
గీర్వాణి అనే నేను...జెడ్పీ చైర్‌పర్సన్ !
‘‘జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలి నయిన ఎస్ గీర్వాణి అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడ్డ భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగివుండి నేను స్వీకరించబోవు పదవిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నా. సత్యనిష్టతో ధ్రువపరస్తున్నాను...’’అంటూ జిల్లా ప్రజాపరిషత్ నూతన చైర్‌పర్సన్ గీర్వాణి ప్రమాణ స్వీకారం చేశారు.చిత్తూరు (అర్బన్): జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు శనివారం చిత్తూరు నగరంలోని జెడ్పీ సమావేశ హాలులో నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జెడ్పీ ప్రత్యేకాధికారి కే.రాంగోపాల్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. జెడ్పీటీసీ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షుల చేత పదవీ ప్రమాణ స్వీకా రం చేయించారు. జెడ్పీ ముఖ్యకార్యనిర్వాహణాధికారి ఎం.వేణుగోపాలరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎన్నిక ఏకగ్రీవం...
చిత్తూరు రూరల్ మండల జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచిన ఎస్ గీర్వాణిని తెలుగుదేశం పార్టీ తరఫున జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా కార్వేటినగరం జెడ్పీటీసీ సభ్యురాలు ఏసీ గీత ప్రతిపాదించారు. నగరి జెడ్పీటీసీ సభ్యులు వెంకటరత్నం బలపరిచారు. ఇతరులెవరూ పోటీచేయకపోవడంతో గీర్వాణి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ రాంగోపాల్ ప్రకటించారు. సత్యవేడు జెడ్పీటీసీ సభ్యుడు కే సుందరరామిరెడ్డిని వైస్ ైచైర్మన్‌గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులకు ధ్రువీకరణ పత్రాలు అందచేశారు.జిల్లాలోని మొత్తం 65 జెడ్పీటీసీ స్థానాలకుగానూ టీడీపీ 37 స్థానాలను దక్కించుకోవడంతో జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఆ పార్టీ అభ్యర్థి గీర్వాణి ఎన్నిక లాంఛనంగా జరిగింది. అంతకుముందు 65 మంది జెడ్పీటీసీ సభ్యుల చేత జిల్లా కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఛైర్‌పర్సన్ ఎన్నికకు మెజారిటీ స్థానాలు లేకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హుందాగా వ్యవహరించి అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది. వైఎస్సార్‌సీపీకి చెందిన 22 మంది జెడ్పీటీసీ సభ్యులు ఈ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డియాదవ్ వైఎస్సార్‌సీపీ తరఫున విప్ జారీ చేశారు.
పలువురి అభినందనలు
జెడ్పీ అధ్యక్షురాలిగా ఎన్నికైన గీర్వాణిని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందనలతో ముంచెత్తారు. జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరుకాని టీడీపీ ప్రజాప్రతినిధులు, చైర్‌పర్సన్ ఎన్నికకు హాజరై ఆమెను పుష్పగుచ్ఛాలు దుశ్శాలువలతో సన్మానించారు. అంతకుముందు కలెక్టర్ రాంగోపాల్ ఆమెకు అభినందనలు తెలియజేశారు. జిల్లాలను సస్యశ్యామలం చేసి అభివృద్ధి వైపు నడిపిం చడానికి కృషి చేయాలని కోరారు. జిల్లా ప్రజల కష్టాలను కడతేర్చాలని సూచించారు. అలాగే వైస్ చైర్మన్ సుందరరామిరెడ్డిని సైతం కలెక్టర్ అభినందించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సత్యప్రభ, తం బళ్లపల్లె, సత్యవేడు ఎమ్మెల్యేలు శంకర్, ఆదిత్య తదితరులు చైర్‌పర్సన్‌ను అభినందనలతో ముంచెత్తారు. జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎం.వేణుగోపాలరెడ్డి, డెప్యూటీ సీఈవో మాలతీకుమారి, ఏవో వెంకటరత్నం, పర్యవేక్షకులు ప్రభాకరరెడ్డి, రమేష్, కనకరాజులు నాయుడు, శోభతో పాటు కార్యాలయ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందచేసి అభినందనలు తెలియజేశారు.