
గురుగ్రామ్: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ)లో ఆదిల్ సుమరివాలా తన పట్టు నిలుపుకున్నారు. మళ్లీ తనే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత దిగ్గజ అథ్లెట్ అంజూ బాబీజార్జ్ సీనియర్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైంది. అధ్యక్షుడి తర్వాత అత్యంత కీలకమైన సీనియర్ ఉపాధ్యక్ష పదవికి ఓ మహిళ ఎన్నికవడం ఏఎఫ్‌ఐ చరిత్రలో ఇదే మొదటిసారి. గత కార్యవర్గంలో ఆమె ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరించింది. రెండు రోజుల పాటు జరిగిన సర్వసభ్య సమావేశంలో శనివారం ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సుమరివాలా వరుసగా మూడో సారి అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. 2012, 2016లలో కూడా ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌నుంచి ఇద్దరు...
కొత్త కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ సంఘంనుంచి ఇద్దరికి చోటు దక్కింది. సంయుక్త కార్యదర్శిగా ఏవీ రాఘవేంద్ర, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎ.హైమ ఎంపికయ్యారు.