశారు. పలువురి అభినందనలు జెడ్పీ అధ్యక్షురాలిగా ఎన్నికైన గీర్వాణిని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందనలతో ముంచెత్తారు. జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరుకాని టీడీపీ ప్రజాప్రతినిధులు, చైర్పర్సన్ ఎన్నికకు హాజరై ఆమెను పుష్పగుచ్ఛాలు దుశ్శాలువలతో సన్మానించారు. అంతకుముందు కలెక్టర్ రాంగోపాల్ ఆమెకు అభినందనలు తెలియజేశారు. జిల్లాలను సస్యశ్యామలం చేసి అభివృద్ధి వైపు నడిపిం చడానికి కృషి చేయాలని కోరారు. జిల్లా ప్రజల కష్టాలను కడతేర్చాలని సూచించారు. అలాగే వైస్ చైర్మన్ సుందరరామిరెడ్డిని సైతం కలెక్టర్ అభినందించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సత్యప్రభ, తం బళ్లపల్లె, సత్యవేడు ఎమ్మెల్యేలు శంకర్, ఆదిత్య తదితరులు చైర్‌పర్సన్‌ను అభినందనలతో ముంచెత్తారు. జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎం.వేణుగోపాలరెడ్డి, డెప్యూటీ సీఈవో మాలతీకుమారి, ఏవో వెంకటరత్నం, పర్యవేక్షకులు ప్రభాకరరెడ్డి, రమేష్, కనకరాజులు నాయుడు, శోభతో పాటు కార్యాలయ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందచేసి అభినందనలు తెలియజేశారు.