
రెండు జిల్లాల్లోనే పోటీ.. మిగిలినవి ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పలువురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో మిగలడంతో అక్కడ ఎమ్మెల్సీ పదవులకు ఎన్నిక తప్పడంలేదు. కర్నూలు బరిలో టీడీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డి. వెంకటేశ్వరరెడ్డి బరిలో ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లా బరిలో టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి, వైఎస్ఆర్సీపీ నుంచి అట్ల చినవెంకటరెడ్డి పోటీ పడుతున్నారు.
గుంటూరు జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణాజిల్లా నుంచి టీడీపీ అభ్యర్థులు బుద్దా వెంకన్న, రాజేంద్రప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి రెడ్డి సుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమనాయుడు, విశాఖ జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థులు ఎంవీవీఎస్ మూర్తి, పప్పల చలపతిరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అక్కడ టీడీపీ అధిష్ఠానం బుజ్జగించడంతో మరో సీనియర్ నాయకుడు కన్నబాబు రాజు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అలాగే మంత్రి అయ్యన్నపాత్రుడు బుజ్జగింపుతో గవిరెడ్డి రామానాయుడు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. అందుకే అక్కడ ఏకగ్రీవం సాధ్యమైంది. ఇక విజయనగరం జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థి ద్వారపురెడ్డి జగదీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.