Anju Bobby George
-
అరుదైన వ్యాధి.. అతడి మాటలే స్ఫూర్తి మంత్రం.. కోచ్ భర్తగా మారి.. పెళ్లి తర్వాతే
వరల్డ్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్స్.. విశ్వవ్యాప్తంగా అథ్లెట్లు తమ సత్తా చాటేందుకు అత్యున్నత వేదిక.. ఒలింపిక్స్ మెడల్‌కి సమానమైన ఘనత.. ఈ మెగా ఈవెంట్ మొదలై రెండు దశాబ్దాలు దాటిపోయాయి.. మరి భారత్ సాధించిన విజయాలు అంటే దిక్కులు చూడాల్సిన పరిస్థితి.. ఎందుకంటే విజయం సంగతేమో కానీ, అప్పటికి ప్రపంచ వేదికపై మన అథ్లెట్లు పాల్గొనడమే గొప్పగా భావించే పరిస్థితి.. అలాంటి సమయంలో సాధించిన విజయం.. ఆ పతకాన్ని పొందిన అథ్లెట్ గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ఆమె గెలిచిన కంచు కూడా మనకు కనకమే! అందుకే ఆమె విజయానికి అంత విలువ.. అలాంటి అరుదైన క్షణాన్ని లిఖించిన లాంగ్ జంపర్‌గా, భారత అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా నిలిచిన ప్రత్యేకత అంజూ బాబీ జార్జ్ సొంతం. కఠినమైన శిక్షణతో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్కి రంగం సిద్ధమైంది. అప్పటికే అంజూ ఈ మెగా పోరు కోసం చాలా కఠినమైన శిక్షణ తీసుకుంటోంది. ఆమె భర్త, బాబీ జార్జ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. యూరప్ కేంద్రంగా అప్పటికి అలవాటు లేని ప్రతికూల పరిస్థితుల్లో ఆమె సాధన కొనసాగుతోంది. అరుదైన జన్యుపరమైన వ్యాధి అన్నింటికి మించి వరల్డ్ చాంపియన్ షిప్స్ కోసమే లాంగ్ జంప్ దిగ్గజం మైక్ పావెల్ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాడు. పోరుకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఒకరోజు కాస్త అనారోగ్యంగా కనిపించినా పెద్ద సమస్యేమీ కాదు, కఠోర శ్రమ వల్ల కాస్త అలసట కావచ్చని అంజూ అనుకుంది. అయితే ఆ తర్వాతా శరీరంలో కాస్త తేడా అనిపించడంతో పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. ఒక్కసారిగా షాక్.. అయినా గానీ అనూహ్యంగా పరీక్షల్లో యూనిలేటరల్ రీనల్ ఎజనీసస్ (యూఆర్ఏ) అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి ఉన్నట్లు తేలింది. ఇలా ఉన్నవారు ఒకే కిడ్నీతో పుడతారు. అప్పటికి అంజూ వయసు 26 ఏళ్లు! ఇన్నేళ్లుగా ఎలాంటి సమస్యా రాలేదు. అసలు అలాంటి వ్యాధి ఒకటి ఉందని కూడా ఏనాడూ గుర్తించలేదు. దాంతో ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురైంది. భర్త మాటలే స్ఫూర్తిని నింపాయి అయితే ఆ సమయంలో బాబీ జార్జ్ తన మాటలతో ఆమెలో స్ఫూర్తి నింపాడు. ‘ఇంతకాలం అదేమీ తెలియకుండా అథ్లెట్‌గా ఈ స్థాయికి చేరావు. ఇప్పుడు దాని గురించి బయటకు చెప్పుకొని లాభం లేదు. పైగా ఆటలో సత్తా చాటాల్సిన సమయంలో మనకు సానుభూతి అవసరం లేదు. నువ్వు ఎప్పటిలాగే పోరాడు’ అంటూ పోటీ వైపు దృష్టి మళ్లించాడు. ట్రాక్ లోపల, బయటా అన్నీ తానై నడిపిస్తున్న భర్త మాటలు అంజూను లక్ష్యం దిశగా నడిపించాయి. పతకం దక్కిన ఘనతతో.. 30 ఆగస్టు, 2003.. భారత అథ్లెటిక్స్‌కు సంబంధించి ఎప్పటికీ గుర్తుంచుకోదగిన రోజు. 6.70 మీటర్ల జంప్‌తో అంజూ మూడో స్థానం సాధించి పోడియంపై గర్వంగా నిలవగా, వేదికపై భారత జెండా ఎగిరింది. మన దేశానికి వరల్డ్ చాంపియన్ షిప్లో దక్కిన తొలి పతకం అది. 2022లో అంటే 19 ఏళ్ల తర్వాత జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజతం సాధించే వరకు కూడా అంజూ గెలిచిన పతకమే మన ఏకైక ఘనత అంటే దాని విలువ ఏమిటో తెలుస్తుంది. ఈ విజయంతో ఆమె ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 52 నుంచి ఏకంగా ఆరో స్థానానికి చేరుకుంది. అన్నింటికి మించి ప్రపంచ చాంపియన్ షిప్లో కాంస్యం గెలిచిన తర్వాత కూడా పలు విజయాలు సాధించినా తన ‘కిడ్నీ’ సమస్య గురించి అంజూ ప్రొఫెషనల్ కెరీర్లో ఏనాడూ చెప్పుకోలేదు. అప్పుడు మాత్రమే దాదాపు 17 ఏళ్ల తర్వాత అదీ ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్‌లో యువ క్రీడాకారిణుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నంలో భాగంగా మాట్లాడుతూ మొదటిసారి ఆమె దీని గురించి బయటి ప్రపంచానికి వెల్లడించింది. ఆమెకు పదిహేడేళ్లప్పుడు కాలికి గాయం కాగా, అది ఏ చికిత్సకూ పూర్తిగా తగ్గలేదు. దానివల్ల పరుగు టేకాఫ్ సమయంలో ఆమెకు ఇబ్బంది కలిగేది. అయితే ఆ గాయంతో పాటు కిడ్నీ సమస్యను కూడా అధిగమించి అంజూ అగ్రస్థానానికి చేరడం విశేషం. ఆల్‌రౌండర్ నుంచి లాంగ్‌జంప్ వైపు.. కేరళ అంటే భారత అథ్లెట్లకు పుట్టిల్లు. పీటీ ఉష, షైనీ విల్సన్ సహా ఎందరో అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లు అక్కడి నుంచే వచ్చారు. అంజూ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. కొట్టాయంలోని చెంగనశెర్రి ఆమె స్వస్థలం. తండ్రి కేఆర్ మార్కోస్‌కు ఆటలపై ఉన్న ఆసక్తితో కూతురిని ప్రోత్సహించాడు. స్కూల్లో అన్ని అథ్లెటిక్స్ పోటీల్లోనూ ఆమెదే పైచేయి. 100 మీటర్ల పరుగు, హర్డిల్స్, రిలే, లాంగ్‌జంప్, హైజంప్.. ఇలా ఎందులోనైనా వరుసగా విజయాలు దక్కేవి. ఆపై హెప్టాథ్లాన్ లోని ఏడు ఈవెంట్లలో కూడా పాల్గొంటూ అంజూ వాటిలోనూ పట్టు సాధించింది. అయితే త్రిసూర్‌లో గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు ఆమె కెరీర్ పూర్తి స్థాయిలో మారింది. అలా అన్ని ఈవెంట్లలో కాకుండా ఏదో ఒక్కదాన్ని ఎంచుకుని దాని మీదే పట్టు సాధిస్తే భవిష్యత్తు బాగుంటుందనే సూచనతో చివరకు లాంగ్‌జంప్ వైపు అంజూ మొగ్గింది. 1996లో జరిగిన ఆసియా జూనియర్ చాంపియన్ షిప్లో పతకం దక్కడంతో అంజూ ఎంచుకున్న దారి సరైందేనని తేలింది. అతని ప్రోత్సాహంతో.. నిజానికి పెళ్లి తర్వాతే ట్రిపుల్ జంప్‌లో జాతీయ చాంపియన్ రాబర్ట్ బాబీ జార్జ్. ఆటగాడిగా కెరీర్ ముగించిన తర్వాత కోచ్‌గా మారాడు. అంజూకు శిక్షణ ఇచ్చే కోచ్‌ల బృందంలో అతను కూడా ఒకడు కావడంతో బెంగళూరు స్పోర్ట్స్ అథారిటీ సెంటర్లో తొలిసారి జార్జ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఒక వైపు ఆటలో కోచింగ్‌తో పాటు పరిచయం ప్రేమగా మారింది. ఆపై అతను పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ‘నాతో పెళ్లి వల్ల నీ ఆటకు ఎలాంటి ఆటంకం రాదని మాటిస్తున్నా’ అంటూ స్పష్టం చేశాడు కూడా. జార్జ్ కుటుంబానికి మంచి క్రీడా నేపథ్యం ఉంది. ఆ ఇంట్లో పది మంది సంతానంలో అతను ఒకడు. అందరూ ఏదో ఒక దశలో ఏదో ఒక క్రీడల్లో కాంపిటీటివ్ స్పోర్ట్స్ ఆడినవారే. తల్లిదండ్రులను ఒప్పించగలిగింది అలాంటి కుటుంబం కాబట్టి తాను కూడా తన తల్లిదండ్రులను ఒప్పించగలిగింది. 2000 సంవత్సరంలోనే వారి పెళ్లి జరిగింది. నిజంగానే ఆ తర్వాత ఆమె కెరీర్‌కు ఎలాంటి ఆటంకం రాలేదు. ఆపై జార్జ్ పూర్తి స్థాయి కోచ్‌గా అంజూ బాధ్యతను తీసుకున్నాడు. అంజూ మాటల్లో చెప్పాలంటే భర్తగాకంటే ‘కఠినమైన కోచ్’గా వ్యవహరిస్తూ ఆమెను తీర్చిదిద్దాడు. వరల్డ్ చాంపియన్ షిప్ సహా అంజూ అత్యుత్తమ ఘనతలన్నీ పెళ్లి తర్వాతే వచ్చాయి. అత్యుత్తమ విజయాలు.. పురస్కారాలు వరల్డ్ చాంపియన్ షిప్లో కాంస్యం, వరల్డ్ అథ్లెటిక్స్ మీట్ ఫైనల్లో స్వర్ణంతో పాటు ఆసియా క్రీడల్లో స్వర్ణ, రజతాలు, కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం, ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్‌లో సాధించిన స్వర్ణ, రజతాలు అంజూ జార్జ్ కెరీర్లో కొన్ని కీలక, అత్యుత్తమ విజయాలు. రెండు ఒలింపిక్స్ క్రీడల (2004, 2008) ప్రయత్నాల్లో పతకం దక్కకపోయినా ఆమె ఘనతను అవి తగ్గించలేవు. ఒలింపిక్స్‌లో ఐదో స్థానం ఆమె అత్యుత్తమ ప్రదర్శన. ఏథెన్స్లో ఆమె 6.83 మీటర్ల జంప్ ఇప్పటికీ భారత లాంగ్ జంప్‌లో అత్యుత్తమ రికార్డుగానే నమోదై ఉంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలు కూడా అందుకుంది. ప్రస్తుతం అంజూ, బాబీ జార్జ్ కలసి బెంగళూరులో అథ్లెటిక్స్ అకాడమీని నిర్వహిస్తూ భవిష్యత్తు స్టార్లను తయారు చేస్తున్నారు. చదవండి: ఒక్కోసారి అలా జరుగుతుంది.. బాధపడాల్సిన అవసరం లేదు.. వాళ్లిద్దరి వల్లే ఇలా: మార్కరమ్ -
భారత అథ్లెట్స్‌పై దిగ్గజ లాంగ్ జంపర్ సంచలన ఆరోపణలు
భారత అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఏఎఫ్ఐ) వైస్ ప్రెసిడెంట్.. లెజెండరీ లాంగ్ జంపర్.. 2003 వరల్డ్ అథ్లెట్స్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత అంజు బాబీ జార్జ్ భారత అథ్లెట్స్‌పై సంచలన ఆరోపణలు చేసింది. దేశంలో బ్యాన్ చేసిన చాలా రకాల నిషేధిత డ్రగ్స్‌ను కొందరు అథ్లెట్లు విదేశాల నుంచి తీసుకొచ్చి పంచుతున్నారని ఆరోపించింది. ఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన ఏఎఫ్ఐ రెండు రోజుల వార్షిక సర్వసభ్య సమావేశంలో అంజూ జార్జీ ఈ వ్యాఖ్యలు చేసింది. ''భారతదేశంలో నిషేధించబడిన అనేక డ్రగ్స్ పదార్థాలను విదేశాల నుంచి కొందరు అథ్లెట్లు విరివిగా తీసుకువస్తున్నారు. తాము వాడడమే కాకుండా మిగతా అథ్లెట్లకు నిషేధిత డ్రగ్స్ పంచడం దారుణం. వద్దని చెప్పాల్సిన కోచ్‌లే దగ్గరుండి డ్రగ్స్ అందజేస్తున్నారు. తమ ప్రదర్శనను మెరుగుపరుచుకునేందుకే కొందరు అథ్లెట్లు ఇలాంటి నిషేధిత డ్రగ్స్ వాడుతున్నారు. దేశంలో అథ్లెట్స్ నిషేధిత డ్రగ్స్ వాడకంలో పెరుగుదల ఆందోళనకరమైన విషయం'' అని పేర్కొంది. కాగా ఏఎఫ్ఏ అధ్యక్షుడు ఆదిల్ సుమరివాలా మాట్లాడుతూ.. ''అంజూ బాబీ జార్జీ ఆరోపణను తీవ్రంగా పరిగణిస్తున్నాము. అథ్లెట్ల పరీక్షకు సంబంధించిన డోపింగ్ టెస్ట్‌ను మరింత కఠినతరం చేస్తాము. ఇప్పటికే ఈ విషయాన్ని నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (నాడా)కి ఈ విషయాన్ని తెలియజేశాం. డోపింగ్ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించాలని వారిని కోరాం అని తెలిపారు. -
మాజీ అథ్లెట్ అంజూ బాబీ జార్జీకి అరుదైన గౌరవం
Former Indian Athlete Anju Bobby George Was Women Of The Year.. భారత మాజీ మహిళా అథ్లెట్ అంజూ బాబీ జార్జీకి అరుదైన గౌరవం దక్కింది. అథ్లెట్ విభాగంలో ఆమె చేసిన సేవలకు గాను వరల్డ్ అథ్లెటిక్స్ 2021 ఏడాదికి గానూ ''వుమెన్ ఆఫ్ ది ఇయర్'' అవార్డుతో సత్కరించింది. లాంగ్‌జంప్‌లో ఎన్నో రికార్డులు, ఘనతలు సాధించిన ఆమె రిటైర్మెంట్ తర్వాత 2016లో అమ్మాయిల కోసం ట్రైనింగ్ అకాడమీని నెలకొల్పి శిక్షణ ఇచ్చింది. కాగా ఇప్పటికే అండర్ 20 విభాగంలో అంజూ బాబీ జార్జీ శిక్షణలో రాటుదేలిన పలువురు యువతులు మెడల్స్ కూడా సంపాదించారు. ఎంతోమంది భారతీయ యువతులకు ఆదర్శంగా నిలిచిన అంజూబాబీ జార్జీ.. ''వుమెన్ ఆఫ్ ది ఇయర్'' అవార్డుకు అర్హురాలని ఇండియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక మెన్స్ విభాగంలో ఒలింపియన్స్ అయిన జమైకాకు చెందిన ఎలైన్ థాంప్సన్.. నార్వేకు చెందిన కార్స్టెన్ వార్లోమ్‌లు ''వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్'' అవార్డుకు ఎంపికయ్యారు. 1977లో కేరళలో జన్మించిన అంజూ బాబీ జార్జీ లాంగ్‌జంప్ విభాగంలో ఎన్నో పతకాలు సాధించింది.వాటిని ఒక్కసారి పరిశీలిద్దాం. ►2003 పారిస్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో లాంగ్‌జంప్ విభాగంలో కాంస్య పతకం ►2005 వరల్డ్ అథ్లెటిక్స్ ఫైనల్లో బంగారు పతకం ►2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం ►2002 బుసాన్, 2006 దోహా ఆసియా క్రీడల్లో స్వర్ణం, రజతం ►2005 ఇంచియాన్, 2007 అమ్మన్ ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం, రజతం Congratulations to @anjubobbygeorg1 on being crowned this year's Woman of the Year at the #WorldAthleticsAwards Her efforts in advancing the sport in India as well as inspiring more women to follow in her footsteps make her more than a worthy recipient of this year's award. pic.twitter.com/5TSWxj4vqt — World Athletics (@WorldAthletics) December 1, 2021 And the @WorldAthletics Woman of the Year 2021 goes to Ms Anju Bobby George 🎉 Congrats @anjubobbygeorg1 pic.twitter.com/cVEFfu7EvO — Athletics Federation of India (@afiindia) December 1, 2021 -
ఒక్క కిడ్నీ.. వేయి విజయాలు
అంజూ జార్జ్ ఇవాళ ట్విటర్ ద్వారా క్రీడా ప్రపంచాన్ని, అభిమానుల్ని ఉలిక్కిపడేలా చేశారు. ‘2003లో భారత్‌కు ప్రపంచ పతకం సాధించే సమయానికి నేను ఒక్క కిడ్నీతోనే ఉన్నాను. పెయిన్ కిల్లర్లు పడేవి కావు. ఎన్నో పరిమితులు. అయినా నా కోచ్ (భర్త రాబర్ట్ జార్జ్) ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. ఈ సమయంలో ఇది ఎందుకు బయటకు వెల్లడి చేస్తున్నానంటే కరోనా మహమ్మారి సమయంలో నా తోటి క్రీడాకారులకు స్ఫూర్తినివ్వడానికే’ అన్నారామె. ఆమె ఎదురీత, పోరాట స్ఫూర్తి, ఏ స్త్రీకి అయినా భర్త ఇవ్వాల్సిన సపోర్ట్‌ను తెలుపుతుంది. చంద్రుడి మీద మనిషి కాలు పెట్టడాన్ని ‘మానవాళి వేసిన ముందంజ’ అన్నారెవరో. కాని భారతీయ మహిళ క్రీడల్లో ముందంజ వేయడానికి 2003 వస్తే తప్ప సాధ్యం కాలేదు. ఆ సంవత్సరం పారిస్‌లో జరిగిన ‘వరల్డ్ ఛాంపియన్ షిప్స్ ఇన్ అథ్లెటిక్స్’లో కేరళకు చెందిన అంజూ బాబీ జార్జ్ 6.70 మీటర్ల పొడవుకు లాంగ్ జంప్ దూకి రజత పతకం సాధించింది. అప్పటి వరకూ ఏ భారతీయ అథ్లెట్ కూడా వరల్డ్ అథ్లెటిక్స్‌లో పతకం సాధించలేదు. అందునా స్త్రీ అసలు సాధించలేదు. ఇది అంజూ జార్జ్ సాధించిన ఘనత. Believe it or not, I'm one of the fortunate, among very few who reached the world top with a single KIDNEY, allergic with even a painkiller, with a dead takeoff leg.. Many limitations. still made it. Can we call, magic of a coach or his talent @KirenRijiju @afiindia @Media_SAI pic.twitter.com/2kbXoH61BX — Anju Bobby George (@anjubobbygeorg1) December 7, 2020 ఇప్పటికీ ఈ ఘనత ఆమె పేరునే ఉంది. అయితే ఆ పోటీలో బంగారు పతకానికి, రజత పతకానికి మధ్య 10 అంగుళాల దూరం కూడా లేదు. ఆ పది అంగుళాలను అంజూ అలవోకగా గెంతి ఉండేది... ఆమెకు రెండు కిడ్నీలు ఉండి ఉంటే. ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి ఉంటే. అవును. అంజూకు మాత్రమే తెలిసిన ఈ సత్యాన్ని సోమవారం (డిసెంబర్ 7) ట్విటర్ ద్వారా ఆమె బయటపెట్టింది. ‘ఒక్క కిడ్నీతోనే ఈ విజయాన్ని ఆ తర్వాతి విజయాలని సాధించాను’ అని ఆమె చెప్పింది. ఒక్క కిడ్నీతో పోరాడి ఆమె ఎగుర వేసిన విజయ పతాక ఎంత ఘనమైనదో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎగిరే కెరటం అంజూ పొడవు ఆమె ఆటల్లో రాణించడానికి పనికొస్తుందని అంజూ తండ్రి ఆమె చిన్నప్పుడే గ్రహించాడు. మూడు నాలుగు తరగతుల్లో ఉండగానే కఠినమైన పరిశ్రమలోకి ఆమెని ప్రవేశపెట్టాడు. దంగల్ సినిమాలో ఆమిర్‌ఖాన్ చేసినట్టే ఉదయం నాలుగు గంటలకే అంజూను మైదానానికి తీసుకెళ్లేవాడు. అంత చిన్నవయసులో శిక్షణ, స్కూల్ చదువు చాలా కష్టమయ్యేది’ అని గుర్తు చేసుకుంది. అంజూ చేసిన పరిశ్రమ వృథా కాలేదు. స్కూల్ లెవల్లో ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఆమె ప్రతిభ త్వరలోనే బయటపడింది. 1996 ఢిల్లీలో జరిగిన జూనియర్ ఆసియన్ ఛాంపియన్ షిప్ లో మెడల్ సాధించింది. 1999లో బెంగళూరులో జరిగిన ఫెడరేషన్ కప్‌లో ట్రిపుల్ జంప్‌లో జాతీయ రికార్డ్ సాధించింది. దేశంలో ఆమె ప్రతిభ తెలుస్తూ ఉంది. దేశం ప్రతిభ ఆమె ద్వారా తెలియాల్సి ఉంది. అంతరాయాల పర్వం పెళ్లయ్యాక బాబీ ఒకవైపు ఆమెను అంతర్జాతీయ వేదిక వైపు తీసుకెళ్లాలనుకుంటుంటే మరోవైపు అంజూకు కాలి సమస్య మొదలైంది. అలోపతి స్పెషలిస్టులు ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు. ‘లాభం లేదు. నేనిక అథ్లెటిక్స్ మానుకుంటాను’ అని అంజూ భర్తతో చెప్పింది. భర్త పడనివ్వలేదు. ఇద్దరూ కలిసి కేరళలో ఒక ఆయుర్వేద వైద్యుడిని కనిపెట్టి అతడి ద్వారా ఆ సమస్య నుంచి బయటపడ్డారు. కాని అంతకంటే పెద్ద సమస్య ఆ తర్వాత రానున్నదని వారికి తెలియదు. ‘2001లో బాడీ చెకప్ చేయించుకున్నాను. డాక్టర్లు నన్ను పరీక్ష చేసి నువ్వు పుట్టడమే ఒక కిడ్నీతో పుట్టావు. ఒక్క కిడ్నీ ఉంటే క్రీడలు ప్రమాదం అన్నారు. ఇది పెద్ద దెబ్బ నాకు. కాని నా భర్త బాబీ నన్ను ఉత్సాహపరిచాడు. అంతగా అవసరమైతే తన కిడ్నీ ఇస్తానన్నాడు’ అంది అంజూ. కాని సవాళ్లు ఎదురు పడుతూనే ఉండేవి. ‘2002లో జర్మనీలో జరిగిన పోటీలకు వెళ్లాను. కాని అక్కడకు వెళ్లినప్పటి నుంచి అలసటగా అనిపించేది. మరోవైపు నేను పాల్గొనాలనుకుంటున్న ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు 2003లో పారిస్‌లో జరుగనున్నాయి. అప్పుడు డాక్టర్లు నన్ను పరీక్ష చేసి క్రీడల సంగతి తర్వాత... అసలు మామూలు పనులు కూడా చేయొద్దు. బెడ్ రెస్ట్ తీస్కోమన్నారు. నేను షాక్ అయ్యాను.’ అంది అంజూ. విజేత ఒక్క కిడ్నీ ఉన్నా, మందులకు ఎలర్జీ వస్తున్నా, టేకాఫ్‌కు తాను ఆధారపడే కాలు అంతగా సహకరించని పరిస్థితి ఉన్నా అంజూ 2003లో భారత్ తరఫున ప్రపంచ ఛాంపియన్ గా రజతం సాధించింది. దేశం మొత్తం లేచి నిలబడి హర్షధ్వానాలు చేసిన రోజు అది. కాని అదే దేశం నేడు ఆమె ఆ విజయాన్ని ఒక్క కిడ్నీతో సాధించిందని తెలిసి నివ్వెరపోతోంది. ‘ఈ సమయంలో ఈ వాస్తవాన్ని ఎందుకు బయటపెట్టానంటే నాతోటి క్రీడాకారులు స్ఫూర్తిపొందాలనే. కరోనా మహమ్మారి వల్ల క్రీడాకారులు డీలా పడ్డారు. ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. జాతీయస్థాయి క్రీడలు జరగట్లేదు. అయినా ఈ చేదుకాలం పోయి మంచి కాలం వస్తుంది. మనకు ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని అధిగమించి ముందుకు పోతూ ఉండటమే మనం చేయవలసిన పని అని చెప్పడానికే’ అంది అంజూ. క్రీడల్లోనే కాదు కుటుంబ జీవితంలో కూడా ఆమె అన్నివిధాలుగా విజయవంతమైంది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి వారి ఆలనా పాలనా చూస్తోంది. అంతేకాదు, స్పోర్ట్స్ అకాడెమీ స్థాపించి కొత్తతరాన్ని సిద్ధం చేస్తోంది. ఇవన్నీ అడ్డంకులను ధైర్యంగా దాటడం వల్లే అంజూ చేయగలిగింది. అంజూ 2004 ఒలంపిక్స్ మెడల్‌ను మిస్ అయ్యింది. ఆమె ఆ పోటీలలో 6.83 మీటర్లు జంప్ చేసి ఐదోస్థానంలో నిలిచింది. కాని ఇప్పటికీ అదే భారతదేశ రికార్డ్. ముందే చెప్పినట్టు ఆరోగ్య ప్రతిబంధకాలు లేకపోతే ఒలంపిక్స్ మెడల్ అంజూకు సాధ్యం కాకుండా ఉండేదా? స్ఫూర్తిగాథలు చుట్టూ ఉంటాయి. అవి బయటకు తెలిసినప్పుడు ఆశ్చర్యం కలిగిస్తాయి. ధైర్యాన్ని నూరిపోస్తాయి. అంజూను చూసి ఈ కాలంలో మనమూ పెద్ద ముందంజకు సిద్ధం అవ్వాలి. సామాన్యుల విజయాలూ సామాన్యమైనవి కావు కదా. భర్త రాబర్ట్ జార్జ్, పిల్లలతో అంజూ జార్జ్ కోచ్, స్నేహితుడు, భర్త సరైన జీవన భాగస్వామి దొరికితే స్త్రీకైనా పురుషుడికైనా విజయం సగం సాఫల్యమైనట్టే. 1996లో అంజూ మొదటిసారి బాబీ జార్జ్‌ను ఒక ట్రైనింగ్ క్యాంప్‌లో కలిసింది. అతడు కూడా అథ్లెట్. ట్రిపుల్ జంప్‌లో జాతీయ ఛాంపియన్‌గా ఉన్నాడు. మోడల్‌గా చేసేవాడు. అంజూ, బాబీ కలిసిన వెంటనే ఫ్రెండ్స్ అయిపోయారు. అంజూ తన కంటే ప్రతిభావంతురాలని బాబీ కనిపెట్టాడు. 1998లో ఒక యాక్సిడెంట్ జరిగాక క్రీడల నుంచి విరమించుకుని అంజూకు కోచ్‌గా ఉండాలని నిశ్చయించుకున్నాడు. అది ఒక మలుపైతే 2000లో వారు పెళ్లి చేసుకోవడం మరో మలుపు. ఆ క్షణం నుంచి బాబీ ఆమెకు అన్నివిధాలుగా సపోర్ట్‌గా ఉంటూ మైదానం వెలుపల ఉండే పనులు చేసి పెడుతూ మైదానాన్ని అంజూకు వదిలిపెట్టాడు. ‘అతను నా భర్త మాత్రమే కాదు న్యూట్రిషనిస్ట్, సైకాలజిస్ట్, కోచ్, ఫ్రెండ్ కూడా’ అంటుంది అంజూ. – సాక్షి ఫ్యామిలీ -
ఒక కిడ్నీతోనే పతకాలు సాధించా
కొచ్చి: స్టార్ ఒలింపియన్ అంజూ బాబీ జార్జి భారత అథ్లెటిక్స్కే వన్నె తెచ్చింది. లాంగ్‌జంప్‌లో తన పతకాలతో చరిత్ర సృష్టించింది. ఇంత చేసిన ఆమె పయనం నల్లేరుపై నడకలా సాగలేదని ఇన్నేళ్ల తర్వాత తాజాగా వెల్లడించింది. తాను సుదీర్ఘ కాలం కిడ్నీ సమస్యలతో సతమతమయ్యానని 43 ఏళ్ల అంజూ చెప్పింది. పోటీల్లో తలపడే సమయానికే ఒక కిడ్నీ పూర్తిగా దెబ్బతింది. దీంతో కేవలం ఒకే కిడ్నీతో ఆమె ఒంట్లో ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే బయట ఈవెంట్లలో ప్రత్యర్థులతో పోటీ పడినట్లు పేర్కొంది. ‘మీరు నమ్మినా నమ్మకపోయినా... ఒకే కిడ్నీతో ప్రపంచ క్రీడల్లో పోటీపడిన అతికొద్ది మందిలో నేనుంటాను. అలర్జీ, కాలి నొప్పి చాలా ఆరోగ్య సమస్యలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నా భర్త, కోచ్ బాబీ జార్జి ప్రోద్బలంతోనే వీటన్నింటిని అధిగమించి పతకాలు నెగ్గాను’ అని ప్రస్తుతం టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) చైర్‌పర్సన్‌గా ఉన్న అంజూ ట్వీట్ చేసింది. కేరళకు చెందిన అంజూ 2003 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఐఏఏఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్స్ (2005)లో స్వర్ణం గెలిచింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. అయితే మరియన్ జోన్స్ (అమెరికా) డోపింగ్‌లో పట్టుబడటంతో ఆమెకు ఐదో స్థానం దక్కింది. అంతకుముందు 2002 బుసాన్ ఆసియా క్రీడల్లో ఆమె బంగారు పతకం సాధించింది. అంజూ ట్వీట్‌పై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ ‘నీ కఠోర శ్రమ, నిబద్దతతో భారత్ ప్రతిష్ట పెంచావు’ అని కొనియాడారు. -
ఉపాధ్యక్షురాలిగా అంజూ జార్జ్
గురుగ్రామ్: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)లో ఆదిల్ సుమరివాలా తన పట్టు నిలుపుకున్నారు. మళ్లీ తనే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత దిగ్గజ అథ్లెట్ అంజూ బాబీజార్జ్ సీనియర్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైంది. అధ్యక్షుడి తర్వాత అత్యంత కీలకమైన సీనియర్ ఉపాధ్యక్ష పదవికి ఓ మహిళ ఎన్నికవడం ఏఎఫ్ఐ చరిత్రలో ఇదే మొదటిసారి. గత కార్యవర్గంలో ఆమె ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరించింది. రెండు రోజుల పాటు జరిగిన సర్వసభ్య సమావేశంలో శనివారం ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సుమరివాలా వరుసగా మూడో సారి అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. 2012, 2016లలో కూడా ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌నుంచి ఇద్దరు... కొత్త కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ సంఘంనుంచి ఇద్దరికి చోటు దక్కింది. సంయుక్త కార్యదర్శిగా ఏవీ రాఘవేంద్ర, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎ.హైమ ఎంపికయ్యారు. -
ఆ జంప్... ఆహా!
స్కూల్‌గేమ్స్‌లో అంజూ తొలి గెలుపు హర్డిల్స్‌లో! హర్డిల్స్ అంటే తెలుసుగా... అన్నీ దాటుకుంటూ సాగే పరుగు పందెం. ఈ పందెం అమె కెరీర్‌కు చక్కగా నప్పుతుంది. పాఠశాల స్థాయి పోటీల నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల దాకా ఎదురొచ్చిన అన్ని అడ్డంకుల్ని దాటుకుంటూ చివరకు ప్రపంచ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించింది. ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. అంజూ బాబీ జార్జి ఎన్నో హర్డిల్స్నైతే అధిగమించింది కానీ... చరిత్రలో నిలిచింది మాత్రం హర్డిల్స్ క్రీడాంశంలో కాదు... లాంగ్‌జంప్‌తో! స్కూల్లో హర్డిల్స్‌తో మొదలైన తన ఆటల బాటలో రిలే, లాంగ్‌జంప్, హైజంప్, హెప్టాథ్లాన్లన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాటుకుంటూ వెళ్లి చివరకు లాంగ్‌జంప్ వద్ద ఆగింది. ఈ జంప్‌తోనే ‘ప్రపంచ’ పతకాన్ని గెలిచింది. ఆ వెంటే ‘ఖేల్‌రత్న’ం వరించింది. కన్నోడు... కట్టుకున్నోడు... చిన్నారి అంజూ చురుకైంది. చదువులో తెలివైంది. ఆటల పోటీల్లో గెలుపు గుర్రంలాంటిది. అందుకే ఆమె కన్నతండ్రి తనకు పుట్టింది అమ్మాయేగా చదువొక్కటి అబ్బితే చాల్లే అని అనుకోలేదు. 40 ఏళ్ల క్రితం ఆయన అలా అనుకొని వుంటే 2003లో పారిస్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించేది కాదు. 1980లో ఆమెను చదువుకోవాలన్నాడు. పోటీపడతానంటే ‘సై’ అన్నాడు. దీంతో 1992లో స్కూల్ గేమ్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్ చాంపియనైంది. తదనంతరం క్రీడాకారుడే భర్తగా రావడం ఆమె కెరీర్‌ను ఉన్నతస్థితికి తీసుకెళ్లింది. ఇలా ఆమె జీవితంలో కన్నతండ్రి కె.టి.మార్కోజ్, కట్టుకున్న భర్త బాబీ జార్జిలది అమూల్యమైన ప్రోత్సాహం. వరల్డ్ ఫైనల్స్ చాంపియన్.... రెండేళ్ల తర్వాత (2005) మొనాకోలోని మోంటెకార్లోలో ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్ టోర్నీ జరిగింది. ఇందులో ఆమె 6.75 మీటర్ల దూరం గెంతి రజతం గెలిచింది. కానీ ఆమె రిటైరయ్యాక... తొమ్మిదేళ్లయ్యాక ఆ పతకం రంగు మారింది. ఆ పోటీల్లో స్వర్ణం నెగ్గిన తాతియానా కొటోవా (రష్యా–6.83 మీటర్లు) 2014లో డోపింగ్‌లో దొరికిపోవడంతో నిర్వాహకులు ఆమె స్వర్ణాన్ని రద్దు చేసి అంజూను చాంపియన్‌గా ప్రకటించి పసడి పతకాన్ని ఖాయం చేశారు. ఇలా భారత క్రీడాకీర్తిని ప్రపంచ పటంలో నిలిపిన అంజూ ప్రతిష్టాత్మక ‘రాజీవ్ ఖేల్‌రత్న’... ‘అర్జున’... ‘పద్మశ్రీ’ పురస్కారాలను అందుకుంది. ఆమె ఘనతలివీ.... ప్రపంచ అథ్లెటిక్స్ కంటే ముందే అంజూ మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్ (2002)లో కాంస్యంతో మెరిసింది. బుసాన్ (2002లో), దోహా (2006లో) ఆసియా క్రీడల్లో వరుసగా స్వర్ణం, రజతం గెలుచుకుంది. అలాగే వరుసగా ఇంచియోన్ (2005లో), అమ్మాన్ (2007లో) ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ స్వర్ణ, రజతాలను రిపీట్ చేసింది. ప్రస్తుతం 43 ఏళ్ల అంజూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకానికి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది. ఐదో ప్రయత్నం... ప్రపంచ పతకం అంజూ 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం తుది సన్నాహాల్లో ఉంది. అయితే ఈ క్రమంలో ఆమె తీవ్రమైన అలసటతో అస్వస్థతకు గురైంది. ఓ దశలో పారిస్ ఈవెంట్ నుంచి తప్పుకుందామని భావించింది. కానీ భర్త బాబీ ముందుండి ధైర్యం చెప్పాడు. బరిలో దిగేందుకు తోవ చూపాడు. అలా చివరకు ఓ మేజర్ ఈవెంట్‌కు అయిష్టంగానే వచ్చినా మొక్కుబడిగా తలపడలేదు. దేశం కోసం, పతకం కోసం వందశాతం అంకిత భావం కనబరిచింది. ప్రపంచ మేటి అథ్లెట్లు, డిఫెండింగ్ చాంపియన్లు బరిలో ఉన్న లాంగ్‌జంప్‌లో ఒక్కొక్కరి ప్రయత్నాలు మొదలయ్యాయి. అంజూ ఐదో ప్రయత్నంలో 6.70 మీటర్ల దూరం మేర దూకింది. నిజానికి ఇది ఆమె గొప్ప ప్రయత్నమేమీ కాదు. ఎందుకంటే షూస్ స్పైక్ ఒక కాలితో మరొకటి తచ్చాడటంతో ఇబ్బంది పడింది. క్షణాల్లోనే ఇదంతా జరిగినా కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకొని అంత దూరం గెంతడం అంత ఆషామాషీ కాదు. కాసేపయ్యాక ఆరో ప్రయత్నం చేసినా అదేమంతా సక్సెస్ కాలేదు. చివరకు అందరివీ అన్నీ ప్రయత్నాలు పూర్తయ్యాక చూస్తే అంజూ మూడో స్థానం ఖాయమైంది. పోడియంలో కాంస్యం అందుకొని చరిత్ర పుటలకెక్కింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన ఉత్సాహంలో 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన అంజూ ఐదో స్థానంలో నిలిచింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లోనూ ఆమె బరిలోకి దిగినా ఫైనల్ చేరలేకపోయింది. –సాక్షి క్రీడా విభాగం -
అంజూ జార్జ్ యూటర్న్‌పై బీజేపీ ఫైర్
బెంగళూర్ : అథ్లెట్ అంజూ జార్జ్ తాను బీజేపీలో చేరలేదని ప్రకటించడం పట్ల కాషాయ పార్టీ మండిపడింది. పార్టీ కర్ణాటక చీఫ్ బీఎస్ యడ్యూరప్ప సమక్షంలో బీజేపీ జెండాను అందిపుచ్చుకున్న అంజూ జార్జ్ పార్టీలో చేరిక విషయంపై మాటమార్చడం విస్మయం కలిగిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర మీడియా కన్వీనర్ ఎస్ శాంతారాం అభ్యంతరం వ్యక్తం చేశారు. బహిరంగ వేదికపై పార్టీ అధ్యక్షుడి నుంచి జెండాను అందుకోవడానికి అర్ధం ఏమిటో ఆమెకు తెలియదా అని ప్రశ్నించారు. ఇదే వేదికపై అంజూ జార్జ్ చేరికను యడ్యూరప్ప స్వయంగా ప్రకటించారని చెప్పారు. కాగా తాను బీజేపీలో చేరలేదని అర్జున అవార్డు గ్రహీత, ప్రముఖ అథ్లెట్ అంజూ జార్జ్ వెల్లడించారని వార్తలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో ఈనెల 6న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పార్టీ సభ్యుల సంఖ్యను 20 శాతం మేర పెంచాలనే లక్ష్యంతో బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. -
‘ఖేలో ఇండియా’ సభ్యులుగా గోపీచంద్, అంజూ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పతక విజేత అంజూ బాబీ జార్జిలను ‘ఖేలో ఇండియా’లో సభ్యులుగా నియమించారు. దేశంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. కేంద్ర క్రీడాశాఖ కార్యదర్శి రాజీవ్ యాదవ్ అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. గోపీ, అంజూ రూపంలో ఇద్దరు క్రీడాకారులకు చోటు లభించింది. హైదరాబాద్‌కు చెందిన గోపీచంద్ 2006 నుంచి జాతీయ కోచ్‌గా పని చేస్తున్నారు. ఆయన శిక్షణలోనే సైనా, సింధు, శ్రీకాంత్‌లాంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. మరోవైపు లాంగ్ జంపర్‌గా అసాధారణ విజయాలు సాధించిన అంజూ... ఇటీవల కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. క్రీడా మంత్రి ఈపీ జయరాజన్ అనుచిత ప్రవర్తనకు వ్యతిరేకంగా మొత్తం 13 మంది సభ్యులు తమ రాజీనామాలు సమర్పించారు. -
అంజూబాబీ జార్జ్ రాజీనామా
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఈపీ జయరాజన్ వేధిస్తున్నారని ఆరోపిస్తున్న మహిళా అథ్లెట్ అంజూ బాబీ జార్జ్ కేరళ స్పోర్ట్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి బుధవారం రాజీనామా చేశారు. కేరళ క్రీడా సమాఖ్య సభ్యుల వేధింపులకు తట్టుకోలేకే ఆమె రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అంజూ జార్జ్ తో పాటు మరికొంత మంది కౌన్సిల్ సభ్యులు, వాలీబాల్ క్రీడాకారుడు టామ్ జోసెఫ్ కూడా రాజీనామా చేసినట్టు సమాచారం. గతేడాది ఉమెన్ చాందీ ప్రభుత్వం అంజూ జార్జ్ ను రాష్ట్ర క్రీడా సమాఖ్య అధ్యక్షురాలిగా నియమించింది. క్రీడా బోర్డులో గత కొంత కాలంగా సాగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాల్సిందిగా అంజు జార్జ్ గతంలో క్రీడా మంత్రికి లేఖను కూడా రాశారు. -
అంజూ జార్జిని వేధిస్తున్న కొత్త క్రీడల మంత్రి
తిరువనంతపురం: తనను క్రీడలశాఖ మంత్రి వేధింపులకు గురిచేశాడని ప్రముఖ క్రీడాకారిణి అంజూ బాబీ జార్జ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆమె తన ఫిర్యాదు వివరాలతో కూడిన లేఖను ముఖ్యమంత్రికి అందించింది. తొలిసారి జరిగిన సమావేశంలోనే క్రీడాశాఖ మంత్రి ఈపీ జయరాజన్ తనను, తనతోపాటు ఉన్న ఇతర సభ్యులను ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. ప్రస్తుతం అంజూ కేరళ క్రీడల మండలి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఆమె, తన మండలి సభ్యులు తొలిసారి వెళ్లి క్రీడాశాఖ మంత్రిని కలిశారు. అయితే వారిని ప్రతిపక్షానికి మద్ధతుదారులని తిట్టారని, మున్ముందు తమ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, బెంగళూరు నుంచి కేరళకు అంజూ విమానంలో ప్రయాణించారంట. అయితే, ఈ కారణంతో ఆమె.. తన కౌన్సిల్ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారని, అయితే, తమకు ట్రావెల్ అలవెన్సులు ఆర్థికశాఖ మంజూరు చేసిందని ఆమె చెప్పారు. ఒక శాఖకు సంబంధించి ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఆ శాఖ ఎలా పనిచేస్తుందో విధివిధానాలు ఏమిటో ఓ మంత్రి కనీసం తెలుసుకోకుంటే ఎలా అని ఆమె ప్రశ్నించారు. తమ మండలి తీసుకున్న ట్రాన్స్ఫర్ల నిర్ణయాన్ని కూడా మంత్రి రద్దు చేశారని సీఎంకు చెప్పారు. ఈ విషయంలో తాను ప్రశ్నిస్తే బెదిరించారని అన్నారు. తనకు ప్రభుత్వంలో ఏదో స్థానంలో ఉండాలనో, అధికారం కావాలనో పెద్ద ఆశ కూడా లేదని చెప్పారు. ఆమె ఫిర్యాదుపై స్పందించిన ముఖ్యమంత్రి సానూకూలంగా స్పందించారు. తాను స్వయంగా ఈ విషయం గురించి తెలుసుకుంటానని అన్నారు. -
ఎనిమిదేళ్ల తర్వాత స్వర్ణకాంతి!
న్యూఢిల్లీ: భారత అథ్లెట్ అంజూ బాబీ జార్జ్‌ను అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో రజత పతకం నెగ్గిన ఈ క్రీడాకారిణికి... ప్రత్యర్థి డోపింగ్‌లో పట్టుబడటం వరంగా మారింది. ఫలితంగా అప్పుడు గెలిచిన రజతమే ఇప్పుడు స్వర్ణమైంది. దాంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్యల సంఘం (ఐఏఏఎఫ్) దీనిని అధికారికంగా ధ్రువీకరించింది. రజతం నుంచి స్వర్ణానికి... సెప్టెంబర్ 9, 2005...మొనాకోలో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఫైనల్స్...ప్రపంచలోని టాప్-8 అథ్లెట్లు పోటీ పడ్డారు. మహిళల లాంగ్‌జంప్‌లో 6.75 మీటర్లు దూకిన భారత అథ్లెట్ అంజూ జార్జ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. ఆ ఈవెంట్లో తాత్యానా కొటోవా (రష్యా)కు స్వర్ణం దక్కింది. అయితే తాజాగా నిర్వహించిన డోపింగ్ పరీక్షలో కొటోవా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ అంజూకు ప్రమోషన్ కల్పించారు. ఫలితంగా ప్రపంచ అథ్లెటిక్స్ చరిత్రలో స్వర్ణం నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా అంజు రికార్డులకెక్కింది. డోపింగ్‌కు సంబంధించి పాత శాంపిల్స్‌ను కూడా మళ్లీ పరీక్షించాలని ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ) నిర్ణయం తీసుకుం ది. ఇందులో భాగంగా 2004 ఏథెన్స్ ఒలింపిక్స్నాటి నుంచి ఆటగాళ్ల నమూనాలను పరిశీలిస్తున్నారు. ఇదే క్రమంలో 2005 వరల్డ్ అథ్లెటిక్స్ శాంపిల్స్‌ను కూడా పరిశీలించడంతో కొటోవా ఉదంతం బయట పడింది. అప్పుడే అనుమానించాను... తన రజత పతకం స్వర్ణానికి మారడం పట్ల అంజూ జార్జ్ సంతోషం వ్యక్తం చేసింది. తన ఇన్నేళ్ల ఎదురు చూపులకు ఫలితం దక్కిందని ఆమె చెప్పింది. ‘నాతో పోటీ పడిన రష్యన్ అథ్లెట్లలో కొందరు డోపింగ్ చేసి ఉండవచ్చని అప్పట్లోనే నాకు అనుమానాలుండేవి. ఇప్పుడు అది నిజమైంది. ఇన్నాళ్లు వేచి ఉన్న తర్వాత స్వర్ణం దక్కడం ఆనందంగా ఉంది’ అని అంజు చెప్పింది.