లక్షల్లో ఒక‌రికే వ‌చ్చే అరుదైన స‌మ‌స్య‌ | Pancake Kidney Problem, AINU Doctors Successfully Removes Tumor, More Details Inside | Sakshi
Sakshi News home page

లక్షల్లో ఒక‌రికే వ‌చ్చే అరుదైన స‌మ‌స్య‌

Published Sun, Dec 22 2024 4:57 PM | Last Updated on Sun, Dec 22 2024 6:05 PM

Pancake Kidney Problem: AINU Doctors Successfully Removes Tumor
  • పాన్‌కేక్ కిడ్నీల మ‌ధ్య క్యాన్స‌ర్ క‌ణితిని కీహోల్ స‌ర్జ‌రీతో తీసిన ఏఐఎన్‌యూ వైద్యులు
  • 3-డి మోడ‌లింగ్ ద్వారా క్యాన్స‌ర్ క‌ణితి గుర్తింపు
  • కీహోల్ ప‌ద్ధ‌తిలో తొలిసారిగా ఇలాంటి సంక్లిష్ట క‌ణితి తొల‌గింపు

హైద‌రాబాద్, న‌గ‌రంలోని కొంప‌ల్లి  ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల‌ మ‌హిళ‌కు పుట్టుక‌తోనే రెండు కిడ్నీలు క‌లిసిపోయి ఉండ‌డంతో పాటు.. వాటిలో కుడివైపు కిడ్నీ ఉండాల్సిన ప్ర‌దేశంలో కాకుండా కింది భాగంలో ఏర్పడింది. పైగా మామూలుగా కిడ్నీ అంటే చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది. కానీ ఈ కేసులో మాత్రం అవి పాన్‌కేక్ మాదిరిగా ఉన్నాయి. 45 ఏళ్లుగా ఆ మ‌హిళ ఇలా పాన్‌కేక్ కిడ్నీల‌తోనే జీవిస్తున్నారు. తాజాగా ఆ రెండింటికీ మ‌ధ్య‌లో క్యాన్స‌ర్ క‌ణితి వ‌చ్చింది. పాన్‌కేక్ కిడ్నీలు ఉండ‌డ‌మే అత్యంత అరుదు. 3.75 ల‌క్ష‌ల మందిలో ఒక్క‌రికి మాత్ర‌మే ఇలా జ‌రుగుతుంది. ఇలాంటి ప్ర‌దేశంలో కేన్స‌ర్ క‌ణితి రావ‌డం మ‌రింత అరుదు. 

క‌లిసిపోయిన కిడ్నీల‌ను ఫ్యూజ్డ్ కిడ్నీ అని, వేరే ప్ర‌దేశంలో ఉండ‌డాన్ని ఎక్టోపిక్ కిడ్నీ అని అంటారు. ఇలాంటి సంద‌ర్భాల్లో ఆ రెండింటికీ మ‌ధ్య‌లో క‌ణితి ఏర్ప‌డితే దాన్ని క‌నిపెట్ట‌డ‌మే చాలా క‌ష్టం. కిడ్నీల‌కు ర‌క్త‌స‌ర‌ఫ‌రా చేసే ర‌క్త‌నాళాలు కూడా ఎక్కడున్నాయో గుర్తించాలి. అందుకే.. న‌గ‌రంలోని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) వైద్యులు సీటీ స్కాన్ చేసి, దాన్ని ఒక సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించ‌డం ద్వారా 3-డి ఇమేజ్ సృష్టించారు. దాని సాయంతో అస‌లు కిడ్నీలు ఎక్క‌డెక్క‌డ ఉన్నాయి, వాటికి ర‌క్త‌స‌ర‌ఫ‌రా ఎటు నుంచి జ‌రుగుతోంది, క‌ణితి ఎక్క‌డుంద‌న్న విష‌యాల‌ను గుర్తించారు. ఈ వివరాల‌ను ఆస్ప‌త్రికి చెందిన రోబోటిక్ అండ్ యూరో ఆంకాల‌జీ విభాగం డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎస్ఎం గౌస్ తెలిపారు.

“కొంప‌ల్లికి చెందిన 45 ఏళ్ల మ‌హిళ వ‌చ్చిన‌ప్పుడు ప‌రీక్ష‌లు చేస్తే.. ఆమెకు క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు తెలిసింది. సీటీ స్కాన్ చేసి చూడ‌గా ప‌రిస్థితి మ‌రింత సంక్లిష్టంగా అనిపించింది. దాంతో అప్పుడు 3-డి మోడ‌ల్ సృష్టించి దాన్ని ప‌రిశీలించ‌గా.. రెండు కిడ్నీలు క‌లిసిపోయి ఉండ‌డం, కుడివైపు కిడ్నీ ఉండాల్సిన చోట కాకుండా కింద క‌టిప్రాంతంలో ఉండ‌డం, ఒక కిడ్నీ ఉండాల్సిన ఆకారంలో కాకుండా పాన్‌కేక్‌లా ఉండ‌డం లాంటి స‌మ‌స్య‌లు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండింటి మ‌ధ్య‌లో క‌ణితి ఏర్ప‌డ‌డం లాంటివి గుర్తించాము. సాధార‌ణంగా అయితే ఇలాంటి క‌ణితుల‌ను అవి స‌రిగ్గా ఎక్క‌డ‌, ఎంత ప‌రిమాణంలో ఉన్నాయో గ‌మ‌నించ‌డం చాలా క‌ష్టం. 

అందుకే అత్యంత అరుదుగా చేసే 3-డి మోడ‌లింగ్ ప‌ద్ధ‌తిని మేం ఎంచుకున్నాం. దీనివ‌ల్ల శ‌స్త్రచికిత్స‌కు ముందుగానే చేసుకునే ప్లానింగ్ చాలా సుల‌భం అవుతుంది. ఇలాంటి కేసుల్లో కిడ్నీలో కొంత భాగం గానీ, పూర్తి కిడ్నీని గానీ తొలగించాల్సి ఉంటుంది. అయితే ఈ కేసులో సంక్లిష్ల‌త చూసుకుంటే.. ఇది పాన్‌కేక్ కిడ్నీ కావ‌డం, ర‌క్త‌స‌ర‌ఫ‌రా కూడా ఇబ్బందిక‌రంగా ఉండ‌డంతో ఓపెన్ శ‌స్త్రచికిత్స చేయ‌డం కుద‌రని ప‌ని. దాంతో అత్యాధునిక టెక్నాల‌జీని ఉప‌యోగించి కీహోల్ శ‌స్త్రచికిత్స చేయాల‌ని నిర్ణ‌యించాం.

ఆస్ప‌త్రి మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ సి.మ‌ల్లికార్జున నాయ‌క‌త్వంలో మా బృందం అత్యంత అరుదైన‌, సంక్లిష్ట‌మైన ఈ శ‌స్త్రచికిత్స ప్రారంభించింది. మా ఆస్ప‌త్రిలోని ప్ర‌ముఖ యూరో ఆంకాల‌జిస్టు డాక్ట‌ర్ రాజేష్ కూడా ఈ శ‌స్త్రచికిత్స మొత్తంలో చాలా కీల‌క‌పాత్ర పోషించారు. 3-డి మోడ‌ల్ ఉండ‌డంతో, కేవ‌లం రెండు చిన్న రంధ్రాలు చేసి వాటి ద్వారా మొత్తం క‌ణితిని అత్యంత కచ్చిత‌త్వంతో తొల‌గించాం.  కీహోల్ శ‌స్త్రచికిత్స కావ‌డంతో ర‌క్త‌స్రావం కూడా చాలా త‌క్కువ‌గానే జ‌రిగింది. రోగి పూర్తిగా కోలుకోవ‌డంతో మూడో రోజునే ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేశాం.

ఇలా చేయ‌డం ఇదే తొలిసారి
ఈ కేసు చాలా చ‌రిత్రాత్మ‌కం. ఎందుకంటే.. ఇలాంటి క‌లిసిపోయి ఉన్న, పాన్‌కేక్‌ కిడ్నీల మ‌ధ్య‌లో ఏర్ప‌డిన క‌ణితిని ఇప్పటివ‌ర‌కు కేవ‌లం ఓపెన్ ప‌ద్ధ‌తిలోనే తొల‌గించారు. కీహోల్ శ‌స్త్రచికిత్స చేయ‌డం ఇప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డా లేదు. తొలిసారిగా ఏఐఎన్‌యూలోనే ఈ ఘ‌న‌త సాధించ‌గ‌లిగాం. అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానానికి వైద్యుల నైపుణ్యం కూడా తోడైన‌ప్పుడే ఇలా చేయ‌గ‌లం. 3-డి మోడ‌లింగ్ చేయ‌గ‌ల‌డం ఇందులో అతిపెద్ద విజ‌యం. దానివ‌ల్లే అన్నిర‌కాల స‌వాళ్లను మేం అధిగ‌మించి, శ‌స్త్రచికిత్స‌ను విజ‌య‌వంతంగా చేయ‌గ‌లిగాం” అని డాక్ట‌ర్ ఎస్ఎం గౌస్ వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఆస్ప‌త్రి మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ సి.మ‌ల్లికార్జున మాట్లాడుతూ, “యూరాల‌జీ, ఆంకాల‌జీ విభాగాల్లో అత్యుత్త‌మంగా ఏం చేయ‌గ‌ల‌మో అన్నింటినీ చేయాల‌న్న‌ది ఏఐఎన్‌యూలో మా అంద‌రి ఏకైక ల‌క్ష్యం. అందుకోసం అన్నిర‌కాల స‌రిహ‌ద్దుల‌ను చెరిపేందుకు మేం స‌దా సిద్ధం. ఈ విజ‌యం మా బృందం నిబ‌ద్ధ‌త‌, స‌మ‌ర్థ‌త‌, అత్యంత సంక్లిష్ట కేసుల‌ను కూడా పూర్తి క‌చ్చిత‌త్వంతో చేయ‌గ‌ల సామ‌ర్థ్యాల‌కు మ‌రో నిద‌ర్శ‌నం” అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement