కొచ్చి: స్టార్ ఒలింపియన్ అంజూ బాబీ జార్జి భారత అథ్లెటిక్స్‌కే వన్నె తెచ్చింది. లాంగ్‌జంప్‌లో తన పతకాలతో చరిత్ర సృష్టించింది. ఇంత చేసిన ఆమె పయనం నల్లేరుపై నడకలా సాగలేదని ఇన్నేళ్ల తర్వాత తాజాగా వెల్లడించింది. తాను సుదీర్ఘ కాలం కిడ్నీ సమస్యలతో సతమతమయ్యానని 43 ఏళ్ల అంజూ చెప్పింది. పోటీల్లో తలపడే సమయానికే ఒక కిడ్నీ పూర్తిగా దెబ్బతింది. దీంతో కేవలం ఒకే కిడ్నీతో ఆమె ఒంట్లో ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే బయట ఈవెంట్లలో ప్రత్యర్థులతో పోటీ పడినట్లు పేర్కొంది. ‘మీరు నమ్మినా నమ్మకపోయినా... ఒకే కిడ్నీతో ప్రపంచ క్రీడల్లో పోటీపడిన అతికొద్ది మందిలో నేనుంటాను. అలర్జీ, కాలి నొప్పి చాలా ఆరోగ్య సమస్యలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
నా భర్త, కోచ్ బాబీ జార్జి ప్రోద్బలంతోనే వీటన్నింటిని అధిగమించి పతకాలు నెగ్గాను’ అని ప్రస్తుతం టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) చైర్‌పర్సన్‌గా ఉన్న అంజూ ట్వీట్ చేసింది. కేరళకు చెందిన అంజూ 2003 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఐఏఏఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్స్ (2005)లో స్వర్ణం గెలిచింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. అయితే మరియన్ జోన్స్ (అమెరికా) డోపింగ్‌లో పట్టుబడటంతో ఆమెకు ఐదో స్థానం దక్కింది. అంతకుముందు 2002 బుసాన్ ఆసియా క్రీడల్లో ఆమె బంగారు పతకం సాధించింది. అంజూ ట్వీట్‌పై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ ‘నీ కఠోర శ్రమ, నిబద్దతతో భారత్ ప్రతిష్ట పెంచావు’ అని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment