శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న కన్నతల్లి
రాజాం శ్రీకాకుళం : స్థానిక అమృత ఆస్పత్రిలో వైద్యులు ఇటీవల అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. యాసిడ్ తాగి అనారోగ్యానికి గురైన ఓ బాధితురాలి పేగులు పాడవ్వగా, ఆ పేగులు కట్‌చేసి అరుదైన శస్త్రచికిత్స చేసి ఔరా అనిపించారు. వంగర మండలంలో శివ్వాం గ్రామానికి చెందిన దమరసింగి కన్నతల్లి మూడు నెలల క్రితం యాసిడ్ తాగి అనారోగ్యానికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు.
అక్కడ పది రోజులు పాటు చికిత్స అందించిన వైద్యులు నయం అయిందని చెప్పడంతో ఇంటికి వచ్చేశారు. అయితే ఆరోగ్యం కుదుటపడకపోవడంతో అప్పటి నుంచి ఆమె క్రమ క్రమంగా ఆహారం సరిగా తినక ఇబ్బంది పడుతుండడాన్ని కుటుంబ సభ్యులు గమనించి రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు స్కానింగ్ నిమిత్తం విజయనగరం పంపించారు. అయితే అసలు విషయం తెలియక అక్కడి వైద్యులు చేతులెత్తేయగా, చేసేది లేక కన్నతల్లి కుటుంబీకులు ఆమెను రాజాంలోని అమృత ఆస్పత్రికి తీసుకొచ్చారు.
ఇక్కడి వైద్యులు ఈమెను పరీక్షించడంతో పాటు వైద్యసేవలు అందించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఎండీ గార రవిప్రసాద్ మాట్లాడుతూ వైద్య బృందం డాక్టర్ డీవీ శ్రీనివాసరావు, ఎనస్థీషియా షణ్ముఖశ్రీనివాసరావు ఆధ్వర్యంలో శస్త్రచికిత్స జరిపారని అన్నారు.
యాసిడ్ తాగడం వల్ల పేగులన్నీ ముడుచుకుపోయాయని, దీంతో ఆహారం కూడా తినలేని పరిస్థితిలో ఉండడంతో ఈమె 20 కిలోల వరకు తగ్గిపోయిందన్నారు. లోపలి పేగులను ఎక్కడికక్కడ కట్‌చేసి అతికించారని తెలిపారు. అతి తక్కువ డబ్బు తీసుకుని ఆపరేషన్ విజయవంతంగా చేశారన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment