rare treatments
-
లక్షల్లో ఒకరికే వచ్చే అరుదైన సమస్య
హైదరాబాద్, నగరంలోని కొంపల్లి ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల మహిళకు పుట్టుకతోనే రెండు కిడ్నీలు కలిసిపోయి ఉండడంతో పాటు.. వాటిలో కుడివైపు కిడ్నీ ఉండాల్సిన ప్రదేశంలో కాకుండా కింది భాగంలో ఏర్పడింది. పైగా మామూలుగా కిడ్నీ అంటే చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది. కానీ ఈ కేసులో మాత్రం అవి పాన్కేక్ మాదిరిగా ఉన్నాయి. 45 ఏళ్లుగా ఆ మహిళ ఇలా పాన్కేక్ కిడ్నీలతోనే జీవిస్తున్నారు. తాజాగా ఆ రెండింటికీ మధ్యలో క్యాన్సర్ కణితి వచ్చింది. పాన్కేక్ కిడ్నీలు ఉండడమే అత్యంత అరుదు. 3.75 లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే ఇలా జరుగుతుంది. ఇలాంటి ప్రదేశంలో కేన్సర్ కణితి రావడం మరింత అరుదు. కలిసిపోయిన కిడ్నీలను ఫ్యూజ్డ్ కిడ్నీ అని, వేరే ప్రదేశంలో ఉండడాన్ని ఎక్టోపిక్ కిడ్నీ అని అంటారు. ఇలాంటి సందర్భాల్లో ఆ రెండింటికీ మధ్యలో కణితి ఏర్పడితే దాన్ని కనిపెట్టడమే చాలా కష్టం. కిడ్నీలకు రక్తసరఫరా చేసే రక్తనాళాలు కూడా ఎక్కడున్నాయో గుర్తించాలి. అందుకే.. నగరంలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు సీటీ స్కాన్ చేసి, దాన్ని ఒక సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించడం ద్వారా 3-డి ఇమేజ్ సృష్టించారు. దాని సాయంతో అసలు కిడ్నీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి రక్తసరఫరా ఎటు నుంచి జరుగుతోంది, కణితి ఎక్కడుందన్న విషయాలను గుర్తించారు. ఈ వివరాలను ఆస్పత్రికి చెందిన రోబోటిక్ అండ్ యూరో ఆంకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం గౌస్ తెలిపారు.“కొంపల్లికి చెందిన 45 ఏళ్ల మహిళ వచ్చినప్పుడు పరీక్షలు చేస్తే.. ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. సీటీ స్కాన్ చేసి చూడగా పరిస్థితి మరింత సంక్లిష్టంగా అనిపించింది. దాంతో అప్పుడు 3-డి మోడల్ సృష్టించి దాన్ని పరిశీలించగా.. రెండు కిడ్నీలు కలిసిపోయి ఉండడం, కుడివైపు కిడ్నీ ఉండాల్సిన చోట కాకుండా కింద కటిప్రాంతంలో ఉండడం, ఒక కిడ్నీ ఉండాల్సిన ఆకారంలో కాకుండా పాన్‌కేక్‌లా ఉండడం లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో కణితి ఏర్పడడం లాంటివి గుర్తించాము. సాధారణంగా అయితే ఇలాంటి కణితులను అవి సరిగ్గా ఎక్కడ, ఎంత పరిమాణంలో ఉన్నాయో గమనించడం చాలా కష్టం. అందుకే అత్యంత అరుదుగా చేసే 3-డి మోడలింగ్ పద్ధతిని మేం ఎంచుకున్నాం. దీనివల్ల శస్త్రచికిత్సకు ముందుగానే చేసుకునే ప్లానింగ్ చాలా సులభం అవుతుంది. ఇలాంటి కేసుల్లో కిడ్నీలో కొంత భాగం గానీ, పూర్తి కిడ్నీని గానీ తొలగించాల్సి ఉంటుంది. అయితే ఈ కేసులో సంక్లిష్లత చూసుకుంటే.. ఇది పాన్కేక్ కిడ్నీ కావడం, రక్తసరఫరా కూడా ఇబ్బందికరంగా ఉండడంతో ఓపెన్ శస్త్రచికిత్స చేయడం కుదరని పని. దాంతో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కీహోల్ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం.ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సి.మల్లికార్జున నాయకత్వంలో మా బృందం అత్యంత అరుదైన, సంక్లిష్టమైన ఈ శస్త్రచికిత్స ప్రారంభించింది. మా ఆస్పత్రిలోని ప్రముఖ యూరో ఆంకాలజిస్టు డాక్టర్ రాజేష్ కూడా ఈ శస్త్రచికిత్స మొత్తంలో చాలా కీలకపాత్ర పోషించారు. 3-డి మోడల్ ఉండడంతో, కేవలం రెండు చిన్న రంధ్రాలు చేసి వాటి ద్వారా మొత్తం కణితిని అత్యంత కచ్చితత్వంతో తొలగించాం. కీహోల్ శస్త్రచికిత్స కావడంతో రక్తస్రావం కూడా చాలా తక్కువగానే జరిగింది. రోగి పూర్తిగా కోలుకోవడంతో మూడో రోజునే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశాం.ఇలా చేయడం ఇదే తొలిసారిఈ కేసు చాలా చరిత్రాత్మకం. ఎందుకంటే.. ఇలాంటి కలిసిపోయి ఉన్న, పాన్కేక్ కిడ్నీల మధ్యలో ఏర్పడిన కణితిని ఇప్పటివరకు కేవలం ఓపెన్ పద్ధతిలోనే తొలగించారు. కీహోల్ శస్త్రచికిత్స చేయడం ఇప్పటివరకు ఎక్కడా లేదు. తొలిసారిగా ఏఐఎన్‌యూలోనే ఈ ఘనత సాధించగలిగాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి వైద్యుల నైపుణ్యం కూడా తోడైనప్పుడే ఇలా చేయగలం. 3-డి మోడలింగ్ చేయగలడం ఇందులో అతిపెద్ద విజయం. దానివల్లే అన్నిరకాల సవాళ్లను మేం అధిగమించి, శస్త్రచికిత్సను విజయవంతంగా చేయగలిగాం” అని డాక్టర్ ఎస్ఎం గౌస్ వివరించారు.ఈ సందర్భంగా ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సి.మల్లికార్జున మాట్లాడుతూ, “యూరాలజీ, ఆంకాలజీ విభాగాల్లో అత్యుత్తమంగా ఏం చేయగలమో అన్నింటినీ చేయాలన్నది ఏఐఎన్‌యూలో మా అందరి ఏకైక లక్ష్యం. అందుకోసం అన్నిరకాల సరిహద్దులను చెరిపేందుకు మేం సదా సిద్ధం. ఈ విజయం మా బృందం నిబద్ధత, సమర్థత, అత్యంత సంక్లిష్ట కేసులను కూడా పూర్తి కచ్చితత్వంతో చేయగల సామర్థ్యాలకు మరో నిదర్శనం” అని చెప్పారు. -
8 నెలలు..7.5 కేజీల బరువు
సాక్షి, హైదరాబాద్: పుట్టుకతోనే మూగ, వినికిడిలోపంతో బాధపడుతున్న ఎనిమిది నెలలు..7.5 కేజీల బరువు ఉన్న శిశువుకు ఒకే సమయంలో రెండు వైపులా కాక్లియర్ ఇంప్లాంట్స్‌ను విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం ఆ శిశువు వినికిడి లోపాన్ని జయించడమే కాకుండా స్వయంగా మాట్లాడుతోంది. చిన్నవయసులోనే ఒకే సమయంలో రెండు వైపులా చికిత్స చేయడం దేశంలోనే ఇదే తొలిదని ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ సత్యకిరణ్ చికిత్స వివరాలను మీడియాకు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన జశ్వంత్(8 నెలలు) మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఇది చెవి, గొంతు పనితీరుపై ప్రభావం చూపింది. మాట్లాడలేక పోవడమే కాకుండా వినికిడిలోపం తలెత్తింది. దీంతో శిశువు తల్లి దండ్రులు ఇటీవల బంజారాహిల్స్‌లోని రెయిన్బో ఆస్పత్రిలోని సత్యకిరణ్, మనుసృత్లను సంప్రదించగా, వారు శిశువుకు పలు పరీక్షలు నిర్వహించి, కాక్లియర్ ఇంప్లాంట్ ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. ఇందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో మార్చి 21న ఒకే సమయంలో రెండు వైపులా కాక్లియర్ ఇంప్లాంట్స్‌ను విజయవంతంగా అమర్చారు. ఈ నెల 17న స్పీచ్ ప్రోసెసర్‌ను అమర్చి, పనితీరును పరిశీలించారు. ప్రస్తుతం బాలుడు వినడంతో పాటు నోటిద్వారా పలు శబ్దాలను చేయగలుగుతున్నాడని తెలిపారు. -
అమృతలో అరుదైన శస్త్రచికిత్స
రాజాం శ్రీకాకుళం : స్థానిక అమృత ఆస్పత్రిలో వైద్యులు ఇటీవల అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. యాసిడ్ తాగి అనారోగ్యానికి గురైన ఓ బాధితురాలి పేగులు పాడవ్వగా, ఆ పేగులు కట్‌చేసి అరుదైన శస్త్రచికిత్స చేసి ఔరా అనిపించారు. వంగర మండలంలో శివ్వాం గ్రామానికి చెందిన దమరసింగి కన్నతల్లి మూడు నెలల క్రితం యాసిడ్ తాగి అనారోగ్యానికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ పది రోజులు పాటు చికిత్స అందించిన వైద్యులు నయం అయిందని చెప్పడంతో ఇంటికి వచ్చేశారు. అయితే ఆరోగ్యం కుదుటపడకపోవడంతో అప్పటి నుంచి ఆమె క్రమ క్రమంగా ఆహారం సరిగా తినక ఇబ్బంది పడుతుండడాన్ని కుటుంబ సభ్యులు గమనించి రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు స్కానింగ్ నిమిత్తం విజయనగరం పంపించారు. అయితే అసలు విషయం తెలియక అక్కడి వైద్యులు చేతులెత్తేయగా, చేసేది లేక కన్నతల్లి కుటుంబీకులు ఆమెను రాజాంలోని అమృత ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడి వైద్యులు ఈమెను పరీక్షించడంతో పాటు వైద్యసేవలు అందించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఎండీ గార రవిప్రసాద్ మాట్లాడుతూ వైద్య బృందం డాక్టర్ డీవీ శ్రీనివాసరావు, ఎనస్థీషియా షణ్ముఖశ్రీనివాసరావు ఆధ్వర్యంలో శస్త్రచికిత్స జరిపారని అన్నారు. యాసిడ్ తాగడం వల్ల పేగులన్నీ ముడుచుకుపోయాయని, దీంతో ఆహారం కూడా తినలేని పరిస్థితిలో ఉండడంతో ఈమె 20 కిలోల వరకు తగ్గిపోయిందన్నారు. లోపలి పేగులను ఎక్కడికక్కడ కట్‌చేసి అతికించారని తెలిపారు. అతి తక్కువ డబ్బు తీసుకుని ఆపరేషన్ విజయవంతంగా చేశారన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉందని తెలిపారు. -
నవజాత శిశువుకు అరుదైన చికిత్స
సాక్షి, హైదరాబాద్ : గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఓ నవజాత శిశువుకు కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. చికిత్స అనంతరం శిశువు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. హృద్రోగ నిపుణుడు డాక్టర్ తపన్ కె.దాస్, డాక్టర్ నాగేశ్వర్ గురువారం ఇక్కడ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చికిత్స వివరాలు వెల్లడించారు. నగరంలోని పాతబస్తీకి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖదీర్ దంపతులకు ఇటీవల మగశిశువు జన్మించాడు. శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, ఆయాసం వంటి సమస్యలతో బాధపడుతున్న శిశువును స్థానిక వైద్యుల సూచన మేరకు తల్లిదండ్రులు కేర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల్లో శిశువు పుట్టుకతోనే హృద్రోగ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం మూసుకుపోయినట్లు గుర్తించారు. రక్తనాళ మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. మైట్రల్‌వాల్వ్ పునరుద్ధరణ ద్వారా... సాధారణంగా ప్రతి వందమంది పిల్లల్లో ఎవరో ఒకరికి మాత్రమే ఇలాంటి సమస్యతో జన్మిస్తుంటారు. తల్లిదండ్రుల అంగీకారంతో 11 రోజుల క్రితం శిశువుకు ఓపెన్‌హార్ట్ సర్జరీ చేసి, మైట్రల్‌వాల్వ్‌ను పునరుద్ధరించారు. సాధారణం గా ఇలాంటి కేసుల్లో ఆవు ద్వారా సేకరించిన రక్తనాళం కానీ మెటల్వాల్వ్ కానీ రీప్లేస్ చేస్తారు. గుండె కండరాలకు అతుక్కుపోయిన రక్తనాళాన్ని కట్ చేసి సరి చేశారు. 2.6 కేజీల బరువుతో జన్మించిన శిశువుకు ఇలాంటి సర్జరీ చేయడం ప్రపంచంలోనే చాలా అరుదని వైద్యులు ప్రకటించారు. ఇలాంటి చికిత్సలకు రూ.ఆరు లక్షల వరకు ఖర్చు అవుతుండగా, శిశువు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వైద్య ఖర్చులో 50శాతం రాయితీ ఇచ్చినట్లు ఆస్పత్రి సీఈవో రియాజ్ తెలిపారు. శిశువుకు భవిష్యత్‌లో ఎలాంటి సమస్య ఉండదని, మరోసారి సర్జరీ చేయాల్సిన అవసరం కూడా రాబోదని డాక్టర్ తపన్ కె.దాస్ స్పష్టం చేశారు. -
‘ఉస్మానియా’లో అరుదైన చికిత్సలు
గన్‌ఫౌండ్రీ: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఒకేరోజు రెండు అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఓమహిళ కుడిచేయి కండరం తీసుకొని ముక్కుకు అతికించారు. అంతేకాక ఓ బీటెక్ విద్యార్థిని ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించి నూతన రూపం ఇచ్చారు. వివరాలు.. ► కరీంనగర్ జిల్లా మల్లారం గ్రామానికి చెందిన లింగమ్మ కూతురు రజిత(26)కు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాదిపాటు సజావుగా సాగిన వారి కాపురంలో భర్త శ్రీనుకు అనుమానం రావడంతో ఆమెను పలుమార్లు విచక్షణారహితంగా కొట్టాడు. ఈ నేపథ్యంలో భార్యపై మరింత అనుమానం పెంచుకున్న శ్రీను ఆమె ముక్కును కోశాడు. దీంతో మాట్లాడేందుకు ఇబ్బందులు పడుతున్న ఆమె వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు ఉస్మానియా ఆస్పత్రికి పంపించడంతో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు శనివారం రాత్రి ఆమెకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. కుడిచేయి కండరం తీసుకొని ముక్కుకు అతికించి అరుదైన చికిత్సను నిర్వహించారు. ► మహబూబ్‌నగర్ జిల్లా, అచ్చంపేటకు చెందిన చెన్నయ్య కుమార్తె కనకదుర్గ బీటెక్ పూర్తిచేసింది. చిన్నతనం నుంచి ఆమెకు కుడివైపు ముఖంపై చిన్నమచ్చలతో క్రమక్రమంగా ముఖంగాపై గుంతలు ఏర్పడి అందవికారంగా మారింది. చికిత్సల కోసం ఎన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించింది. ఉస్మానియా ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ నాగప్రసాద్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆపరేషన్ నిర్వహించి ఆమెకు నూతన రూపం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలోని బర్న్స్ వార్డ్‌లో చికిత్స పొందుతోంది. ఈ రెండు చికిత్సలలో హెచ్‌వోడీ డాక్టర్ నాగ ప్రసాద్, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ మధుసూదన్‌నాయక్, డాక్టర్ జైపాల్ రాథోడ్, రెహ్మాన్ ఖురేషీ, కృష్ణమూర్తి, గంగాభవానీ, జ్యోతి, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.