అంజూ జార్జ్ ఇవాళ ట్విటర్ ద్వారా క్రీడా ప్రపంచాన్ని, అభిమానుల్ని ఉలిక్కిపడేలా చేశారు. ‘2003లో భారత్‌కు ప్రపంచ పతకం సాధించే సమయానికి నేను ఒక్క కిడ్నీతోనే ఉన్నాను. పెయిన్ కిల్లర్లు పడేవి కావు. ఎన్నో పరిమితులు. అయినా నా కోచ్ (భర్త రాబర్ట్ జార్జ్) ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. ఈ సమయంలో ఇది ఎందుకు బయటకు వెల్లడి చేస్తున్నానంటే కరోనా మహమ్మారి సమయంలో నా తోటి క్రీడాకారులకు స్ఫూర్తినివ్వడానికే’ అన్నారామె. ఆమె ఎదురీత, పోరాట స్ఫూర్తి, ఏ స్త్రీకి అయినా భర్త ఇవ్వాల్సిన సపోర్ట్‌ను తెలుపుతుంది.
చంద్రుడి మీద మనిషి కాలు పెట్టడాన్ని ‘మానవాళి వేసిన ముందంజ’ అన్నారెవరో. కాని భారతీయ మహిళ క్రీడల్లో ముందంజ వేయడానికి 2003 వస్తే తప్ప సాధ్యం కాలేదు. ఆ సంవత్సరం పారిస్‌లో జరిగిన ‘వరల్డ్ ఛాంపియన్ షిప్స్ ఇన్ అథ్లెటిక్స్’లో కేరళకు చెందిన అంజూ బాబీ జార్జ్ 6.70 మీటర్ల పొడవుకు లాంగ్ జంప్ దూకి రజత పతకం సాధించింది. అప్పటి వరకూ ఏ భారతీయ అథ్లెట్ కూడా వరల్డ్ అథ్లెటిక్స్‌లో పతకం సాధించలేదు. అందునా స్త్రీ అసలు సాధించలేదు. ఇది అంజూ జార్జ్ సాధించిన ఘనత.
Believe it or not, I'm one of the fortunate, among very few who reached the world top with a single KIDNEY, allergic with even a painkiller, with a dead takeoff leg.. Many limitations. still made it. Can we call, magic of a coach or his talent @KirenRijiju @afiindia @Media_SAI pic.twitter.com/2kbXoH61BX
— Anju Bobby George (@anjubobbygeorg1) December 7, 2020
ఇప్పటికీ ఈ ఘనత ఆమె పేరునే ఉంది. అయితే ఆ పోటీలో బంగారు పతకానికి, రజత పతకానికి మధ్య 10 అంగుళాల దూరం కూడా లేదు. ఆ పది అంగుళాలను అంజూ అలవోకగా గెంతి ఉండేది... ఆమెకు రెండు కిడ్నీలు ఉండి ఉంటే. ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి ఉంటే. అవును. అంజూకు మాత్రమే తెలిసిన ఈ సత్యాన్ని సోమవారం (డిసెంబర్ 7) ట్విటర్ ద్వారా ఆమె బయటపెట్టింది. ‘ఒక్క కిడ్నీతోనే ఈ విజయాన్ని ఆ తర్వాతి విజయాలని సాధించాను’ అని ఆమె చెప్పింది. ఒక్క కిడ్నీతో పోరాడి ఆమె ఎగుర వేసిన విజయ పతాక ఎంత ఘనమైనదో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది.
ఎగిరే కెరటం
అంజూ పొడవు ఆమె ఆటల్లో రాణించడానికి పనికొస్తుందని అంజూ తండ్రి ఆమె చిన్నప్పుడే గ్రహించాడు. మూడు నాలుగు తరగతుల్లో ఉండగానే కఠినమైన పరిశ్రమలోకి ఆమెని ప్రవేశపెట్టాడు. దంగల్ సినిమాలో ఆమిర్‌ఖాన్ చేసినట్టే ఉదయం నాలుగు గంటలకే అంజూను మైదానానికి తీసుకెళ్లేవాడు. అంత చిన్నవయసులో శిక్షణ, స్కూల్ చదువు చాలా కష్టమయ్యేది’ అని గుర్తు చేసుకుంది.
అంజూ చేసిన పరిశ్రమ వృథా కాలేదు. స్కూల్ లెవల్‌లో ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఆమె ప్రతిభ త్వరలోనే బయటపడింది. 1996 ఢిల్లీలో జరిగిన జూనియర్ ఆసియన్ ఛాంపియన్ షిప్ లో మెడల్ సాధించింది. 1999లో బెంగళూరులో జరిగిన ఫెడరేషన్ కప్‌లో ట్రిపుల్ జంప్‌లో జాతీయ రికార్డ్ సాధించింది. దేశంలో ఆమె ప్రతిభ తెలుస్తూ ఉంది. దేశం ప్రతిభ ఆమె ద్వారా తెలియాల్సి ఉంది.
అంతరాయాల పర్వం
పెళ్లయ్యాక బాబీ ఒకవైపు ఆమెను అంతర్జాతీయ వేదిక వైపు తీసుకెళ్లాలనుకుంటుంటే మరోవైపు అంజూకు కాలి సమస్య మొదలైంది. అలోపతి స్పెషలిస్టులు ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు. ‘లాభం లేదు. నేనిక అథ్లెటిక్స్ మానుకుంటాను’ అని అంజూ భర్తతో చెప్పింది. భర్త పడనివ్వలేదు. ఇద్దరూ కలిసి కేరళలో ఒక ఆయుర్వేద వైద్యుడిని కనిపెట్టి అతడి ద్వారా ఆ సమస్య నుంచి బయటపడ్డారు. కాని అంతకంటే పెద్ద సమస్య ఆ తర్వాత రానున్నదని వారికి తెలియదు. ‘2001లో బాడీ చెకప్ చేయించుకున్నాను. డాక్టర్లు నన్ను పరీక్ష చేసి నువ్వు పుట్టడమే ఒక కిడ్నీతో పుట్టావు. ఒక్క కిడ్నీ ఉంటే క్రీడలు ప్రమాదం అన్నారు. ఇది పెద్ద దెబ్బ నాకు. కాని నా భర్త బాబీ నన్ను ఉత్సాహపరిచాడు. అంతగా అవసరమైతే తన కిడ్నీ ఇస్తానన్నాడు’ అంది అంజూ. కాని సవాళ్లు ఎదురు పడుతూనే ఉండేవి.
‘2002లో జర్మనీలో జరిగిన పోటీలకు వెళ్లాను. కాని అక్కడకు వెళ్లినప్పటి నుంచి అలసటగా అనిపించేది. మరోవైపు నేను పాల్గొనాలనుకుంటున్న ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు 2003లో పారిస్‌లో జరుగనున్నాయి. అప్పుడు డాక్టర్లు నన్ను పరీక్ష చేసి క్రీడల సంగతి తర్వాత... అసలు మామూలు పనులు కూడా చేయొద్దు. బెడ్ రెస్ట్ తీస్కోమన్నారు. నేను షాక్ అయ్యాను.’ అంది అంజూ.
విజేత
ఒక్క కిడ్నీ ఉన్నా, మందులకు ఎలర్జీ వస్తున్నా, టేకాఫ్‌కు తాను ఆధారపడే కాలు అంతగా సహకరించని పరిస్థితి ఉన్నా అంజూ 2003లో భారత్ తరఫున ప్రపంచ ఛాంపియన్ గా రజతం సాధించింది. దేశం మొత్తం లేచి నిలబడి హర్షధ్వానాలు చేసిన రోజు అది. కాని అదే దేశం నేడు ఆమె ఆ విజయాన్ని ఒక్క కిడ్నీతో సాధించిందని తెలిసి నివ్వెరపోతోంది. ‘ఈ సమయంలో ఈ వాస్తవాన్ని ఎందుకు బయటపెట్టానంటే నాతోటి క్రీడాకారులు స్ఫూర్తిపొందాలనే. కరోనా మహమ్మారి వల్ల క్రీడాకారులు డీలా పడ్డారు. ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. జాతీయస్థాయి క్రీడలు జరగట్లేదు. అయినా ఈ చేదుకాలం పోయి మంచి కాలం వస్తుంది. మనకు ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని అధిగమించి ముందుకు పోతూ ఉండటమే మనం చేయవలసిన పని అని చెప్పడానికే’ అంది అంజూ.
క్రీడల్లోనే కాదు కుటుంబ జీవితంలో కూడా ఆమె అన్నివిధాలుగా విజయవంతమైంది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి వారి ఆలనా పాలనా చూస్తోంది. అంతేకాదు, స్పోర్ట్స్ అకాడెమీ స్థాపించి కొత్తతరాన్ని సిద్ధం చేస్తోంది. ఇవన్నీ అడ్డంకులను ధైర్యంగా దాటడం వల్లే అంజూ చేయగలిగింది. అంజూ 2004 ఒలంపిక్స్ మెడల్‌ను మిస్ అయ్యింది. ఆమె ఆ పోటీలలో 6.83 మీటర్లు జంప్ చేసి ఐదోస్థానంలో నిలిచింది. కాని ఇప్పటికీ అదే భారతదేశ రికార్డ్. ముందే చెప్పినట్టు ఆరోగ్య ప్రతిబంధకాలు లేకపోతే ఒలంపిక్స్ మెడల్ అంజూకు సాధ్యం కాకుండా ఉండేదా? స్ఫూర్తిగాథలు చుట్టూ ఉంటాయి. అవి బయటకు తెలిసినప్పుడు ఆశ్చర్యం కలిగిస్తాయి. ధైర్యాన్ని నూరిపోస్తాయి. అంజూను చూసి ఈ కాలంలో మనమూ పెద్ద ముందంజకు సిద్ధం అవ్వాలి. సామాన్యుల విజయాలూ సామాన్యమైనవి కావు కదా.
భర్త రాబర్ట్ జార్జ్, పిల్లలతో అంజూ జార్జ్
కోచ్, స్నేహితుడు, భర్త
సరైన జీవన భాగస్వామి దొరికితే స్త్రీకైనా పురుషుడికైనా విజయం సగం సాఫల్యమైనట్టే. 1996లో అంజూ మొదటిసారి బాబీ జార్జ్‌ను ఒక ట్రైనింగ్ క్యాంప్‌లో కలిసింది. అతడు కూడా అథ్లెట్. ట్రిపుల్ జంప్‌లో జాతీయ ఛాంపియన్‌గా ఉన్నాడు. మోడల్‌గా చేసేవాడు. అంజూ, బాబీ కలిసిన వెంటనే ఫ్రెండ్స్ అయిపోయారు. అంజూ తన కంటే ప్రతిభావంతురాలని బాబీ కనిపెట్టాడు. 1998లో ఒక యాక్సిడెంట్ జరిగాక క్రీడల నుంచి విరమించుకుని అంజూకు కోచ్‌గా ఉండాలని నిశ్చయించుకున్నాడు. అది ఒక మలుపైతే 2000లో వారు పెళ్లి చేసుకోవడం మరో మలుపు. ఆ క్షణం నుంచి బాబీ ఆమెకు అన్నివిధాలుగా సపోర్ట్‌గా ఉంటూ మైదానం వెలుపల ఉండే పనులు చేసి పెడుతూ మైదానాన్ని అంజూకు వదిలిపెట్టాడు. ‘అతను నా భర్త మాత్రమే కాదు న్యూట్రిషనిస్ట్, సైకాలజిస్ట్, కోచ్, ఫ్రెండ్ కూడా’ అంటుంది అంజూ.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment